చెన్నై కార్పొరేషన్‌కు ఆరు అవార్డులు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజాసేవలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు చెన్నై కార్పొరేషన్ ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకుందని మేయర్ సైదై దొరస్వామి ప్రకటించారు. సోమవారం రిప్పన్ భవన్‌లో జరిగిన కార్పొరేషన్ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్పొరేషన్ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం, రవాణా సౌకర్యం తదితర అంశాల్లో దేశస్థాయిలో ఆరు అవార్డులను దక్కించుకున్నామన్నారు. చెన్నై కార్పొరేషన్ చరిత్రలో ఇదొక మహత్తర రికార్డుగా ఆయన పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలో 348 ఆధునిక టాయిలెట్ల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. ఒకేసారి ఏడుగురు వినియోగించుకోగల ఈ టాయిలెట్లకు ఒక్కోదానికి రూ.8 లక్షలను కేటాయించినట్లు తెలిపారు.
డీఎంకే వాకౌట్
డీఎంకే హయాంలో నిర్లక్ష్యానికి గురైన కార్పొరేషన్, 2011లో అమ్మ అధికారంలోకి వచ్చిన తరువాత అవార్డులు సాధించే స్థాయికి ఎదిగిందని మేయర్ అన్నారు. ఈ మూడేళ్లలో ప్రభుత్వం రూ.4,527 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఈ సొమ్ముతో నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మేయర్ వివరిస్తుండగా, డీఎంకే కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ అడ్డుతగిలారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరించి పొగుడుకోవడం తగదన్నారు. తమకు మాట్లాడే అవకాశం ఇస్తే ప్రజా సమస్యలు ఏమిటో వివరిస్తామని కోరారు. అయితే మేయర్ ఇందుకు నిరాకరించారు. ప్రజా సమస్యలను విస్మరించి బాకా కొట్టుకునేందుకే మేయర్ ప్రాధాన్యత నిస్తున్నారని ఆరోపిస్తూ డీఎంకే కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఆనంతరం కౌన్సిలర్ బోస్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ, రోడ్లు ధ్వంసమై ప్రమాదానికి దారితీస్తున్నాయని, చెత్తకుప్పలు పేరుకుపోయి వ్యాధులు ప్రబలుతున్నాయని, ఇవేమీ సమావేశంలో చర్చించకుండా
వారిని వారే మెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకనే సమావేశం నుంచి వాకౌట్ చేశామని వివరణ ఇచ్చారు.
తెరపైకి సైదై
పలు కారణాలతో అమ్మ ఆగ్రహానికి గురై తెరవెనుకకు వెళ్లిపోయిన మేయర్ సైదై దొరస్వామి సుదీర్ఘ విరామం తరువాత సోమవారం తొలిసారిగా తెరపైకి వచ్చారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో మేయర్‌ను దూరంగా పెట్టమని అమ్మ ఆదేశించారు. ఈ కారణం చేతనే ఇటీవల జరిగిన ఎంజీఆర్ వర్ధంతి, పార్టీ కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సైదై కనిపించలేదు. అయితే అకస్మాత్తుగా కార్పొరేషన్ సమావేశంలో పాల్గొనడం అందరినీ విస్మయూనికి గురి చేసింది.