అదిగో మెట్రో! | Reday for Metro Rail in Chennai | Sakshi
Sakshi News home page

అదిగో మెట్రో!

Published Mon, Jun 29 2015 3:14 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

Reday for Metro Rail in Chennai

 సాక్షి, చెన్నై: రాజధాని నగరంలో ట్రాఫిక్ రద్దీ క్రమబద్ధీకరించే రీతిలో మెట్రో రైలు సేవలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రెండు మార్గాల్లో ఈ పనులు సాగుతున్నాయి. ఇందులో భాగంగా కోయంబేడు - ఆలందూరు మధ్య రైలు నడిపేందుకు తగ్గ అన్ని పనులు ముగిసి నెలలు కావస్తున్నాయి. ఇక, ఈ మార్గంలో ఏడు చోట్ల రైల్వే స్టేషన్లు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. తొలి విడతగా ఈ మార్గం లో రైలు సేవలకు అన్ని రకాల అనుమతులు లభించి నా, ముహూర్తాలు అడ్డొస్తూ ఉన్నాయి. గత ఏడాది చివర్లో శ్రీకారం చుడదామనుకునేలోపు సీఎం జయలలిత నెత్తిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు వచ్చి కూర్చుంది. ఇక, సీఎం మారడంతో ఆ ప్రయత్నం వాయిదా పడింది. జయలలిత నిర్ధోషిగా బయటపడ్డ మరుసటి రోజే ప్రారంభోత్సవానికి చర్యలు చేపట్టినా, అది కార్యరూపం దాల్చలేదు. ఈ సమయంలో ఆర్కేనగర్ ఉప ఎన్నికలు రావడంతో మళ్లీ వాయిదాలు వేసుకోవాల్సి వచ్చింది.
 
 సర్వం సిద్ధం
 ప్రతి రోజూ కోయంబేడు - ఆలందూరు మార్గంలో మెట్రో రైలు అటూ ఇటూ పరుగులు తీస్తూ వస్తోంది. అయితే, ఇందులో ప్రయాణికులకు అనుమతి లేదు. ట్రయల్న్ ్రరూపంలో పరుగులు తీస్తున్న ఈ రైలులో ఎప్పుడెప్పుడు పయనించబోతున్నామా..? అన్న ఎదురు చూపుల్లో నగర వాసులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మెట్రో రైలు సేవలకు శ్రీకారం చుట్టేందుకు గాను అధికారికంగా తేదీ, ముహూర్తం ఖరారు కాలేదు. అయితే, ఏ క్షణంలోనైనా సరే, ఏ సమయంలో నైనా సరే సీఎం జయలలిత జెండా ఊపేందుకు మాత్రం రెడీ అంటూ సచివాలయం నుంచి వచ్చిన కబురుతో మెట్రో ప్రాజెక్టు వర్గాలు సిద్ధమయ్యాయి. తాము సిద్ధమన్నట్టుగా మెట్రో ప్రాజెక్టు వర్గాలు సిద్ధం చేశారు.
 
 నేడు ప్రారంభం
  ఆదివారం మెట్రో రైలు సేవలకు శ్రీకారం చుడతారని తొలుత ప్రచారం సాగింది. అయితే, చివరకు అది కాస్త సోమవారానికి మారింది. మెట్రో రైలు సేవలకు శ్రీకారం చుట్టేందుకు గాను, అధికారికంగా సచివాలయం వర్గాలు ప్రకటించడంతో అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇటీవలి కాలంగా సీఎం జయలలిత సచివాలయం వేదికగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే అన్ని రకాల ప్రారంభోత్సవాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోయంబేడు - ఆలందూరు మధ్య మెట్రో రైలు సేవల ప్రారంభోత్సవ వేడుకను నిరాడంబరంగా నిర్వహించి, సచివాలయం నుంచే జెండా ఊపేందుకు సిద్ధమయ్యారు. కోయంబేడులోని ప్రధాన కార్యాలయ పరిసరాల్లో అందుకుతగ్గ ఏర్పాట్లు చేశారు. అలాగే, కోయంబేడు, ఆరుంబాక్కం, వడపళని, అశోక్‌నగర్, ఈక్కాడుతాంగల్, ఆలందూరు రైల్వే స్టేషన్లు ముస్తాబు చేశారు. కాగా, ఈ ప్రారంభోత్సవ వేడుకకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు మాత్రం ఆహ్వానం వెళ్లినట్టుంది. అయితే, ఆయన వస్తారా..? లేదా..? అన్నది పక్కన బెడితే, సచివాలయంలో జెండా ఊపేందుకు సీఎం జయలలిత సిద్ధమయ్యారు. తొలి రోజు పట్టాలెక్కే రైళ్లు ప్రత్యేక ఆకర్షణగా కన్పించే రీతిలో పుష్పాలతో అలకరించేందుకు రూ.28 లక్షలు కేటాయించడం గమనార్హం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement