రోడ్లకు మహర్దశ
రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు తీయాలంటే అందుకు అనుగుణంగా రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి జయలలిత తెలిపారు. ఇందుకుగాను రూ.2,325 కోట్లతో సుదీర్ఘ ప్రణాళికను రూపొందించినట్లు శుక్రవారం ఆమె అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ పారిశ్రామికంగా, వ్యవసాయకంగానేగాక ఇతర రంగాలపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు. తక్కువ సమయంలో గమ్యం చేరడం ద్వారా ఇంధన వినియోగంలో పొదుపు పాటించవచ్చన్నారు. ఈ విధానానికి రహదారులు అనువుగా ఉండాలన్నారు. చెన్నై కార్పొరేషన్ సరిహద్దులను కలుపుతూ 250 కిలోమీటర్ల మేర రూ.250 కోట్లతో రోడ్ల నిర్మాణం, విస్తరణ జరుపుతామని తెలిపారు. రూ.185 కోట్లతో నగరంలో సబ్‌వేల నిర్మాణం చేపడతామన్నారు.
ప్రధాన రద్దీ ప్రాంతాల్లో పాదచారుల కోసం ఎస్కిలేటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒరగడం ఇండస్ట్రియల్ పార్క్ వద్ద రూ.120 కోట్లతో సిక్స్‌లైన్ రోడ్ల నిర్మాణం జరుగుతోందని అన్నారు. మధురైలో మీనాక్షి ఆస్పత్రి నుంచి కప్పలూరు వరకు 27 కిలోమీటర్ల పొడవున రూ.200 కోట్లతో రహదారిని విస్తరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 మానసిక చికిత్సాలయాలు ఉండగా మరో 22 నెలకొల్పుతున్నట్లు తెలిపారు. తమిళభాషను కాపాడుకునేందుకుప్రతి జిల్లా నుంచి సాహితీవేత్తలను ఎంపికచేస్తామన్నారు. వారిని తమిళచెమ్మల్, ఇళంగవడికల్ అవార్డులతో సత్కరించనున్నట్టు తెలిపారు. ఇదిలావుండగా డీఎంకే సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ ప్రతిపక్షాలు చేసిన అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారు. దీంతో పీఎంకే వాకౌట్ చేసింది.
సీపీఎం కార్యదర్శిపై పరువునష్టం దావా
తన పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా మాట్లాడారని పేర్కొంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జీ.రామకృష్ణన్‌పై సీఎం జయలలిత శుక్రవారం పరువునష్టం దావాను దాఖలు చేశారు. ఇసుక మాఫియా చేతుల్లో ఒక కానిస్టేబుల్ హత్యకు గురికావడంపై ఓ ఆంగ్ల పత్రికకు రామకృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూలో వాస్తవాలకు విరుద్దగా మాట్లాడాడని పేర్కొంటూ జయ తరపున న్యాయవాది ఎంఎల్ జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా రాష్ట్ర రవాణా శాఖా మంత్రి సెంధిల్ బాలాజీ ఇప్పటికే ఇద్దరిపై పరువునష్టం దావా వేసి ఉన్న విషయం తెల్సిందే.