►కాకతీయ పౌరుషానికి ప్రతీక అయిన రాణీ రుద్రమదేవి 1289లో ప్రాణాలు వదిలారు. ఆ విషయం 1970లలో వెలుగు చూసింది. ఆమె ఎప్పుడు చనిపోయిందో ప్రపంచానికి ఇన్ని శతాబ్దాల తర్వాత తెలియచెప్పింది ఓ శాసనం.
►విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు 1529 అక్టోబర్ 17న మరణించారన్న విషయం గతేడాది ఫిబ్రవరిలో కర్ణాటకలోని తూమకూరు ప్రాంతంలో లభించిన ఓ శాసనమే వెలుగులోకి తెచ్చింది.
సాక్షి, హైదరాబాద్: చరిత్రలో శాసనాలకు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతాకాదు. చరిత్రను ఎలాంటి వక్రీకరణల్లేకుండా భావితరాలకు అందిస్తున్నవి నాటి శాసనాలే. ఇప్పుడు అలాంటి శాసనాలకు ఓ ప్రత్యేక ప్రదర్శనశాల సిద్ధం కానుంది. భాగ్యనగరం కేంద్రంగా నేషనల్ ఎపిగ్రఫీ మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర పర్యాటక, సాంస్కతిక శాఖ చర్యలు చేపట్టింది. దేశంలో ఇప్పటికే పూర్తిస్థాయి మింట్ మ్యూజియంకు హైదరాబాద్ వేదిక కానుండగా ఇప్పుడు ఎపిగ్రఫీ మ్యూజియం కూడా ఇక్కడే ఏర్పడనుండటం విశేషం.
నేటి తరం కోసమే...
కాగితాలు లేని కాలంలో ఓ చారిత్రక ఘట్టాన్ని భవిష్యత్తు తరానికి అక్షరబద్ధం చేసి అందించేందుకు ఉన్న ఏకైక మార్గం శాసనం వేయించడమే. అందుకే చరిత్రను ఆధారసహితంగా మనకు అందించేవి శాసనాలే. కానీ ఈ విషయంలో మన దేశం ఎంతో వెనకబడి ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా శాసనాలు చదివేందుకు ప్రభుత్వపరంగా ఉన్న నిపుణులు కేవలం 30 మందే. అలాగే కొందరు ఔత్సాహికులు తప్ప ఇప్పుడు శాసనాలు చదివి పరిష్కరించేవారు లేకుండా పోతున్నారు. నేటి తరానికి వాటిపై అవగాహనే ఉండటం లేదు. ఈ తరుణంలో ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు కానుండటంతో శాసనాలను వెలుగులోకి తెచ్చి పదిలం చేసే వ్యవస్థ ఏర్పడేందుకు మార్గం సుగమం కానుంది.
ఆ నినాదంతో మొదలై..
కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం పరిధిలో జాతీయ స్థాయిలో ఎపిగ్రఫీ విభాగం కర్ణాటకలోని మైసూరు కేంద్రంగా కొనసాగుతోంది. అక్కడ ఎపిగ్రఫీ డైరక్టరేట్ ఉండగా, లక్నో, నాగ్‌పూర్, చెన్నైలలో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. కానీ సిబ్బంది కొరత, రాష్ట్రాల పరిధిలో పురావస్తు శాఖలు నిర్వీర్యమైపోవడం, వాటికి కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగంతో సమన్వయం లేకపోవడం.. వెరసి ఎపిగ్రఫీ విభాగం సరిగ్గా పనిచేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఎపిగ్రఫీ పోస్టుల సంఖ్య పెంచాలంటూ కొందరు విశ్రాంత ఎపిగ్రఫిస్టులు, ఔత్సాహిక పరిశోధకులు దాదాపు 50 వేల మంది ఇటీవల ఆన్‌లైన్ వేదికగా ఉద్యమిస్తున్నారు.
ఉద్యమ ప్రతినిధులు కొందరు ఇటీవల విశ్రాంత ఐఏఎస్ అధికారి ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. వారి డిమాండ్లతోపాటు ఎపిగ్రఫీ మ్యూజియం అంశం చర్చకు వచ్చింది. ఫలితంగా జాతీయ స్థాయిలో ఓ ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు అంశం కొలిక్కి వచ్చింది. హైదరాబాద్‌లో ఆ మ్యూజియంను ఏర్పాటు చేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. త్వరలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి భవనాన్ని ఎంపిక చేయనున్నారు. ఉన్న భవనాల్లో ఎక్కడో ఓ చోట ఏర్పాటు చేయాలా, కొత్త భవనం నిర్మించాలా అన్న విషయాన్ని తేల్చనున్నారు.
►జాతీయ స్థాయిలో లభించిన, కొత్తగా వెలుగు చూసే ముఖ్యమైన శాసనాలను ఈ మ్యూజియంలో భద్రపరిచి, వాటి ప్రాధాన్యాన్ని సరికొత్త సాంకేతికతతో సందర్శకుల ముందుంచుతారు.
కేంద్రం చేపట్టనున్న చర్యలు...
►కొత్తగా కనీసం 100 వరకు ఎపిగ్రఫీ పోస్టులు ఏర్పాటు చేసి భర్తీ చేస్తారు.
►శాసనాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తారు.
►శాసనాల గుర్తింపు, వాటి పరిరక్షణ విషయంలో రాష్ట్రాలతో అనుసంధానం ఏర్పాటు చేస్తారు.
►డిజిటలైజేషన్ ద్వారా శాసనాల పూర్తి విషయాలను సందర్శకుల ముందుంచుతారు.
►శాసనాలకు సంబంధించిన సదస్సులు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment