సాక్షి, చెన్నై : కోయంబేడు - ఆలందూరు మధ్య ఐదు నిమిషాలకో మెట్రో రైలు నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మార్గంలో రైలు నడిపేందుకు సంబంధించిన అన్ని పనులు ముగి శాయి. రైల్వే స్టేషన్లలో మెరుగులుదిద్దే పనులు తుది దశకు చేరాయి. దీంతో రైల్వే భద్రతా కమిషన్ పనుల పరిశీలనకు సిద్ధం అయింది. రాజధాని నగరంలో ప్రధానంగా ట్రాఫిక్ రద్దీ క్రమబద్ధీకరణ లక్ష్యంగా మెట్రో రైలు సేవల్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. చాకలి పేట నుంచి అన్నా సాలై వైపుగా జెమిని, సైదా పేట, గిండి మీదుగా మీనంబాక్కం వరకు ఓ మార్గం, సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కోయంబేడు మీదుగా వడపళని, గిండిలను కలుపుతూ సెయింట్ థామస్ మౌంట్ వరకు మరో మార్గంలో మెట్రో రైలు సేవలకు చర్యలు చేపట్టారు.
మొత్తంగా నగరంలో 45 కి.మీ మేరకు మెట్రో రైలు సేవలు అందనున్నాయి. ఇప్పటికే బ్రెజిల్‌లో రూపుదిద్దుకున్న మెట్రో రైలు బోగిలు చెన్నై చేరాయి. కోయంబేడు - ఆలందూరు మధ్య వంతెన మీద రైలు పయనించేందుకు తగ్గ అన్ని పనులు ముగియడంతో ట్రైల్ రన్ జోరందుకుంది. ఇక , ఇతర సాంకేతిక వ్యవహారాలకు సంబంధించి పనుల్ని, రైల్వే స్టేషన్ల ఏర్పాటును పనుల్ని ముగించేసి తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డారు. కోయంబేడు - ఆలందూరు మార్గంలో ఏడు రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేసి ఉన్నారు. కోయంబేడు, సీఎంబిటి, వడపళని, అశోక్ నగర్, ఈక్కాట్టు తాంగల్, ఆలందూరు రైల్వే స్టేషన్లలో తుది మెరుగులు దిద్దే పని ముగింపుదశకు చేరాయి.
ఈ మార్గంలో త్వరలో రైలు సేవలకు శ్రీకారం చుట్టే విధంగా మెట్రో ప్రాజెక్టు వర్గాలు ఉరకలు తీస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ మార్గంలో ముగిసిన అన్ని పనులతో కూడిన నివేదిక, రైలు నడిపేందుకు సర్వం సిద్ధం చేస్తూ రూపొందించిన నివేదికల్ని మెట్రో ప్రాజెక్టు అధికారులు బెంగళూరులోని రైల్వే భద్రతా కమిషన్‌కు సమర్పించారు. ఈ కమిషన్ బృందం ఆ నివేదికను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్టు మెట్రో ప్రాజెక్టు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కమిషన్ బృందం ఒకటి రెండు రోజుల్లో చెన్నైకు రానుంది. వారం రోజుల పాటుగా ఇక్కడే తిష్ట వేసి ఇప్పటి వరకు ముగిసిన అన్ని పనులు, భద్రతా పరంగా తీసుకున్న అన్ని చర్యల్ని పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నది. ఈ కమిషన్ పరిశీలన మేరకు వచ్చే సిగ్నల్ ఆధారంగా రైలు సేవలకు శ్రీకారం చుట్టేందుకు మంచి ముహూర్తం కోసం అన్వేషణలో మెట్రో వర్గాలు నిమగ్నం అయ్యాయి.
5 నిమిషాలకో రైలు
Published Mon, Mar 23 2015 1:53 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement