cmda
-
చర్యలేవీ..?
రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో నిబంధనలకు తిలోదకాలిచ్చి నిర్మించిన భవనాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని సీఎండీఏ వర్గాల్ని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. నిబంధనల ఉల్లంఘల్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇప్పటి వరకు తీసుకున్న కఠిన చర్యలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఇందుకోసం రెండు నెలల గడువు ఇస్తున్నట్టు పేర్కొంది. సాక్షి, చెన్నై: రాష్ర్ట రాజధాని నగరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా చెన్నై మెట్రో డెవలప్మెంట్ అథారిటీ(సీఎండీఏ) అనుమతి తప్పని సరి. ఈ అథారిటీ నిబంధనలు ఓ రకంగా ఉంటే, నిర్మాణాలు మరో రకంగా ఉంటున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, చేతివాటంతో నగరంలో భవనాలు ఇష్టారాజ్యంగా వెలుస్తున్నాయి. నగరంలోని అతిపెద్ద మాల్స్‌లలో సీఎండీఏ నిబంధనలు అంతంత మాత్రంగానే అమలుచేస్తున్నారు. ఈ వ్యవహారం గతంలో మద్రాసు హైకోర్టు దృష్టికి చేరింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం సీఎండీఏ వర్గాలకు పలుమార్లు అక్షింతలు వేసింది. వాటిని అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. చివరకు మాజీ ఐఏఎస్ అధికారి దేవసహాయం కోర్టును ఆశ్రయించడంతో అధికారుల్లో గుబులు పట్టుకుంది. ఆయన పిటిషన్‌తో నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాల భరతం పట్టే రీతిలో ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది. ఈ కమిటీ తొలి నాళ్లలో ఉరకలు తీసినా తర్వాత పత్తాలేదు. ఏడాదిన్నరగా నగరంలో రోజు రోజుకూ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ భారీ భవనాల నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో మళ్లీ దేవసహాయం రంగంలోకి దిగారు. ఆ కమిటీ ఏమి చేస్తోంది, ఎక్కడ ఉంది? అని ప్రశ్నిస్తూ, ఇప్పటి వరకు ఆ కమిటీ ఒరగ బెట్టిందేమిటో వివరించాలని మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీఎండీఏ వర్గాలకు బెంచ్ అక్షింతలు వేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన పర్యవేక్షణా కమిటీ ఏమి చేస్తోందని ప్రశ్నించింది. నెలకు రెండుసార్లు చొప్పున ఈ కమిటీ సమావేశం కావాల్సి ఉందని, ఆ కమిటీలో చర్చించి తీసుకున్న నిర్ణయాలు, ఆ కమిటీ ఇప్పటి వరకు ఎన్ని సార్లు సమావేశమైంది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాలపై తీసుకున్న చర్యలు తదితరాలపై ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించి నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకున్నారా..? లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇప్పటి వరకు తీసుకున్న చర్యల్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. తమ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇస్తూ, ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో సమగ్ర నివేదికను సమర్పించాలని పేర్కొంది. ఇందుకు గాను రెండు నెలలు సమయం కేటాయిస్తూ, తదుపరి విచారణను డిసెంబర్ నెలాఖరుకు వాయిదా వేసింది. -
మరో అపార్టుమెంటు కూల్చేద్దాం
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై మౌళివాక్కంలో కుప్పకూలిన 11 అంతస్తుల అపార్టుమెంటు పక్కనే ఉన్న మరో అపార్టుమెంటును సైతం కూల్చివేయాలని నిర్ణయిస్తూ చెన్నై మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (సీఎండీఏ) అధికారికంగా ప్రకటించింది. ఈనెల 30 లేదా 31 తేదీల్లో కూల్చివేత పనులు ప్రారంభించే అవకాశం ఉంది. మౌళివాక్కంలోని ఒకే ప్రాంగణంలో రెండు కట్టడాలుగా నిర్మించిన 11 అంతస్తుల అపార్టుమెంటుల్లో ఒకటి జూన్ 28న కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఆనాటి ప్రమాదంలో అపార్టుమెంటు శిథిలాల కింద చిక్కి 61 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు అక్కడి రెండో అపార్టుమెంటు సైతం ఒకవైపునకు ఒరిగినట్లుగా గుర్తించారు. ఒకే బిల్డరు కట్టిన అపార్టుమెంటు కావడంతో ప్రమాదం జరిగిన వెంటనే రెండోదాన్ని అధికారులు సీజ్ చేశారు. రెండో అపార్టుమెంటు నాణ్యతపై కూడా అనుమానాలు ఉన్నందున కూల్చివేయాలని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో అధికారులు అనధికారికంగా ప్రకటించారు. రెండో అపార్టుమెంటుకు వెనుకవైపు వీధిలోని ఇళ్లను ఖాళీ చేయించారు. రెండో అపార్టుమెంటును కూల్చేవరకు కొనసాగేలా పరిసరాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏకసభ్య కమిషన్ విచారణ పూర్తికాగానే రెండో అపార్టుమెంట్ కూల్చివేతపై తేదీ ఖరారు అవుతుందని అధికారులు ఇంతకాలం జాప్యం చేశారు. అపార్టుమెంటు కూలిన ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ పూర్తిచేసి ఈనెల 25వ తేదీన ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ప్రమాదానికి కారకులు ఎవరో ప్రభుత్వం ఇంకా వెల్లడి చేయలేదు. అయితే రెండో అపార్టుమెంటు కూల్చివేతకు ఈనెల 30, 31 తేదీలను ముహూర్తంగా పెట్టినట్లు తెలిపారు. -
కొరడా
సాక్షి, చెన్నై:రాష్ట్ర రాజధాని నగరంలో సీఎండీఏ నిబంధనలకు విరుద్ధంగా అనేక భవనాలు వెలిశాయి. వీటి భరతం పట్టేలా కార్పొరేషన్, సీఎం డీఏ వర్గాలు తరచూ చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేదు. ఏదేని చిన్న పాటి ప్రమాదం జరిగినా తప్పించుకోలేని రీతిలో మాల్స్‌ను నిర్మించారు. గతంలో ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. దీనిపై అప్పట్లో కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ నిర్మించిన భవనాల్ని కూల్చి వేయూలని ఆదేశిం చింది. దాన్ని అమలు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఈ వ్యవహారాన్ని ఎత్తి చూపుతూ సం ఘ సేవకుడు ట్రాఫిక్ రామస్వామి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు 1999 వరకు నిబంధనలకు విరుద్ధం గా నిర్మితమైన భవనాల్ని కూల్చి వేయాలని కోర్టు ఆదేశించినా అమలు కాలేదని గుర్తుచేశారు. డీఎంకే హాయూంలో మోహన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇచ్చిన సూచనల మేరకు ఆ భవనాల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. 2007 వరకు నిబంధనల్ని ఉల్లంఘించి నిర్మించిన భవనాల్ని క్రమబద్ధీకరిస్తున్నట్టు, జరిమానాలు విధిస్తున్నట్టు, నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఊరట ఇచ్చే విధంగా ఉత్తర్వులు వెలువడ్డాయని వివరించారు. వాటిని రద్దు చేసి నిబంధనల ఉల్లంఘనపై కొరడా ఝుళిపించాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి అగర్వాల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. ట్రాఫిక్ రామస్వామి తరపు న్యాయవాదులు, అధికారుల వాదనల్ని విన్న బెంచ్ గత వారం విచారణను ముగించింది. సోమవారం తీర్పు వెలువరించనున్నట్టు ప్రకటించింది. ఆ మేరకు ఉదయం బెంచ్ తీర్పు వెలువరించింది. ఇది వరకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. నిబంధనల్ని ఉల్లంఘించి నగరంలో పుట్టగొడుగుల్లా భవనాలు వెలుస్తున్నాయని బెంచ్ వివరించింది. అన్ని కోణాల్లో పరిశీలించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, కొందరి ప్రయోజనాలను మాత్రం దృష్టిలో ఉంచుకోకూడదని అక్షింతలు వేసింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ దృష్ట్యా నిబంధనల్ని ఉల్లంఘించిన భవనాలపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఉందని తీర్పు వెలువరించింది.