గతుకులే గతి
- జిల్లాలో రోడ్లనిర్మాణానికి సర్కారు విముఖత
- రూ.8 కోట్లతో ప్రతిపాదనలకు ఎర్రజెండా
- తుపాన్లకు దెబ్బతిన్నవాటికి కలగని మోక్షం
రహదారులు నాగరికతకు చిరునామాలు. ఎక్కడ రోడ్లు అభివృద్ధి చెందుతాయో అక్కడ నాగరికత పరిఢవిల్లుతుంది. జిల్లాలో ఈ రంగం పూర్తిగా కుదేలయింది. గ్రామీణ రోడ్లది అక్షరాలా కన్నీటి గాథే. రోజురోజుకు ఇవి అధోగతి పాలవుతున్నాయి. మోకాలిలోతు గోతులతో శిథిలమైన రోడ్ల కారణంగా వందలాది గ్రామాలకు రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. కొత్త ప్రభుత్వం వీటి నిర్మాణం, మరమ్మతులకు నిధులు విడుదలకు ససేమిరా అంటోంది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రోడ్లు చాలావరకు నడవడానికి వీల్లేకుండా ఉన్నాయి.
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఆర్‌అండ్‌బీ శాఖ అధీనంలోని విశాఖ, పాడేరు డివిజన్లలో మొత్తం 2198 కిలోమీటర్ల రహదారులున్నాయి. వీటిలో 721 కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్రామీణ రోడ్లున్నాయి. వీటిలో 28 మండలాల్లో సగానికిపైగా పూర్తిగా ధ్వంసమై నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. నర్సీపట్నం, నక్కపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, కోటవురట్ల, రోలుగుంటతోపాటు పాడేరు, అరకు డివిజన్లలో చాలా గ్రామాల్లో రహదారుల్లో నడవడానికి, ప్రయాణించడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏడాదిన్నరగా ఇదే తంతు.
అయినా ప్రభుత్వం గ్రామీణ, పట్టణ రోడ్ల నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు. సీఎం రోశయ్య హయాం నుంచి జిల్లాలో కొత్త రహదారుల నిర్మాణానికి ఆర్‌అండ్‌బీకి నిధులు పెద్దగా విడుదల కాలేదు. దీనికితోడు 2013లో వచ్చిన పలు తుపాన్లు, భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. సుమారుగా 280 కిలోమీటర్లు పూర్తిగా పాడయ్యాయని అధికారులు తేల్చారు. వీటి స్థానంలో కొత్త రోడ్లకు ప్రాథమికంగా రూ.8 కోట్లు విడుదల చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించినా అతీగతీలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాకైనా నిధులివ్వలేదు.
విభజనకు ముందు ఇచ్చిన ప్రతిపాదనలతో తమకు సంబంధం లేదని, నిధులు ఇవ్వలేమని కరాకండీగా చెబుతోంది. దీంతో ఇప్పుడు ఆశాఖ అధికారులకు పాలుపోవడం లేదు. ఆర్థిక సంఘం నిధులు కూడా రాక చేష్టలుడిగి చూస్తున్నారు. ఇంకోపక్క ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఆర్‌అండ్‌బీ అధికారులపై ఒత్తిడి తెచ్చి పలు రోడ్లకు శంకుస్థాపనలు చేయించేశారు. కానీ నిధులు లేక ఇవి ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దీంతో గ్రామాల్లో ప్రజలకు సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లునములుతున్నారు.
ఇదిలాఉంటే అసెంబ్లీ నియోజకవర్గ అభివద్ధి పథకం (ఏసీడీపీ) కింద ఎమ్మెల్యేలకు ఏటా రూ.కోటి నిధులు వచ్చేవి. వీటితో రోడ్లను కొంతవరకు స్థానికంగా అభివద్ధి చేసుకునేందుకు వీలుండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఏసీడీపీ నిధులు రద్దుచేయడంతో ఆర్‌అండ్‌బీ అధికారులకూ పెద్దగా పనిలేకుండా పోయింది. దీంతో ఇప్పుడు ఒకపక్క నిధులు లేక..చేయడానికి పనిలేక ఖాళీగా ఉంటున్నామని చెబుతున్నారు.