మరో అపార్టుమెంటు కూల్చేద్దాం
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై మౌళివాక్కంలో కుప్పకూలిన 11 అంతస్తుల అపార్టుమెంటు పక్కనే ఉన్న మరో అపార్టుమెంటును సైతం కూల్చివేయాలని నిర్ణయిస్తూ చెన్నై మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (సీఎండీఏ) అధికారికంగా ప్రకటించింది. ఈనెల 30 లేదా 31 తేదీల్లో కూల్చివేత పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
మౌళివాక్కంలోని ఒకే ప్రాంగణంలో రెండు కట్టడాలుగా నిర్మించిన 11 అంతస్తుల అపార్టుమెంటుల్లో ఒకటి జూన్ 28న కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఆనాటి ప్రమాదంలో అపార్టుమెంటు శిథిలాల కింద చిక్కి 61 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు అక్కడి రెండో అపార్టుమెంటు సైతం ఒకవైపునకు ఒరిగినట్లుగా గుర్తించారు. ఒకే బిల్డరు కట్టిన అపార్టుమెంటు కావడంతో ప్రమాదం జరిగిన వెంటనే రెండోదాన్ని అధికారులు సీజ్ చేశారు.
రెండో అపార్టుమెంటు నాణ్యతపై కూడా అనుమానాలు ఉన్నందున కూల్చివేయాలని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో అధికారులు అనధికారికంగా ప్రకటించారు. రెండో అపార్టుమెంటుకు వెనుకవైపు వీధిలోని ఇళ్లను ఖాళీ చేయించారు. రెండో అపార్టుమెంటును కూల్చేవరకు కొనసాగేలా పరిసరాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏకసభ్య కమిషన్ విచారణ పూర్తికాగానే రెండో అపార్టుమెంట్ కూల్చివేతపై తేదీ ఖరారు అవుతుందని అధికారులు ఇంతకాలం జాప్యం చేశారు. అపార్టుమెంటు కూలిన ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ పూర్తిచేసి ఈనెల 25వ తేదీన ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ప్రమాదానికి కారకులు ఎవరో ప్రభుత్వం ఇంకా వెల్లడి చేయలేదు. అయితే రెండో అపార్టుమెంటు కూల్చివేతకు ఈనెల 30, 31 తేదీలను ముహూర్తంగా పెట్టినట్లు తెలిపారు.