పిల్లలకు మాత్రమే | Adult certification if scenes in movies are not viewable by children | Sakshi
Sakshi News home page

పిల్లలకు మాత్రమే

Published Mon, Sep 18 2017 11:59 PM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM

పిల్లలకు మాత్రమే

పిల్లలకు మాత్రమే

క్రైమ్‌ పేరెంటింగ్‌
 

సినిమాల్లో సన్నివేశాలు పిల్లలు చూడదగ్గవి కాకపోతే అడల్ట్‌ సర్టిఫికేషన్‌ ఇచ్చి పెద్దలకు మాత్రమే’ అని చెప్తారు! ఇది థియేటర్‌ సంగతిఅదే సినిమా ఇంట్లో ఉంటే? అదే సినిమాను పెద్దలు పిల్లల చేతుల్లో పెడితే? పిల్లలు చాలా పెద్ద పనులే చేస్తారు! పిల్లల్ని జీవితాలతో గేమ్స్‌ ఆడనివ్వకండి.. బీ కేర్‌ ఫుల్‌!!

‘‘అన్నయ్యా.. ఇది నాది’’ తన చేతిలోంచి లాక్కుంటున్న పెన్నును గట్టిగా పట్టుకొని అరుస్తున్నాడు ధీరజ్‌. నాక్కావాలి’’ అంటూ మొండిగా ప్రయత్నిస్తున్నాడు ధీరజ్‌ అన్న ప్రణవ్‌. పెన్ను ఇవ్వకుండా ధీరజ్‌ తన అన్న చేతుల్లోంచి తప్పించుకుని పరిగెత్తసాగాడు. అది ప్రణవ్‌కి పరాభవంగా అనిపించింది. పదమూడేళ్ల ఆ పిల్లోడు పళ్లుబిగపట్టి .. అదే కోపంతో తమ్ముడిని పట్టుకొని వాడిని కొట్టి ఆ పెన్ను లాగేసుకున్నాడు. కిందపడిపోయిన తమ్ముడిని విజయగర్వంతో మళ్లీ ఒకసారి తన్ని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అన్న చేష్టలకు భయంతో బిక్కచచ్చిపోయాడు ధీరజ్‌.

సైకిల్‌ కోసం...
చూశావా? దీనికి షాక్‌ అబ్జార్బర్స్‌ కూడా ఉన్నాయి..’’ మెరిసే కళ్లతో వివరిస్తున్నాడు విరాజ్‌ తన స్నేహితులకు.‘అబ్బ భలే ఉందిరా.. ’’ అన్నాడు రోహన్‌ సంభ్రమాశ్చర్యంగా ఆ సైకిల్‌ హ్యాండిల్‌ పట్టుకొని చూస్తూ! రెడ్‌ కలర్‌.. నాకెంత ఇష్టమో తెలుసా? ఈ కలర్‌ స్టాక్‌ లేదంటే త్రీ హండ్రెడ్‌ రూపీస్‌ ఎక్స్‌ట్రా పే చేసి మరీ తెప్పించాడు మా డాడీ.. ’’ అదే సంతోషాన్ని కంటిన్యూ చేస్తూ విరాజ్‌. మొత్తం ఫిఫ్టీన్‌ థౌజెండ్‌ కదరా ఈ సైకిల్‌?’’ అడిగాడు ఇంకో స్నేహితుడు. ఊ...’’ సైకిల్‌నే మురిపెంగా చూసుకుంటూ తలాడించాడు విరాజ్‌. ఇదంతా వింటున్న, చూస్తున్న ప్రణవ్‌కి ఆ సైకిల్‌ను నడపాలనే ఆశ పుట్టింది.

రేయ్‌ విరాజ్‌.. ఒక్కసారి నీ సైకిల్‌ ఇవ్వరా.. ఒక రౌండ్‌ వేసొస్తా’’ కొంచెం దబాయింపుతో అడిగాడు ప్రణవ్‌. అమ్మో.. నా కొత్త సైకిల్‌ నేనివ్వను’’ అన్నాడు విరాజ్‌.  నీ కొత్త సైకిలేం అరిగిపోదులే కాని.. ఒక్కసారివ్వు..’’ అంటూ సైకిల్‌ లాక్కోబోయాడు ప్రణవ్‌. రేయ్‌.. ఇవ్వనన్నాను కదా.. ’’ విరాజ్‌ కూడా దబాయించాడు. ఏదో గొడవ జరగబోతోందనుకున్నారేమో మిగిలిన వాళ్లంతా కాస్త పక్కకు తప్పుకున్నారు బెరుకుగా.  ఇవ్వనని విరాజ్‌ కరాఖండిగా చెప్పేసరికి ప్రణవ్‌ మొహంలో రంగులు మారాయి. వాడికి తాను ఆడుతున్న వీడియోగేమ్‌ గ్రాండ్‌ టెస్ట్‌ ఆటో 5 గుర్తొచ్చింది. అంతే విరాజ్‌ని కొట్టి, వాడిని కింద పడేసి ఆ సైకిల్‌ తీసుకొని రౌండ్‌వేయడానికి వెళ్లిపోయాడు.

హీరోగా..
కజిన్స్‌తో కలిసి ఆడుకుంటున్నారు ప్రణవ్, ధీరజ్‌. చేతుల్లో టాయ్‌ గన్స్‌ ఉన్నాయి. ప్రణవ్‌ చేతిలో గన్‌ పట్టుకొని నిజమైన గన్‌ను పేలుస్తున్నట్టే పోజ్‌ పెట్టి సీరియస్‌గా ఆడుతున్నాడు. వాడు ఎవరినైతే గన్‌తో పేలుస్తున్నాడో వాళ్లు పడిపోవాలని చెప్పాడు ముందే. వాడి కజిన్‌ ఒకమ్మాయి అలా పడిపోకుండా.. తనూ తిరిగి గన్‌తో ప్రణవ్‌ పేల్చసాగింది.  ఏయ్‌.. సంజూ.. నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్‌ కాల్చకూడదు.. నేనే హీరో.. మీరంతా డమ్మీస్‌.. మోర్టల్‌ కంబాట్‌ గేమ్‌ చూడరా? ఇడియట్‌’’ అంటూ విసుక్కున్నాడు ప్రణవ్‌. ఎప్పుడూ నువ్వే హీరోవా? ఇడియట్‌..’’ ఎదురు తిరిగింది సంజనా. నన్ను ఇడియట్‌ అంటావా?’’ అంటూ ఆ టాయ్‌ గన్‌ బ్యాక్‌ సైడ్‌తో సంజనా తల మీద కొట్టాడు.  ఆ పిల్ల బాధతో విలవిల్లాడుతూ ప్రణవ్‌ వాళ్లమ్మ దగ్గరకు పరిగెత్తింది.

‘‘అత్తా.. ప్రణవ్‌ ఎలా కొట్టాడో చూడూ’’ అని ఏడుస్తూ ప్రణవ్‌ వాళ్లమ్మకు తన తలను చూపించింది. అరెరె.. బొప్పి కట్టిందిరా.. దేంతో కొట్టాడు’’ అని కంగారుగా బొప్పిని అరచేత్తో అదిమిపట్టింది ప్రణవ్‌ వాళ్లమ్మ కావేరి. రేయ్‌.. ప్రణవ్‌ ఇలారా?’’ కేకేసింది ఆమె. వాడు అప్పటికే గన్‌ పడేసి బయటకు పరిగెత్తాడు.  టాయ్‌ గన్‌తో కొట్టాడమ్మా అక్కను’’ బెదురుతూ చెప్పాడు ధీరజ్‌. మిగిలిన పిల్లలూ అవునంటూ కోరస్‌ ఇచ్చారు.  సంజనాకు ఫస్ట్‌ ఎయిడ్‌ చేసి భర్త దగ్గరకు వెళ్లింది ప్రణవ్‌ మీద కంప్లయింట్‌తో కావేరి. తల్లి వెనకాలే ధీరజ్‌ కూడా!

నా బాధ్యతేనా?
ఏమండీ.. ప్రణవ్‌ చూశారా.. సంజనాను ఎలా కొట్టాడో?’’ అంది. ఊ’’ ల్యాప్‌టాప్‌లోంచి తలెత్తకుండానే అన్నాడు ఆయన.‘అమ్మా... మొన్న నన్ను కూడా అలాగే కొట్టి కిందపడేశాడమ్మా’’ పదేళ్ల ధీరజ్‌ ఫిర్యాదు చేశాడు అన్నమీద.‘అయ్యో ఎక్కడ నాన్నా’’ అని వాడిని గోము చేస్తూ ‘‘విన్నారా?’’ అంటూ భర్తకేసి చూసింది. ఊ’’ మళ్లీ అదే పొజిషన్‌లో ఆయన.అమ్మా.. మొన్న గ్రౌండ్‌లో కూడా విరాజ్‌ అన్నవాళ్లతో అలాగే గొడవ పెట్టుకున్నాడు. విరాజ్‌ అన్నను కొట్టి వాడి కొత్త సైకిల్‌ను తీసుకెళ్లిపోయాడు. విరాజన్న వాళ్ల మమ్మీకి చెప్పాడు కూడా. వాళ్ల మమ్మీయేమో నన్ను తిట్టింది’’ బుంగమూతితో ధీరజ్‌.వాడిని దగ్గరకు తీసుకుంటూ ‘‘ఏమండీ.. వింటున్నారా?’’ఈసారి కాస్త స్వరం పెంచింది.అయినా ఆయన మళ్లీ ‘‘ఊ’’ అనే అన్నాడు అదే పోశ్చర్‌ అండ్‌ అదే స్థాయిలో అతని ప్రతిస్పందన చూసి చిర్రెత్తుకొచ్చింది కావేరికి.

‘‘ఇందాకటి నుంచి ఒక ఇంపార్టెంట్‌ థింగ్‌ మాట్లాడ్డానికి ట్రై చేస్తుంటే ఏంటీ మీ తీరు?’’ అంటూ అరిచేసింది ఆయన మీద. ల్యాప్‌టాప్‌ పక్కన పెట్టి ఏంటీ అన్నట్టు చూశాడు ఆమెకేసి ఆయన.‘ప్రణవ్‌ లీలలు విన్నారా? మళ్లీ వినిపించమంటారా? వేలెడంత లేడు.. వాడి దాదాగిరి చూశారుగా? అందరి మీదకు చెయ్యెత్తుతున్నాడు. ఏదైనా అవసరం ఉంటే నెమ్మదిగా అడిగే ప్రసక్తే లేదు.. కొట్టి, తిట్టి తీసుకోవడమే. మొన్నటికిమొన్న వంట మనిషి మీద కూడా అరిచాడట.. చెయ్యి లేపాడట.. పాస్తా చేయనందుకు’’ కంప్లయింట్లు గుప్పించేసింది.

నాకు కాదుకదా ఇవన్నీ చెప్పాల్సింది. చూసుకోవాల్సింది నువ్వు. వాడలా తయారయ్యేదాకా పరిస్థితి వచ్చిందంటే నువ్వేం చేస్తున్నట్టు?’’ ఆమెనే తప్పుపట్టాడు ఆయన.నాకేం పనిలేదనుకుంటున్నారా? మీ ఆఫీస్‌ వర్క్‌తో మీరెంత బిజీనో.. నేనూ అంతే బిజీ! నాకూ ఇంటికి తెచ్చుకునేంత వర్క్‌ ఉంటుంది. అయినా అన్నీ నేనే చూసుకోవాలి అంటే ఎలా కుదురుతుంది? ఫాదర్‌గా మీకూ బాధ్యత ఉంటుంది కదా?’’ వాళ్ల మధ్య గొడవకు తెరలేపింది ఆమె.అసలు ప్రణవ్‌ ప్రవర్తన, వాడిని దారిలోకి తెచ్చుకోవడమెలాగో అన్న అంశం పక్కకు వెళ్లి నువ్వెం చేస్తున్నావంటే నువ్వేం చేస్తున్నావ్, నేను బిజీ అంటే నేను బిజీ.. నీ రెస్పాన్స్‌బులిటీ అంటే నీదే రెస్పాన్స్‌బులిటీ అనే చర్చే సాగింది వాళ్ల మధ్య. ఈ గొడవకు భయపడ్డ ధీరజ్‌ అక్కడి నుంచి వాడి గదిలోకి వెళ్లిపోయి తలుపేసుకున్నాడు. ప్రణవ్‌ ఎప్పటిలాగే నింపాదిగా వీడియోగేమ్స్‌ ఆడుకోసాగాడు చెవుల్లో ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకొని.

పట్టించుకోండి
ఇదంతా గమనిస్తున్న ప్రణవ్‌ మేనమామ ఆ పెద్దవాళ్ల దగ్గరకు వచ్చి ‘‘మీరిలా ఉన్నారు కాబట్టే వాడు అలా తయారయ్యాడు. వాడి వయొలెంట్‌ బిహేవియర్‌కి అదిగో ఆ వీడియోగేమ్స్‌ పిచ్చే కారణం’’ అని వాళ్లకు ప్రణవ్‌ను చూపించాడు. ప్రణవ్‌ అందులో లీనమై ఉన్నాడు. పిల్లాడు వీడియో గేమ్స్‌ అడిగితే కొనిపెట్టడం కూడా తప్పేనారా?’’ అంది అమాయకంగా ఆ తల్లి. తప్పుకాదు.. కాని అవి ఎలాంటివి? వాడిపై అవెలాంటి ఇంపాక్ట్‌ చూపిస్తున్నాయో తెలుసుకోవడం కూడా పేరెంట్స్‌గా మీ బాధ్యత.. అవసరం కూడా. పిల్లలు అడిగినవి అమర్చడం పేరెంటింగ్‌ కాదు అక్కా.. వాళ్ల మీద శ్రద్ధ పెట్టడం పేరెంటింగ్‌. మీరేమో మీ ఆఫీస్‌ బిజీలో పడిపోయి ఇంట్లో ఆయా మీద వదిలేశారు. వాడలా తయారయ్యాడు’’ అని చెప్పుకుపోతుంటే ఆమె కొడుకునే చూస్తోంది. వాడు ఆ గేమ్‌లో పడి కసిగా ‘యెస్‌’ అంటూ పిడికిలితో మంచం మీద కొడుతున్నాడు, ‘ఓ నో..’ అంటూ పళ్లు కొరుకుతున్నాడు.. ‘చట్‌’ అంటూ నేలకేసి రిమోట్‌ను బాదుతున్నాడు.. ఉద్వేగంతో మోకాళ్ల మీద కూర్చుంటున్నాడు.. కాసేపు అరుస్తున్నాడు.. ఇంకాసేపు మౌనంగా ఉంటున్నాడు.. ఇలా అన్నీ ఉద్రేకపూరితమైన భావాలతోనే వాడు ఆ గేమ్‌ను చూస్తున్నాడు. అంతా గమనించి భర్తను చూసింది ఆమె. అతనూ విస్తుపోయి చూస్తున్నాడు ప్రణవ్‌ను.

ఎడిక్ట్‌ అవుతారు... పాజిటివ్‌ యాక్టివిటీస్‌ పెంచాలి
వీడియో, కంప్యూటర్‌ గేమ్స్‌ వయలెంట్‌ అయినా కాకపోయినా పిల్లలు వాటిని ఆడే టైమ్‌ను  చాలా లిమిట్‌ చేయాలి.  ఆ గేమ్స్‌ ఏ వయసు పిల్లలకో.. అంటే 13 ప్లస్‌ అని, 15 ప్లస్, 16 ప్లస్‌ అని.. ఇలా వాటి మీద స్పష్టంగా రాసి ఉంటుంది. 16 ప్లస్‌ అనే వాటిని పదేళ్ల పిల్లలకు కొనివ్వకూడదు. వీటి ప్రభావం పిల్లల మీద ఉంటుంది, ఉండదు అని ఏ సర్వేలు, అధ్యయనాలు ఏం చెప్పినా.. ఇంట్లో తల్లిదండ్రులు మాత్రం ఈ గేమ్స్‌ విషయంలో చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఆ గేమ్స్‌ అగ్రెసివ్‌గా ఉన్నా లేకపోయినా వాటిని పిల్లలకు ఎంత తక్కువగా ఎక్స్‌పోజ్‌ చేస్తే అంత మంచిది. మొత్తానికే దూరం పెట్టడం సాధ్యమయ్యే పనికాదు కాబట్టి  ఆ టైమ్‌ను పాజిటివ్‌ యాక్టివిటీస్‌ వైపు మళ్లించాలి. ఫుట్‌బాల్, బాస్కెట్‌ బాల్‌ వంటి శారీరక వ్యాయామం ఉండే ఆటలను ఆడించడమో లేక తల్లిదండ్రులు వాళ్లతో గడపడమో, సోషల్‌ రెస్పార్స్‌బులిటీస్‌లో వాళ్లను ఇన్‌వాల్వ్‌ చేయడమో జరగాలి. దీనివల్ల పిల్లల మనస్తత్వం, వాళ్ల ఆలోచనాధోరణి ఎలా ఉంటోందో, వాళ్లు ఎటువైపు వెళుతున్నారో తెలుసుకునే వీలుంటుంది. మొక్కగా ఉన్నప్పుడే వారి సరైన దారిలో పెట్టే వీలూ కలుగుతుంది.
 – డాక్టర్‌ పద్మ పాల్వాయి, చైల్డ్‌ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌
- శరాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement