Chennai Corporation
-
కొరడా
► ఆస్తిపన్ను వసూలు లక్ష్యం రూ.700 కోట్లు ► దుకాణాలపై కార్పొరేషన్ కొరడా సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై కార్పొరేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన కోసం పన్ను బకాయిలు పడిన దుకాణాలు, నివాస గృహాలపై కొరడా ఝుళిపిం చడం ప్రారంభించింది. చెన్నై కార్పొరేషన్‌కు వచ్చే వార్షిక ఆదాయంలో ఆస్తిపన్ను రూపేణా లభించే శాతమే ఎక్కువ. ఆస్తిపన్ను ద్వారా గత ఏడాది రూ.600 కోట్లు వసూలు లక్ష్యంగా పెట్టుకోగా రూ.586.46 కోట్లు వసూలైంది. కార్పొరేషన్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిపన్ను అత్యధిక సొమ్ముగా రికార్డు నమోదు చేశారు. ప్రస్తుతం చెన్నై కార్పొరేషన్ ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుండగా, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఆస్తిపన్నే దిక్కని భావిస్తూ రూ.650 కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆస్తిపన్ను వసూలులో తొలి అర్ధ సంవత్సరం రూ.308 కోట్లు వసూలు చేశారు. ఇక లక్ష్యసాధనలో మిగిలిన రూ.342 కోట్లకు అక్టోబర్ 1వ తేదీ నుంచి కొరడా ఝుళిపించడం ప్రారంభించారు. రోజుకు సగటున అందరూ కలిపి రూ.4 కోట్లు వసూలు చేయాలని బిల్ కలెక్టర్లకు నిబంధన విధించారు. అత్యధిక బకాయి ఉన్న వర్తక దుకాణాల జాబితాను సిద్ధం చేసుకుని కఠిన చర్యలు చేపడుతున్నారు. దుకాణాలకు జారీ చేసిన జీఎస్టీలను రద్దు చేయించడం, కాలుష్య నియంత్ర మండలి నుంచి సర్టిఫికెట్ జారీ కాకుండా అడ్డుకోవడం వంటి చర్యల ద్వారా మొండి బకాయిలను వసూలు చేస్తున్నారు. పురసైవాక్కం జాతీయ రహదారి, ఠాకూర్ రోడ్డు ప్రాంతాల్లో రాయపురం మండల అధికారులు గురువారం దాడులు జరిపి 18 దుకాణాలకు సీలు వేశారు. ఇదే ప్రాంతంలోని రెండు వర్తక దుకాణాల వారు రూ.50 లక్షల వరకు ఆస్తిపన్ను బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు కావడం, ఈశాన్య రుతుపవనాల ప్రభావం అంతగా లేకపోవడం వల్ల కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి పన్ను వసూలు మినహా మరే ముఖ్యమైన బాధ్యతలు లేవు. దీంతో ఆస్తిపన్ను వసూలుపైనే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇదే వేగాన్ని మరి కొన్ని నెలలు కేటాయించి రూ.700 ఆస్తిపన్ను వసూలుతో సరికొత్త రికార్డును స్థాపించగలమని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఆస్తిపన్ను లక్ష్య సాధన, చెల్లింపు బకాయిలపై కార్పొరేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ కేవలం కాంట్రాక్టర్లకే రూ.400 కోట్ల బకాయిని కార్పొరేషన్ చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఆస్తిపన్ను ద్వారా వసూలయ్యే నగదులో నిర్వహణ ఖర్చులకు, పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించేందుకే సరిపోతుందని అన్నారు. ఆస్తిపన్ను వసూళ్ల ద్వారానే కార్పొరేషన్ ఆర్థిక భారాన్ని నెట్టుకొస్తున్నామని తెలిపారు. 2012-13లో ఆస్తిపన్ను కింద రూ.461 కోట్లు, వృత్తిపన్ను ద్వారా రూ.221.04 కోట్లు వసూలు చేశామని తెలిపారు. అలాగే 2013-14లో ఆస్తిపన్ను కింద రూ.480.13, వృత్తి పన్ను ద్వారా రూ.234.68, 2014-15లో ఆస్తిపన్ను ద్వారా రూ.581.82, వృత్తిపన్ను కింద రూ.264.79 వసూలు చేశామని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెల మొదటి వారం వరకు రూ.400 కోట్లు వసూలైనట్లు తెలియజేశారు. -
కార్పొరేషన్‌కు అనుమతి
సాక్షి, చెన్నై: ప్రకటనల అనుమతి అధికారం మళ్లీ చెన్నై కార్పొరేషన్ పరిధికి చేరింది. ఇందుకు తగ్గ ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. రాజధాని నగరం చెన్నైలో ఏదేని ప్రకటన బోర్డులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు , బోర్డులు ఏర్పాటు చేయాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. ఆ మేరకు గతంలో కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ అనుమతుల వ్యవహారం 2003లో చెన్నై జిల్లా కలెక్టరేట్‌కు చేరింది. కలెక్టరేట్లో అనుమతి పొందాలంటే, ముందుగా బోర్డు ఏర్పాటు చేసే పరిధిలోని పోలీసు స్టేషన్, కార్పొరేషన్ అధికారుల వద్ద నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తప్పని సరి. ఈ ప్రక్రియ ముగియడానికి సమయం వృథా కావడమే కాకుండా, అవినీతి దొర్లుతున్నట్టు ఆరోపణలు మొదలయ్యాయి. అన్ని సంతకాలతో కలెక్టరేట్‌కు వెళ్తే, అక్కడ అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగంలో సిబ్బంది కొరతతో జాప్యం తప్పడం లేదు. దీంతో ఇష్టారాజ్యంగా బోర్డులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే వారి సంఖ్య పెరిగింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన మద్రాసు హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు సైతం వేసింది. కొత్త నిబంధనల్ని అమలు చేసే రీతిలో హుంకు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మళ్లీ కార్పొరేషన్‌కు అధికారాలు అప్పగించేందుకు తగ్గ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక చెన్నై జిల్లా కలెక్టరేట్లో అనుమతి పొందాల్సిన అవసరం లేదని, కార్పొరేషన్‌ను ఆశ్రయించి అనుమతులు పొందే విధంగా, ఈ అధికారం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ దృష్ట్యా, ఇక ప్రకటనల అనుమతులకు కార్పొరేషన్‌ను ఆశ్రయించాల్సిందిగా ఆయా సంస్థలకు అధికారులు సూచించే పనిలో పడ్డారు. తాజాగా అధికారం కార్పొరేషన్ గుప్పెట్లోకి చేరడంతో అధికార పక్షం వర్గాలకు మరింత పండుగే. -
అమ్మ సినిమా!
తమిళనాడు ప్రజలు ముఖ్యమంత్రి జయలలితను అమ్మ అని ఆప్యాయంగా పిలుచుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అమ్మ అనే ఈ పదాన్ని అనేక పథకాలకు చేర్చడం ద్వారా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రజలకు మరింత చేరువయ్యారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: పేదలను దృష్టిలో ఉంచుకుని అమ్మ క్యాంటిన్లు, ఆమ్మ మినరల్ వాటర్, అమ్మ సిమెంట్, అమ్మ ఫార్మసి, అమ్మ అముదం స్టోర్లు ఇప్పటికే ప్రజల మన్నలను అపారంగా పొందాయి. ఇప్పటి వరకు ఆహారం, ఆరోగ్యం వరకే పరిమితమైన జయలలిత అమ్మ థియేటర్ల ఏర్పాటు వినోదంపై కూడా దృష్టి సారించారు. ఇలా అమ్మ పథకాల వరుసలో అమ్మ థియేటర్లు చేరబోతున్నాయి. వినోదం అనేది తారతమ్య బేధం లేకుండా అందరికీ అవసరమే. విసుగుపొందిన జీవితంలో ఆట విడుపుకు వినోదాన్ని పంచివ్వగల సినిమాకు పేదలైనా ఒకటే పెద్దలైనా ఒకటే. అయితే హైక్లాస్ సినిమా టిక్కెట్టు ధర రూ.1.25లు తాకిన తరుణంలో పేదవాడికి సినిమా వినోదం అందని ద్రాక్షపండుగా మారిపోతోంది. రోజంతా కష్టించిన సొమ్మును కడుపు నింపుకోవడం కోసం కాకుండా వినోదం కోసం ఖర్చుచేయడపై పేదల మనస్సులు అంగీకరించడం లేదు. అలాగని సినిమా మాధ్యమానికి దూరంగా ఉండలేని స్థితి. ఈలోటును కొంత వరకు భర్తీ చేసేందుకు నగరంలో కొత్తగా నిర్మించే ప్రతి ఐమాక్స్, ఎస్ మాక్స్ థియేటర్లలో కిందివైపున ఒక వరుస సీట్లు పేదల కోసం రూ.10లకే కేటాయించేలా ప్రభుత్వం షరతు విధించింది. ఈ షరతుతో పేద ప్రజలు సైతం హైక్లాస్ థియేటర్లలో సినిమాలను చూసి ఆనందిస్తున్నారు. అయితే ఈ థియేటర్లలో తక్కువ ధర సీట్ల సంఖ్య చాలా స్వల్పం. కార్పొరేషన్ వారి ‘అమ్మ సినిమా’: మరింతమంది పేదలకు సినిమాను అందుబాటులోకి తెచ్చేందుకు చెన్నై కార్పొరేషన్ కనుసన్నల్లో నడిచేలా అమ్మ థియేటర్లు ఆవిర్భవిస్తున్నాయి. ముందస్తుగా రెండింటిని ప్రారంభిస్తున్నారు. చెన్నై కార్పొరేషన్ నేతృత్వంలో టీ నగర్ (జీఎన్ చెట్టి రోడ్డులోని సర్ పిట్ త్యాగరాయ కలైఅరంగం), షెనాయ్నగర్లలో అమ్మ థియేటర్లు సిద్దం అవుతున్నాయి. షెనాయ్‌నగర్‌లోని కలైఅరంగాన్ని ఇటీవలే రూ.17.28 కోట్లతో తీర్చిదిద్దగా ఇందులో 3వేల మంది సినిమాను వీక్షించే మార్పులు చేయడంపై పరిశీలన సాగుతోంది. అంతేగాక ముగప్పేర్‌లోని 3.94 ఎకరాల గృహనిర్మాణశాఖ వారి ఖాళీ స్థలాన్ని, చేట్‌పట్‌లో మరో స్థలాన్ని పరిశీలిస్తున్నారు. టిక్కెట్టు ధర రూ.10, రూ. 20, రూ.30లుగా నిర్ణయించే అవకాశం ఉంది. అలాగే డిజిటల్ సౌండ్ సిస్టమ్ అనుభవాన్ని పొందవచ్చు. -
చెన్నై కార్పొరేషన్‌కు హైకోర్టు హెచ్చరిక
కేకే.నగర్: పురట్చికర మానవర్ ఇయక్కమ్ (పీఎంఈ) తరఫున మద్రాసు హైకోర్టులో కేసు దాఖలయ్యింది. అందులో చెన్నై నగర పరిధిలో ఉన్న 281 కార్పొరేషన్ పాఠశాల్లో కనీస వసతులు, విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరని పిటిషన్లో పేరొన్నారు. కోర్టు దీనిపై ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కేసును గతంలో విచారించిన న్యాయస్థానం సౌకర్యాల కల్పనకు ఒక కమిటీ వేయాలని కార్పొరేషన్‌ను ఆదేశించింది. మరోసారి ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి ఎస్కె గేల్, న్యాయమూర్తి మహదేవన్‌ల సమక్షంలో శుక్రవారం విచారణకు వచ్చింది. పిటిషన్‌దారుని తరఫున న్యాయవాది పోర్కొడి హాజరై కోర్టు ఆదేశాల ప్రకారం కనీస వసతులు ఏర్పాటు చేయలేదని దీనిపై కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేయాలన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం పాఠశాలల్లో మరుగుదొడ్లు సహా అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని.. దీనిపై నివేదికను సెప్టెంబర్ 2 లోపు కార్డులో దాఖలు చేయాలన్నారు. లేని పక్షంలో అధికారులపై కోర్టు దిక్కారణ కేసుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. పాఠశాల విద్యా జాయింట్ డైరక్టర్ కోర్టుకు నేరుగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టులో పోలీసుల క్షమాపణలు.. ప్రేమించి మోసం చేసిన కున్నూరు మెజిస్ట్రేట్‌పై మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పల్లడం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మెజిస్ట్రేట్‌ను 2013లో అరెస్టు చేసి జైలుకు తరలించారు. పోలీసు చర్యలలను న్యాయమూర్తుల సంఘం తీవ్రంగా ఖండించింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని అరెస్టు చేసే సమయంలో అనుసరించాల్సిన నిబంధనలను సుప్రంకోర్టు 1991లో తీర్పు ఇచ్చిందన్నారు. దీన్ని పల్లడం పోలీసులు అనుసరించలేదని సంఘం మండిపడింది. దీంతో మెజిస్ట్రేట్‌ను అరెస్టు చేసిన అప్పటి తిరువూర్ జిల్లా ఎస్పీ పొన్ని, సహాయ పోలీసు సురేష్ కుమార్, పిచ్చైలపై మద్రాసు హైకోర్టులో దిక్కారణ కేసు నమోదయ్యింది. ఈ కేసు ముందుగా న్యాయమూర్తులు పాల్ వసంతకుమార్, సత్యనారాయణన్‌లు విచారించారు. ఆ సమయంలో పోలీసులు నోటి మాటలతో నిబంధన లేని క్షమాపణ కోరారు. వాటిని ప్రమాణ పత్రాలుగా దాఖలు చేయాలని న్యాయమూర్తులు ఆదేశించగా దాన్ని వారు అంగీకరించలేదు. దీంతో వారిపై కోర్టు దిక్కారణ కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ క్రమంలో పాల్ వసంతకుమార్ జమ్మూకాశ్మీర్‌కు బదిలీ అయ్యారు. అయితే మెజిస్ట్రేట్‌ను అరెస్టు చేసిన సమయంలో ఈ విషయాన్ని పోలీసు కమిషనర్లకు, జిల్లా ఎస్పీలకు డీ జీపీ సర్కులర్ పంపినట్లు చెపుతూ ఆ సర్కులర్‌ను కోర్టులో శుక్రవారం దాఖలు చేశారు. దీంతో కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
చెన్నై మళ్లీ చిత్తడి!
ఆదివారం రోజంతా కురిసిన వాన..రోడ్లన్నీ జలమయం ♦ నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి ♦ రెండ్రోజులపాటు వర్షాలు: వాతావరణశాఖ వెల్లడి ♦ సహాయ కార్యక్రమాలకు ఆటంకంగా వాన చెన్నై నుంచి నందగోపాల్, సాక్షి ప్రతినిధి: చెన్నై నగరం కోలుకుంటోంది.. కుదుటపడుతోంది.. అనే మాటలు వినిపిస్తున్నా స్థానికుల్లో మాత్రం ఆ భావన కనిపించడంలేదు. తామెప్పటికి కోలుకుంటామో కూడా చెప్పలేకపోతున్నారు. ఇల్లు.. వీధి అనే తేడాలేదు అంతటా మురుగే. వరదకు కొట్టుకొచ్చిన చెత్తాచెదారం అలాగే పడిఉంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 500 మంది మృతిచెంది ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇటువంటి దయనీయ పరిస్థితిలో ఆదివారం మళ్లీ రోజంతా వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ మళ్లీ జలమయమయ్యాయి. ఒక్కొక్కటిగా సేవలు పునరుద్ధరిస్తున్నా.. అన్నిచోట్లా జనం బారులు తీరుతున్నారు. లగ్జరీగా బతికినవాళ్లుసైతం తాగునీరు, ఆహారం కోసం ఇప్పటికీ సహాయబృందాల వద్ద చేయిచాస్తున్నారు. నగరం నుంచి మరోచోటుకు వెళ్లడానికి బస్సు, రైలు, విమానసేవలు మొదలుకావడం కొంత ఊరటనిస్తోంది. కాగా నైరుతి బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడన ద్రోణి ఏర్పడనుందనే వార్త తమిళనాడుతోపాటు పుదుచ్చేరివాసులను కలవరానికి గురిచేస్తోంది. దీనికారణంగా రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. చురుగ్గా సహాయ కార్యక్రమాలు.. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది చురుగ్గా పాల్గొంటోంది. మొత్తం 50 బృందాలుగా విడిపోయి నగరవ్యాప్తంగా సాయమందిస్తున్నాయి. ఇప్పటిదాకా దాదాపు 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. 50 వేల ఆహారపదార్థాల పొట్లాలు, మరో 50 వేల నీళ్ల సీసాలను బాధితులకు సరఫరా చేశాయి. ఎన్డీఆర్ ఎఫ్ వైద్య బృందాలు 200 మందిని ప్రాణాపాయం నుంచి బయటపడేశాయి. కాగా నగరవ్యాప్తంగా 1,27,580 మంది 114 పునరావాసకేంద్రాల్లోనే గడుపుతున్నారు. ఇప్పటికిప్పుడు తాగునీరు అందించలేం: చెన్నై కార్పొరేషన్ వరదల కారణంగా సర్వం కోల్పోయిన నగరవాసులకు కనీసం తాగునీటిని అందించే పరిస్థితి కూడా లేదని చెన్నై కార్పొరేషన్ నిస్సహాయతను వ్యక్తం చేస్తోంది. అందుబాటులో ఉంచిన తాగునీరు మొత్తం కలుషితమైందని, నీటిని శుద్ధిచేసే వ్యవస్థ కూడా దెబ్బతిన్నందున ఇప్పటికిప్పుడు మంచినీటిని అందించే పరిస్థితి లేదని కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు. స్థానిక అధికారులు సహకరించడంలేదు: ఆర్మీ సహాయచర్యల కోసం కేంద్రప్రభుత్వం మరిన్ని విపత్తు సహాయక బృందాలను, ఆర్మీ, వైమానిక సిబ్బందిని నగరానికి పంపింది. విమానం దిగిన బృందాలు నగరంలోని ఏ ప్రాంతానికి వె ళ్లాలో, ఎక్కడ తమ సాయం అవసరమో చెప్పేవారు లేక దాదాపు ఐదారుగంటలు సహాయకచర్యల్లో పాల్గొనలేకపోయారు. ఆ తర్వాత టీనగర్‌కు చేరుకున్నాక కూడా స్థానిక అధికారుల నుంచి వారికి ఎటువంటి సహకారమూ అందలేదు. వారే చొరవ తీసుకొని వెళ్లి అడిగినా అధికారుల నుంచి సరైన స్పందన రాలేదు. స్థానిక అధికారుల తీరుపై ఆర్మీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వరద బీభత్సానికి స్తంభించిన రవాణా సేవలు కాస్త ఊపందుకున్నాయి. నగరవ్యాప్తంగా ఉచిత బస్సుసేవలు కొనసాగుతుండగా సోమవారం నుంచి అన్ని రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. -
రూ.10కే 20 లీటర్ల మినరల్ వాటర్
-కార్పొరేషన్ నిర్ణయం - మరి కొద్ది రోజుల్లో పంపిణీ సాక్షి, చెన్నై : మినరల్ వాటర్ క్యాన్ వ్యాపారంలోకి చెన్నై కార్పొరేషన్ అడుగు పెట్టనున్నది. రూ.పదికే 20 లీటర్ల వాటర్ క్యాన్‌ను నగర వాసులకు అందించేందుకు నిర్ణయించింది. మరి కొద్ది రోజుల్లో నగరంలోని పదిహేను మండల కేంద్రాల ద్వారా ఈ క్యాన్ల పంపిణీ సాగబోతున్నది. రోజుకు ఎనిమిది లక్షల క్యాన్ల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలో తాగు నీరు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. కొన్ని జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మినహా తక్కిన పట్టణ, నగరాల్లో వాట ర్క్యాన్ల మీద ప్రజలు ఆధార పడక తప్ప డం లేదు. ఆ దిశగా రాజధాని నగరం , సబర్బన్ల్లో వాటార్ క్యాన్ కొనుగోలు తప్పని సరి. కొన్ని ఇళ్లల్లో వాటర్ ఫ్యూరీ లు ఉన్నా, మిగిలిన వాళ్లు వాటర్ క్యా న్లను కొనాల్సిందే. దీంతో నగర, శివారుల్లో కొకొల్లలుగా మినరల్ వాటర్ క్యాన్ల పరిశ్రమలు పుట్టుకొచ్చి ఉన్నాయి. 20 లీటర్ల క్యాన్ నీటిని రూ. ముప్పైకు పైగానే విక్రయం సాగుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇటీవలి కాలంగా సరికొత్త పోకడలతో ముందుకు సాగుతున్న చెన్నై కార్పొరేషన్ పాలక మండలి తాజాగా వాటర్ క్యాన్ల మీద దృష్టి పెట్టి ఉన్నది. అమ్మ క్యాంటీన్లు, అమ్మ మెడికల్స్, అమ్మ కూరగాయల దుకాణం అంటూ ముందుకు సాగుతున్న కార్పొరేషన్ పాలక మండలి, తక్కువ ధరకే వాటర్క్యాన్ల విక్రయానికి చర్యలు చేపట్టింది. రూ. 10కే 20 లీటర్ల క్యాన్ : ఇటీవల వాటర్ క్యాన్ల పంపిణీ పరిశ్రమలతో మే యర్ సైదై దురైస్వామి సమీక్షించినట్టు సమాచారం. ధరలు తగ్గించాలని ఆయ న సూచించినా ఆ యాజమాన్యాలు తలొగ్గలేదు. ప్రభుత్వం నిర్ణయించిన విద్యుత్ చార్జీల మేరకు ఒ క్యాన్‌లో నీటి ని నింపడానికి తమకు రూ. ఆరు నుంచి ఏడు రూపాయల మేరకు ఖర్చు అవుతోందని, ఇక రవాణా, సిబ్బంది చార్జీలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని సూచించారు. ఆ యాజమన్యాలు తలొగ్గని దృష్ట్యా, ఇక, తామే స్వయంగా వా టర్ క్యాన్ల విక్రయాలకు శ్రీకారం చుట్టేం దుకు మేయర్ నిర్ణయించి ఉన్నారు. నగరంలో రెండు వందల వార్డులు ఉన్నా యి. ఈ వార్డుల్ని పదిహేను మండలాలుగా విభజించి ఉన్నారు. ప్రతి మండలంలోనూ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల వేదికగా వాటర్ క్యా న్ల విక్రయాలకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అయ్యారు. ఇందుకు గాను రూ. పదహారు కోట్లను కేటాయించి ఉన్నా రు. రోజుకు ఎనిమిది లక్షల వాటర్ క్యాన్లను పంపిణీ, విక్రయానికి చర్యలు చేపట్టి ఉన్నారు. అలాగే, 20 లీటర్ల వాట ర్ క్యాన్ ధర రూ. పదిగా నిర్ణయించడంతో పాటుగా మరి కొద్ది రోజుల్లో మండల కేంద్రాల్లోని కౌంటర్ల ద్వారా వాటర్ క్యాన్ల వ్యాపారంలోకి అడుగు పెట్టేందుకు కార్పొరేషన్ సిద్ధం కావడం విశేషం. అదే సమయంలో ఈ వాటర్ క్యాన్లకు ‘అమ్మ’ పేరు పెట్టే అవకాశాలు ఎక్కువే. -
సొమ్మసిల్లిన సౌరవిద్యుత్
చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రం దశాబ్దకాలంగా విద్యుత్ సమస్యను ఎదుర్కొంటోంది. మండు వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో 14 గంటల విద్యుత్ కోత ను విధిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో కనీసం రెండు గంటల కోత తప్పడం లేదు. రాష్ట్రంలో ఎండవేడిమి పెరగకముందే విద్యుత్ వాడకం తీవ్రమైంది. ఈ ఏడాది జనవరిలో 11,727 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఫిబ్రవరి 5న 11,951 మెగావాట్లు, 10న 12,007, 16న 12,044 మెగావాట్లకు చేరుకుంది. రాష్ట్రంలో గరిష్ట వినియోగం 15 వేల మెగావాట్లు కాగా ప్రస్తుతం ఉత్పత్తి 12 వేల మెగావాట్లు మాత్రమే ఉంది. గత ఏడాది 12,300 మెగావాట్ల వినియోగం జరిగినపుడు రాష్ట్రంలో 11,600 మెగావాట్ల ఉత్పత్తి సాగుతున్నా సర్దుబాటు చేశామని అధికారులు అంటున్నారు. ఈ ఏడాది సైతం మండువేసవిలో 15 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం తప్పదని తెలుస్తుండగా, ఉత్పాదనలో ఇంకా వెనకబడి ఉన్నామని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కేంద్రాలు, కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ అందుతున్నందున అధికారులు కొంత వరకు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సౌరవిద్యుత్ సహాయం సౌర విద్యుత్ సౌకర్యాన్ని పెంచుకోవడం ద్వారా విద్యుత్‌లోటును అధిగమించాలని చెన్నై కార్పొరేషన్ వేసుకున్న అంచనాలు అటకెక్కేశాయి. పథకం బాగున్నా అమలుకు తగిన ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతో కార్పొరేషన్ కలలు కల్లలుగా మారాయి. చెన్నై కార్పొరేషన్‌కు సంబంధించి మొత్తం 3 వేల నిర్మాణాల్లో 800 నిర్మాణాలు సౌరశక్తి సౌకర్యానికి, ముఖ్యంగా భవనం పై భాగంలో సౌర పలకలు అమర్చేందుకు అనువుగా ఉన్నాయని కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. మూడేళ్లలోగా వీటన్నింటినీ సౌరశక్తి వినియోగంలోకి తీసుకురావాలని తీర్మానించారు. సౌరవిద్యుత్‌కు అనువైన నిర్మాణాల్లో కార్పొరేషన్ కేంద్ర కార్యాలయమైన రిప్పన్ బిల్డింగ్‌ను కూడా చేర్చారు. చెన్నై కార్పొరేషన్ కేంద్ర కార్యాలయం రిప్పన్ బిల్డింగ్తోపాటూ ఇతర కార్యాలయాల్లో సౌరశక్తి పలకలు పెట్టడం ద్వారా సౌరశక్తిని వినియోగించుకోవాలని భావించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా రిప్పన్ బిల్డింగ్‌లో సౌరవిద్యుత్ ప్రతిపాదనను పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ బిల్డింగ్ చుట్టూ ఉన్న భవనాలను మాత్రం సౌరవిద్యుత్ సౌకర్యం కోసం కూల్చివేశారు. కొత్తగా నిర్మించిన భవనంలో మాత్రం సౌరవిద్యుత్‌ను అమర్చాలని తీర్మానించారు. ప్రయోగాత్మక వినియోగం కోసం కొన్ని నిర్మాణాల్లో భారీ పెట్టుబడులు సమకూర్చుకుని ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆరు నిర్మాణాల్లో సౌరవిద్యుత్ పలకలు అమర్చారు. మిగిలిన నిర్మాణాల్లో ఈ పథకాన్ని అమలుచేసేందుకు కార్పొరేషన్ వద్ద తగినన్ని నిధులు లేవు. మరిన్ని సౌర పలకలను పొందేందుకు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం, పథకం అమలులో రాయితీలు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం సౌరవిద్యుత్ సౌకర్యాల విస్తరణకు మ్యాచింగ్ గ్రాంటు రాబట్టుకునేందుకు కార్పొరేషన్ కొత్త కోణాల్లో ప్రయత్నాలు ప్రారంభించింది. కార్పొరేషన్లో నిధుల లేమిని ఈ ప్రయత్నాలే రుజువుగా నిలిచాయి. ఇటువంటి సంకట పరిస్థితిపై కార్పొరేషన్‌కు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, సౌరశక్తి పలకలు అమర్చేందుకు బలమైన భవనాలను గుర్తించి ఒక జాబితాను సిద్ధం చేశామని, అయితే ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు పథకానికి శాపంగా మారాయన్నారు. నిధులు సమకూరగానే పనులు ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. మూడేళ్లలోగా 800 నిర్మాణాల్లో సౌర విద్యుత్ పనులు పూర్తికావడం అసాధ్యమని చెప్పారు. సమృద్ధిగా నిధులు చేతిలో ఉన్నపుడే పనులు వేగవంతంగా సాగుతాయని అన్నారు. -
తమిళం తప్పనిసరి
సాక్షి, చెన్నై:రాజధాని నగరంలో కొన్ని చిన్నా పెద్ద దుకాణాల్లో, ప్రైవేటు సం స్థల కార్యాలాయల్లో తమిళంలో ఆయా దుకాణాల పేర్లు, వీధుల పేర్లు ఉన్నా యి. అయితే, మెజారిటీ శాతం దుకాణాలు, సంస్థలు, కార్యాలయల్లో తమిళంలో బోర్డులు ఎన్నా, ఆంగ్లం లోనే ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న చెన్నై కార్పొరేషన్, ఇక, తమిళంలో బోర్డులు తప్పని సరిగా ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఆయా సంస్థలు, పరిశ్రమల లెసైన్సుల రెన్యూవల్ పర్వం ఆరంభం కావడాన్ని పరిగణన లోకి తీసుకుని ఆయా సంస్థలకు హుకుం జారీ చేసింది. ఆంగ్లంతో పాటుగా వారికి తోచిన భాషల్లో బోర్డులు ఏర్పాటు చేసుకున్నా, తప్పని సరిగా తమిళం అక్షరాలు కన్పించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు కార్పొరేషన్ అధికార వర్గాలు ప్రకటించాయి. అలాగే, లెసైన్సుల రెన్యూవల్, కొత్త లెసైన్సులకు దరఖాస్తుల గడువును మార్చి 31గా నిర్ణయించారు. ఈ ఏడాది తమిళంలో బోర్డుల హెచ్చరికతో పాటుగా కొత్తగా మరికొన్ని ఆంక్షల్ని విధించే పనిలో పడ్డారు. అతి పెద్ద మాల్స్, సంస్థల్లో వికలాంగుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉండాలని ఆదేశించారు. అలాగే, వర్షపు నీటిని కార్పొరేషన్ కాలువల్లోకి వదిలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లు, బ్యానర్లను సిద్ధం చేస్తున్న సంస్థలకు కొత్త రకం ఆంక్షను విధించారు. ఇక మీదట ఎవరైనా పలా ఫ్లక్సీ, కటౌట్, బ్యానర్లు రూపొందించాలని వస్తే, వారి చిరునామా, ఫోన్ నెంబర్లు అన్ని వివరాల్ని తప్పని సరిగా రికార్డు పుస్తకాల్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. పుట్ పాత్లలో దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన లెసైన్సులు ఇవ్వబోమని, రెన్యూవల్ చేయబోమని స్పష్టం చేశారు. 2015-16కు గాను లెసైన్సుల జారీ, రెన్యూవల్ ప్రక్రియను మార్చి 31లోపు ముగించనున్నామని ప్రకటించారు. వివరాలకు కార్పొరేషన్ వెబ్ సైట్‌ను ఆశ్రయించ వచ్చని సూచించారు. అలాగే, కొత్త లెసైన్సులు, రెన్యూవల్ ప్రక్రియను నగరంలోని పదిహేను మండల కార్యాలయాల్లోనూ చేసుకోవచ్చని, ఆయా కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాటు చేశామని ప్రకటించారు. -
చెన్నై కార్పొరేషన్‌కు ఆరు అవార్డులు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజాసేవలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు చెన్నై కార్పొరేషన్ ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకుందని మేయర్ సైదై దొరస్వామి ప్రకటించారు. సోమవారం రిప్పన్ భవన్లో జరిగిన కార్పొరేషన్ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్పొరేషన్ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం, రవాణా సౌకర్యం తదితర అంశాల్లో దేశస్థాయిలో ఆరు అవార్డులను దక్కించుకున్నామన్నారు. చెన్నై కార్పొరేషన్ చరిత్రలో ఇదొక మహత్తర రికార్డుగా ఆయన పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలో 348 ఆధునిక టాయిలెట్ల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. ఒకేసారి ఏడుగురు వినియోగించుకోగల ఈ టాయిలెట్లకు ఒక్కోదానికి రూ.8 లక్షలను కేటాయించినట్లు తెలిపారు. డీఎంకే వాకౌట్ డీఎంకే హయాంలో నిర్లక్ష్యానికి గురైన కార్పొరేషన్, 2011లో అమ్మ అధికారంలోకి వచ్చిన తరువాత అవార్డులు సాధించే స్థాయికి ఎదిగిందని మేయర్ అన్నారు. ఈ మూడేళ్లలో ప్రభుత్వం రూ.4,527 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఈ సొమ్ముతో నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మేయర్ వివరిస్తుండగా, డీఎంకే కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ అడ్డుతగిలారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరించి పొగుడుకోవడం తగదన్నారు. తమకు మాట్లాడే అవకాశం ఇస్తే ప్రజా సమస్యలు ఏమిటో వివరిస్తామని కోరారు. అయితే మేయర్ ఇందుకు నిరాకరించారు. ప్రజా సమస్యలను విస్మరించి బాకా కొట్టుకునేందుకే మేయర్ ప్రాధాన్యత నిస్తున్నారని ఆరోపిస్తూ డీఎంకే కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఆనంతరం కౌన్సిలర్ బోస్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ, రోడ్లు ధ్వంసమై ప్రమాదానికి దారితీస్తున్నాయని, చెత్తకుప్పలు పేరుకుపోయి వ్యాధులు ప్రబలుతున్నాయని, ఇవేమీ సమావేశంలో చర్చించకుండా వారిని వారే మెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకనే సమావేశం నుంచి వాకౌట్ చేశామని వివరణ ఇచ్చారు. తెరపైకి సైదై పలు కారణాలతో అమ్మ ఆగ్రహానికి గురై తెరవెనుకకు వెళ్లిపోయిన మేయర్ సైదై దొరస్వామి సుదీర్ఘ విరామం తరువాత సోమవారం తొలిసారిగా తెరపైకి వచ్చారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో మేయర్‌ను దూరంగా పెట్టమని అమ్మ ఆదేశించారు. ఈ కారణం చేతనే ఇటీవల జరిగిన ఎంజీఆర్ వర్ధంతి, పార్టీ కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సైదై కనిపించలేదు. అయితే అకస్మాత్తుగా కార్పొరేషన్ సమావేశంలో పాల్గొనడం అందరినీ విస్మయూనికి గురి చేసింది. -
కోర్టు కొరడా
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఎండీఏ), చెన్నై కార్పొరేషన్లపై మద్రాసు హైకోర్టు కొరడా ఝుళిపించింది. జార్జ్‌టౌన్ పరిధిలోని 11,302 ఆక్రమిత, అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నగర పరిధిలోని జార్జ్‌టౌన్‌లో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు జరిగాయని సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి మద్రాసు హైకోర్టులో ఇటీవల ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) దాఖలు చేశాడు. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు సాగాయని, ఇరుకు సందుల్లో ఆకాశహర్మ్యాలు నిర్మించారని ఆయన ఆరోపించారు. ఇటీవల జార్జ్‌టౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించగా అగ్నిమాపక శకటం సందులోకి వెళ్లలేకపోయిందని, ఈ కారణంగా ఓ వ్యక్తి మృతిచెందగా భారీ ఆస్తినష్టం సంభవించిందని పిల్లో పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణల ముందుకు ఈ పిల్ శుక్రవారం విచారణకు వ చ్చింది. జార్జ్‌టౌన్‌లో 479 వీధులుండగా 300 వీధులను తనిఖీ చేసి 3,080 నిర్మాణాలు నిబంధనలకు విరుద్దంగా ఉన్నట్లు గుర్తించామని సీఎండీఏ అధికారి కార్తిక్ కోర్టుకు వివరించారు. ఆ నిర్మాణాలను స్వచ్ఛందంగా సరిచేసుకోవాలని యజమానులకు నోటీసులు పంపామని, ఆపై చర్యలకు ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి ఉన్నామని వివరించారు. కార్పొరేషన్ కమిషనర్ విక్రమ్ ప్రభు ఒక లేఖ ద్వారా కోర్టుకు వివరణ పంపారు. జార్జ్‌టౌన్‌లో 14,450 నిర్మాణాలకు గాను 11,304 నిర్మాణాలను తనిఖీ చేయగా వీటిల్లో 6,183 నిర్మాణాలు రోడ్డు ఆక్రమించుకున్నట్లు, మరికొన్ని నిబంధనలను ధిక్కరించి నిర్మించినట్లు గుర్తించామని తెలిపారు. మొత్తం నిర్మాణాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే సక్రమంగా ఉన్నాయని వివరించారు. ఇందుకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సోమయాజీ బదులిస్తూ ఒక్క శాతం మాత్రమే నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని అన్నారు. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా హద్దుమీరిన నిర్మాణాలకు నోటీసులు జారీచేయగా కొందరు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మరికొందరు ప్రభుత్వానికి మొరపెట్టుకోవడంతో స్తంభన ఏర్పడిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు... ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాల సమస్యను ఎలా అధిగమిస్తారో నాలుగు వారాల్లోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కార్పొరేషన్లో సిబ్బంది, అధికారుల కొరత కారణంగా నిర్మాణాలపై పర్యవేక్షణ లోపించిందని మరో వాదన ఉన్నందున ఈ అంశంపైనా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. -
ఇక ఆన్లైన్ సేవలు
చెన్నై కార్పొరేషన్ పరిధిలోని గృహ యజమానులు ఇక మంచినీరు, డ్రైనేజీ సదుపాయాల కోసం కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకుని ఈ సేవలు పొందే సదుపాయాన్ని కార్పొరేషన్ త్వరలో కల్పించనుంది. ఇందుకు సంబంధించిన పనులు ఇటీవలే ప్రారంభమయ్యూయి. చెన్నై, సాక్షి ప్రతినిధి : చెన్నై మంచినీరు, డ్రైనేజీ విభాగం ద్వారా ఇళ్లకు ఆయా కనెక్షన్లు అందుతున్నాయి. కొత్త కనెక్షన్లు కోరే వారి సంఖ్య ఏడాదికి ఏడాది పెరిగిపోతోంది. సగటున ఏడాదికి 10 వేల మంది కొత్త కనెక్షన్లకు దరఖాస్తు చేసుకుంటున్నారు. కార్పొరేషన్ పరిధిలో కొత్తగా నిర్మించిన గృహాలకు కనెక్షన్లు అందించే ప్రక్రియ కొనసాగుతోంది. కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం 6,24,631 మంచినీరు 7,71,168 డ్రైనేజీ కనెక్షన్లు వినియోగంలో ఉన్నాయి. బ్రోకర్ల ప్రమేయం లేకుండా కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తులు పూర్తిచేసి తగిన సొమ్మును చెల్లించి పొందడం అంత సులువు కాదు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ సేవలను పరిచేయం చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తరువాత ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకుని కార్యాలయంకు రావాల్సి ఉంటుంది. అధికారులు వాటిని పరిశీలించి కనెక్షన్‌ను మంజూరు చేస్తారు. కార్యాలయానికి రావడం, గంటల తరబడి క్యూలో నిల్చోవడం, బ్రోకర్లకు డబ్బు చెల్లించడం వంటి బాధలు ఇంటి యజమానులకు తప్పుతాయని అధికారులు అంటున్నారు. రూ.21.42 కోట్ల ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో ఆన్లైన్ సేవలను ప్రవేశపెడుతున్నారు. చెన్నై కార్పొరేషన్ పరిధిలోని గృహాలతోపాటూ కొత్తగా కార్పొరేషన్లో చేరిన ఇళ్లకు సైతం ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని మంచినీరు, డ్రైనేజీ విభాగ అధికారి ఒకరు చెప్పారు. వినియోగదారుల వృథా ఖర్చు, శ్రమను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఆన్లైన్ సేవలు ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆన్లైన్ పనులు పూర్తికాగానే బహిరంగ ప్రకటన చేస్తామని, ఆ తరువాత వినియోగించుకోవచ్చని తెలిపారు. -
రోడ్లకు మహర్దశ
రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు తీయాలంటే అందుకు అనుగుణంగా రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి జయలలిత తెలిపారు. ఇందుకుగాను రూ.2,325 కోట్లతో సుదీర్ఘ ప్రణాళికను రూపొందించినట్లు శుక్రవారం ఆమె అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ పారిశ్రామికంగా, వ్యవసాయకంగానేగాక ఇతర రంగాలపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు. తక్కువ సమయంలో గమ్యం చేరడం ద్వారా ఇంధన వినియోగంలో పొదుపు పాటించవచ్చన్నారు. ఈ విధానానికి రహదారులు అనువుగా ఉండాలన్నారు. చెన్నై కార్పొరేషన్ సరిహద్దులను కలుపుతూ 250 కిలోమీటర్ల మేర రూ.250 కోట్లతో రోడ్ల నిర్మాణం, విస్తరణ జరుపుతామని తెలిపారు. రూ.185 కోట్లతో నగరంలో సబ్‌వేల నిర్మాణం చేపడతామన్నారు. ప్రధాన రద్దీ ప్రాంతాల్లో పాదచారుల కోసం ఎస్కిలేటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒరగడం ఇండస్ట్రియల్ పార్క్ వద్ద రూ.120 కోట్లతో సిక్స్‌లైన్ రోడ్ల నిర్మాణం జరుగుతోందని అన్నారు. మధురైలో మీనాక్షి ఆస్పత్రి నుంచి కప్పలూరు వరకు 27 కిలోమీటర్ల పొడవున రూ.200 కోట్లతో రహదారిని విస్తరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 మానసిక చికిత్సాలయాలు ఉండగా మరో 22 నెలకొల్పుతున్నట్లు తెలిపారు. తమిళభాషను కాపాడుకునేందుకుప్రతి జిల్లా నుంచి సాహితీవేత్తలను ఎంపికచేస్తామన్నారు. వారిని తమిళచెమ్మల్, ఇళంగవడికల్ అవార్డులతో సత్కరించనున్నట్టు తెలిపారు. ఇదిలావుండగా డీఎంకే సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ ప్రతిపక్షాలు చేసిన అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారు. దీంతో పీఎంకే వాకౌట్ చేసింది. సీపీఎం కార్యదర్శిపై పరువునష్టం దావా తన పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా మాట్లాడారని పేర్కొంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జీ.రామకృష్ణన్‌పై సీఎం జయలలిత శుక్రవారం పరువునష్టం దావాను దాఖలు చేశారు. ఇసుక మాఫియా చేతుల్లో ఒక కానిస్టేబుల్ హత్యకు గురికావడంపై ఓ ఆంగ్ల పత్రికకు రామకృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూలో వాస్తవాలకు విరుద్దగా మాట్లాడాడని పేర్కొంటూ జయ తరపున న్యాయవాది ఎంఎల్ జగన్ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా రాష్ట్ర రవాణా శాఖా మంత్రి సెంధిల్ బాలాజీ ఇప్పటికే ఇద్దరిపై పరువునష్టం దావా వేసి ఉన్న విషయం తెల్సిందే. -
కార్పొరేషన్లో ‘కోడిగుడ్డు’
ఓడిన పార్టీలంటే గెలిచిన పార్టీలకు ఎప్పుడూ చులకనేనని అన్నాడీఎంకే నిరూపించింది. ఓటమి చవిచూసిన పార్టీలకు కార్పొరేషన్ సాక్షిగా కోడిగుడ్డు చూపించి వాగ్యుద్ధానికి తెరదీసింది. చెన్నై కార్పొరేషన్లో శుక్రవారం జరిగిన సమావేశం గందరగోళం, వాకౌట్ల నడుమ రసాభాసగా సాగింది. - ప్రతిపక్ష ఓటమిపై అన్నాడీఎంకే కౌన్సిలర్ ఎద్దేవా - డీఎంకే, కాంగ్రెస్‌సభ్యుల వాకౌట్ - నగరంలో 15 రోడ్ల విస్తరణ - మరో 200 అమ్మ క్యాంటీన్లు చెన్నై, సాక్షి ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికల వేడి చల్లారినా పార్టీల మధ్య వైషమ్యాల సెగలు మాత్రం సమసిపోలేదు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఒంటి చేత్తో 37 లోక్‌సభ సీట్లు మూటగట్టుకుంది. విధిలేక ఒంటరిపోరుకు దిగిన కాంగ్రెస్ గెలుపు మాట అటుంచి డిపాజిట్టును కోల్పోయింది. ఇక అన్నాడీఎంకే ప్రధాన ప్రత్యర్థి డీఎం కే 35 స్థానాల్లో (మిత్రపక్షం 5) పోటీచేసి దారుణ పరాభవానికి గురైంది. గెలుపోటములపై రాష్ట్ర పార్టీల్లో తర్జనభర్జనలు జరుగుతున్న తరుణంలో ఎన్నికల తరువాత తొలి సమావేశం శుక్రవారం జరిగింది. మేయర్ సైదై దొరస్వామి సమావేశానికి అధ్యక్షత వహించగా, తొలి అంశంగా అన్నాడీఎంకే అధినేత్రికి ధన్యవాదాలు చెప్పే తీర్మానా న్ని ప్రతిపాదించారు. ఇందుకు డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. కార్పొరేషన్ సమావేశం ప్రజా సమస్యలను చర్చించేందుకే గానీ ప్రశంసలు కురిపించేందుకు కాదని ప్రతిపక్ష నేత సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. నగరంలో విద్యుత్ కోత, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి అనేక సమస్యలుండగా, అభినందన తీర్మానం ఏమిటని అడ్డుతగిలారు. ఇంతలో అన్నాడీఎంకే మహిళా కౌన్సిలర్ వేలాంగణి కుర్చీ నుంచి లేచి డీఎంకే, కాంగ్రెస్‌ల ఓటమికి చిహ్నంగా కోడిగుడ్డును చూపారు. ఎన్నికల సమయంలో తరచూ 144 సెక్షన్ అమలుచేయడం వల్లే అన్నాడీఎంకే గెలుపు సాధ్యమరుందని వారు ఎద్దేవా చేశారు. అయినా అధికార పార్టీ సభ్యుల విమర్శలు కొనసాగించడంతో ఆగ్రహించిన ప్రతిపక్షాల వారు వాకౌట్ చేశారు. మరికొద్ది సేపటికి వారంతా సమావేశం హాలులోకి ప్రవే శించగా ఆమె మళ్లీ కోడిగుడ్డును ప్రదర్శించారు. అయితే రెండోసారి ఆమె చేతి నుంచి కోడిగుడ్డు జారిపడి పగిలిపోవడంతో సభ్యులంతా నవ్వుకున్నారు. మరో 200 అమ్మ క్యాంటీన్లు: నగరంలో మరో 200 అమ్మ క్యాంటీన్లను తెరవనున్నట్లు కార్పొరేషన్ ప్రకటించింది. నగరంలో మొత్తం వెయ్యి క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యంకాగా తొలివిడతగా నగరంలోని అన్ని వార్డుల్లో 200 క్యాంటీన్లు ప్రారంభమైనట్లు మేయర్ తెలిపారు. దశలవారీగా 1000 క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నగరంలో ఇరుకుగా ఉన్న 15 రోడ్లను విస్తరించనున్నట్లు చెప్పారు. రోడ్ల విస్తరణతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలుగుతాయని పేర్కొన్నారు. కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆళ్వారుపేటలోని సంక్రాంతి హోటల్‌కు సీలువేసినట్లు ప్రకటించారు. ఇంటికోసం దరఖాస్తు చేసుకుని హోటల్ నిర్మాణం చేపట్టినందుకే ఈ చర్యతీసుకున్నట్లు ఆయన వివరించారు. కార్పొరేషన్ దుకాణాలకు లెసైన్సు పొంది సబ్‌లీజు ఇస్తే మంజూరైన లీజును రద్దుచేస్తామని మేయర్ హెచ్చరించారు.