రగడ
రేనాటిలో పెన్నేరు గండి క్రీ.శ.575
(నేటి కడపజిల్లా- గండికోట)
ఆకాశం మేఘావృతమై ఉంది. పెన్నేరు గండి కుడిగట్టుపై నిలిచి అవతలి వైపు దృష్టి సారించాడు దుగరాజు (యువరాజు) ధనంజయ చోళుడు. ‘ఈనాడైనా కొంచెం జల్లులు పడితే బాగుంటాది’ అంటూ తాళపత్ర గ్రంథంలో తలదూర్చి ఉన్న మాధవుని వంక చూసాడు.
‘ఈ మేఘాలు ఎక్కడి నించి వస్తాయో కాని ఒక్కక్షణం రేనాటిలో ఆగి కురిసే పాపానబోవు’ పుస్తకంలోంచి తలెత్తకుండా ప్రత్యుత్తరమిచ్చాడు స్నేహితుడు మాధవశర్మ. అతడు సంస్కృత కావ్యాలు చదివి వాటి తాత్పర్యాలు విడమర్చి చెబితే వినడం యువరాజుకి అలవాటు.
‘ఏమప్పా అంత దీర్ఘంగా చదువుతూండావ్?’
‘కాళిదాసు కృతి మేఘదూతం’.
‘ఆహా! మహాకవప్పా! బిరాన కానీయ్’ అని శిలాపీఠంపై కూర్చున్నాడు.
‘కశ్చిత్కాంతా విరహ గురుణాస్వాధికారాత్ప్రమత్త...’ అంటూ మొదటి వృత్తాన్ని స్వరయుక్తంగా పాడి తెలుగులో తాత్పర్యం వివరించాడు మాధవుడు.
‘చక్కగా పాడినావు మాధవా’ అని భుజం తట్టాడు ధనంజయుడు- కానీ నీవు సంస్కృతంలో పాడినది అర్థమవదు చెప్పే తెలుగు తాత్పర్యం చెవులకు ఇంపుగా ఉండదు- అని మనస్సులో అనుకుంటూ ‘ఊ చెప్పు’ అని సైగ చేసాడు.
‘ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్టసానుం
వప్రక్రీడా పరిణిత గజ ప్రేక్షణీయం దదర్శ’
అని రెండవ వృత్తాన్ని ముగించి అర్థం వివరించసాగాడు మాధవశర్మ.
వింటున్న ధనంజయుడు ఆకాశంలో మేఘాలని చూస్తూ ‘హాయిగా ఆషాఢ మాసాన ఆకాశదేశాన మార్గాన మెరిసేటి ఓ మేఘమా... అని మన భాషలో పాడుకుంటే ఎంత బాగుంటుంది. ఈ తాత్పర్యాలూ తత్సమాలూ లేకుండా అందరూ విని ఆనందిస్తారు ఏమంటావ్?’ అడిగాడు యువరాజు.
‘ఛీఛీ.. అంత మహాకావ్యాన్ని ఈ దేశీభాషలో పాడటమంటే బురదలో పన్నీరు పోయటమే దేవభాషని అవమానించటం’ అంటూ కోపంగా పుస్తకాన్ని మూసేసాడు మాధవశర్మ.
‘అది కాదులే మాధవా! సంస్కృతంలో ఉన్న పురాణాలనీ కావ్యాలనీ అందరికీ అర్థమయేటట్లుగా మన భాషలో అందంగా రాస్తే జనాలు సైతం పాడుకొని ఆనందిస్తారుగా...’ అంటున్న ధనంజయుడికి అడ్డుచెబుతూ,
‘అందమా? ఈ పామర అనాగరిక భాషకి అందమా? మాట సరిగ్గా పలకలేని వీళ్ళ నోటబడితే శబ్దాలు అసంబద్ధాలై వికృతంగా అవుతాయి’ అని మూతి బిగించాడు.
‘నీవు విద్వాంసుడివప్పా. కంచిలో చదువుకొనుండినావు. అందుకే నీకలాగనిపిస్తాది. కానీ ఈడనే బతుకుతా ఉండే ఈ జానపదుల పల్లెపాటల్లో అందం లేకపోలేదు’ అన్నాడు ఎర్రబడిన ముఖంతో దుగరాజు.
యువరాజు ఉక్రోషానికి కారణం అతడికి సంస్కృతం తెలియకపోవడమే అని గ్రహించాడు మాధవశర్మ. ‘పేదవాని కోపం పెదవికి చేటు’ అనే జనవాక్యం తెలియనివాడు కాదు. వెంటనే ఏదోవిధంగా సర్దిచెప్పకపోతే నష్టం అతడికే. ‘యువరాజా! మీ దూరదృష్టి, నిశితమైన మేధస్సు ముందు నా విద్య ఏపాటికి? ఎంతటి మహాకావ్యాన్నయినా ఒక్కసారి వినినంతనే దాని లోతుపాతులు అర్థం చేసుకోగల సామర్థ్యం మీకే ఉంది. ప్రజాహితం గురించి ఆలోచించే మీకు ఈ కావ్యాలని ప్రజల భాషలో అందివ్వాలనే కోరిక కలగటం సమంజసమే. కానీ...’ అంటూ తటపటాయించాడు, మాధవశర్మ.
‘ఊహ్’, మాధవుడి పొగడ్తలకి కాస్త శాంతించాడు ధనంజయుడు. ‘అయితే ఈ విషయం రేపటి పండిత గోష్ఠిలో ప్రస్తావించవలసిందే. ఆ పని నీవే చేయాలి’ అని తీర్మానించాడు.
చెన్నకేశవస్వామి ఆలయంలో రేనాటిలోని పండితులూ, తర్కవేత్తలూ, కళాకారులు, శ్రేష్ఠులూ, గామండులూ, రట్టలూ, కావ్యనాటకాదులలో ఆసక్తి ఉన్న పౌరులు తమతమ హోదాకి తగినట్లు వరుసలలో ఆసీనులయ్యారు. సభాధ్యక్షుడికి నమస్కరించి మంటపంలో కూర్చున్నాడు ఎరికల్ ముత్తురాజు ధనంజయ చోళ దుగరాజు. వేదపండితుల ఆశీస్సులతో మొదలై కవి పండితుల ప్రశంసలతో కొన్ని గంటలు గడిచాయి. ఇక అసలు అంశం ప్రస్తావించవలసిన సమయం వచ్చింది. మాధవుడు లేచి సభకి నమస్కరించాడు.
‘ఆదికవి వాల్మీకితో ఆవిష్కృతమై వేదవ్యాసునిచే విరచించబడి పాణినిచే నిర్దేశింపబడి భాస, భారవీ, భర్తృహర్యాదుల కృతులచే సంపన్నమై శూద్రక, కాళిదాసాది మహాకవులని మనకందించిన సంస్కృత భాషా సరస్వతిని కనుగొనడం మహా పండితులకే అసులభం. అటువంటి సంస్కృత పురాణ, కావ్య, నాటక క్రమాన్ని తెలుగుభాషలో సామాన్య జానపదులకు అందుబాటులోకి తేవాలని యువరాజు ఉద్దేశం. అదే ఈనాటి చర్చాంశం...’
ముందు వరుసలలో పండితులు అవాక్కయ్యారు. కానీ లెస్స లెస్సంటూ వెనుక వరుసలలోని పురజనుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి.
‘వెయ్యేళ్ళు వర్ధిల్లు దుగరాజా. ఈ పండితుల నోటబడి పరుషమైన సాహిత్యం, సరళమైన తెలుగు భాష తీయందనంతో మరింత శోభించగలదు’, అంటూ లేచాడొక దిగంబర జైనుడు. మూడు బారల దండాన్ని పెకైత్తి చిందులు తొక్కుతూ పదం అందుకున్నాడు.
‘కరికాళ సోండ్రమగ రేనాణ్టి దుగరాజు
పగతుండ్ర యమరాజు ఎరిగండ్ర ముతురాజు’
జనం అతడి గళంతో గళం కలిపారు.
‘ఆపండీ... ఈ రగడ!’
సభాధ్యక్షుడి ఉరుములాంటి గర్జనతో సభలో కోలాహలం కాస్త సద్దుమణిగింది. ‘ఇది పండితగోష్ఠా? తిరునాళా? ముందు వరుసలలోని పండిత బ్రాహ్మణులు తప్ప మిగిలినవారు వెంటనే నిష్ర్కమించండి’ అన్నాడు.
‘ఇది అధర్మం, అనుచితం!’ అంటూ లేచాడొక రట్ట యువకుడు. ‘ఈ చర్చాంశం అందరికీ సంబంధించినది. గీర్వాణం బలిసిన మీ బ్రాహ్మణులేనా? మేమెలా అనర్హులం?’
అవునూ! అవునూ! అంటూ సభలో మరలా కలకలం చెలరేగింది.
‘ఏమిటవునూ?’ మరోసారి అధ్యక్షుడి గొంతు సభలో మార్మోగింది. ‘వేదాలలో పుట్టిన గాయత్రి, జగతి ఆది వృత్తాలు స్వర ప్రధానాలయితే కావ్యరచనకి ప్రాణం వర్ణవృత్తాలు. జయదేవ, పింగళాది ఛందశ్శాస్త్రజ్ఞులు, పాణినీ, పతంజల్యాది వైయ్యాకరణులు నిర్దేశించినదీ కావ్య విధానం. తకిటతక తాళాల పల్లెపాటల దేశిభాషలో కావ్య రచన అసాధ్యం.’
‘ఉహ్. తేనె తెలుగట. ఈ పామర భాషకి ఒక ఛందస్సు లేదు. ఒక వ్యాకరణం లేదు. సంస్కృత సరస్వతి కాలిగోటికి సరితూగదీ తెలుగు’ అంటూ ఈసడించాడు ముందు వరుసలోని మరొక పండితుడు.
‘భుటులారా వీరందరినీ వెడలగొట్టి ద్వారాలు మూయండి. పండితుల చర్చ ఆ పిమ్మట సాగగలదు’ అని తీర్మానించాడు సభాధ్యక్షుడు.
‘ఆగండి’ అంటూ లేచి నిలుచున్నాడు యువరాజు ధనంజయుడు,
‘సభాధ్యక్షులు మాట మన్నించాల్సిందే. ప్రస్తుత పరిస్థితిలో మన భాష కావ్యరచనకి అనర్హమే. కానీ వారు చెప్పిన సంగీతానికి స్వర, వర్ణ, తాళాలు మూడు ముఖ్యమే. జానపదుల పదాలకి తాళం ముఖ్యం. మన పల్లెపాటల్లో దాగి వున్న లయ తాళాలను వెలికితీసి కావ్యరచనలోని స్వరవర్ణాలకు జోడిస్తే, భాషాసరస్వతికి మరింత అందం చేకూరుతాదని మా అభిప్రాయం. అయితే తెలుగు ఛందస్సుకి, వ్యాకరణానికి ఒక మంచి రూపం ఇవ్వవలసి ఉండె. గురువుల అనుమతితో మ్రితుడు మాధవశర్మని అందుకు నియోగిస్తుంటిని. మరొక విషయం...’ అని ముందున్న పండిత బృందాన్ని తేరిపార చూస్తూ, ‘ఈనాటి నుండి రాజ్యంలో అన్ని రాచకార్యాలు పామరులకు కూడా తెలిసేటివిధంగా తెలుగుభాషలో సాగగలవు. ఇందుకు ఛందస్సు, వ్యాకరణాల అవసరం లేదు. లిపి, వచనాలు చాలు.
ఇది చెన్నకేశవుని అనగా, రేనాడు ఏలే, ఎరికల్ ముత్తురాజు ధనంజయుడి శాసన!’ అని పౌరజనుల చప్పట్ల మధ్య సభ చాలించాడు.
ఈ శీర్షికపై మీ స్పందన రాయండి: saipapeneni@gmail.com
తెలుగుభాషలో మొట్టమొదటి శాసనం
కడపజిల్లా కలమళ్ల చెన్నకేశ్వరాలయంలో దొరికిన రేనాటి ధనంజయశర్మ శాసనం తెలుగుభాషలో మొట్టమొదటిది. మద్రాస్ మ్యూజియం చేరిన ఆ శాసన శకలం దురదృష్టవశాన అదృశ్యమయింది. అంతేకాదు తెలుగువారి వారసత్వ సంపదలో భాగమైన అనేక చారిత్రక శిల్పాలు, అవశేషాలు మద్రాస్ మ్యూజియంలో ఉన్నాయి. తెలుగుభాషకి క్లాసికల్ లాంగ్వేజ్‌గా గుర్తింపు రావటానికి కలమళ్ళ శాసనం ఎంతో కీలకమైనది. తమిళ భాషావేత్తలు, చరిత్రకారులు తెలుగుకి ప్రాచీనభాషగా గుర్తింపు రావటాన్ని ఎంతో వ్యతిరేకించారు. అదే సమయంలో కలమళ్ళ శాసనం మాయమవటం కొన్ని అనుమానాలకి తావు ఇస్తుంది. ఎట్టకేలకు ఎందరో భాషాభిమానులు, భాషాశాస్త్రజ్ఞుల కృషి ఫలితంగా ఆలస్యంగానైనా తెలుగుభాషకి క్లాసికల్ లాంగ్వేజ్ గుర్తింపు లభించింది.
భాషగా తెలుగు అతి ప్రాచీన కాలం నుండీ వ్యవహారంలో ఉందనేది నిజం. భరతుని నాట్యశాస్త్రంలో వాత్సాయనుని కామశాస్త్రంలో ‘ఆంధ్రీ’ అనే భాష ప్రసక్తి ఉంది. అదే తెలుగు. క్రీ.శ.1వ శతాబ్దికి చెందిన వాశిష్ఠీపుత్ర పులుమాని నాణెంలో తెలుగులో రాసిన ‘అరహన కు వహిత్థీ మకనాకు తిరు పులుమావి కు’ అనే ఐతిహ్యం కనిపిస్తుంది. ఇందులో ‘కు’ అనే షష్ఠీ విభక్తి ప్రత్యయం తెలుగులో ఉంది. ఈ ఐతిహ్యం తెలుగు ఛందస్సుకు చెందిన ‘రగడ’లో ఉందని భాషావేత్తలు చెప్తారు. అంతేకాదు ఆంధ్రదేశం అనాది నుండీ రచనా వ్యాసంగానికి ఆటపట్టు. వైదిక పరంపరలో మొట్టమొదటి ధర్మశాస్త్రజ్ఞుడు క్రీ.పూ.6వ శతాబ్దికి చెందిన ఆపస్తంభుడు ఆంధ్రుడే. క్రీ.పూ.1వ శతాబ్దంలో రచించబడిన ‘అష్టసహస్రిక’ అనే బౌద్ధగ్రంథంలో అధికభాగం ఆంధ్రప్రాంతానికి చెందిన అంధక శాఖీయులే రచించారు. హీనయాన బౌద్ధానికి మూలమైన పిటకాలు ‘అంధక’ భాష నుండే పాళిభాషలోకి అనువదించబడ్డాయని బుద్ధఘోషుడు ‘మజ్జెమనికాయం’ పీఠికలో చెప్పుకున్నాడు. అంటే ఆంధ్రభాషలో రచనలు చేయడం క్రీస్తు పూర్వం నుండే ఉందని తెలుస్తుంది.
మహాయాన బౌద్ధగ్రంథాలు రచించిన నాగార్జునుడు, ఆర్యదేవుడు, దిన్నాగుడు ఆంధ్రులే. కానీ బౌద్ధయుగంలో ప్రాకృతాల్లో సాగాయి. 4వ శతాబ్ది నుండీ బ్రాహ్మణ భూస్వామ్య వ్యవస్థ బలపడటంతో సంస్కృతం విజృంభించింది.
క్రీ.శ. 5 నుండి 7వ శతాబ్ది వరకు సంస్కృత సాహిత్యానికి స్వర్ణయుగం అంటారు. కాళిదాసు, భాసుడు, బాణభట్టు మొదలైన మహాకవులు భారత రామాయణాది ఇతిహాసాలలోని ఘట్టాలనే కాక లౌకిక సంప్రదాయంలోని ఎన్నో కథలకి కావ్య, నాటక రూపాలిచ్చారు. శూద్రకుని మృచ్ఛకటికం, విశాఖదత్తుని ముద్రారాక్షసం, భారవి కిరాతార్జునీయం, కాళిదాసు శాంకుతలం, మేఘదూతం, హర్షుని నాగానందం, నైషధం, బాణుడి కాదంబరి, భర్తృహరి సుభాషితాలు ప్రజలలో ఎంతో ఆదరణ చూరగొన్నాయి. భారతీయ సాహిత్యం, నాటక ప్రక్రియ, పాశ్చాత్య కళారూపాలకంటే ఎంతో ఉత్కృష్టమైనవని జగానికి చాటిచెప్పాయి.
ఆకాలంలో సంస్కృతం విద్యద్భాషగా విలసిల్లింది. కవులకు, గురువులకు, రాజప్రాపకం దొరికింది. వ్యవహారాలు సంస్కృతంలో నడిచాయి. దక్షిణదేశంలోని అనేక సంస్కృత శాసనాలు అందుకు నిదర్శనం. ఆ భాషమీద పట్టుగల బ్రాహ్మణులు సమాజంలో అగ్రస్థానానికి ఎదిగారు. దేశీభాషయైన తెలుగుకి చిన్నచూపు ఎదురయింది.
అటువంటి పరిస్థితులలో, తెలుగుకి ప్రాముఖ్యం ఇచ్చిన రేనాటి ధనంజయుడు, తెలుగువారికి చిరస్మరణీయుడు.