చెన్నై, సాక్షి ప్రతినిధి:చెన్నై నగరంలో జరుగుతున్న మెట్రోరైలు నిర్మాణ పనులు మరో నిండు ప్రాణాన్ని తీసుకున్నాయి. పరంగిమలై వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో గిరిధర్ (30) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరు దుర్మరణం చెందాడు.ఉదయం 9.30 గంటల సమయం. ఆఫీసులు, వ్యాపారాలకు, విద్యాలయాలకు వెళ్లే వారితో నగరమంతా వందలాది వాహనాలతో రద్దీమయం. అందరితోపాటూ గిరిధర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరు ఆఫీసుకని మడిపాక్కంలోని తన నివాసం నుండి బయలుదేరాడు. ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ తలకు హెల్మెట్ కూడా ధరించి ద్విచక్రవాహనంపై వడపళనిలోని ఆఫీసువైపుగా ప్రయాణం. ఏడాదిన్నర క్రితమే పెళ్లి, నిండుగర్భిణిగా పుట్టింటికి వెళ్లిన భార్య, త్వరలో తండ్రి కాబోతున్న సంతోషంతో సాగిపోతున్నాడు. మరికొద్ది క్షణాల్లో మృత్యువు తనను కబళిస్తుందని తెలియదు పాపం. కత్తిపార జంక్షన్ మీదుగా పరంగిమలై వద్ద బైక్‌పై ప్రయాణిస్తున్న తరుణంలో మెట్రో పనుల కోసం అమర్చిన పది అడుగుల పొడవున్న ఒక బలమైన ఇనుప చట్రం అతని తలపై పడింది.
సుమారు వంద అడుగుల ఎత్తునుండి పడటంతో హెల్మెట్‌ను చీల్చివేసి అతని తలను ఛిద్రం చేసింది. తీవ్ర రక్తస్రావంతో గిలగిల కొట్టుకుంటూ గిరిధర్ అక్కడే ప్రాణాలు విడిచాడు. అతని వాహనంతోపాటూ ప్రయాణిస్తున్న వారు ప్రమాదాన్ని కళ్లారా చూసి భయంతో వణికిపోయారు. మరిన్ని ఇనుప కమ్మీలు పడుతాయనే భీతితో పాదాచారులు పరుగులు పెట్టారు. అంబులెన్స్ పిలిచే సమయం కూడా లేకుండా గిరిధర్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదం కారణంగా సుమారు గంట పాటూ ట్రాఫిక్ స్థంభించి పోయింది. ఆగ్రహించిన ప్రజానీకం మెట్రో పనులను పర్యవేక్షిస్తున్న అరవింద్,రాజాలపై దాడికి దిగింది. కుమారుని మరణవార్త తెలియగానే తల్లిదండ్రులు సీత, లక్ష్మణ్‌లు ప్రమాదస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరైనారు. గిరిధ ర్, ఉత్తరలకు ఏడాదిన్నర క్రితమే వివాహం అయిం ది. భార్య ఉత్తర సైతం సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు.
గర్బిణీగా ఉన్న భార్య కాన్పుకోసం పుట్టిం టికి వెళ్లి ఉంది. ఈ తరుణంలో కుమారుడు మృత్యువాతపడటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోయా రు. కుమారుని మరణవార్త కోడలికి ఎలాచెప్పాలని గిరిధర్ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.చెన్నై నగరంలో పలుప్రాంతాల్లో సాగుతున్న మెట్రో పనులు ప్రాణాలను బలిగొనడం సహజంగా మారిపోయింది. మూడేళ్ల క్రితం వడపళనిలో మెట్రోరైలు బ్రిడ్జి నిర్మాణానికి అమర్చిన ఒక ఇనుప క మ్మి పై నుండి రోడ్డుపై పడింది. నిత్యం రద్దీగా ఉండే ఆ సమయంలో అదృష్టవశాత్తు ప్రాణనష్టం సంభవించలేదు. మెట్రోపనుల్లో ఇది మొదటి ప్రమాదం. కాగా, కీల్‌పాక్ వద్ద పనుల్లో ఒక జేసీబీకి అమర్చిన ఇనుపరాట్నం ఊడిపడగా అక్కడ పనిచేస్తున్న బీహార్‌కు చెందిన కూలీ కార్మికుడు మృతి చెందాడు. భార్య, పిల్లలను రైల్వేస్టేషన్‌లో దింపి ఇంటికి వెళుతుండగా అన్నాశాలై వద్ద మెట్రోపనుల నుంచి పడిన ఇనుపరాడ్ అతన్ని బలిగొంది. సైదాపేట, ఆలందూరు వద్ద మరో ఇద్దరు మృతి చెందారు. ఇటీవల ట్రిప్లికేన్‌లో మెట్రో సొరంగం పనుల వల్ల ఆరు ఇళ్లు రెండు అడుగుల మేర భూమిలో దిగబడిపోయాయి.
ప్రాణం తీసిన మెట్రో
Published Thu, Jun 18 2015 4:12 AM | Last Updated on Mon, Oct 22 2018 7:50 PM
Advertisement