మృత్యువులోనూ వీడని బంధం | Enigmatical death, bonding | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని బంధం

Published Mon, Mar 27 2017 11:38 PM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM

మృత్యువులోనూ వీడని బంధం - Sakshi

మృత్యువులోనూ వీడని బంధం

లింగాల : వారు ముగ్గురూ ఒకే పాలిటెక్నిక్‌ కళాశాలలో చదివారు... అప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా మారారు... ఉద్యోగాలు వచ్చి స్థిరపడ్డా సెలవు వచ్చిందంటే చాలు కలసే వారు.. ఈ క్రమంలో కారులో వెళ్తున్న ముగ్గురు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.. వారిలో ఇద్దరు మృతి చెందారు... మరొకరు గాయాల పాలయ్యారు... మృతులిద్దరిదీ ఒకే గ్రామం... మృత్యువూ వారి స్నేహ బంధాన్ని విడదీయలేక పోయింది. లింగాల మండలం చిన్నకుడాల బస్టాండు సమీపంలోని మయూరి పైపుల ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్న ఊట బావిలోకి టాటా ఇండికా కారు ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో దూసుకెళ్లింది. ఈ ఘటనలో లింగాల మండల కేంద్రానికి చెందిన కొమ్మా శివమోహన్‌రెడ్డి(25), కేశంరెడ్డి చంద్రమహేశ్వరరెడ్డి(25) అనే ప్రాణ స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. జోగిరెడ్డి రవితేజేశ్వరరెడ్డి అనే యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొమ్మా మహేశ్వరరెడ్డి, అంకాలమ్మ కుమారుడు శివమోహన్‌రెడ్డి.. కేశంరెడ్డి చెన్నకృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణమ్మ కుమారుడు చంద్ర మహేశ్వరరెడ్డి.. జోగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఘనేశ్వరమ్మ కుమారుడు రవితేజేశ్వరరెడ్డి పులివెందుల పాల్‌టెక్నిక్‌ కళాశాలలో చదివేటప్పుటి నుంచి ప్రాణ స్నేహితులు. శివమోహన్‌రెడ్డి యూసీఐఎల్‌లో కాంట్రాక్టు కార్మికునిగా పని చేస్తుండే వాడు. చంద్ర మహేశ్వరరెడ్డి ఒక డ్రిప్‌ కంపెనీలో పని చేస్తుండే వాడు. రవితేజేశ్వరరెడ్డి తాడిపత్రిలోని పెన్నా సిమెంటు ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. రవితేజేశ్వరరెడ్డి స్వగ్రామం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం వెన్నపూసపల్లె. ఆ యువకుడు తాత గారి గ్రామమైన లింగాలలోనే ఎక్కువగా ఉంటాడు. ఇక్కడ నుంచే పాలిటెక్నిక్‌ కళాశాలకు వెళ్లి చదివాడు. వీరు వేర్వేరు పనులు చేస్తున్నా ఆదివారం వచ్చే సరికి కలసేవారు. కలసి భోజనం చేయంది ఉండే వారు కాదు. ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఓ ఇండిక కారులో పులివెందులకు వెళ్లారు. అక్కడ పనులను ముగించుకొని తిరిగి వస్తుండగా మార్గంమధ్యలో 10.30 గంటల ప్రాంతంలో ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. రోడ్డుకు ఎడమ వైపున వస్తున్న కారు ఒక్కసారిగా కుడి పక్కకు మళ్లి సుమారు 50 మీటర్ల దూరం దూసుకెళ్లి అక్కడ ఉన్న ఊట బావి అవతల గట్టుకు ఢీకొట్టి.. బావి లోపల 20 అడుగుల లోతులో ఉన్న గట్టుపై బోల్తా పడింది. అక్కడే ఉన్న వేప చెట్టు కారు బావిలోకి పడకుండా నియంత్రించింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న మహేశ్వరరెడ్డి, ముందు భాగాన కూర్చొన్న శివమోహన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. రవితేజేశ్వరరెడ్డి కారు వెనుక భాగంలో జారి బావిలో పడ్డాడు. దీంతో యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. సోమవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో చిన్నకుడాల గ్రామానికి చెందిన రైతులు పొలం పనులకు వచ్చి ఈ విషయాన్ని గుర్తించి బావిలో ఉన్న యువకుడి కేకలు విని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే రవితేజేశ్వరరెడ్డిని బయటకు లాగి ఆసుపత్రికి తరలించారు. తర్వాత భారీ పొక్లెయిన్‌తో బావి గట్టుపై ఉన్న కారును వెలికితీసి శివమోహన్‌రెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి భౌతిక కాయాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన వైఎస్‌ వివేకా.. :
రోడ్డు ప్రమాదంలో యువకులు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్‌ వివేకానందరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై ఆయన తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. శివమోహన్‌రెడ్డి తండ్రి మహేశ్వరరెడ్డిని, చంద్రమహేశ్వరరెడ్డి తండ్రి చెన్నాకృష్ణారెడ్డిని ఓదార్చి «ధైర్యాన్నిచ్చారు. కార్యక్రమంలో పులివెందుల వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ పి.వి.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అతి వేగమే ప్రమాదానికి కారణం.. :
కారును అతివేగంగా నడపడం వల్లే ప్రమాదానికి గురైందని సీఐ రామకృష్ణుడు, ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి అన్నారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో విషాధచాయలు.. :
 గ్రామంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి చెందడంతో విషాధ చాయలు అలుముకున్నాయి. వీరి కుటుంబాలలో ఒక్కొక్కరికి ఒక మగ పిల్లవాడే ఉండటం, వారు మృతి చెందడంతో గ్రామ ప్రజలను కలిచివేసింది. అందులోనూ ఉగాది పండుగ నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు దుఃఖ సాగరంలో మునిగారు.
ఒకే చోట ఖననం.. :
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శివమోహన్‌రెడ్డి, చంద్రమహేశ్వరరెడ్డిలను లింగాల శ్మశాన వాటికలో పక్కపక్కనే ఖననం చేశారు.
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు :
ఒక్కగానొక్క కుమారుడు అని ఆ కుటుంబాలు అల్లారు ముద్దగా పెంచుకున్నాయి. వారు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వారి ఆక్రందనలు చూపరులను సైతం కన్నీటి పర్యంతం చేశాయి.

27పీఎల్‌వీడీ502–15050002 :– గాయపడ్డ రవితేజేశ్వరరెడ్డి
27పీఎల్‌వీడీ502బి–15050002 :– మహేశ్వరరెడ్డిని ఓదార్చుతున్న వైఎస్‌ వివేకా
27పీఎల్‌వీడీ502ఇ–15050002 :– నుజ్జు నుజ్జుయిన కారు

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement