Jayalalitha health
-
తెరపైకి జయ ‘ఆసుపత్రి’ వీడియో
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత (అమ్మ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి వీడియో అనూహ్యంగా బుధవారం తెరపైకి వచ్చింది. చెన్నైలోని ఆర్కే నగర్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగడానికి ఒక్కరోజు ముందు ఈ వీడియో విడుదల కావడం గమనార్హం. అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ వర్గానికి చెందిన, శాసనసభలో అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యే వెట్రివేల్ ఈ వీడియో విడుదల చేశారు. 20 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో జయలలిత ఆసుపత్రిలో బెడ్‌పై కూర్చొని ఎనర్జీ డ్రింక్ సేవిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో నిజమైనదేనని అపోలో ఆసుపత్రి వర్గాలు కూడా ధ్రువీకరించాయి. పోలింగ్‌కు ఒక్కరోజు ముందు వీడియో విడుదల చేయడంపై ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్రంగా స్పందించింది. ఈసీ ఫిర్యాదు మేరకు వెట్రివేల్‌పై కేసు నమోదైంది. జయ వీడియో దృశ్యాలను ప్రసారం చేయకూడదని టీవీ చానళ్లను కూడా ఈసీ ఆదేశించింది. ఉపఎన్నికను రద్దు చేయనున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల్లో లబ్ధి కోసమే! అనారోగ్యానికి గురైన జయలలిత గత ఏడాది సెప్టెంబర్‌లో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ దాదాపు 75 రోజుల అనంతరం అక్కడే మరణించడం తెలిసిందే. అమ్మకు చికిత్స అందిస్తున్న ఫొటోలు, వీడియోలు విడుదల చేయాలని అప్పట్లో కార్యకర్తలు, అమ్మ అభిమానులు ఎంత డిమాండ్ చేసినా ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు. ఇప్పుడు ఆమె ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ నియోజకవర్గం ఉపఎన్నికకు గురువారం పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలో పోటీచేస్తున్న శశికళ అక్క కొడుకు దినకరన్ తన విజయం కోసమే కుట్రపన్ని జయ వీడియోను తాజాగా విడుదల చేయించారని అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే నేతలు ఆరోపించారు. అమ్మను అగౌరవ పరిచేందుకు దినకరన్ వర్గం వారు ప్రయత్నిస్తున్నారనీ, ఈ వీడియోను విచారణ కమిషన్‌కు ఎందుకు అందించలేదని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ప్రశ్నించారు. మరోవైపు ఈ వీడియోను సొంతంగా తానే విడుదల చేశాననీ, తర్వాత దినకరన్ కూడా ఇలా ఎందుకు చేశావని తనను అడిగారని వెట్రివేల్ చెబుతున్నారు. జయ మరణంపై విచారణ జరిపేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటవడం తెలిసిందే. ఈ కమిషన్ కూడా వెట్రివేల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొత్తగా శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకే వెట్రివేల్ ఈ వీడియోను ఉద్దేశపూర్వకంగా విడుదల చేశారనీ, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషన్ కోరింది. వీడియో విడుదల చేస్తున్న వెట్రివేల్ నేడే పోలింగ్: ఆర్కే నగర్ ఉప ఎన్నికకు గురువారం పోలింగ్ జరగనుంది. మొత్తం 59 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సహజంగా తమిళనాడులో ఏ ఎన్నికలు వచ్చినా ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే ఉంటుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే బహిష్కృతనేత దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగడంతో త్రిముఖ పోరు నెలకొంది. 258 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభ¶మై సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. -
‘అమ్మ’ ఆరోగ్యంపై అన్నీ అబద్ధాలే
సాక్షి ప్రతినిధి, చెన్నై: శశికళకు భయపడి దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి ఏఐఏడీఎంకే నాయకులు అబద్ధాలు చెప్పారని తమిళనాడు మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జయ కోలుకుంటున్నారని ప్రజలను నమ్మించడానికే అలా చేయాల్సి వచ్చిందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జయను కలుసుకోవడానికి ఎవరినీ అనుమతించలేదని, కలుసుకోవాలని వచ్చిన వారికి జయ బాగానే ఉన్నారని చెప్పి శశికళ బంధువులు పంపించేవారన్నారు. అబద్ధాలు చెప్పినందుకు క్షమించాలని వేడుకున్నారు. మదురైలో శుక్రవారం ఓ సభలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘దయచేసి నన్ను క్షమించండి. అమ్మ ఇడ్లీ, సాంబార్, చట్నీ తింటున్నారని అబద్ధాలు చెప్పాం. ఆమె ఇడ్లీ తింటుండగా, టీ తాగుతుండగా మేమెవరం చూడలేదు. అవి కట్టుకథలు. జయతో పలువురు నాయకులు సమావేశమయ్యారని, ఆమె కోలుకుంటున్నారని చెప్పినవన్నీ అబద్ధం. పార్టీ రహస్యాలు బయటికి రాకూడదనే అబద్ధాలు చెప్పాం’ అని అన్నారు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లోనే శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించాల్సి వచ్చిందని వెల్లడించారు. జయ చికిత్స వీడియో ఉంది: శ్రీనివాసన్ వ్యాఖ్యలపై శశికళ మేనల్లుడు దినకరన్ స్పందించారు. ఆసుపత్రిలో జయ చికిత్స పొందుతున్నప్పటి వీడియో ఫుటేజీ ఉందని, దాన్ని తగిన సమయంలో బయటపెడతామన్నారు.‘ అపోలో ఆసుపత్రిలో జయకు చికిత్స చేయడానికి ఎయిమ్స్ నుంచి వైద్యులు వచ్చారు.జయను చూడటానికి శశికళను అనుమతించలేదు. మేము దేనికి భయపడం. శశికళ అనుమతి లేకుండా జయ చికిత్సకు సంబంధించిన ఫుటేజీని విడుదల చేయలేం. సీబీఐ లేదా జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తే దాన్ని తగిన సమయంలో బహిర్గతం చేస్తాం’ అని దినకరన్ అన్నారు. -
జయలలిత ఆరోగ్యం పై చర్చ
-
రాజకీయాల కోసం పిటిషన్లు వేయొద్దు : హైకోర్టు
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ప్రముఖ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి సీఎం ఆరోగ్యంపై గురువారం రెండో పిటిషన్‌ను వేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. రెండు నిమిషాల్లోనే వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌ను ప్రచారం కోసం వేసిన ప్రజాప్రయోజనవ్యాజ్యంగా కోర్టు పేర్కొంది. రాజకీయాల కోసం పిటిషన్లు వేయొద్దని హైకోర్టు హితవు పలికింది. జయలలిత ఆరోగ్యంపై తక్షణమే ప్రకటన చేయాలంటూ ట్రాఫిక్ రామస్వామి గత సోమవారం ఓ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
జయ ఆరోగ్యంపై ట్రాఫిక్ రామస్వామి పిటిషన్
-
జయ ఆరోగ్యంపై ట్రాఫిక్ రామస్వామి పిటిషన్
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై తక్షణమే ప్రకటన చేయాలంటూ సోమవారం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జయ ఆరోగ్య పరిస్థితిపై తక్షణమే అపోలో ఆస్పత్రి నివేదిక సమర్పించేలా ఆదేశాలివ్వాలంటూ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి ఈ పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడు వాసులకు ట్రాఫిక్ రామస్వామి సుపరిచితమే. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వెలిసే బోర్డులు, ఫ్లెక్సీలు తదితర ప్రచార సాధనలను తొలగించడం ద్వారా రాష్ట్రంలో ఆయన బహుళ ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. ఇప్పటికే జయలలిత ఆరోగ్యంపై వివరాలు తెలియటం లేదంటూ తమిళనాడుకు చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది ఒకరు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి ఎవరూ బయటకు వెల్లడించడంలేదని న్యాయవాది రీగన్ ఎస్. బెల్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో 356వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని, సీఎం ఆరోగ్యంపై గవర్నర్ నుంచి నివేదిక తెప్పించుకోవాలని కోరారు. జ్వరంతో పాటు డీహైడ్రేషన్‌తో సెప్టెంబర్ 22న జయలలిత ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే మూడు, నాలుగు రోజులుగా ఆమె ఆరోగ్యంపై పెద్ద ఎత్తున వదంతులు ఏర్పడటంతో, అన్నాడీఎంకే కార్యకర్తలు,అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే జయలలిత ఆరోగ్యం మెరుగుపడిందని, ఆమె కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని ఓ సీనియర్ జర్నలిస్ట్ ట్విట్ చేశారు.