చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రం దశాబ్దకాలంగా విద్యుత్ సమస్యను ఎదుర్కొంటోంది. మండు వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో 14 గంటల విద్యుత్ కోత ను విధిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో కనీసం రెండు గంటల కోత తప్పడం లేదు. రాష్ట్రంలో ఎండవేడిమి పెరగకముందే విద్యుత్ వాడకం తీవ్రమైంది. ఈ ఏడాది జనవరిలో 11,727 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఫిబ్రవరి 5న 11,951 మెగావాట్లు, 10న 12,007, 16న 12,044 మెగావాట్లకు చేరుకుంది. రాష్ట్రంలో గరిష్ట వినియోగం 15 వేల మెగావాట్లు కాగా ప్రస్తుతం ఉత్పత్తి 12 వేల మెగావాట్లు మాత్రమే ఉంది. గత ఏడాది 12,300 మెగావాట్ల వినియోగం జరిగినపుడు రాష్ట్రంలో 11,600 మెగావాట్ల ఉత్పత్తి సాగుతున్నా సర్దుబాటు చేశామని అధికారులు అంటున్నారు. ఈ ఏడాది సైతం మండువేసవిలో 15 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం తప్పదని తెలుస్తుండగా, ఉత్పాదనలో ఇంకా వెనకబడి ఉన్నామని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కేంద్రాలు, కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ అందుతున్నందున అధికారులు కొంత వరకు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సౌరవిద్యుత్ సహాయం
సౌర విద్యుత్ సౌకర్యాన్ని పెంచుకోవడం ద్వారా విద్యుత్‌లోటును అధిగమించాలని చెన్నై కార్పొరేషన్ వేసుకున్న అంచనాలు అటకెక్కేశాయి. పథకం బాగున్నా అమలుకు తగిన ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతో కార్పొరేషన్ కలలు కల్లలుగా మారాయి. చెన్నై కార్పొరేషన్‌కు సంబంధించి మొత్తం 3 వేల నిర్మాణాల్లో 800 నిర్మాణాలు సౌరశక్తి సౌకర్యానికి, ముఖ్యంగా భవనం పై భాగంలో సౌర పలకలు అమర్చేందుకు అనువుగా ఉన్నాయని కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. మూడేళ్లలోగా వీటన్నింటినీ సౌరశక్తి వినియోగంలోకి తీసుకురావాలని తీర్మానించారు. సౌరవిద్యుత్‌కు అనువైన నిర్మాణాల్లో కార్పొరేషన్ కేంద్ర కార్యాలయమైన రిప్పన్ బిల్డింగ్‌ను కూడా చేర్చారు. చెన్నై కార్పొరేషన్ కేంద్ర కార్యాలయం రిప్పన్ బిల్డింగ్‌తోపాటూ ఇతర కార్యాలయాల్లో సౌరశక్తి పలకలు పెట్టడం ద్వారా సౌరశక్తిని వినియోగించుకోవాలని భావించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా రిప్పన్ బిల్డింగ్‌లో సౌరవిద్యుత్ ప్రతిపాదనను పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆ బిల్డింగ్ చుట్టూ ఉన్న భవనాలను మాత్రం సౌరవిద్యుత్ సౌకర్యం కోసం కూల్చివేశారు. కొత్తగా నిర్మించిన భవనంలో మాత్రం సౌరవిద్యుత్‌ను అమర్చాలని తీర్మానించారు. ప్రయోగాత్మక వినియోగం కోసం కొన్ని నిర్మాణాల్లో భారీ పెట్టుబడులు సమకూర్చుకుని ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆరు నిర్మాణాల్లో సౌరవిద్యుత్ పలకలు అమర్చారు. మిగిలిన నిర్మాణాల్లో ఈ పథకాన్ని అమలుచేసేందుకు కార్పొరేషన్ వద్ద తగినన్ని నిధులు లేవు. మరిన్ని సౌర పలకలను పొందేందుకు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం, పథకం అమలులో రాయితీలు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం సౌరవిద్యుత్ సౌకర్యాల విస్తరణకు మ్యాచింగ్ గ్రాంటు రాబట్టుకునేందుకు కార్పొరేషన్ కొత్త కోణాల్లో ప్రయత్నాలు ప్రారంభించింది. కార్పొరేషన్‌లో నిధుల లేమిని ఈ ప్రయత్నాలే రుజువుగా నిలిచాయి. ఇటువంటి సంకట పరిస్థితిపై కార్పొరేషన్‌కు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, సౌరశక్తి పలకలు అమర్చేందుకు బలమైన భవనాలను గుర్తించి ఒక జాబితాను సిద్ధం చేశామని, అయితే ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు పథకానికి శాపంగా మారాయన్నారు. నిధులు సమకూరగానే పనులు ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. మూడేళ్లలోగా 800 నిర్మాణాల్లో సౌర విద్యుత్ పనులు పూర్తికావడం అసాధ్యమని చెప్పారు. సమృద్ధిగా నిధులు చేతిలో ఉన్నపుడే పనులు వేగవంతంగా సాగుతాయని అన్నారు.
సొమ్మసిల్లిన సౌరవిద్యుత్
Published Thu, Feb 19 2015 1:39 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement