ఇక ఆన్‌లైన్ సేవలు
చెన్నై కార్పొరేషన్ పరిధిలోని గృహ యజమానులు ఇక మంచినీరు, డ్రైనేజీ సదుపాయాల కోసం కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకుని ఈ సేవలు పొందే సదుపాయాన్ని కార్పొరేషన్ త్వరలో కల్పించనుంది. ఇందుకు సంబంధించిన పనులు ఇటీవలే ప్రారంభమయ్యూయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి : చెన్నై మంచినీరు, డ్రైనేజీ విభాగం ద్వారా ఇళ్లకు ఆయా కనెక్షన్లు అందుతున్నాయి. కొత్త కనెక్షన్లు కోరే వారి సంఖ్య ఏడాదికి ఏడాది పెరిగిపోతోంది. సగటున ఏడాదికి 10 వేల మంది కొత్త కనెక్షన్లకు దరఖాస్తు చేసుకుంటున్నారు. కార్పొరేషన్ పరిధిలో కొత్తగా నిర్మించిన గృహాలకు కనెక్షన్లు అందించే ప్రక్రియ కొనసాగుతోంది. కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం 6,24,631 మంచినీరు 7,71,168 డ్రైనేజీ కనెక్షన్లు వినియోగంలో ఉన్నాయి. బ్రోకర్ల ప్రమేయం లేకుండా కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తులు పూర్తిచేసి తగిన సొమ్మును చెల్లించి పొందడం అంత సులువు కాదు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ సేవలను పరిచేయం చేయాలనే నిర్ణయానికి వచ్చింది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తరువాత ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకుని కార్యాలయంకు రావాల్సి ఉంటుంది. అధికారులు వాటిని పరిశీలించి కనెక్షన్‌ను మంజూరు చేస్తారు. కార్యాలయానికి రావడం, గంటల తరబడి క్యూలో నిల్చోవడం, బ్రోకర్లకు డబ్బు చెల్లించడం వంటి బాధలు ఇంటి యజమానులకు తప్పుతాయని అధికారులు అంటున్నారు. రూ.21.42 కోట్ల ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో ఆన్‌లైన్ సేవలను ప్రవేశపెడుతున్నారు. చెన్నై కార్పొరేషన్ పరిధిలోని గృహాలతోపాటూ కొత్తగా కార్పొరేషన్‌లో చేరిన ఇళ్లకు సైతం ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని మంచినీరు, డ్రైనేజీ విభాగ అధికారి ఒకరు చెప్పారు. వినియోగదారుల వృథా ఖర్చు, శ్రమను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఆన్‌లైన్ సేవలు ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆన్‌లైన్ పనులు పూర్తికాగానే బహిరంగ ప్రకటన చేస్తామని, ఆ తరువాత వినియోగించుకోవచ్చని తెలిపారు.