development of roads
-
ఏకరీతిన హరిత నగరాల ప్రధాన రోడ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జగనన్న హరిత నగరాల కింద తొలి విడతలో ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లో ప్రథాన రోడ్లను ఒకేలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం విజయవాడ విమానాశ్రయ రోడ్డును నమూనాగా తీసుకోనున్నారు. ఈ మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతారు. ఈ రహదారిపై ఎలాంటి మొక్కలు నాటుతారో మిగతా నగరాల్లోనూ ఒక ప్రధాన మార్గాన్ని అలాగే తయారు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ విభాగాలు నిర్ణయించాయి. నగర, పట్టణాల్లోని ప్రధాన మీడియన్స్‌లో అభివృద్ధి చేసే ఈ ప్లాంటేషన్ ద్వారా మొత్తం 1.50 లక్షల చ.మీ మేర పచ్చదనం అదనంగా అందుబాటులోకి వస్తుంది. ఇతర రాష్ట్రాలకు విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే గన్నవరం విమానాశ్రయం రోడ్డును అందంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ రోడ్డు విజయవాడ రామవరప్పాడు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు 13.82 కిలోమీటర్లు ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డు కొంత కాలం పాటు కృత్రిమ అందాలు, రంగుల వెలుగుల్లో కనిపించింది. ఇకపై సహజమైన పూల మొక్కలు, పచ్చని చెట్లతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో పురపాలక, పట్టణాభివృద్ధి విభాగంపై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం ఈ రోడ్డును రూ.5.02 కోట్లతో ప్రకృతి అందాన్నిచ్చే మొక్కలతో నింపేలా ప్రణాళిక రూపొందించింది. ఇప్పటి దాకా జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఈ రోడ్డును తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చి, ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్‌కు అప్పగించారు. -
భవిష్యత్ తరాలకు ఇబ్బందులుండవ్
చిలకలగూడ: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు, భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ)ద్వారా నగరంలో అద్భుతమైన రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నామని, ఇందుకోసం రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రూ.72 కోట్ల వ్యయంతో నిర్మించిన తుకారాంగేట్ ఆర్యూబీని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రజాసమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఎస్ఆర్డీపీ పథకం ద్వారా అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే సిగ్నల్ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామన్నారు. సికింద్రాబాద్, ఖైరతాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల పరిధిలో రైల్వేలైన్లు ఉన్నందున రైల్వే అధికారులతో చర్చించి స్థానిక ప్రజల మౌలిక అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామని వివరించారు. లాలాగూడ రైల్వేగేట్ పడడంతో 2003లో కేసీఆర్‌తోపాటు తాను, పద్మారావులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కున్నామని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. తుకారాంగేట్ ఆర్యూబీ అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజల కల నెరవేరిందన్నారు. పద్మారావు దొరకడం మీ అదృష్టం డిప్యూటీ స్పీకర్ పద్మారావు నేతృత్వంలో సికింద్రాబాద్ అన్నివిధాల అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలను కడుపులో పెట్టుకుని ఆదరించే పద్మారావు వంటి నాయకుడు దొరకడం నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. ప్రజల చిరకాలవాంఛ నేటికి నెరవేరిందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. ఆర్యూబీ అందుబాటులోకి రావడంతో మల్కాజ్గిరి, మారేడుపల్లి, మెట్టుగూడ, లాలాపేట, మౌలాలీ, తార్నాక, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల మధ్య రవాణా సదుపాయం మెరుగుపడిందన్నారు. ఉద్యమ కాలంలో ఇక్కడే పలుమార్లు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నామని వివరించారు. బడుగు, బలహీన, దళిత వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాసయాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి, కార్పొరేటర్లు లింగాని ప్రసన్నలక్ష్మి, సామల హేమ, కంది శైలజ, సునీత, ఎస్ఆర్డీపీ సీఈ దేవానంద్, ఎస్ఈ రవీందర్‌రాజు, ఈఈ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
నల్లకుంట: నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో అన్ని డివిజన్లలోని బస్తీలు, కాలనీలకు సమాన ప్రాధాన్యతది ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బడ్జెట్ ద్వారా మంజూరైన నిధులతో అన్ని డివిజన్ల పరిధిలోనూ నూతన సీవరేజీ, డ్రైనేజీ పైప్‌లతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. బుధవారం నల్లకుంట డివిజన్ యాక్సిస్ బ్యాంక్ లేన్‌లో రూ.6 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ అమృతతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయా ప్రాంతాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సువర్ణ, ఏఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ నరేందర్, వాటర్ వర్క్స్ ఏఈ రోహిత్, టీఆర్ఎస్ నాయకులు నరేందర్, భాస్కర్ గౌడ్, ప్రవీణ్, సాయికిరణ్, బీజేపీ నాయకులు శ్యామ్‌రాజ్, లక్ష్మణ్‌కుమార్, సుధాకర్ పాల్గొన్నారు. రోడ్ల సమగ్రాభివృద్ధికి కృషి.. అంబర్‌పేట: నియోజకవర్గంలో రోడ్ల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. బుధవారం బాగ్‌అంబర్‌పేట డివిజన్ శ్రీనివాసకాలనీలో రూ.22 లక్షల అంచనా వ్యయంతో నిరి్మంచనున్న సీసీ రోడ్లను స్థానిక కార్పొరేటర్ బీ.పద్మావెంకట్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లను సైతం ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ గద్వాల జిల్లా ఇన్చార్జ్ బీ.వెంకట్‌రెడ్డి, స్థానిక బీజేపీ, టీఆర్ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు. -
రోడ్లకు ఇక మహర్దశ
⇒రహదారుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ⇒స్పెషల్ పర్పస్ వెహికల్‌గా ‘హెచ్ఆర్డీసీఎల్’ ఏర్పాటు సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలో ప్రధాన రూట్లలోని రహదారులను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ఆర్డీసీఎల్)ను ఏర్పాటు చేసింది. రహదారుల అభివృద్ధి మాత్రమే కాక, రహదారుల వెంట ప్రకటనలు, రహదారుల వెంబడి ఉన్న ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం సైతం ఈ సంస్థకే చెందుతాయి. అవసరమైన నిధుల్ని బ్యాంకు రుణాలుగా లేదా షేర్ల ద్వారా పొందే అధికారం సైతం దీనికి ఉంది. వీటన్నింటి కోసం స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)గా హెచ్‌ఆర్‌డీసీఎల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రహదారుల అభివృద్ధి లక్ష్యం.. గ్రేటర్ నగరంలో రోడ్ల దుస్థితి గురించి చెప్పాలిందేం లేదు. నాలుగు చినుకులు పడ్డా వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారుల(మేజర్రోడ్ల)నైనా అభివృద్ధి పరచాలని ప్రభుత్వం భావించింది. వాటిని అభివృద్ధి పరచాలంటే వివిధ ప్రభుత్వ విభాగాల మధ్యనే సమన్వయం, సహకారం లేవు. ఓవైపు నుంచి జీహెచ్ఎంసీ రోడ్లు వేస్తూ ఉంటే.. మరోవైపు నుంచి జలమండలి/ఆర్అండ్బీ/టీఎస్ఎస్పీడీసీఎల్/బీఎస్ఎన్ఎల్/ ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్లు / ట్రాఫిక్ పోలీసులు...ఎవరికి తోచిన విధంగా వారు తమ అవసరాల కోసం రోడ్లు తవ్వుతూ పోతున్నారు. మౌలిక సదుపాయాల కోసం చేసే ఈ పనుల్లో అన్ని ప్రభుత్వ విభాగాలు, సంస్థల మధ్య సమన్వయంలేదు. దీంతో ఏటా కోట్ల రూపాయలు రోడ్ల కోసం ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రజల కష్టాలు తీరడం లేదు. ట్రాఫిక్ సమస్యలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ ప్రధాన రహదారుల మార్గాల్లో సమగ్రంగా రహదారులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం హెచ్‌ఆర్‌డీసీఎల్‌ను ఏర్పాటు చేసింది. కంపెనీ యాక్ట్ కింద స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)గా దీన్ని ఏర్పాటు చేసింది. ఇకపై జీహెచ్ఎంసీ పరిధిలో.. పరిసరాల్లోని పట్టణస్థానిక సంస్థల్లో రోడ్నెట్వర్క్ అభివృద్ధి పనులు మొత్తం దీని పర్యవేక్షణలో జరుగుతాయి. మరోవైపు ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా తొలిదశలో దాదాపు రూ. 2600 కోట్లతో మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు, స్కైవేలు, తదితర పనుల్ని జీహెచ్ఎంసీ చేపడుతోంది. ఆర్అండ్బీ పరిధిలోని 41 రహదారుల్ని సైతం రెండేళ్ల కిందట జీహెచ్ఎంసీ అధీనంలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో మేజర్ రోడ్లను అభివృద్ధి పరచేందుకు సమగ్ర ప్లాన్ అవసరమని, ప్లాన్ మేరకు పనులు పనులను పర్యవేక్షించేందుకు ఎస్పీవీ అవసరమని భావించిన ప్రభుత్వం హెచ్‌ఆర్‌డీసీఎల్‌ను ఏర్పాటు చేసింది. అన్ని శాఖల మధ్య సమన్వయం కోసం హెచ్ఆర్డీసీఎల్లో వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులను డైరెక్టర్లుగా నామినేట్ చేసింది. చీఫ్ సెక్రటరీ చైర్మన్‌గా.. హెచ్‌ఆర్‌డీసీఎల్‌కు చైర్మన్‌గా చీఫ్ సెక్రటరీని, ఎండీగా మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ/సెక్రటరీని నియమించింది. డైరెక్టర్లుగా ఆర్ అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ /సెక్రటరీ, ఆర్థికశాఖ ప్రిన్సిపల్సెక్రటరీ/ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ, హెచ్ఎండీఏ కమిషనర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అడిషనల్ కమిషనర్(ట్రాఫిక్), టీఎస్సార్టీసీ ఎండీ, టీఎస్ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ఎండీ, ఆర్అండ్బీ ఈఎన్సీలను నియమించింది. రుణాలు సేకరించే అధికారం.. జీహెచ్ఎంసీ, శివార్లలోని మేజర్రోడ్స్ నెట్వర్క్ పనులకు అవసరమైన నిధుల్ని ఆర్థిక సంస్థలనుంచి రుణాలుగా పొందేందుకు హెచ్‌ఆర్‌డీసీఎల్‌కు అధికారం ఉంటుంది. షేర్ల రూపేణా తీసుకునే పక్షంలో హెచ్ఆర్డీసీఎల్ షేర్ క్యాపిటల్ ఎంత ఉండాలనేది సమయానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. తొలుత ఆర్అండ్బీ మార్గాలు.. తొలిదశలో భాగంగా ఆర్అండ్బీ నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చిన రహదారుల్ని హెచ్ఆర్డీసీఎల్ పరిధిలోకి తెచ్చారు. రహదారులతోపాటే వాటి రైట్ ఆఫ్ వే పరిధిలోని వివిధ అధికారాలు (ప్రకటనలు, పార్కింగ్, నిర్మాణాల లీజులు, ఆస్తిపన్ను మీద సెస్ వంటి) సైతం హెచ్ఆర్డీసీఎల్కే ఉంటాయి. భవిష్యత్తులో ఈరోడ్ల వెంబడి భవనాలకు ఇంపాక్ట్ ఫీజు వంటివి విధించినా తద్వారా వచ్చే ఆదాయం సైతం దీనికే చెందుతాయి. రహదారుల్ని అభివృద్ధి పరచేందుకు ఈ నిధుల్ని వినియోగిస్తారు. హెచ్‌ఆర్‌డీసీఎల్‌ను ఏర్పాటుచేస్తూ కొద్దిరోజుల క్రితం చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ జీవో (నెంబర్ 89) జారీ చేశారు. -
రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం
జగిత్యాల రూరల్ : గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉపాధిహామీ పథకం కింద చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణాలను మండలంలోని తాటిపల్లిలో రూ.15 లక్షల విలువైన, చల్గల్లో రూ.17 లక్షల విలువైన సీసీ రోడ్ల పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఉపాధిహామీ పథకం ద్వారా సీసీరోడ్లు నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు మౌళిక వసతులు కల్పించేందుకు ఎన్ని నిధులైనా వెచ్చిస్తామన్నారు. అనంతరం చల్గల్ గ్రామ శివారులోని లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు నీలం భూమన్న, జున్ను కవిత, ఎంపీటీసీలు ఎంబారి రాజేశ్వరి, మొర్రి లక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొలుగూరి దామోదర్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ అయిలవేని గంగాధర్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ మనోహర్‌రెడ్డి, నాయకులు చెట్పల్లి సత్తన్న, బందెల మల్లయ్య, పెద్దన్న, జున్ను రాజేందర్, మల్లేశం, గంగారెడ్డి పాల్గొన్నారు. -
దేవాలయాల కూల్చివేత అమానుషం
మచిలీపట్నం (చిలకలపూడి) : రహదారుల అభివృద్ధిలో భాగంగా విజయవాడలో 42 ఆలయాలను కూల్చివేయడం అమానుషమైన చర్య అని బీజేపీ బందరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జ్ పంతం గజేంద్ర అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా ధర్నా జరిగింది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డౌన్.. డౌన్.. అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గజేంద్ర మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా దేవాలయాలు కూల్చివేయడమే కాకుండా బీజేపీ నాయకులపై తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేయడం సబబుకాదన్నారు. ఆలయాలు కూల్చివేయటంపై మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్సీ, ఎంపీలను పరుష పదజాలంతో దూషించడం హేయమన్నారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఆలయాలను విచక్షణారహితంగా కూల్చివేస్తున్నారని ఇందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. విజయవాడ మునిసిపల్ కమిషనర్ తదితర అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ జిల్లా యువమోర్చ నాయకుడు చిలంకుర్తి పృధ్వీప్రసన్న మాట్లాడుతూ ఆలయాల కూల్చివేత విషయంలో బీజేపీ నాయకులపై టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో సీహెచ్ రంగయ్యకు వినతిపత్రం అందజేశారు. బీజేపీ నాయకులు కూనపరెడ్డి శ్రీనివాసరావు, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, ఉడత్తు శ్రీనివాసరావు, మల్లాది వెంకటేశ్వరరావు, కూనపరెడ్డి సుబ్బయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డుకు మొరం.. కార్యకర్తలకు వరం
►రూ.384 కోట్లతో 11,212 రోడ్ల అభివృద్ధి ►14,657 కిలోమీటర్ల మేర మట్టి పనులు హైదరాబాద్: మొరం, మట్టి పనుల పేరుతో కోట్లాది నిధులను రోడ్లపై వెదజల్లేందుకు రంగం సిద్ధమైంది. గ్రామీణ రోడ్ల అభివృద్ధిలో భాగంగా భారీ ఎత్తున మరమ్మతు పనులు చేపట్టాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులన్నింటినీ నామినేషన్ పద్ధతిన చేపట్టాలన్న సాకుతో పార్టీ శ్రేణులకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ద్వారాలు తెరిచింది. ఇందుకోసం ఇటీవలే రూ. 384.61 కోట్లను సర్కారు కేటాయించింది. మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్(ఎంఆర్ఆర్) గ్రాంటు నుంచి ఈ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో రాష్ట్రవ్యాప్తంగా 11,212 రోడ్ల మరమ్మతుల్లో భాగంగా దాదాపు 14,657.23 కిలోమీటర్ల మేర మట్టి, మొరం పోసి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ రూ.5 లక్షలలోపు విలువైన పనులు కావడంతో నిబంధనల ప్రకారం వీటిని నామినేషన్ పద్ధతిన అప్పగిస్తారు. గ్రామ సర్పంచ్, గ్రామాభివృద్ధి కమిటీ పేరిట తీర్మానం చేసిన కాంట్రాక్టర్లే ఈ పనులు దక్కించుకుంటారు. దీంతో మండల, గ్రామ స్థాయిల్లో అధికార పార్టీ నేతలకు పనుల పండుగ మొదలైంది. ఇదంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో జరిగే తతంగం కావడంతో నిధులన్నీ ‘గులాబీ’ కాంట్రాక్టర్లకే పంచిపెట్టనున్నారు. మొరం, మట్టి పోసే పనులు కావడంతో ఆనవాళ్లు లేకుండా ఈ నిధులను పార్టీ కార్యకర్తలకు ఫలహారంగా పంచి పెట్టడం ఖాయమనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే పంచాయతీరాజ్ విభాగం ఈ పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రూ.20 లక్షలకు మించి అంచనా వ్యయమయ్యే రోడ్ల పనులను సైతం రూ.5 లక్షల విలువైన పనులుగా విభజించిన తీరు ఈ పంపకాల లోగుట్టును బయటపెడుతోంది. ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లా ఖానాపురం మండలంలో గంగాపూర్ నుంచి బీర్నాడీ ఎర్రచింతల్ వరకు రూ.15.88 లక్షల ఖర్చుతో అంచనా వేసిన ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు పనులను నాలుగు బిట్లుగా విడగొట్టారు. రూ.5 లక్షల అంచనా వ్యయం దాటకుండా ఒకే పనిని నాలుగు పనులుగా మంజూరీ చేశారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం శాత్రాజుపల్లి నుంచి కొండన్నపేట రోడ్డు పనులను రూ.5 లక్షలు మించకుండా మూడు బిట్లుగా విడగొట్టారు. ఇదే తీరుగా ప్రతి జిల్లాలో వందలాది పనులను వేలాది పనులుగా విభజించి పంపిణీకి అనువుగా పరిపాలక ఉత్తర్వులను జారీ చేశారు. కార్యకర్తలకు కరువు తీరా.. గతంలో మండలం యూనిట్‌గా పనులను విభజించి కోటికిపైగా అంచనా వ్యయంతో పంచాయతీరాజ్ విభాగం రూపొందించిన ప్రతిపాదనలను సర్కారు ఆమోదించింది. భారీ ప్యాకేజీలతో బడా కాంట్రాక్టర్లు, బీటీ హాట్‌మిక్స్ ప్లాంట్లు ఉన్న వారు మాత్రమే టెండర్లలో పాల్గొనే లా నిబంధనలను సవరించింది. దీంతో రాజకీయ నేతలకు సంబంధించిన కాంట్రాక్టు ఏజెన్సీలే ఈ పనులను సునాయాసంగా దక్కించుకున్నాయి. దీనికితోడు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులను పంచుకునేందుకు అన్ని జిల్లాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులే పోటీపడ్డారు. దీంతో గ్రామస్థాయిలో చోటామోటా కాంట్రాక్టర్లకు పనుల కరువు ఏర్పడింది. కిందిస్థాయి కార్యకర్తల్లోని అసంతృప్తిని గమనించిన సర్కారు తాజాగా గ్రామీణ రోడ్ల పనులకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం మరమ్మతు చేపట్టే రోడ్లలో 30 శాతం ఇప్పటికే కంకర(మెటల్) రోడ్లుగా మారాయి. ఇప్పటికే రూ.225.11 కోట్లతో ఈ రోడ్ల అభివృద్ధి జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈజీఎస్ అప్‌గ్రేడేషన్ పేరుతో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఖర్చు చేసింది. అయితే ఇప్పటికే మెటల్ రోడ్లుగా మారిన వాటిని సైతం తాజాగా మట్టి పనులు చేపట్టే రోడ్ల జాబితాలో ఉన్నాయి. వీటిని రద్దు చేస్తారా లేక మట్టి పోసినట్లు బిల్లులు చేస్తారా అనేది చర్చనీయాంశమైంది. సర్కారు ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికే చేపట్టిన పనులుంటే రద్దు చేయాల్సి ఉంది. కానీ నిధుల పంపిణీ కోసమే చేపట్టిన పనులు కావడంతో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పంచాయతీరాజ్ విభాగం అధికారులు ఇరకాటంలో పడ్డారు. జిల్లా రోడ్ల సంఖ్య కిలోమీటర్లు నిధులు(రూ. కోట్లలో) ఆదిలాబాద్ 1,169 1,363.20 43.87 కరీంనగర్ 1,386 1,833.03 53.43 ఖమ్మం 883 978.70 33.02 మహబూబ్‌నగర్ 1,587 2,421.56 51.98 మెదక్ 1,340 1,458.09 48.08 నల్గొండ 1,562 2,399.59 49.00 నిజామాబాద్ 1,059 1,207.77 33.99 రంగారెడ్డి 933 1,269.91 28.69 వరంగల్ 1,293 1,725.38 42.55 ----------------------------------------------- మొత్తం 11,212 14,657.23 384.61 ---------------------------------------------- అధికార పార్టీ శ్రేణులకు పనుల పండుగ రోడ్ల మరమ్మతులకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఫలహారంలా నిధుల పంపిణీకి ఎత్తుగడ రూ.5 లక్షల్లోపు బిట్లుగా పనుల విభజన నామినేషన్ పద్ధతిన గులాబీ నేతలకు కట్టబెట్టే వ్యూహం -
పాలన వేగవంతం
- జిల్లాలో ప్రతీ అర్హుడికి సంక్షేమ పథకాలు అందించటమే లక్ష్యం - కాకతీయ మిషన్, రోడ్ల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి - వాటర్‌గ్రిడ్ ద్వారా జిల్లా అంతటికీ తాగునీరు - విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల సాక్షి ప్రతినిధి, ఖమ్మం : నూతనంగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారుల విభజన జరిగిందని, ఇక నుంచి జిల్లాలో పాలన వేగవంతం చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్ 2న ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారని, గత నెల వరకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ పంపకాలు పూర్తి కాకపోవడంతో పాలనలో ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ప్రధానంగా కాకతీయ మిషన్, రోడ్ల మరమ్మతులు, విస్తరణ, అంగన్వాడీలకు సన్నబియ్యం, హరితహారం, వాటర్‌గ్రిడ్ పథకాలను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. కాకతీయ మిషన్ కింద 900 చెరువుల మరమ్మతు లక్ష్యం కాగా, 585 చెరువులకు అంచనాలు వేసి ఆమోదానికి పంపామని తెలిపారు. మిగిలిన పనుల అంచనాలు వారం రోజుల్లో పూర్తిచేసి టెండర్లు పిలుస్తామన్నారు. ఇప్పటికే 186 పనులకు టెండర్లు పూర్తి చేశామని, ఈ నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో అంచనాలు రూపొందించేలా ఆదేశాలు జారీ చేశామని వివరించారు. పంచాయతీరాజ్ శాఖలో ఉన్న రోడ్లు పదేళ్లలో విచ్ఛిన్నం, విధ్వంసం అయ్యాయని, వాటికి రెన్యూవల్స్, రిపేర్లకు టెండర్లు పిలిచామని చెప్పారు. ఆర్అండ్బీ పరిధిలో 104 పనులకు టెండర్లు పిలిచామని, వారంలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రూ.20 కోట్లతో 80 పనులు చేపడతామన్నారు. జిల్లాలో వాటర్‌గ్రిడ్ పథకం కింద మూడు ప్రాజెక్టుల ద్వారా తాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. తొలుత సత్తుపల్లి, అశ్వారావుపేట నియోకవర్గాలకు కృష్ణాజలాల నుంచి తాగునీటిని అందించాలని భావించామని, అది సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవటంతో గోదావరి నుంచి నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. హరితహారం కింద లక్ష్యాలు సాధించేందుకు ఈ నెలాఖరు నాటికి మొక్కలు నాటుతామన్నారు. రానున్న వేసవిలో కరెంట్, నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అందుకు అవసరమైన నిధులకోసం ప్రతిపాదనలు పంపించాలన్నారు. పెన్షన్లు రానివారు అధైర్యపడవద్దని, చివరి మనిషి వరకు పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. హాస్టళ్లలో, అంగన్వాడీ కేంద్రాల్లో సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని, పాలు, గుడ్లపై కూడా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. కడుపులో ఉన్న బిడ్డకు, తల్లికి ఆహారం అందించటంతో పాటు పుట్టిన నాటి నుంచి పెద్దయ్యేంత వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు. షాధీముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాన్ని అర్హులకు అందించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట కలెక్టర్ ఇలంబరితి, చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఉన్నారు. -
రాష్ట్రంలో రోడ్డు లేని ఊరే ఉండొద్దు
తెలంగాణ గ్రామీణ రోడ్ల అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు సీఎం ఆదేశం రహదారుల పరిస్థితిపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో రోడ్డులేని ఊరే ఉండొద్దని, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లను బాగుపరిచేందుకు తెలంగాణ గ్రామీణ రహదారుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి, మరమ్మతుల కోసం రూ. 5 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో 20 వేల కిలోమీటర్ల రహదారులను అభివృద్ధిపరచడానికి రూ. 200 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. వచ్చే రెండేళ్లలో బీటీ రోడ్ల మరమ్మతులకు రూ. 2,400 కోట్లు కేటాయిస్తామని, రూ. 700 కోట్ల బకాయిలు కూడా చెల్లిస్తామని సీఎం తెలిపారు. 4,146 కిలోమీటర్ల డబ్ల్యూబీఎం రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1450 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. కల్వర్టులు, వంతెనల మరమ్మతుల కోసం మరో రూ. 250 కోట్లు వెచ్చిస్తామన్నారు. పంచాయతీరాజ్ రోడ్ల పరిస్థితిపై ముఖ్యమంత్రి శనివారం సచివాలయంలో సమీక్షించారు. డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రులు కె.టి.రామారావు, టి.హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. సమావేశ వివరాలను సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. రోడ్ల పనుల కోసం వారం రోజుల వ్యవధిలోనే టెండర్లు పిలవాలని, 15వ రోజు వర్క్ ఆర్డర్ ఇవ్వాలని, 20వ రోజు నుంచి పని ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు అన్ని పనులు ప్రారంభమయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంకా రోడ్డు సౌకర్యం లేని 1614 ఆవాస ప్రాంతాల్లో వెంటనే రోడ్లు వేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్డు సౌకర్యం లేని ఊరే ఉండొద్దన్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించడానికి త్వరలో అన్ని స్థాయిల ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించారు. మరోవైపు రెండేళ్లలో రహదారులను అద్దంలా మార్చుతామని, హైదరాబాద్ నుంచి ప్రతి జిల్లా కేంద్రానికి నాలుగు లైన్ల రోడ్లను నిర్మిస్తామని రోడ్ల అభివృ ద్ధిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. శనివారం సచివాలయంలో ఇది భేటీ అయింది. సమావేశ వివరాలను ఉప ముఖ్యమంత్రి రాజయ్య వివరించారు. వరంగల్, కరీం నగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, మెదక్ జిల్లా కేంద్రాల్లో రింగ్ రోడ్ల సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రతీ జిల్లాలో మాస్టర్ ప్లాన్ తయారు చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు రాజయ్య పేర్కొన్నారు. ‘ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లకు ఒకే ప్రమాణాలుండాలి. ఇసుక లారీలు, ట్రాక్టర్ల వల్ల జాతీయ రహదారులు ధ్వంసమవుతున్నాయి. ఇలా జరగకుండా ఎలాంటి ప్రమాణాలు పాటించాలో అధికారులను నివేదిక కోరాం. రోడ్లను అభివృద్ధి చేసేందుకు సెస్ పెట్టాలా.. లేదా అన్న ఆలోచన చేస్తున్నాం. రోడ్ల నిర్వహణ బాధ్యతను సంబంధిత ఏజెన్సీకి ఐదేళ్లు ఇవ్వాలనుకుంటున్నాం. నీళ్లు నిల్వ ఉండటం వల్ల రోడ్లు పాడవుతున్నాయి కాబట్టి డ్రైనేజీ సౌకర్యాలను మెరుగుపర్చాల్సి ఉంది. ఆన్లైన్లో వారం వ్యవధిలోనే టెండర్లు పిలవాలని భావిస్తున్నాం’’ అని డిప్యూ టీ సీఎం చెప్పారు. మరో 15 రోజుల్లో పనులు మొదలుపెట్టాలని భావిస్తున్నామన్నారు. ఈ నెల 7న మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపారు. -
రోడ్లకు మహర్దశ
రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం: కేసీఆర్ జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నాలుగు లైన్లు మండల కేంద్రాల నుంచి జిల్లాలకు రెండు లైన్ల రోడ్ల నిర్మాణం అన్ని నదులు, ఉప నదులపై అవసరమైన చోట వంతెనలు సాక్షి, హైదరాబాద్: రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై శుక్రవారం సచివాలయంలో ఆయన మరోసారి సమీక్షించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రహదారులు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు లైన్ల రహదారుల నిర్మాణ ం చేపట్టాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. రాష్ర్టవ్యాప్తంగా రహదారులకు వెంటనే మరమ్మతులు ప్రారంభించాలని సూచించారు. నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, జాతీయ రహదారుల చీఫ్ ఇంజనీర్ గణపతిరెడ్డి, ఆర్అండ్బీ ఈఎన్సీ రవీందర్రావు, క్వాలిటీ కంట్రోల్ విభాగం ఈఎన్సీ భిక్షపతి సమీక్షలో పొల్గొన్నారు. జిలా కేంద్రాల నుంచి నాలుగు లైన్లు: వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లా కేంద్రాల నుంచి ఇప్పటికే హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రోడ్లు ఉండగా, వీటిలో ఇంకా కొన్ని పనులు పురోగతిలో ఉన్నాయని, నిజామాబాద్, ఖమ్మం రహదారులను కొత్తగా నిర్మించాల్సి ఉందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. రాష్ర్టంలో 149 మండలాలకు వాటి జిల్లా కేంద్రాలకు మధ్య డబుల్ లైన్ రోడ్లు లేవని, వెంటనే వాటిని వేయాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రజల సౌకర్యం కోసం రహదారులను అద్దాల మాదిరి తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రూరల్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లను వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఆర్‌అండ్‌బీలో ఖాళీలను భర్తీ చేసి ఆ శాఖను బలోపేతం చేస్తామన్నారు. అత్యవసరంగా రోడ్ల మరమ్మత్తుల కోసం సీఈ స్థాయిలో రూ. 5 ల క్షలు, ఎస్ఈ స్థాయిలో రూ. 2 లక్షలు, ఈఈ స్థాయిలో రూ. లక్ష వరకు వినియోగించే అధికారం కల్పిస్తామన్నారు. రానున్న రెండేళ్లలో రహదారుల కోసం దాదాపు రూ. 12 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు, ప్రతి నియోజకవర్గానికి సగటున రూ. 110 కోట్లు కేటాయిస్తామన్నారు. గోదావరిపై వంతెనలు: గోదావరి నదిపై ఎస్ఆర్ఎస్పీ ఎగువన ఒకటి, దిగువన మరొక వంతెనను నిర్మించాలని, అవి ముదోల్-అర్మూర్ నియోజకవర్గాల మధ్య, కడెం-రాయికల్ నియోజకవర్గాల మధ్య ఉండాలని సీఎం సూచించారు. అలాగే రాష్ర్టంలో నదులు, ఉప నదులపై ఎక్కడెక్కడ వంతెనలు అవసరమో సర్వే చేయాలని ఆదేశించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో రింగురోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 260 కిలోమీటర్ల పొడవున్న రాజీవ్ రహదారిని సరిచేసేందుకు రూ. 750 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రజ్ఞాపూర్, కుక్కనూర్పల్లి, గౌరారం, మామిడిపల్లి, తుర్కపల్లి, దుద్దెడ, ములుగు, కొడకుండ్ల, రామునిపట్ల, ఇబ్రహీంనగర్ తదితర చోట్ల బైపాస్‌రోడ్లు, షామీర్పేట్, సిద్దిపేట్, ఎల్కతుర్తి వద్ద ఫ్లైవోవర్లు నిర్మించాలని నిర్ణయించారు. హైదరాబాద్-వరంగల్ రహదారిలో ప్రస్తుతం యాదగిరిగుట్ట వరకు నాలుగు లైన్లు ఉండగా, దాన్ని వరంగల్ వరకు త్వరగా పూర్తి చేయాలని సీఎం పేర్కొన్నారు. -
గతుకులే గతి
జిల్లాలో రోడ్లనిర్మాణానికి సర్కారు విముఖత రూ.8 కోట్లతో ప్రతిపాదనలకు ఎర్రజెండా తుపాన్లకు దెబ్బతిన్నవాటికి కలగని మోక్షం రహదారులు నాగరికతకు చిరునామాలు. ఎక్కడ రోడ్లు అభివృద్ధి చెందుతాయో అక్కడ నాగరికత పరిఢవిల్లుతుంది. జిల్లాలో ఈ రంగం పూర్తిగా కుదేలయింది. గ్రామీణ రోడ్లది అక్షరాలా కన్నీటి గాథే. రోజురోజుకు ఇవి అధోగతి పాలవుతున్నాయి. మోకాలిలోతు గోతులతో శిథిలమైన రోడ్ల కారణంగా వందలాది గ్రామాలకు రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. కొత్త ప్రభుత్వం వీటి నిర్మాణం, మరమ్మతులకు నిధులు విడుదలకు ససేమిరా అంటోంది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రోడ్లు చాలావరకు నడవడానికి వీల్లేకుండా ఉన్నాయి. సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఆర్అండ్బీ శాఖ అధీనంలోని విశాఖ, పాడేరు డివిజన్లలో మొత్తం 2198 కిలోమీటర్ల రహదారులున్నాయి. వీటిలో 721 కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్రామీణ రోడ్లున్నాయి. వీటిలో 28 మండలాల్లో సగానికిపైగా పూర్తిగా ధ్వంసమై నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. నర్సీపట్నం, నక్కపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, కోటవురట్ల, రోలుగుంటతోపాటు పాడేరు, అరకు డివిజన్లలో చాలా గ్రామాల్లో రహదారుల్లో నడవడానికి, ప్రయాణించడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏడాదిన్నరగా ఇదే తంతు. అయినా ప్రభుత్వం గ్రామీణ, పట్టణ రోడ్ల నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు. సీఎం రోశయ్య హయాం నుంచి జిల్లాలో కొత్త రహదారుల నిర్మాణానికి ఆర్‌అండ్‌బీకి నిధులు పెద్దగా విడుదల కాలేదు. దీనికితోడు 2013లో వచ్చిన పలు తుపాన్లు, భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. సుమారుగా 280 కిలోమీటర్లు పూర్తిగా పాడయ్యాయని అధికారులు తేల్చారు. వీటి స్థానంలో కొత్త రోడ్లకు ప్రాథమికంగా రూ.8 కోట్లు విడుదల చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించినా అతీగతీలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాకైనా నిధులివ్వలేదు. విభజనకు ముందు ఇచ్చిన ప్రతిపాదనలతో తమకు సంబంధం లేదని, నిధులు ఇవ్వలేమని కరాకండీగా చెబుతోంది. దీంతో ఇప్పుడు ఆశాఖ అధికారులకు పాలుపోవడం లేదు. ఆర్థిక సంఘం నిధులు కూడా రాక చేష్టలుడిగి చూస్తున్నారు. ఇంకోపక్క ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఆర్అండ్బీ అధికారులపై ఒత్తిడి తెచ్చి పలు రోడ్లకు శంకుస్థాపనలు చేయించేశారు. కానీ నిధులు లేక ఇవి ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దీంతో గ్రామాల్లో ప్రజలకు సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లునములుతున్నారు. ఇదిలాఉంటే అసెంబ్లీ నియోజకవర్గ అభివద్ధి పథకం (ఏసీడీపీ) కింద ఎమ్మెల్యేలకు ఏటా రూ.కోటి నిధులు వచ్చేవి. వీటితో రోడ్లను కొంతవరకు స్థానికంగా అభివద్ధి చేసుకునేందుకు వీలుండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఏసీడీపీ నిధులు రద్దుచేయడంతో ఆర్అండ్బీ అధికారులకూ పెద్దగా పనిలేకుండా పోయింది. దీంతో ఇప్పుడు ఒకపక్క నిధులు లేక..చేయడానికి పనిలేక ఖాళీగా ఉంటున్నామని చెబుతున్నారు. -
గిరి బతుకులపై దుర్‘మార్గం’
11 మండలాల్లో అభివృద్ధి చెందని రోడ్లు 100 గ్రామాల గిరిజనుల అవస్థలు పాడేరు: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లవుతున్నా మారుమూల గ్రామాల గిరిజనులు రవా ణా సౌకర్యాల్లేక నరకయాతన పడుతున్నారు. ఇప్పటికీ ఏజెన్సీలో రోడ్లు లేని గ్రామాలు కోకొల్లలు. కొయ్యూరు నుంచి అనంతగిరి వ రకు 11 మండలాల్లోని కుగ్రామాల్లో ఇప్పటికీ రోడ్లు అభివృద్ధి చెందలేదు. అనేక పంచాయతీ కేంద్రాలకు పక్కా రోడ్డు సౌకర్యం లేదు. పాడేరు, పెదబయలు మండలాల పరిధిలోని కించూరు, కుం తుర్ల, కిముడుపల్లి, పెదకోడాపల్లి పంచాయతీల పరిధిలో రోడ్లు అభివృద్ధి చెందలేదు. ఆర్టీసీ బస్సు సౌకర్యానికి కూడా నోచుకోని సు మారు 100 గ్రామాల గిరిజనులు దుర్భర జీవ నం సాగిస్తున్నారు. మండల కేంద్రాలకు చేరుకునేందుకు ప్రయివేటు జీపుల్లో ప్రమాదకర ప్ర యాణం సాగిస్తున్నారు. గమ్యం చేరేవరకు ప్రా ణాలను అరచేతిలో పెట్టుకుంటున్నారు. పది హేను మం దికి మించి చోటు లేని ప్రయివేటు జీపుల్లో 40 నుంచి 50 మంది వరకు ప్రయాణిస్తున్న తీరు వారి రవాణా అవసరాలకు అద్దం పడుతున్నాయి. పెదకోడాపల్లి-గుత్తులపుట్టు మార్గంలో ఈ భయానక ప్రయాణం నిత్యకృత్యమైంది. అధ్వానపు రోడ్డును అభివృద్ధి చేస్తే బ స్సు సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నా పాలకుల్లో చలనం లేదు. గిరిజనాభ్యున్నతికి రూ.వేల కోట్లు నిధులు మంజూరవుతున్నా గిరిజనులకు కనీస సౌకర్యాలను కల్పించలేక పోతున్నారు. -
రోడ్లకు మహర్దశ
రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు తీయాలంటే అందుకు అనుగుణంగా రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి జయలలిత తెలిపారు. ఇందుకుగాను రూ.2,325 కోట్లతో సుదీర్ఘ ప్రణాళికను రూపొందించినట్లు శుక్రవారం ఆమె అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ పారిశ్రామికంగా, వ్యవసాయకంగానేగాక ఇతర రంగాలపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు. తక్కువ సమయంలో గమ్యం చేరడం ద్వారా ఇంధన వినియోగంలో పొదుపు పాటించవచ్చన్నారు. ఈ విధానానికి రహదారులు అనువుగా ఉండాలన్నారు. చెన్నై కార్పొరేషన్ సరిహద్దులను కలుపుతూ 250 కిలోమీటర్ల మేర రూ.250 కోట్లతో రోడ్ల నిర్మాణం, విస్తరణ జరుపుతామని తెలిపారు. రూ.185 కోట్లతో నగరంలో సబ్‌వేల నిర్మాణం చేపడతామన్నారు. ప్రధాన రద్దీ ప్రాంతాల్లో పాదచారుల కోసం ఎస్కిలేటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒరగడం ఇండస్ట్రియల్ పార్క్ వద్ద రూ.120 కోట్లతో సిక్స్‌లైన్ రోడ్ల నిర్మాణం జరుగుతోందని అన్నారు. మధురైలో మీనాక్షి ఆస్పత్రి నుంచి కప్పలూరు వరకు 27 కిలోమీటర్ల పొడవున రూ.200 కోట్లతో రహదారిని విస్తరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 మానసిక చికిత్సాలయాలు ఉండగా మరో 22 నెలకొల్పుతున్నట్లు తెలిపారు. తమిళభాషను కాపాడుకునేందుకుప్రతి జిల్లా నుంచి సాహితీవేత్తలను ఎంపికచేస్తామన్నారు. వారిని తమిళచెమ్మల్, ఇళంగవడికల్ అవార్డులతో సత్కరించనున్నట్టు తెలిపారు. ఇదిలావుండగా డీఎంకే సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ ప్రతిపక్షాలు చేసిన అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారు. దీంతో పీఎంకే వాకౌట్ చేసింది. సీపీఎం కార్యదర్శిపై పరువునష్టం దావా తన పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా మాట్లాడారని పేర్కొంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జీ.రామకృష్ణన్‌పై సీఎం జయలలిత శుక్రవారం పరువునష్టం దావాను దాఖలు చేశారు. ఇసుక మాఫియా చేతుల్లో ఒక కానిస్టేబుల్ హత్యకు గురికావడంపై ఓ ఆంగ్ల పత్రికకు రామకృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూలో వాస్తవాలకు విరుద్దగా మాట్లాడాడని పేర్కొంటూ జయ తరపున న్యాయవాది ఎంఎల్ జగన్ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా రాష్ట్ర రవాణా శాఖా మంత్రి సెంధిల్ బాలాజీ ఇప్పటికే ఇద్దరిపై పరువునష్టం దావా వేసి ఉన్న విషయం తెల్సిందే.