టూకీగా ప్రపంచ చరిత్ర 44 | Encapsulate the history of the world 44 | Sakshi
Sakshi News home page

టూకీగా ప్రపంచ చరిత్ర 44

Published Wed, Feb 25 2015 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

టూకీగా  ప్రపంచ చరిత్ర    44

టూకీగా ప్రపంచ చరిత్ర 44

నాగరికత
 
అతలాకుతలమైన భూగోళపు ఉపరితలం కుదురుబాటుకు చేరుకుంటున్న తరుణంలో మానవుని పరిణామంలో ‘నాగరికత’ మోసెత్తింది. ఏ పదివేల సంవత్సరాలకు పూర్వమో విల్లనమ్ములు చేత్తో పట్టుకుని దశదిశలా విస్తరించిన మానవునితో మనకు ‘సంస్కృతి’ ప్రారంభం కాగా, నాగలి పట్టిన మానవునితో నాగరికత మొదలయింది. సంస్కృతి వేరు, నాగరికత వేరు. ఉమ్మడి ఆచార విశ్వాసాలు సంస్కృతి; ఉమ్మడిగా అనుభవించే సౌకర్యాలు నాగరికత. సంస్కృతి సంచార జాతుల్లోనూ ఉంటుంది. నాగరికత స్థిరనివాసుల్లో మాత్రమే కనిపిస్తుంది. ఏడాది పొడవునా నీటికి కొరత ఉండని జీవనదులను ఆశ్రయించి క్రీ.పూ.7000 ప్రాంతంలో నాగరిక నివాసాలు మొదలైనట్టు మనకు దొరుకుతున్న ఆధారాలు నిరూపిస్తున్నాయి. చిత్రమేమిటంటే - ఈ రెండు దశలూ కొత్తరాతియుగం అంతర్భాగాలే. లోహం గురించి అప్పటికి తెలీకపోవడంతో, కర్రు లేని నాగలితో సాగిందే సేద్యం; రాతి కొడవలితో బరుక్కున్నదే కోత!

అతి పురాతనమైన నాగరికతలుగా ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాల్లో బహు విస్తారమైనవి - 1. మెసొపొటేమియా, 2. ఈజిప్టు, 3. సింధూ, 4. చైనా నాగరికతలు. వీటిల్లో ముందుగా చెప్పుకోదగింది ‘మెసొపొటేమియా’. యూఫ్రాటెస్,టైగ్రిస్ పేరుగల రెండు నదుల మధ్య విస్తరించిన ప్రాంతం కావడంతో దీనికి ఆ పేరొచ్చింది. ఈ నదుల మూలంగా, సిరియా మొదలు పర్షియల్ గల్ఫ్‌వరకు చాపంలా విస్తరించిన పీఠభూమి (ఫెర్టైల్ క్రిసెంట్) ప్రపంచంలోకెల్లా అత్యంత సారవంతమైనదిగా ప్రసిద్ధి. చరిత్రకు పితామహుడైన ‘హెరొడోటస్’ ప్రకారం, ఆ భూముల్లో విత్తిన ప్రతి గోధుమ గింజ రెండు వందల రెట్లు ఫలసాయం ఇచ్చేదట. అంతేగాదు, ఆరోజుల్లోనే గోధుమను ఇరుగారు పండించేవాళ్ళనీ, కోతలు పూర్తయిన తరువాత ఆ పొలాల్లో పశువులకు మేత పుష్కలంగా దొరికేదనీ, ఖర్జూరం మొదలు ఎన్నోరకాల పండ్ల చెట్లు ఆ ప్రాంతంలో విస్తారంగా ఉండేవనీ బైబిల్ కాలంనాటి చరిత్రకారులు చెబుతున్నారు. హెరొడోటస్ నాటికి గోధుమ బహుళ ప్రచారం పొందిన పంట కావచ్చుగానీ, తొలితరం వ్యవసాయదారునికి ఆ పైరును గురించి అవగాహన లేదు. అప్పట్లో తెలిసిన తృణధాన్యాలు జొన్న, బార్లీ మాత్రమే. గోధుమను తెలుసుకునేందుకు మరో రెండువేల సంవత్సరాలు పట్టింది.

ఆహారంలో భాగంగా పప్పుదినుసులు ఎప్పుడు మొదలయ్యాయో చెప్పలేం గానీ, పలురకాల పప్పుధాన్యాలు మెట్టపైర్లుగా మెసొపొటేమియాలో ప్రవేశించాయి. వాళ్ళ వ్యవసాయం తడిపైర్లకు మాత్రమే పరిమితం కాలేదనీ, అది బహుముఖంగా విస్తరించిందనీ ఈ పప్పుదినసులు నిరూపిస్తున్నాయి. వీటిల్లో ‘నువ్వులు’ కూడా ఉండడం మరింత అపురూపం. నువ్వుల నుండి వచ్చింది ‘నూనె’. సంస్కృతంలో ‘తిల’ నుండి వచ్చింది ‘తైలం’. నూనెనిచ్చే పదార్థాలకు నువ్వుగింజ మొదటిది కావడంతో, ఆ తరువాత ఏ గింజనుండి అలాంటి పదార్థం లభించినా దాన్ని నూనెగానే వ్యవహరిస్తున్నాము - అవిసె నూనె, ఆవనూనె, కుసుమనూనె, వేరుసెనగ నూనె - ఇలా. మరో మూడువేల సంవత్సరాల తరువాత సింధూనది తీరంనుండి దిగుమతులు మొదలయ్యేవరకూ ‘పత్తి’ని గురించి మెసొపొటేమియాకు తెలీదు. దుస్తులుగా వాళ్ళు ధరించినవి ఉన్నితోనూ, నారతోనూ తయారైన బట్టలు. ‘మగ్గం’ ఇంకా అందుబాటులోకి రానందున, పడుగునూ పేకనూ చేతికర్రల సహాయంతో మార్చుకుంటూ నేసేదే నేత. లడక్, మేఘాలయా ప్రాంతాల్లో ఇప్పటికీ ఈతరహా నేత మనకు కనిపిస్తుంది.

వాడుకునే దినుసులన్నీ ఒకే తావులో పండవు కాబట్టి ప్రయత్నం లేకుండా ప్రవేశించిన విధానం ‘వస్తుమార్పిడి’. దరిమిలా, సంతల రూపంలో వర్తకానికి పునాది ఏర్పడింది. వర్తకం అనగానే ప్రామాణికమైన కొలతలూ, తూకాలూ అవసరమౌతాయి. ఒకే పరిణామంలో తయారుచేసుకున్న గంపలతోనూ, ఇంచుమించు ఒకే బరువుండే గుండ్రాళ్ళతోనూ బహుశా వాళ్ళు ఆ అవసరాన్ని తీర్చుకోనుండొచ్చు. గింజకూ గింజకూ తూకంలో తేడా స్వల్పాతిస్వల్పమైన కారణంగా గురువింద గింజలను ఇటీవలి కాలందాకా బంగారు తూకానికి వినియోగించడం మనం చూసేవున్నాం.

రచన: ఎం.వి.రమణారెడ్డి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement