పడవలాంటి కారుల్లో, విమానాల్లో తిరిగే త్రిష లోకల్ ట్రైన్‌లో ప్రయాణం చేస్తే...? ఆ రోజు ఆ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న ప్రయాణీకులందరూ ఎగ్జయిట్ అయిపోవడం ఖాయం. ఇటీవల అదే జరిగింది. చెన్నై మెట్రో ట్రైన్‌లో త్రిష ప్రయాణం చేశారు. ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు అరుంబాక్కం స్టేషన్‌కి వెళ్లి, టికెట్ కొనుక్కుని, ప్లాట్‌ఫామ్ మీద వెయిట్ చేశారు. ఏడున్నర గంటలకు వచ్చిన ట్రైన్ ఎక్కారామె. ఆ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న చిన్నా, పెద్దా అందరూ ఈవిడగార్ని చూడగానే షాక్.
ఆ స్వీట్ షాక్ నుంచి తేరుకుని త్రిషతో మాటలు కలిపారు. ఆ తర్వాత కాసేపు ట్రైన్ విండో నుంచి బయటికి చూస్తూ, త్రిష ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఈ ప్రయాణం తీపి గుర్తుగా మిగిలిపోవాలని ఓ సెల్ఫీ తీసుకున్నారు. కొంతమంది ప్రయాణీకులు కూడా త్రిషతో సెల్ఫీ దిగారు. ఫైనల్‌గా కోయంబేడు స్టేషన్ రాగానే ప్రయాణీకులందరికీ టాటా చెప్పి, ట్రైన్ దిగారు త్రిష. ‘‘నాకు లోకల్ ట్రైన్‌లో ప్రయాణం చేసే అవకాశం పెద్దగా దక్కలేదు. కాలేజ్ డేస్‌లో టూ వీలర్‌లో వెళ్లేదాన్ని’’ అని ఈ సందర్భంగా త్రిష పేర్కొన్నారు.
‘‘మెట్రో ట్రైన్ ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంది. అరుంబాక్కమ్ నుంచి కోయంబేడుకి పదిహేను నిమిషాల్లో వచ్చేశాను. అదే రోడ్ వే అయితే చాలా టైమ్ పట్టేది’’ అని కూడా ఆమె అన్నారు. సమయం వృథా కాకూడదనుకునేవాళ్లు, సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలనుకునేవాళ్లు తప్పకుండా మెట్రో ట్రైన్‌లో వెళ్లాలని త్రిష సూచించారు.