రాష్ట్రంలో రోడ్డు లేని ఊరే ఉండొద్దు | High priority to the development of roads,says kcr | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రోడ్డు లేని ఊరే ఉండొద్దు

Published Sun, Nov 2 2014 1:14 AM | Last Updated on Wed, Aug 15 2018 7:50 PM

రాష్ట్రంలో రోడ్డు లేని ఊరే ఉండొద్దు - Sakshi

రాష్ట్రంలో రోడ్డు లేని ఊరే ఉండొద్దు

తెలంగాణ గ్రామీణ రోడ్ల అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు సీఎం ఆదేశం  
రహదారుల పరిస్థితిపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష


సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో రోడ్డులేని ఊరే ఉండొద్దని, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లను బాగుపరిచేందుకు తెలంగాణ గ్రామీణ రహదారుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి, మరమ్మతుల కోసం రూ. 5 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో 20 వేల కిలోమీటర్ల రహదారులను అభివృద్ధిపరచడానికి రూ. 200 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు.

వచ్చే రెండేళ్లలో బీటీ రోడ్ల మరమ్మతులకు రూ. 2,400 కోట్లు కేటాయిస్తామని, రూ. 700 కోట్ల బకాయిలు కూడా చెల్లిస్తామని సీఎం తెలిపారు. 4,146 కిలోమీటర్ల డబ్ల్యూబీఎం రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1450 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. కల్వర్టులు, వంతెనల మరమ్మతుల కోసం మరో రూ. 250 కోట్లు వెచ్చిస్తామన్నారు. పంచాయతీరాజ్ రోడ్ల పరిస్థితిపై ముఖ్యమంత్రి శనివారం సచివాలయంలో సమీక్షించారు. డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రులు కె.టి.రామారావు, టి.హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. సమావేశ వివరాలను సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. రోడ్ల పనుల కోసం వారం రోజుల వ్యవధిలోనే టెండర్లు పిలవాలని, 15వ రోజు వర్క్ ఆర్డర్ ఇవ్వాలని, 20వ రోజు నుంచి పని ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు.

ఈ నెలాఖరు వరకు అన్ని పనులు ప్రారంభమయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంకా రోడ్డు సౌకర్యం లేని 1614 ఆవాస ప్రాంతాల్లో వెంటనే రోడ్లు వేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్డు సౌకర్యం లేని ఊరే ఉండొద్దన్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించడానికి త్వరలో అన్ని స్థాయిల ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించారు. మరోవైపు రెండేళ్లలో రహదారులను అద్దంలా మార్చుతామని, హైదరాబాద్ నుంచి ప్రతి జిల్లా కేంద్రానికి నాలుగు లైన్ల రోడ్లను నిర్మిస్తామని రోడ్ల అభివృ  ద్ధిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. శనివారం సచివాలయంలో ఇది భేటీ అయింది.

సమావేశ వివరాలను ఉప ముఖ్యమంత్రి రాజయ్య వివరించారు. వరంగల్, కరీం నగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, మెదక్ జిల్లా కేంద్రాల్లో రింగ్ రోడ్ల సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రతీ జిల్లాలో మాస్టర్ ప్లాన్ తయారు చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు రాజయ్య పేర్కొన్నారు. ‘ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్లకు ఒకే ప్రమాణాలుండాలి. ఇసుక లారీలు, ట్రాక్టర్ల వల్ల జాతీయ రహదారులు ధ్వంసమవుతున్నాయి.

ఇలా జరగకుండా ఎలాంటి ప్రమాణాలు పాటించాలో అధికారులను నివేదిక కోరాం. రోడ్లను అభివృద్ధి చేసేందుకు సెస్ పెట్టాలా.. లేదా అన్న ఆలోచన చేస్తున్నాం. రోడ్ల నిర్వహణ బాధ్యతను సంబంధిత ఏజెన్సీకి ఐదేళ్లు ఇవ్వాలనుకుంటున్నాం. నీళ్లు నిల్వ ఉండటం వల్ల రోడ్లు పాడవుతున్నాయి కాబట్టి డ్రైనేజీ సౌకర్యాలను మెరుగుపర్చాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో వారం వ్యవధిలోనే టెండర్లు పిలవాలని భావిస్తున్నాం’’ అని డిప్యూ టీ సీఎం చెప్పారు. మరో 15 రోజుల్లో పనులు మొదలుపెట్టాలని భావిస్తున్నామన్నారు. ఈ నెల 7న మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement