చర్యలేవీ..? | CMDA Scouts for New Moffusil Bus Stand Site | Sakshi
Sakshi News home page

చర్యలేవీ..?

Published Tue, Oct 14 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

చర్యలేవీ..?

చర్యలేవీ..?

 రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో నిబంధనలకు తిలోదకాలిచ్చి నిర్మించిన భవనాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని సీఎండీఏ వర్గాల్ని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. నిబంధనల ఉల్లంఘల్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇప్పటి వరకు తీసుకున్న కఠిన చర్యలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఇందుకోసం రెండు నెలల గడువు ఇస్తున్నట్టు పేర్కొంది.
 
 సాక్షి, చెన్నై: రాష్ర్ట రాజధాని నగరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా చెన్నై మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ(సీఎండీఏ) అనుమతి తప్పని సరి. ఈ అథారిటీ నిబంధనలు ఓ రకంగా ఉంటే, నిర్మాణాలు మరో రకంగా ఉంటున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, చేతివాటంతో నగరంలో భవనాలు ఇష్టారాజ్యంగా వెలుస్తున్నాయి. నగరంలోని అతిపెద్ద మాల్స్‌లలో సీఎండీఏ నిబంధనలు అంతంత మాత్రంగానే అమలుచేస్తున్నారు. ఈ వ్యవహారం గతంలో మద్రాసు హైకోర్టు దృష్టికి చేరింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం సీఎండీఏ వర్గాలకు పలుమార్లు అక్షింతలు వేసింది. వాటిని అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. చివరకు మాజీ  ఐఏఎస్ అధికారి దేవసహాయం కోర్టును ఆశ్రయించడంతో అధికారుల్లో గుబులు పట్టుకుంది. ఆయన పిటిషన్‌తో నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాల భరతం పట్టే రీతిలో ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది.
 
 ఈ కమిటీ తొలి నాళ్లలో ఉరకలు తీసినా తర్వాత పత్తాలేదు. ఏడాదిన్నరగా నగరంలో రోజు రోజుకూ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ భారీ భవనాల నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో మళ్లీ దేవసహాయం రంగంలోకి దిగారు. ఆ కమిటీ ఏమి చేస్తోంది, ఎక్కడ ఉంది? అని ప్రశ్నిస్తూ, ఇప్పటి వరకు ఆ కమిటీ ఒరగ బెట్టిందేమిటో వివరించాలని మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది.  
 
 ఈ సందర్భంగా సీఎండీఏ వర్గాలకు బెంచ్ అక్షింతలు వేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన పర్యవేక్షణా కమిటీ ఏమి చేస్తోందని ప్రశ్నించింది. నెలకు రెండుసార్లు చొప్పున ఈ కమిటీ సమావేశం కావాల్సి ఉందని, ఆ కమిటీలో చర్చించి తీసుకున్న నిర్ణయాలు, ఆ కమిటీ ఇప్పటి వరకు ఎన్ని సార్లు సమావేశమైంది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాలపై తీసుకున్న చర్యలు తదితరాలపై ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించి నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకున్నారా..? లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇప్పటి వరకు తీసుకున్న చర్యల్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. తమ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇస్తూ, ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో సమగ్ర నివేదికను సమర్పించాలని పేర్కొంది. ఇందుకు గాను రెండు నెలలు సమయం కేటాయిస్తూ, తదుపరి విచారణను డిసెంబర్ నెలాఖరుకు వాయిదా వేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement