విధి విడదీసింది... | Three killed in two families | Sakshi
Sakshi News home page

విధి విడదీసింది...

Published Fri, May 30 2014 1:47 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

విధి విడదీసింది... - Sakshi

విధి విడదీసింది...

  •   రెండు కుటుంబాల్లో ముగ్గురు దుర్మరణం
  •   ఒక కుటుంబంలో తల్లి, కొడుకు...
  •   మరో కుటుంబంలో చిన్నారి మృతి
  •   బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రిలో విషాదఛాయలు
  •  వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. ఒకరిది జగ్గయ్యపేట, మరొకరిది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. వేసవి సెలవుల్లో రెండు కుటుంబాలు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లాయి. కానీ... తిరుగు ప్రయాణంలో విధి వారిద్దరినీ విడదీసింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వారి కుటుంబాల్లోని ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.
     
    ప్రత్తిపాడు (గుంటూరు), న్యూస్‌లైన్ : గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు వద్ద కాటూరి వైద్య కళాశాల సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ప్రాణ స్నేహితులైన జగ్గయ్యపేటకు చెందిన కుందేలు రవికిరణ్, సత్తుపల్లికి చెందిన దూదిపాళ్ల ప్రభు వేసవి సెలవుల్లో సకుటుంబసమేతంగా తిరుపతి, కంచి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకున్నారు.

    ఈనెల 23వ తేదీ శుక్రవారం కుందేలు రవికిరణ్ తన కుటుంబసభ్యులైన తల్లి రాజ్యం, భార్య శ్రీదేవి, కుమార్తె గాయత్రి, కుమారుడు హవీష్, ప్రాణ స్నేహితుడు దూదిపాళ్ల ప్రభు, అతని భార్య శ్రీదేవి, కుమార్తెలు యోజిత, చేతనలతో కలిసి మొత్తం రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిదిమంది కారులో తిరుపతి బయలుదేరి వెళ్లారు. పుణ్యక్షేత్రాలను సందర్శించి బుధవారం సాయంత్రం జగ్గయ్యపేటకు బయలుదేరారు.

    గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వేగంగా వస్తున్న కారు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై కాటూరి మెడికల్ కళాశాలకు సమీపంలో నిర్మించిన వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవికిరణ్ (38)తో పాటు అతని తల్లి రాజ్యం (63), స్నేహితుడు ప్రభు కుమార్తె యోజిత (8) మృత్యువాత పడ్డారు. మిగిలిన ఆరుగురు తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. ఒక కుటుంబం తల్లీ కొడుకును కోల్పోగా, మరో కుటుంబం కన్నకూతురిని కోల్పోయింది.
     
    రవి ఎలా ఉన్నాడు...
     
    తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దూదిపాళ్ల ప్రభు భరించలేని గాయాల దెబ్బలను సైతం పంటిబిగువున భరిస్తూ, తన స్నేహితుడి యోగక్షేమాలను ఆరా తీయడం అందరినీ కలిచివేసింది. స్ట్రెచర్‌పై చికిత్స పొందుతూనే తనకు వైద్యం చేస్తున్న వైద్యులు, నర్సులతో రవి ఎలా ఉన్నాడు.. వాడికేం ఇబ్బందిలేదుగా.. అంటూ అడిగాడు. తీవ్ర గాయాలతో బాధపడుతూ కూడా తన స్నేహితుడి యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం చూసిన వారు వారి స్నేహ బంధాన్ని తలచుకుని కంటతడి పెట్టుకున్నారు.
     
    అమ్మా.. ఒక్కసారి లేమ్మా..
     
    కుందేలు రవికిరణ్, అతని తల్లి రాజ్యం మృతిచెందారన్న విషయం తెలుసుకున్న వారి కుటుంబీకులు, బంధువులు ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడులోని కాటూరి వైద్యశాల వద్దకు చేరుకున్నారు. రవికిరణ్ చెల్లెలు విగతజీవులుగా పడి ఉన్న మృతదేహాలపై పడి అమ్మా లేవే.. ఒక్కసారి నాతో మాట్లాడవే.. అన్నా లే అన్నా.. ఒక్కసారి లే అన్నా.. అంటూ పెద్దపెద్దగా ఏడవడంతో ఆస్పత్రి ప్రాంగణం అంతా బంధువుల రోదనలతో మార్మోగింది.
     
    నొప్పులతో ఎగిరెగిరి పడుతూ..
     
    ప్రమాదం బారిన పడిన వారిలో నలుగురు చిన్నారులు ఉండడంతో వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తలకు, కాళ్లకు, చెవులకు, చేతులతో పాటు పలు శరీర భాగాల వద్ద తీవ్ర గాయాలవడంతో నొప్పులు భరించలేక ఆ చిన్నారులు అల్లాడిపోయారు. వైద్య సిబ్బంది వైద్యం చేయడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ చిన్నారులు నొప్పులతో ఎగిరెగిరిపడుతూ ఎక్కిళ్లు పెట్టి ఏడవడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. చిన్నారులకు ఎంత కష్టం వచ్చింది దేవుడా..అంటూ విలపించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement