జయ ఆరోగ్యంపై ట్రాఫిక్ రామస్వామి పిటిషన్
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై తక్షణమే ప్రకటన చేయాలంటూ సోమవారం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జయ ఆరోగ్య పరిస్థితిపై తక్షణమే అపోలో ఆస్పత్రి నివేదిక సమర్పించేలా ఆదేశాలివ్వాలంటూ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి ఈ పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడు వాసులకు ట్రాఫిక్ రామస్వామి సుపరిచితమే. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వెలిసే బోర్డులు, ఫ్లెక్సీలు తదితర ప్రచార సాధనలను తొలగించడం ద్వారా రాష్ట్రంలో ఆయన బహుళ ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే.
ఇప్పటికే జయలలిత ఆరోగ్యంపై వివరాలు తెలియటం లేదంటూ తమిళనాడుకు చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది ఒకరు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి ఎవరూ బయటకు వెల్లడించడంలేదని న్యాయవాది రీగన్ ఎస్. బెల్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో 356వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని, సీఎం ఆరోగ్యంపై గవర్నర్ నుంచి నివేదిక తెప్పించుకోవాలని కోరారు.
జ్వరంతో పాటు డీహైడ్రేషన్తో సెప్టెంబర్ 22న జయలలిత ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే మూడు, నాలుగు రోజులుగా ఆమె ఆరోగ్యంపై పెద్ద ఎత్తున వదంతులు ఏర్పడటంతో, అన్నాడీఎంకే కార్యకర్తలు,అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే జయలలిత ఆరోగ్యం మెరుగుపడిందని, ఆమె కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని ఓ సీనియర్ జర్నలిస్ట్ ట్విట్ చేశారు.