కోర్టు కొరడా
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఎండీఏ), చెన్నై కార్పొరేషన్లపై మద్రాసు హైకోర్టు కొరడా ఝుళిపించింది. జార్జ్‌టౌన్ పరిధిలోని 11,302 ఆక్రమిత, అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నగర పరిధిలోని జార్జ్‌టౌన్‌లో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు జరిగాయని సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి మద్రాసు హైకోర్టులో ఇటీవల ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) దాఖలు చేశాడు.
నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు సాగాయని, ఇరుకు సందుల్లో ఆకాశహర్మ్యాలు నిర్మించారని ఆయన ఆరోపించారు. ఇటీవల జార్జ్‌టౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించగా అగ్నిమాపక శకటం సందులోకి వెళ్లలేకపోయిందని, ఈ కారణంగా ఓ వ్యక్తి మృతిచెందగా భారీ ఆస్తినష్టం సంభవించిందని పిల్‌లో పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణల ముందుకు ఈ పిల్ శుక్రవారం విచారణకు వ చ్చింది. జార్జ్‌టౌన్‌లో 479 వీధులుండగా 300 వీధులను తనిఖీ చేసి 3,080 నిర్మాణాలు నిబంధనలకు విరుద్దంగా ఉన్నట్లు గుర్తించామని సీఎండీఏ అధికారి కార్తిక్ కోర్టుకు వివరించారు.
ఆ నిర్మాణాలను స్వచ్ఛందంగా సరిచేసుకోవాలని యజమానులకు నోటీసులు పంపామని, ఆపై చర్యలకు ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి ఉన్నామని వివరించారు. కార్పొరేషన్ కమిషనర్ విక్రమ్ ప్రభు ఒక లేఖ ద్వారా కోర్టుకు వివరణ పంపారు. జార్జ్‌టౌన్‌లో 14,450 నిర్మాణాలకు గాను 11,304 నిర్మాణాలను తనిఖీ చేయగా వీటిల్లో 6,183 నిర్మాణాలు రోడ్డు ఆక్రమించుకున్నట్లు, మరికొన్ని నిబంధనలను ధిక్కరించి నిర్మించినట్లు గుర్తించామని తెలిపారు. మొత్తం నిర్మాణాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే సక్రమంగా ఉన్నాయని వివరించారు. ఇందుకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సోమయాజీ బదులిస్తూ ఒక్క శాతం మాత్రమే నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని అన్నారు.
మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా హద్దుమీరిన నిర్మాణాలకు నోటీసులు జారీచేయగా కొందరు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మరికొందరు ప్రభుత్వానికి మొరపెట్టుకోవడంతో స్తంభన ఏర్పడిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు... ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాల సమస్యను ఎలా అధిగమిస్తారో నాలుగు వారాల్లోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కార్పొరేషన్‌లో సిబ్బంది, అధికారుల కొరత కారణంగా నిర్మాణాలపై పర్యవేక్షణ లోపించిందని మరో వాదన ఉన్నందున ఈ అంశంపైనా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.