వరంగల్: వరంగల్ నగరంలోని కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్ తోటలో బుధవారం ఉదయం ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి భార్య కళ్లేదుటే వృద్ధుడిని కత్తితో గొంతు కోసి పరారయ్యారు. భూ వివాదమే హత్యకు కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన నాముతాబాజీ రాధాబాయ్, రాంచందర్(65) దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
రాంచందర్ ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహించి రిటైరయ్యారు. పదేళ్ల క్రితమే ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు. పిల్లలకు పెళ్లిళ్లై వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. ప్రస్తుతం రాధాబాయ్, రాంచందర్ మాత్రమే ఎస్‌ఆర్ ఆర్‌తోటలోని ఇంట్లో నివాసం ఉంటున్నారు. రాంచందర్‌కు పరకాల నియోజవర్గం పత్తిపాక శాయంపేట గ్రామంలో 1.20గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి విషయమై స్థానికుడి నడమ వివాదం కొనసాగుతోంది. ఈ విషయంపై శాయంపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది.
ఈ క్రమంలో బుధవారం ఉదయం సుమారు 11.20 నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తులు ఎస్‌ఆర్‌తోటలో రాంచందర్ పేరు పెట్టి పిలుస్తూ ఇంట్లోకి ప్రవేశించారు. ఎవరో వచ్చారు అని భార్య రాధాబాయ్ చెప్పగానే బెడ్రూం నుంచి హాల్‌లోకి ప్రవేశించిన రాంచందర్‌ను దుండగులు కింద పడేసి వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి పరారయ్యారు. ఆ దృశ్యం చూసిన భార్య షాక్‌కు గురైంది. రక్షించండి అంటూ రాంచందర్ ఇంట్లోనుంచి రోడ్డుపైకి చేరి రక్తపు మడుగులో కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు.
విషయం తెలిసిన వెంటనే మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ సురేష్.. ఎస్సై శ్రీలత, సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. మృతుడి బంధువులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి పెద్ద కుమారుడు నాము తాబాజీ ప్రదీప్ చందర్ మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ టి.సురేష్ తెలిపారు.
భూ వివాదమే హత్యకు కారణమా..?
వృద్ధుడి హత్య అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా..? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా..? పత్తిపాక శాయంపేటలోని 1.20 గంటల భూ వివాదమే హత్యకు కారణమా..? భూ వివాదంపై పట్టు వీడడం లేదనే కక్షతో గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసి ఉంటారా..? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.
పత్తిపాక శాయంపేటకు చెందిన ఓ వ్యక్తికి రాంచందర్ నడమ భూవివాదం ఉందని, మృతుడి కుమారుడు ప్రదీప్ చందర్ చెప్పడంతో సదరు వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. హత్య చేసి పరారైన వ్యక్తులు ముందుగా ఎక్కడినుంచి ఇంటికి చేరుకున్నారు..? ఆ తరువాత ఏ దారిలో వెళ్లి ఉంటారు..? అనే దానిపై సీసీ పుటేజీలను సైతం పరిశీలించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment