
అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్సపొందుతున్న వీడియో దృశ్యం(ఫైల్)
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత (అమ్మ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి వీడియో అనూహ్యంగా బుధవారం తెరపైకి వచ్చింది. చెన్నైలోని ఆర్కే నగర్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగడానికి ఒక్కరోజు ముందు ఈ వీడియో విడుదల కావడం గమనార్హం. అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ వర్గానికి చెందిన, శాసనసభలో అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యే వెట్రివేల్ ఈ వీడియో విడుదల చేశారు.
20 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో జయలలిత ఆసుపత్రిలో బెడ్‌పై కూర్చొని ఎనర్జీ డ్రింక్ సేవిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో నిజమైనదేనని అపోలో ఆసుపత్రి వర్గాలు కూడా ధ్రువీకరించాయి. పోలింగ్‌కు ఒక్కరోజు ముందు వీడియో విడుదల చేయడంపై ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్రంగా స్పందించింది. ఈసీ ఫిర్యాదు మేరకు వెట్రివేల్‌పై కేసు నమోదైంది. జయ వీడియో దృశ్యాలను ప్రసారం చేయకూడదని టీవీ చానళ్లను కూడా ఈసీ ఆదేశించింది. ఉపఎన్నికను రద్దు చేయనున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఈసీ స్పష్టం చేసింది.
ఎన్నికల్లో లబ్ధి కోసమే!
అనారోగ్యానికి గురైన జయలలిత గత ఏడాది సెప్టెంబర్‌లో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ దాదాపు 75 రోజుల అనంతరం అక్కడే మరణించడం తెలిసిందే. అమ్మకు చికిత్స అందిస్తున్న ఫొటోలు, వీడియోలు విడుదల చేయాలని అప్పట్లో కార్యకర్తలు, అమ్మ అభిమానులు ఎంత డిమాండ్ చేసినా ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు. ఇప్పుడు ఆమె ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ నియోజకవర్గం ఉపఎన్నికకు గురువారం పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలో పోటీచేస్తున్న శశికళ అక్క కొడుకు దినకరన్ తన విజయం కోసమే కుట్రపన్ని జయ వీడియోను తాజాగా విడుదల చేయించారని అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే నేతలు ఆరోపించారు.
అమ్మను అగౌరవ పరిచేందుకు దినకరన్ వర్గం వారు ప్రయత్నిస్తున్నారనీ, ఈ వీడియోను విచారణ కమిషన్‌కు ఎందుకు అందించలేదని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ప్రశ్నించారు. మరోవైపు ఈ వీడియోను సొంతంగా తానే విడుదల చేశాననీ, తర్వాత దినకరన్ కూడా ఇలా ఎందుకు చేశావని తనను అడిగారని వెట్రివేల్ చెబుతున్నారు. జయ మరణంపై విచారణ జరిపేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటవడం తెలిసిందే. ఈ కమిషన్ కూడా వెట్రివేల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొత్తగా శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకే వెట్రివేల్ ఈ వీడియోను ఉద్దేశపూర్వకంగా విడుదల చేశారనీ, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషన్ కోరింది.
వీడియో విడుదల చేస్తున్న వెట్రివేల్
నేడే పోలింగ్: ఆర్కే నగర్ ఉప ఎన్నికకు గురువారం పోలింగ్ జరగనుంది. మొత్తం 59 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సహజంగా తమిళనాడులో ఏ ఎన్నికలు వచ్చినా ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే ఉంటుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే బహిష్కృతనేత దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగడంతో త్రిముఖ పోరు నెలకొంది. 258 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభ¶మై సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment