Chennai Metropolitan Development Authority
-
కోర్టు కొరడా
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఎండీఏ), చెన్నై కార్పొరేషన్లపై మద్రాసు హైకోర్టు కొరడా ఝుళిపించింది. జార్జ్‌టౌన్ పరిధిలోని 11,302 ఆక్రమిత, అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నగర పరిధిలోని జార్జ్‌టౌన్‌లో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు జరిగాయని సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి మద్రాసు హైకోర్టులో ఇటీవల ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) దాఖలు చేశాడు. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు సాగాయని, ఇరుకు సందుల్లో ఆకాశహర్మ్యాలు నిర్మించారని ఆయన ఆరోపించారు. ఇటీవల జార్జ్‌టౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించగా అగ్నిమాపక శకటం సందులోకి వెళ్లలేకపోయిందని, ఈ కారణంగా ఓ వ్యక్తి మృతిచెందగా భారీ ఆస్తినష్టం సంభవించిందని పిల్లో పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణల ముందుకు ఈ పిల్ శుక్రవారం విచారణకు వ చ్చింది. జార్జ్‌టౌన్‌లో 479 వీధులుండగా 300 వీధులను తనిఖీ చేసి 3,080 నిర్మాణాలు నిబంధనలకు విరుద్దంగా ఉన్నట్లు గుర్తించామని సీఎండీఏ అధికారి కార్తిక్ కోర్టుకు వివరించారు. ఆ నిర్మాణాలను స్వచ్ఛందంగా సరిచేసుకోవాలని యజమానులకు నోటీసులు పంపామని, ఆపై చర్యలకు ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి ఉన్నామని వివరించారు. కార్పొరేషన్ కమిషనర్ విక్రమ్ ప్రభు ఒక లేఖ ద్వారా కోర్టుకు వివరణ పంపారు. జార్జ్‌టౌన్‌లో 14,450 నిర్మాణాలకు గాను 11,304 నిర్మాణాలను తనిఖీ చేయగా వీటిల్లో 6,183 నిర్మాణాలు రోడ్డు ఆక్రమించుకున్నట్లు, మరికొన్ని నిబంధనలను ధిక్కరించి నిర్మించినట్లు గుర్తించామని తెలిపారు. మొత్తం నిర్మాణాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే సక్రమంగా ఉన్నాయని వివరించారు. ఇందుకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సోమయాజీ బదులిస్తూ ఒక్క శాతం మాత్రమే నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని అన్నారు. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా హద్దుమీరిన నిర్మాణాలకు నోటీసులు జారీచేయగా కొందరు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మరికొందరు ప్రభుత్వానికి మొరపెట్టుకోవడంతో స్తంభన ఏర్పడిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు... ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాల సమస్యను ఎలా అధిగమిస్తారో నాలుగు వారాల్లోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కార్పొరేషన్లో సిబ్బంది, అధికారుల కొరత కారణంగా నిర్మాణాలపై పర్యవేక్షణ లోపించిందని మరో వాదన ఉన్నందున ఈ అంశంపైనా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. -
చర్యలేవీ..?
రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో నిబంధనలకు తిలోదకాలిచ్చి నిర్మించిన భవనాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని సీఎండీఏ వర్గాల్ని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. నిబంధనల ఉల్లంఘల్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇప్పటి వరకు తీసుకున్న కఠిన చర్యలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఇందుకోసం రెండు నెలల గడువు ఇస్తున్నట్టు పేర్కొంది. సాక్షి, చెన్నై: రాష్ర్ట రాజధాని నగరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా చెన్నై మెట్రో డెవలప్మెంట్ అథారిటీ(సీఎండీఏ) అనుమతి తప్పని సరి. ఈ అథారిటీ నిబంధనలు ఓ రకంగా ఉంటే, నిర్మాణాలు మరో రకంగా ఉంటున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, చేతివాటంతో నగరంలో భవనాలు ఇష్టారాజ్యంగా వెలుస్తున్నాయి. నగరంలోని అతిపెద్ద మాల్స్‌లలో సీఎండీఏ నిబంధనలు అంతంత మాత్రంగానే అమలుచేస్తున్నారు. ఈ వ్యవహారం గతంలో మద్రాసు హైకోర్టు దృష్టికి చేరింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం సీఎండీఏ వర్గాలకు పలుమార్లు అక్షింతలు వేసింది. వాటిని అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. చివరకు మాజీ ఐఏఎస్ అధికారి దేవసహాయం కోర్టును ఆశ్రయించడంతో అధికారుల్లో గుబులు పట్టుకుంది. ఆయన పిటిషన్‌తో నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాల భరతం పట్టే రీతిలో ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది. ఈ కమిటీ తొలి నాళ్లలో ఉరకలు తీసినా తర్వాత పత్తాలేదు. ఏడాదిన్నరగా నగరంలో రోజు రోజుకూ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ భారీ భవనాల నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో మళ్లీ దేవసహాయం రంగంలోకి దిగారు. ఆ కమిటీ ఏమి చేస్తోంది, ఎక్కడ ఉంది? అని ప్రశ్నిస్తూ, ఇప్పటి వరకు ఆ కమిటీ ఒరగ బెట్టిందేమిటో వివరించాలని మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీఎండీఏ వర్గాలకు బెంచ్ అక్షింతలు వేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన పర్యవేక్షణా కమిటీ ఏమి చేస్తోందని ప్రశ్నించింది. నెలకు రెండుసార్లు చొప్పున ఈ కమిటీ సమావేశం కావాల్సి ఉందని, ఆ కమిటీలో చర్చించి తీసుకున్న నిర్ణయాలు, ఆ కమిటీ ఇప్పటి వరకు ఎన్ని సార్లు సమావేశమైంది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాలపై తీసుకున్న చర్యలు తదితరాలపై ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించి నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకున్నారా..? లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇప్పటి వరకు తీసుకున్న చర్యల్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. తమ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇస్తూ, ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో సమగ్ర నివేదికను సమర్పించాలని పేర్కొంది. ఇందుకు గాను రెండు నెలలు సమయం కేటాయిస్తూ, తదుపరి విచారణను డిసెంబర్ నెలాఖరుకు వాయిదా వేసింది.