Edict
-
వన్స్‌యూ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్
►కాకతీయ పౌరుషానికి ప్రతీక అయిన రాణీ రుద్రమదేవి 1289లో ప్రాణాలు వదిలారు. ఆ విషయం 1970లలో వెలుగు చూసింది. ఆమె ఎప్పుడు చనిపోయిందో ప్రపంచానికి ఇన్ని శతాబ్దాల తర్వాత తెలియచెప్పింది ఓ శాసనం. ►విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు 1529 అక్టోబర్ 17న మరణించారన్న విషయం గతేడాది ఫిబ్రవరిలో కర్ణాటకలోని తూమకూరు ప్రాంతంలో లభించిన ఓ శాసనమే వెలుగులోకి తెచ్చింది. సాక్షి, హైదరాబాద్: చరిత్రలో శాసనాలకు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతాకాదు. చరిత్రను ఎలాంటి వక్రీకరణల్లేకుండా భావితరాలకు అందిస్తున్నవి నాటి శాసనాలే. ఇప్పుడు అలాంటి శాసనాలకు ఓ ప్రత్యేక ప్రదర్శనశాల సిద్ధం కానుంది. భాగ్యనగరం కేంద్రంగా నేషనల్ ఎపిగ్రఫీ మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర పర్యాటక, సాంస్కతిక శాఖ చర్యలు చేపట్టింది. దేశంలో ఇప్పటికే పూర్తిస్థాయి మింట్ మ్యూజియంకు హైదరాబాద్ వేదిక కానుండగా ఇప్పుడు ఎపిగ్రఫీ మ్యూజియం కూడా ఇక్కడే ఏర్పడనుండటం విశేషం. నేటి తరం కోసమే... కాగితాలు లేని కాలంలో ఓ చారిత్రక ఘట్టాన్ని భవిష్యత్తు తరానికి అక్షరబద్ధం చేసి అందించేందుకు ఉన్న ఏకైక మార్గం శాసనం వేయించడమే. అందుకే చరిత్రను ఆధారసహితంగా మనకు అందించేవి శాసనాలే. కానీ ఈ విషయంలో మన దేశం ఎంతో వెనకబడి ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా శాసనాలు చదివేందుకు ప్రభుత్వపరంగా ఉన్న నిపుణులు కేవలం 30 మందే. అలాగే కొందరు ఔత్సాహికులు తప్ప ఇప్పుడు శాసనాలు చదివి పరిష్కరించేవారు లేకుండా పోతున్నారు. నేటి తరానికి వాటిపై అవగాహనే ఉండటం లేదు. ఈ తరుణంలో ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు కానుండటంతో శాసనాలను వెలుగులోకి తెచ్చి పదిలం చేసే వ్యవస్థ ఏర్పడేందుకు మార్గం సుగమం కానుంది. ఆ నినాదంతో మొదలై.. కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం పరిధిలో జాతీయ స్థాయిలో ఎపిగ్రఫీ విభాగం కర్ణాటకలోని మైసూరు కేంద్రంగా కొనసాగుతోంది. అక్కడ ఎపిగ్రఫీ డైరక్టరేట్ ఉండగా, లక్నో, నాగ్‌పూర్, చెన్నైలలో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. కానీ సిబ్బంది కొరత, రాష్ట్రాల పరిధిలో పురావస్తు శాఖలు నిర్వీర్యమైపోవడం, వాటికి కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగంతో సమన్వయం లేకపోవడం.. వెరసి ఎపిగ్రఫీ విభాగం సరిగ్గా పనిచేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఎపిగ్రఫీ పోస్టుల సంఖ్య పెంచాలంటూ కొందరు విశ్రాంత ఎపిగ్రఫిస్టులు, ఔత్సాహిక పరిశోధకులు దాదాపు 50 వేల మంది ఇటీవల ఆన్లైన్ వేదికగా ఉద్యమిస్తున్నారు. ఉద్యమ ప్రతినిధులు కొందరు ఇటీవల విశ్రాంత ఐఏఎస్ అధికారి ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. వారి డిమాండ్లతోపాటు ఎపిగ్రఫీ మ్యూజియం అంశం చర్చకు వచ్చింది. ఫలితంగా జాతీయ స్థాయిలో ఓ ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు అంశం కొలిక్కి వచ్చింది. హైదరాబాద్‌లో ఆ మ్యూజియంను ఏర్పాటు చేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. త్వరలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి భవనాన్ని ఎంపిక చేయనున్నారు. ఉన్న భవనాల్లో ఎక్కడో ఓ చోట ఏర్పాటు చేయాలా, కొత్త భవనం నిర్మించాలా అన్న విషయాన్ని తేల్చనున్నారు. ►జాతీయ స్థాయిలో లభించిన, కొత్తగా వెలుగు చూసే ముఖ్యమైన శాసనాలను ఈ మ్యూజియంలో భద్రపరిచి, వాటి ప్రాధాన్యాన్ని సరికొత్త సాంకేతికతతో సందర్శకుల ముందుంచుతారు. కేంద్రం చేపట్టనున్న చర్యలు... ►కొత్తగా కనీసం 100 వరకు ఎపిగ్రఫీ పోస్టులు ఏర్పాటు చేసి భర్తీ చేస్తారు. ►శాసనాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తారు. ►శాసనాల గుర్తింపు, వాటి పరిరక్షణ విషయంలో రాష్ట్రాలతో అనుసంధానం ఏర్పాటు చేస్తారు. ►డిజిటలైజేషన్ ద్వారా శాసనాల పూర్తి విషయాలను సందర్శకుల ముందుంచుతారు. ►శాసనాలకు సంబంధించిన సదస్సులు నిర్వహిస్తారు. -
ఘన చరితం.. రేనాటి శాసనం
వైవీయూ: ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామ సమీపంలో లభించిన శాసనం ఆధారంగా చోళ మహారాజు రేనాడు ప్రాంతం నుంచి పరిపాలన సాగించినట్లు రూఢీ అయిందని వైవీయూ వైస్ చాన్సలర్ ఆచార్య మునగాల సూర్యకళావతి అన్నారు. బుధవారం వైవీయూ చరిత్ర, పురావస్తుశాఖ పరిశోధకులు, సహాయ ఆచార్యులు డాక్టర్ వి. రామబ్రహ్మం రేనాటి చోళరాజు శాసనం వివరాలను, దాని వెనుక ఉన్న చరిత్ర సంగతులను వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకువచ్చారు. చిన్నదుద్యాల సమీపంలో లభించిన రేనాటి చోళరాజు శాసనం అత్యంత అరుదైనదన్నారు. ఆ గ్రామానికి చెందిన బి.శివనారాయణరెడ్డి పొలంలో ఇది బయల్పడినట్లు తెలిపారు. వైవీయూ ఎంఏ చరిత్ర, పురావస్తుశాఖ విద్యార్థి వాసుదేవరెడ్డికి ముందుగా ఈ విషయం తెలియడంతో ఆయన డా. రామబ్రహ్మం దృష్టికి తీసుకువచ్చారు. శాసనం, ఆ సమాచారాన్ని మైసూర్‌లోని భారత పురాతత్వశాఖ(ఏఎస్ఐ)కు తెలియజేశారు. ఏఎస్ఐ, వైవీయూ చరిత్ర పురావస్తుశాఖ పంపిన శాసనం గురించి అధ్యయనం చేయగా పలు చారిత్రక అంశాలు వెలుగుచూశాయని ఆయన తెలిపారు. ►రేనాటి చోళుల రాజైన చోళమహారాజు ఈ శాసనం వేయించారు. అందులో (తొలితరం) తెలుగుభాష, తెలుగు లిపిలో క్రీ.శ. 8వ శతాబ్దంలో శాసనం వేయించినట్లు ఉంది. పిడుకుల గ్రామంలోని దేవాలయాన్ని దేవాలయ బ్రాహ్మణులకు ఆరు మర్తల (8పుట్ల ధాన్యం పండేభూమి) సేద్యానికి ఇచ్చినట్లు నమోదై ఉంది. అలానే ఈ శాసనంలో చోళమహారాజు రేనాడు ప్రాంతం నుంచి పరిపాలన కొనసాగించినట్లు తెలుస్తోంది. ఎవరైతే ధాన్యాన్ని పరిరక్షిస్తారో వారికి (శాసనంలో లైన్ నెంబర్ 21, నవారికి ఆశ్వ : 22 లైన్లో మేద : (ం) బుదీని’ ఉంది) అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుందని, ఎవరైతే హానిచేస్తారో వారు వారణాసిలో చంపిన పాపాన్ని (23. చెర్రివారు, 24 బారనసి ప్ర) పొందుతారని శాసనంలో లిఖించారు. ►పరిశోధకులు డాక్టర్ రామబ్రహ్మంను వైవీయూ వైస్ చాన్సలర్ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య డి. విజయరాఘవప్రసాద్‌లు అభినందించారు. వైవీయూ అధికారుల ఆదేశానుసారం ‘ఎక్స్‌ఫ్లోరేషన్ ఆఫ్ ఆన్ – ఎర్త్డ్ ఇన్స్క్రిప్షన్, స్ల్కప్ఫర్ అండ్ టెంప్లెస్ ఆఫ్ వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ పేరుతో యూనివర్సిటీ గ్రాంటు కమిషన్‌కు ప్రాజెక్టును పంపనున్నట్లు డాక్టర్ రామబ్రహ్మం తెలిపారు. -
కడపలో అరుదైన శాసనం లభ్యం
సాక్షి, కడప : జిల్లాలో మరొక అరుదైన శాసనం వెలుగు చూసింది. ఈ ప్రాంతం రేనాటి రాజుల పాలనలో ఉండిందని దీని ద్వారా మరో మారు స్పష్టం అవుతోంది. జిల్లాలోని చిన్న దుద్యాల గ్రామంలో లభించిన దీని గురించి యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులు వెలుగులోకి తెచ్చారు. అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాకు శాసనాల ఖిల్లాగా పేరుంది. రాష్ట్రంలో లభించిన మొత్తం తెలుగు శాసనాలలో ఎక్కువ శాతం వైఎస్ఆర్ జిల్లాలోనే లభించిన విషయం తెలిసిందే. ఇటీవల జిల్లాలో లభించిన ఓ శాసనం ద్వారా జిల్లా పాలనలో తమదైన ముద్ర వేసిన రేనాటి చోళులు మన జిల్లా వారేనని స్పష్టం అయింది. ఇప్పుడు లభించిన శాసనం ద్వారా అది మరో మారు ధృవీకరింపబడింది. జిల్లాలోని ముద్దనూరు మండలం చిన్న దుద్యాల గ్రామంలో గల శివనారాయణరెడ్డి పొలంలో ఇటీవల ఓ శాసనం బయల్పడింది. దాని విలువను గ్రహించిన ఆయన దాని గురించిన సమాచారాన్ని తన మిత్రుడు వైవీయూ పరిశోధక విద్యార్థి నిఖిల్‌కు తెలిపారు. ఆయన తన సహచర పరిశోధక మిత్రుడైన వాసుదేవ రెడ్డికి శాసనం గురించి వివరించారు. వారిద్దరూ కలిసి వైవీయూ చరిత్ర పురావస్తు శాఖ ఆసిస్టెంట్ ప్రొఫెసర్ రామబ్రహ్మంకు సమాచారం అందించారు. ఆయన దాని గురించి పరిశీలించి భారత పురాతత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. శాసన పాఠం ఇలా..... శాసన లిపి పరిశోధకుల సమాచారం ప్రకారం చిన్న దుద్యాలలో వెలుగు చూసిన ఈ శాసనంలోని సమాచారం ఇలా ఉంది. దీన్ని క్రీస్తుశకం 8వ శతాబ్దంలో నాటి ఈ ప్రాంత పాలకులు రేనాటి చోళులు వేయించినట్లు కేంద్ర పురావస్తు శాఖ పరిశోధకులు తెలుపుతున్నారు. రాతి బండకు ఇరువైపులా అక్షరాలు ఉన్నాయి. ఇవి నాటి తెలుగు లిపిలో ఉన్నట్లు సమాచారం. రేనాటి ప్రభువు చోళులు చిన్న దుద్యాల గ్రామంలోని ఓ దేవాలయానికి చెందిన అర్చకులకు ఆరుమరŠుత్యల భూమిని దానంగా ఇచ్చినట్లు ఇందులో రాసి ఉంది. జిల్లాలో పాలించిన ప్రభువులలో రేనాటి పాలకులు తమదైన ముద్ర వేశారు. జిల్లాలోని కల్లమల్లలో లభించిన తొలి తెలుగు శాసనం రేనాటి ధనుంజయుడు 575లో వేయించినట్టు తెలుస్తోంది. తెలుగు భాష ఉనికిని జిల్లాలో చాటి చెప్పిన అపురూపమైన శాసనంగా దీనికి దేశంలో ముఖ్యంగా తెలుగునాట ఎంతో ప్రాముఖ్యత లభిస్తోంది. దీని ద్వారా మన ప్రాంతంలో తెలుగు భాషకు పట్టం కట్టిన వైనంతో పాటు రేనాటి ప్రభువుల సంక్షేమ పాలన గురించి కూడ స్పష్టంగా తెలియవస్తోంది. ఇప్పుడు చిన్న దుద్యాలలో లభించిన శాసనం ద్వారా ఈ విషయం మరోమారు స్పష్టం అవుతోంది. దీనిని వెలుగులోకి తెచ్చిన వైవీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామబ్రహ్మం, పొలం యజమాని శివనారాయణరెడ్డి, పరిశోధక విద్యార్థులను చరిత్ర, పరిశోధక అభిమానులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. -
ఇది రుద్రమ మరణశాసనం
సాక్షి, హైదరాబాద్: రాణి రుద్రమదేవి.. ధీర వనిత, భారతావనిలో దేశాన్ని అత్యంత గొప్పగా పాలించిన మహారాణి. మహిళ అయి ఉండి ‘మగ’మహారాజుగా చరిత్రలో నిలిచిపోయిన ఓ విచిత్రం. తొలుత పురుష వేషధారణలో ఉండి, యువరాజుగా పేరు పొందినా.. తర్వాత మహిళగా రాజ్యపాలన చేసినా, చరిత్రలో మాత్రం కాకతి రుద్రదేవ మహారాజుగా నిలిచిపోయారు. కాకతీయ పౌరుషం అనగానే ఠక్కున రుద్రమదేవి పేరు మదిలో మెదులుతుంది. సువిశాల గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి, ప్రజారంజక పాలనతో గుర్తింపు తెచ్చుకున్న ఈ మహాయోధురాలు ఎప్పుడు మృతిచెందారు? ఆమె మరణించిన కాలంపై భిన్న వాదనలు ఉన్నప్పటికీ, సూర్యాపేట జిల్లా చందుపట్లలో లభించిన ఓ శాసనంపై ఉన్న కాలాన్నే ఎక్కువ మంది అసలు మరణ తేదీగా భావిస్తారు. ఇప్పుడు ఆ శాసనాన్ని రూఢి చేసేలా మరో కొత్త శాసనం వెలుగు చూసింది. దాని ప్రకారం ఆమె మరణించిన సంవత్సరం 1289. గుంటూరు జిల్లా పుట్టాలగూడెం శివారులో ఇటీవల ఓ శాసనం వెలుగు చూసింది. గతంలో ఇక్కడ బౌద్ధస్థూపం ఉండేదన్న ఆనవాళ్లు ఉన్నాయి. అక్కడి ఆయక స్తంభంపైనే ఈ శాసనం చెక్కి ఉండటం విశేషం. చాలాకాలంగా ఇది ఇక్కడే ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవలే దాన్ని పరీక్షించగా ఆ దేవాలయానికి భూమిని దానంగా ఇచ్చిన సందర్భంలో వేయించిన శాసనంగా తేలింది. అందులో రాణి రుద్రమదేవి వివరాలు వెలుగుచూశాయి. ఆమె చనిపోయిన సందర్భంలో ఈ భూదానం చేసినట్టు స్పష్టమవుతోంది. శక సంవత్సరం 1210(1) విరోధినామ సంవత్సరం పౌష్య శుద్ధ విదియనాడు మకర సంక్రాంతి పుణ్యకాలంలో ఇది వేయించినట్టుగా ఉంది. దాని ప్రకారం క్రీ.శ. 1289 డిసెంబరు 15 అవుతోంది. కాకతీయ మహారాజు రుద్రదేవ మహారాజుకు ధర్మంగా ఒడ్ల కాలువ, సోమలవరి ఇడువ (పంటపొలం)ధర్మంగా ఇచ్చినట్టు ఉంది. కొన్ని పంక్తులు చెరిగిపోయి అస్పష్టంగా మిగిలాయి. అంతకుముందు కాకతీయ సేనానిగా పనిచేసిన గన్నమనాయకుడి కుమారుడైన సోమయ్య సాహిణి ఈ భూమిని దానం చేసినట్టుగా అందులో ఉంది. ఈయన రుద్రమదేవి పరిపాలన చివరి కాలంలో ఆమె వెంట ఉన్న వ్యక్తి. తొలి శాసనానికి బలం చేకూర్చిన ఆధారం.. నేటి సూర్యాపేట జిల్లా చందుపట్ల సోమనాథ దేవాలయంలో లభించిన శాసనంలో రుద్రమదేవికి శివలోక ప్రాప్తి కోరుతూ దేవాలయానికి భూమిని దానం చేసినట్టు ఉంది. ఈ శాసనాన్ని 1289 నవంబరు 25న వేయించినట్టు వివరాలు చెబుతున్నాయి. వారు మరణించిన దశదిన కర్మ జరిగేలోపు వేయించి ఉంటారని, అంటే అందులోని తేదీకి కాస్త అటూ ఇటూగా పక్షం రోజుల ముందు ఆమె చనిపోయి ఉంటుందని అంచనాగా చరిత్రకారులు చెబుతారు. గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని ఈవూరు గోపాలస్వామి దేవాలయం ముందు స్తంభంపై గతంలో మరో శాసనం లభించింది. ఇందులో రుద్రమదేవితోపాటు అంగరక్షకుడు బొల్నాయినికి పుణ్యంగా స్వామికి భూమిని సమర్పించినట్టు ఉంది. ఈ శాసనం 1289 నవంబర్ 28న వేయించారు. ఈ రెండు శాసనాల్లో రాణి రుద్రమతోపాటు ఆమె సైన్యాధిపతి మల్లికార్జుననాయునికి, అంగరక్షకుడు బొల్నాయినికి కూడా శివలోక ప్రాప్తి కోరుతూ ఉండటంతో ముగ్గురూ ఒకేసారి మరణించారని చరిత్రకారులు అంచనాకొచ్చారు. అంటే యుద్ధంలోనో, అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్న సమయంలోనో మరణించి ఉంటారని అంచనా. మరణించే నాటికి 80 ఏళ్లు? రుద్రమదేవి మరణించే సమయానికి ఆమెకు 80 ఏళ్ల వయసు ఉంటుందని ప్రముఖ చరిత్రకారులు పరబ్రహ్మశాస్త్రి గతంలోనే ఓ అంచనాకొచ్చారు. ఆమె తండ్రికి సంబంధించి వెలుగు చూసిన శాసనాలు, రుద్రమదేవికి సంబంధించిన ఆధారాలను అధ్యయనం చేసి ఆయన ఈ అంచనాకొచ్చారు. 80 ఏళ్ల వయసులో ఆమె యుద్ధం చేయటం కష్టమైన పనే. అందుకే ఆమె మరణించిన సమయంలో నేరుగా యుద్ధంలో పాల్గొన్నారా, లేక యుద్ధానికి సంబంధించిన పర్యవేక్షణకు వచ్చిన సమయంలో శత్రువుల చేతిలో చనిపోయారా అన్నది మాత్రం స్పష్టం కాలేదు. మొదటి రెండు శాసనాలు దాదాపు ఒకే సమయంలో వేయించినట్టు స్పష్టంగా ఉంది. ఇప్పుడు కొత్తగా వెలుగుచూసిన శాసనాన్ని తొలిసారి నేనే చదివాను. ఇందులో 1289 డిసెంబరు 15 అని ఉంది. వెరసి ఆమె అదే సంవత్సరంలో మరణించారని దాదాపు స్పష్టమైంది. మన చరిత్రలో మహా అధ్యాయాన్ని లిఖించుకున్న గొప్ప యోధురాలు రుద్రమదేవి మరణ సమయంపై దాదాపు స్పష్టత వచ్చినట్టయింది . –శ్రీరామోజు హరగోపాల్, చరిత్రకారులు -
పిల్లలకు మాత్రమే
క్రైమ్ పేరెంటింగ్ సినిమాల్లో సన్నివేశాలు పిల్లలు చూడదగ్గవి కాకపోతే అడల్ట్ సర్టిఫికేషన్ ఇచ్చి పెద్దలకు మాత్రమే’ అని చెప్తారు! ఇది థియేటర్ సంగతిఅదే సినిమా ఇంట్లో ఉంటే? అదే సినిమాను పెద్దలు పిల్లల చేతుల్లో పెడితే? పిల్లలు చాలా పెద్ద పనులే చేస్తారు! పిల్లల్ని జీవితాలతో గేమ్స్ ఆడనివ్వకండి.. బీ కేర్ ఫుల్!! ‘‘అన్నయ్యా.. ఇది నాది’’ తన చేతిలోంచి లాక్కుంటున్న పెన్నును గట్టిగా పట్టుకొని అరుస్తున్నాడు ధీరజ్. నాక్కావాలి’’ అంటూ మొండిగా ప్రయత్నిస్తున్నాడు ధీరజ్ అన్న ప్రణవ్. పెన్ను ఇవ్వకుండా ధీరజ్ తన అన్న చేతుల్లోంచి తప్పించుకుని పరిగెత్తసాగాడు. అది ప్రణవ్‌కి పరాభవంగా అనిపించింది. పదమూడేళ్ల ఆ పిల్లోడు పళ్లుబిగపట్టి .. అదే కోపంతో తమ్ముడిని పట్టుకొని వాడిని కొట్టి ఆ పెన్ను లాగేసుకున్నాడు. కిందపడిపోయిన తమ్ముడిని విజయగర్వంతో మళ్లీ ఒకసారి తన్ని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అన్న చేష్టలకు భయంతో బిక్కచచ్చిపోయాడు ధీరజ్. సైకిల్ కోసం... చూశావా? దీనికి షాక్ అబ్జార్బర్స్ కూడా ఉన్నాయి..’’ మెరిసే కళ్లతో వివరిస్తున్నాడు విరాజ్ తన స్నేహితులకు.‘అబ్బ భలే ఉందిరా.. ’’ అన్నాడు రోహన్ సంభ్రమాశ్చర్యంగా ఆ సైకిల్ హ్యాండిల్ పట్టుకొని చూస్తూ! రెడ్ కలర్.. నాకెంత ఇష్టమో తెలుసా? ఈ కలర్ స్టాక్ లేదంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేసి మరీ తెప్పించాడు మా డాడీ.. ’’ అదే సంతోషాన్ని కంటిన్యూ చేస్తూ విరాజ్. మొత్తం ఫిఫ్టీన్ థౌజెండ్ కదరా ఈ సైకిల్?’’ అడిగాడు ఇంకో స్నేహితుడు. ఊ...’’ సైకిల్‌నే మురిపెంగా చూసుకుంటూ తలాడించాడు విరాజ్. ఇదంతా వింటున్న, చూస్తున్న ప్రణవ్‌కి ఆ సైకిల్‌ను నడపాలనే ఆశ పుట్టింది. రేయ్ విరాజ్.. ఒక్కసారి నీ సైకిల్ ఇవ్వరా.. ఒక రౌండ్ వేసొస్తా’’ కొంచెం దబాయింపుతో అడిగాడు ప్రణవ్. అమ్మో.. నా కొత్త సైకిల్ నేనివ్వను’’ అన్నాడు విరాజ్. నీ కొత్త సైకిలేం అరిగిపోదులే కాని.. ఒక్కసారివ్వు..’’ అంటూ సైకిల్ లాక్కోబోయాడు ప్రణవ్. రేయ్.. ఇవ్వనన్నాను కదా.. ’’ విరాజ్ కూడా దబాయించాడు. ఏదో గొడవ జరగబోతోందనుకున్నారేమో మిగిలిన వాళ్లంతా కాస్త పక్కకు తప్పుకున్నారు బెరుకుగా. ఇవ్వనని విరాజ్ కరాఖండిగా చెప్పేసరికి ప్రణవ్ మొహంలో రంగులు మారాయి. వాడికి తాను ఆడుతున్న వీడియోగేమ్ గ్రాండ్ టెస్ట్ ఆటో 5 గుర్తొచ్చింది. అంతే విరాజ్‌ని కొట్టి, వాడిని కింద పడేసి ఆ సైకిల్ తీసుకొని రౌండ్వేయడానికి వెళ్లిపోయాడు. హీరోగా.. కజిన్స్‌తో కలిసి ఆడుకుంటున్నారు ప్రణవ్, ధీరజ్. చేతుల్లో టాయ్ గన్స్ ఉన్నాయి. ప్రణవ్ చేతిలో గన్ పట్టుకొని నిజమైన గన్ను పేలుస్తున్నట్టే పోజ్ పెట్టి సీరియస్‌గా ఆడుతున్నాడు. వాడు ఎవరినైతే గన్‌తో పేలుస్తున్నాడో వాళ్లు పడిపోవాలని చెప్పాడు ముందే. వాడి కజిన్ ఒకమ్మాయి అలా పడిపోకుండా.. తనూ తిరిగి గన్‌తో ప్రణవ్ పేల్చసాగింది. ఏయ్.. సంజూ.. నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్ కాల్చకూడదు.. నేనే హీరో.. మీరంతా డమ్మీస్.. మోర్టల్ కంబాట్ గేమ్ చూడరా? ఇడియట్’’ అంటూ విసుక్కున్నాడు ప్రణవ్. ఎప్పుడూ నువ్వే హీరోవా? ఇడియట్..’’ ఎదురు తిరిగింది సంజనా. నన్ను ఇడియట్ అంటావా?’’ అంటూ ఆ టాయ్ గన్ బ్యాక్ సైడ్‌తో సంజనా తల మీద కొట్టాడు. ఆ పిల్ల బాధతో విలవిల్లాడుతూ ప్రణవ్ వాళ్లమ్మ దగ్గరకు పరిగెత్తింది. ‘‘అత్తా.. ప్రణవ్ ఎలా కొట్టాడో చూడూ’’ అని ఏడుస్తూ ప్రణవ్ వాళ్లమ్మకు తన తలను చూపించింది. అరెరె.. బొప్పి కట్టిందిరా.. దేంతో కొట్టాడు’’ అని కంగారుగా బొప్పిని అరచేత్తో అదిమిపట్టింది ప్రణవ్ వాళ్లమ్మ కావేరి. రేయ్.. ప్రణవ్ ఇలారా?’’ కేకేసింది ఆమె. వాడు అప్పటికే గన్ పడేసి బయటకు పరిగెత్తాడు. టాయ్ గన్‌తో కొట్టాడమ్మా అక్కను’’ బెదురుతూ చెప్పాడు ధీరజ్. మిగిలిన పిల్లలూ అవునంటూ కోరస్ ఇచ్చారు. సంజనాకు ఫస్ట్ ఎయిడ్ చేసి భర్త దగ్గరకు వెళ్లింది ప్రణవ్ మీద కంప్లయింట్‌తో కావేరి. తల్లి వెనకాలే ధీరజ్ కూడా! నా బాధ్యతేనా? ఏమండీ.. ప్రణవ్ చూశారా.. సంజనాను ఎలా కొట్టాడో?’’ అంది. ఊ’’ ల్యాప్‌టాప్‌లోంచి తలెత్తకుండానే అన్నాడు ఆయన.‘అమ్మా... మొన్న నన్ను కూడా అలాగే కొట్టి కిందపడేశాడమ్మా’’ పదేళ్ల ధీరజ్ ఫిర్యాదు చేశాడు అన్నమీద.‘అయ్యో ఎక్కడ నాన్నా’’ అని వాడిని గోము చేస్తూ ‘‘విన్నారా?’’ అంటూ భర్తకేసి చూసింది. ఊ’’ మళ్లీ అదే పొజిషన్లో ఆయన.అమ్మా.. మొన్న గ్రౌండ్లో కూడా విరాజ్ అన్నవాళ్లతో అలాగే గొడవ పెట్టుకున్నాడు. విరాజ్ అన్నను కొట్టి వాడి కొత్త సైకిల్‌ను తీసుకెళ్లిపోయాడు. విరాజన్న వాళ్ల మమ్మీకి చెప్పాడు కూడా. వాళ్ల మమ్మీయేమో నన్ను తిట్టింది’’ బుంగమూతితో ధీరజ్.వాడిని దగ్గరకు తీసుకుంటూ ‘‘ఏమండీ.. వింటున్నారా?’’ఈసారి కాస్త స్వరం పెంచింది.అయినా ఆయన మళ్లీ ‘‘ఊ’’ అనే అన్నాడు అదే పోశ్చర్ అండ్ అదే స్థాయిలో అతని ప్రతిస్పందన చూసి చిర్రెత్తుకొచ్చింది కావేరికి. ‘‘ఇందాకటి నుంచి ఒక ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడ్డానికి ట్రై చేస్తుంటే ఏంటీ మీ తీరు?’’ అంటూ అరిచేసింది ఆయన మీద. ల్యాప్‌టాప్ పక్కన పెట్టి ఏంటీ అన్నట్టు చూశాడు ఆమెకేసి ఆయన.‘ప్రణవ్ లీలలు విన్నారా? మళ్లీ వినిపించమంటారా? వేలెడంత లేడు.. వాడి దాదాగిరి చూశారుగా? అందరి మీదకు చెయ్యెత్తుతున్నాడు. ఏదైనా అవసరం ఉంటే నెమ్మదిగా అడిగే ప్రసక్తే లేదు.. కొట్టి, తిట్టి తీసుకోవడమే. మొన్నటికిమొన్న వంట మనిషి మీద కూడా అరిచాడట.. చెయ్యి లేపాడట.. పాస్తా చేయనందుకు’’ కంప్లయింట్లు గుప్పించేసింది. నాకు కాదుకదా ఇవన్నీ చెప్పాల్సింది. చూసుకోవాల్సింది నువ్వు. వాడలా తయారయ్యేదాకా పరిస్థితి వచ్చిందంటే నువ్వేం చేస్తున్నట్టు?’’ ఆమెనే తప్పుపట్టాడు ఆయన.నాకేం పనిలేదనుకుంటున్నారా? మీ ఆఫీస్ వర్క్‌తో మీరెంత బిజీనో.. నేనూ అంతే బిజీ! నాకూ ఇంటికి తెచ్చుకునేంత వర్క్ ఉంటుంది. అయినా అన్నీ నేనే చూసుకోవాలి అంటే ఎలా కుదురుతుంది? ఫాదర్‌గా మీకూ బాధ్యత ఉంటుంది కదా?’’ వాళ్ల మధ్య గొడవకు తెరలేపింది ఆమె.అసలు ప్రణవ్ ప్రవర్తన, వాడిని దారిలోకి తెచ్చుకోవడమెలాగో అన్న అంశం పక్కకు వెళ్లి నువ్వెం చేస్తున్నావంటే నువ్వేం చేస్తున్నావ్, నేను బిజీ అంటే నేను బిజీ.. నీ రెస్పాన్స్‌బులిటీ అంటే నీదే రెస్పాన్స్‌బులిటీ అనే చర్చే సాగింది వాళ్ల మధ్య. ఈ గొడవకు భయపడ్డ ధీరజ్ అక్కడి నుంచి వాడి గదిలోకి వెళ్లిపోయి తలుపేసుకున్నాడు. ప్రణవ్ ఎప్పటిలాగే నింపాదిగా వీడియోగేమ్స్ ఆడుకోసాగాడు చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. పట్టించుకోండి ఇదంతా గమనిస్తున్న ప్రణవ్ మేనమామ ఆ పెద్దవాళ్ల దగ్గరకు వచ్చి ‘‘మీరిలా ఉన్నారు కాబట్టే వాడు అలా తయారయ్యాడు. వాడి వయొలెంట్ బిహేవియర్‌కి అదిగో ఆ వీడియోగేమ్స్ పిచ్చే కారణం’’ అని వాళ్లకు ప్రణవ్ను చూపించాడు. ప్రణవ్ అందులో లీనమై ఉన్నాడు. పిల్లాడు వీడియో గేమ్స్ అడిగితే కొనిపెట్టడం కూడా తప్పేనారా?’’ అంది అమాయకంగా ఆ తల్లి. తప్పుకాదు.. కాని అవి ఎలాంటివి? వాడిపై అవెలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయో తెలుసుకోవడం కూడా పేరెంట్స్‌గా మీ బాధ్యత.. అవసరం కూడా. పిల్లలు అడిగినవి అమర్చడం పేరెంటింగ్ కాదు అక్కా.. వాళ్ల మీద శ్రద్ధ పెట్టడం పేరెంటింగ్. మీరేమో మీ ఆఫీస్ బిజీలో పడిపోయి ఇంట్లో ఆయా మీద వదిలేశారు. వాడలా తయారయ్యాడు’’ అని చెప్పుకుపోతుంటే ఆమె కొడుకునే చూస్తోంది. వాడు ఆ గేమ్‌లో పడి కసిగా ‘యెస్’ అంటూ పిడికిలితో మంచం మీద కొడుతున్నాడు, ‘ఓ నో..’ అంటూ పళ్లు కొరుకుతున్నాడు.. ‘చట్’ అంటూ నేలకేసి రిమోట్‌ను బాదుతున్నాడు.. ఉద్వేగంతో మోకాళ్ల మీద కూర్చుంటున్నాడు.. కాసేపు అరుస్తున్నాడు.. ఇంకాసేపు మౌనంగా ఉంటున్నాడు.. ఇలా అన్నీ ఉద్రేకపూరితమైన భావాలతోనే వాడు ఆ గేమ్‌ను చూస్తున్నాడు. అంతా గమనించి భర్తను చూసింది ఆమె. అతనూ విస్తుపోయి చూస్తున్నాడు ప్రణవ్ను. ఎడిక్ట్ అవుతారు... పాజిటివ్ యాక్టివిటీస్ పెంచాలి వీడియో, కంప్యూటర్ గేమ్స్ వయలెంట్ అయినా కాకపోయినా పిల్లలు వాటిని ఆడే టైమ్‌ను చాలా లిమిట్ చేయాలి. ఆ గేమ్స్ ఏ వయసు పిల్లలకో.. అంటే 13 ప్లస్ అని, 15 ప్లస్, 16 ప్లస్ అని.. ఇలా వాటి మీద స్పష్టంగా రాసి ఉంటుంది. 16 ప్లస్ అనే వాటిని పదేళ్ల పిల్లలకు కొనివ్వకూడదు. వీటి ప్రభావం పిల్లల మీద ఉంటుంది, ఉండదు అని ఏ సర్వేలు, అధ్యయనాలు ఏం చెప్పినా.. ఇంట్లో తల్లిదండ్రులు మాత్రం ఈ గేమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఆ గేమ్స్ అగ్రెసివ్‌గా ఉన్నా లేకపోయినా వాటిని పిల్లలకు ఎంత తక్కువగా ఎక్స్పోజ్ చేస్తే అంత మంచిది. మొత్తానికే దూరం పెట్టడం సాధ్యమయ్యే పనికాదు కాబట్టి ఆ టైమ్‌ను పాజిటివ్ యాక్టివిటీస్ వైపు మళ్లించాలి. ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్ వంటి శారీరక వ్యాయామం ఉండే ఆటలను ఆడించడమో లేక తల్లిదండ్రులు వాళ్లతో గడపడమో, సోషల్ రెస్పార్స్బులిటీస్లో వాళ్లను ఇన్వాల్వ్ చేయడమో జరగాలి. దీనివల్ల పిల్లల మనస్తత్వం, వాళ్ల ఆలోచనాధోరణి ఎలా ఉంటోందో, వాళ్లు ఎటువైపు వెళుతున్నారో తెలుసుకునే వీలుంటుంది. మొక్కగా ఉన్నప్పుడే వారి సరైన దారిలో పెట్టే వీలూ కలుగుతుంది. – డాక్టర్ పద్మ పాల్వాయి, చైల్డ్ సైకియాట్రిస్ట్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ - శరాది -
రగడ
రేనాటిలో పెన్నేరు గండి క్రీ.శ.575 (నేటి కడపజిల్లా- గండికోట) ఆకాశం మేఘావృతమై ఉంది. పెన్నేరు గండి కుడిగట్టుపై నిలిచి అవతలి వైపు దృష్టి సారించాడు దుగరాజు (యువరాజు) ధనంజయ చోళుడు. ‘ఈనాడైనా కొంచెం జల్లులు పడితే బాగుంటాది’ అంటూ తాళపత్ర గ్రంథంలో తలదూర్చి ఉన్న మాధవుని వంక చూసాడు. ‘ఈ మేఘాలు ఎక్కడి నించి వస్తాయో కాని ఒక్కక్షణం రేనాటిలో ఆగి కురిసే పాపానబోవు’ పుస్తకంలోంచి తలెత్తకుండా ప్రత్యుత్తరమిచ్చాడు స్నేహితుడు మాధవశర్మ. అతడు సంస్కృత కావ్యాలు చదివి వాటి తాత్పర్యాలు విడమర్చి చెబితే వినడం యువరాజుకి అలవాటు. ‘ఏమప్పా అంత దీర్ఘంగా చదువుతూండావ్?’ ‘కాళిదాసు కృతి మేఘదూతం’. ‘ఆహా! మహాకవప్పా! బిరాన కానీయ్’ అని శిలాపీఠంపై కూర్చున్నాడు. ‘కశ్చిత్కాంతా విరహ గురుణాస్వాధికారాత్ప్రమత్త...’ అంటూ మొదటి వృత్తాన్ని స్వరయుక్తంగా పాడి తెలుగులో తాత్పర్యం వివరించాడు మాధవుడు. ‘చక్కగా పాడినావు మాధవా’ అని భుజం తట్టాడు ధనంజయుడు- కానీ నీవు సంస్కృతంలో పాడినది అర్థమవదు చెప్పే తెలుగు తాత్పర్యం చెవులకు ఇంపుగా ఉండదు- అని మనస్సులో అనుకుంటూ ‘ఊ చెప్పు’ అని సైగ చేసాడు. ‘ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్టసానుం వప్రక్రీడా పరిణిత గజ ప్రేక్షణీయం దదర్శ’ అని రెండవ వృత్తాన్ని ముగించి అర్థం వివరించసాగాడు మాధవశర్మ. వింటున్న ధనంజయుడు ఆకాశంలో మేఘాలని చూస్తూ ‘హాయిగా ఆషాఢ మాసాన ఆకాశదేశాన మార్గాన మెరిసేటి ఓ మేఘమా... అని మన భాషలో పాడుకుంటే ఎంత బాగుంటుంది. ఈ తాత్పర్యాలూ తత్సమాలూ లేకుండా అందరూ విని ఆనందిస్తారు ఏమంటావ్?’ అడిగాడు యువరాజు. ‘ఛీఛీ.. అంత మహాకావ్యాన్ని ఈ దేశీభాషలో పాడటమంటే బురదలో పన్నీరు పోయటమే దేవభాషని అవమానించటం’ అంటూ కోపంగా పుస్తకాన్ని మూసేసాడు మాధవశర్మ. ‘అది కాదులే మాధవా! సంస్కృతంలో ఉన్న పురాణాలనీ కావ్యాలనీ అందరికీ అర్థమయేటట్లుగా మన భాషలో అందంగా రాస్తే జనాలు సైతం పాడుకొని ఆనందిస్తారుగా...’ అంటున్న ధనంజయుడికి అడ్డుచెబుతూ, ‘అందమా? ఈ పామర అనాగరిక భాషకి అందమా? మాట సరిగ్గా పలకలేని వీళ్ళ నోటబడితే శబ్దాలు అసంబద్ధాలై వికృతంగా అవుతాయి’ అని మూతి బిగించాడు. ‘నీవు విద్వాంసుడివప్పా. కంచిలో చదువుకొనుండినావు. అందుకే నీకలాగనిపిస్తాది. కానీ ఈడనే బతుకుతా ఉండే ఈ జానపదుల పల్లెపాటల్లో అందం లేకపోలేదు’ అన్నాడు ఎర్రబడిన ముఖంతో దుగరాజు. యువరాజు ఉక్రోషానికి కారణం అతడికి సంస్కృతం తెలియకపోవడమే అని గ్రహించాడు మాధవశర్మ. ‘పేదవాని కోపం పెదవికి చేటు’ అనే జనవాక్యం తెలియనివాడు కాదు. వెంటనే ఏదోవిధంగా సర్దిచెప్పకపోతే నష్టం అతడికే. ‘యువరాజా! మీ దూరదృష్టి, నిశితమైన మేధస్సు ముందు నా విద్య ఏపాటికి? ఎంతటి మహాకావ్యాన్నయినా ఒక్కసారి వినినంతనే దాని లోతుపాతులు అర్థం చేసుకోగల సామర్థ్యం మీకే ఉంది. ప్రజాహితం గురించి ఆలోచించే మీకు ఈ కావ్యాలని ప్రజల భాషలో అందివ్వాలనే కోరిక కలగటం సమంజసమే. కానీ...’ అంటూ తటపటాయించాడు, మాధవశర్మ. ‘ఊహ్’, మాధవుడి పొగడ్తలకి కాస్త శాంతించాడు ధనంజయుడు. ‘అయితే ఈ విషయం రేపటి పండిత గోష్ఠిలో ప్రస్తావించవలసిందే. ఆ పని నీవే చేయాలి’ అని తీర్మానించాడు. చెన్నకేశవస్వామి ఆలయంలో రేనాటిలోని పండితులూ, తర్కవేత్తలూ, కళాకారులు, శ్రేష్ఠులూ, గామండులూ, రట్టలూ, కావ్యనాటకాదులలో ఆసక్తి ఉన్న పౌరులు తమతమ హోదాకి తగినట్లు వరుసలలో ఆసీనులయ్యారు. సభాధ్యక్షుడికి నమస్కరించి మంటపంలో కూర్చున్నాడు ఎరికల్ ముత్తురాజు ధనంజయ చోళ దుగరాజు. వేదపండితుల ఆశీస్సులతో మొదలై కవి పండితుల ప్రశంసలతో కొన్ని గంటలు గడిచాయి. ఇక అసలు అంశం ప్రస్తావించవలసిన సమయం వచ్చింది. మాధవుడు లేచి సభకి నమస్కరించాడు. ‘ఆదికవి వాల్మీకితో ఆవిష్కృతమై వేదవ్యాసునిచే విరచించబడి పాణినిచే నిర్దేశింపబడి భాస, భారవీ, భర్తృహర్యాదుల కృతులచే సంపన్నమై శూద్రక, కాళిదాసాది మహాకవులని మనకందించిన సంస్కృత భాషా సరస్వతిని కనుగొనడం మహా పండితులకే అసులభం. అటువంటి సంస్కృత పురాణ, కావ్య, నాటక క్రమాన్ని తెలుగుభాషలో సామాన్య జానపదులకు అందుబాటులోకి తేవాలని యువరాజు ఉద్దేశం. అదే ఈనాటి చర్చాంశం...’ ముందు వరుసలలో పండితులు అవాక్కయ్యారు. కానీ లెస్స లెస్సంటూ వెనుక వరుసలలోని పురజనుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ‘వెయ్యేళ్ళు వర్ధిల్లు దుగరాజా. ఈ పండితుల నోటబడి పరుషమైన సాహిత్యం, సరళమైన తెలుగు భాష తీయందనంతో మరింత శోభించగలదు’, అంటూ లేచాడొక దిగంబర జైనుడు. మూడు బారల దండాన్ని పెకైత్తి చిందులు తొక్కుతూ పదం అందుకున్నాడు. ‘కరికాళ సోండ్రమగ రేనాణ్టి దుగరాజు పగతుండ్ర యమరాజు ఎరిగండ్ర ముతురాజు’ జనం అతడి గళంతో గళం కలిపారు. ‘ఆపండీ... ఈ రగడ!’ సభాధ్యక్షుడి ఉరుములాంటి గర్జనతో సభలో కోలాహలం కాస్త సద్దుమణిగింది. ‘ఇది పండితగోష్ఠా? తిరునాళా? ముందు వరుసలలోని పండిత బ్రాహ్మణులు తప్ప మిగిలినవారు వెంటనే నిష్ర్కమించండి’ అన్నాడు. ‘ఇది అధర్మం, అనుచితం!’ అంటూ లేచాడొక రట్ట యువకుడు. ‘ఈ చర్చాంశం అందరికీ సంబంధించినది. గీర్వాణం బలిసిన మీ బ్రాహ్మణులేనా? మేమెలా అనర్హులం?’ అవునూ! అవునూ! అంటూ సభలో మరలా కలకలం చెలరేగింది. ‘ఏమిటవునూ?’ మరోసారి అధ్యక్షుడి గొంతు సభలో మార్మోగింది. ‘వేదాలలో పుట్టిన గాయత్రి, జగతి ఆది వృత్తాలు స్వర ప్రధానాలయితే కావ్యరచనకి ప్రాణం వర్ణవృత్తాలు. జయదేవ, పింగళాది ఛందశ్శాస్త్రజ్ఞులు, పాణినీ, పతంజల్యాది వైయ్యాకరణులు నిర్దేశించినదీ కావ్య విధానం. తకిటతక తాళాల పల్లెపాటల దేశిభాషలో కావ్య రచన అసాధ్యం.’ ‘ఉహ్. తేనె తెలుగట. ఈ పామర భాషకి ఒక ఛందస్సు లేదు. ఒక వ్యాకరణం లేదు. సంస్కృత సరస్వతి కాలిగోటికి సరితూగదీ తెలుగు’ అంటూ ఈసడించాడు ముందు వరుసలోని మరొక పండితుడు. ‘భుటులారా వీరందరినీ వెడలగొట్టి ద్వారాలు మూయండి. పండితుల చర్చ ఆ పిమ్మట సాగగలదు’ అని తీర్మానించాడు సభాధ్యక్షుడు. ‘ఆగండి’ అంటూ లేచి నిలుచున్నాడు యువరాజు ధనంజయుడు, ‘సభాధ్యక్షులు మాట మన్నించాల్సిందే. ప్రస్తుత పరిస్థితిలో మన భాష కావ్యరచనకి అనర్హమే. కానీ వారు చెప్పిన సంగీతానికి స్వర, వర్ణ, తాళాలు మూడు ముఖ్యమే. జానపదుల పదాలకి తాళం ముఖ్యం. మన పల్లెపాటల్లో దాగి వున్న లయ తాళాలను వెలికితీసి కావ్యరచనలోని స్వరవర్ణాలకు జోడిస్తే, భాషాసరస్వతికి మరింత అందం చేకూరుతాదని మా అభిప్రాయం. అయితే తెలుగు ఛందస్సుకి, వ్యాకరణానికి ఒక మంచి రూపం ఇవ్వవలసి ఉండె. గురువుల అనుమతితో మ్రితుడు మాధవశర్మని అందుకు నియోగిస్తుంటిని. మరొక విషయం...’ అని ముందున్న పండిత బృందాన్ని తేరిపార చూస్తూ, ‘ఈనాటి నుండి రాజ్యంలో అన్ని రాచకార్యాలు పామరులకు కూడా తెలిసేటివిధంగా తెలుగుభాషలో సాగగలవు. ఇందుకు ఛందస్సు, వ్యాకరణాల అవసరం లేదు. లిపి, వచనాలు చాలు. ఇది చెన్నకేశవుని అనగా, రేనాడు ఏలే, ఎరికల్ ముత్తురాజు ధనంజయుడి శాసన!’ అని పౌరజనుల చప్పట్ల మధ్య సభ చాలించాడు. ఈ శీర్షికపై మీ స్పందన రాయండి: saipapeneni@gmail.com తెలుగుభాషలో మొట్టమొదటి శాసనం కడపజిల్లా కలమళ్ల చెన్నకేశ్వరాలయంలో దొరికిన రేనాటి ధనంజయశర్మ శాసనం తెలుగుభాషలో మొట్టమొదటిది. మద్రాస్ మ్యూజియం చేరిన ఆ శాసన శకలం దురదృష్టవశాన అదృశ్యమయింది. అంతేకాదు తెలుగువారి వారసత్వ సంపదలో భాగమైన అనేక చారిత్రక శిల్పాలు, అవశేషాలు మద్రాస్ మ్యూజియంలో ఉన్నాయి. తెలుగుభాషకి క్లాసికల్ లాంగ్వేజ్‌గా గుర్తింపు రావటానికి కలమళ్ళ శాసనం ఎంతో కీలకమైనది. తమిళ భాషావేత్తలు, చరిత్రకారులు తెలుగుకి ప్రాచీనభాషగా గుర్తింపు రావటాన్ని ఎంతో వ్యతిరేకించారు. అదే సమయంలో కలమళ్ళ శాసనం మాయమవటం కొన్ని అనుమానాలకి తావు ఇస్తుంది. ఎట్టకేలకు ఎందరో భాషాభిమానులు, భాషాశాస్త్రజ్ఞుల కృషి ఫలితంగా ఆలస్యంగానైనా తెలుగుభాషకి క్లాసికల్ లాంగ్వేజ్ గుర్తింపు లభించింది. భాషగా తెలుగు అతి ప్రాచీన కాలం నుండీ వ్యవహారంలో ఉందనేది నిజం. భరతుని నాట్యశాస్త్రంలో వాత్సాయనుని కామశాస్త్రంలో ‘ఆంధ్రీ’ అనే భాష ప్రసక్తి ఉంది. అదే తెలుగు. క్రీ.శ.1వ శతాబ్దికి చెందిన వాశిష్ఠీపుత్ర పులుమాని నాణెంలో తెలుగులో రాసిన ‘అరహన కు వహిత్థీ మకనాకు తిరు పులుమావి కు’ అనే ఐతిహ్యం కనిపిస్తుంది. ఇందులో ‘కు’ అనే షష్ఠీ విభక్తి ప్రత్యయం తెలుగులో ఉంది. ఈ ఐతిహ్యం తెలుగు ఛందస్సుకు చెందిన ‘రగడ’లో ఉందని భాషావేత్తలు చెప్తారు. అంతేకాదు ఆంధ్రదేశం అనాది నుండీ రచనా వ్యాసంగానికి ఆటపట్టు. వైదిక పరంపరలో మొట్టమొదటి ధర్మశాస్త్రజ్ఞుడు క్రీ.పూ.6వ శతాబ్దికి చెందిన ఆపస్తంభుడు ఆంధ్రుడే. క్రీ.పూ.1వ శతాబ్దంలో రచించబడిన ‘అష్టసహస్రిక’ అనే బౌద్ధగ్రంథంలో అధికభాగం ఆంధ్రప్రాంతానికి చెందిన అంధక శాఖీయులే రచించారు. హీనయాన బౌద్ధానికి మూలమైన పిటకాలు ‘అంధక’ భాష నుండే పాళిభాషలోకి అనువదించబడ్డాయని బుద్ధఘోషుడు ‘మజ్జెమనికాయం’ పీఠికలో చెప్పుకున్నాడు. అంటే ఆంధ్రభాషలో రచనలు చేయడం క్రీస్తు పూర్వం నుండే ఉందని తెలుస్తుంది. మహాయాన బౌద్ధగ్రంథాలు రచించిన నాగార్జునుడు, ఆర్యదేవుడు, దిన్నాగుడు ఆంధ్రులే. కానీ బౌద్ధయుగంలో ప్రాకృతాల్లో సాగాయి. 4వ శతాబ్ది నుండీ బ్రాహ్మణ భూస్వామ్య వ్యవస్థ బలపడటంతో సంస్కృతం విజృంభించింది. క్రీ.శ. 5 నుండి 7వ శతాబ్ది వరకు సంస్కృత సాహిత్యానికి స్వర్ణయుగం అంటారు. కాళిదాసు, భాసుడు, బాణభట్టు మొదలైన మహాకవులు భారత రామాయణాది ఇతిహాసాలలోని ఘట్టాలనే కాక లౌకిక సంప్రదాయంలోని ఎన్నో కథలకి కావ్య, నాటక రూపాలిచ్చారు. శూద్రకుని మృచ్ఛకటికం, విశాఖదత్తుని ముద్రారాక్షసం, భారవి కిరాతార్జునీయం, కాళిదాసు శాంకుతలం, మేఘదూతం, హర్షుని నాగానందం, నైషధం, బాణుడి కాదంబరి, భర్తృహరి సుభాషితాలు ప్రజలలో ఎంతో ఆదరణ చూరగొన్నాయి. భారతీయ సాహిత్యం, నాటక ప్రక్రియ, పాశ్చాత్య కళారూపాలకంటే ఎంతో ఉత్కృష్టమైనవని జగానికి చాటిచెప్పాయి. ఆకాలంలో సంస్కృతం విద్యద్భాషగా విలసిల్లింది. కవులకు, గురువులకు, రాజప్రాపకం దొరికింది. వ్యవహారాలు సంస్కృతంలో నడిచాయి. దక్షిణదేశంలోని అనేక సంస్కృత శాసనాలు అందుకు నిదర్శనం. ఆ భాషమీద పట్టుగల బ్రాహ్మణులు సమాజంలో అగ్రస్థానానికి ఎదిగారు. దేశీభాషయైన తెలుగుకి చిన్నచూపు ఎదురయింది. అటువంటి పరిస్థితులలో, తెలుగుకి ప్రాముఖ్యం ఇచ్చిన రేనాటి ధనంజయుడు, తెలుగువారికి చిరస్మరణీయుడు.