సాక్షి ప్రతినిధి, చెన్నై: శశికళకు భయపడి దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి ఏఐఏడీఎంకే నాయకులు అబద్ధాలు చెప్పారని తమిళనాడు మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జయ కోలుకుంటున్నారని ప్రజలను నమ్మించడానికే అలా చేయాల్సి వచ్చిందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జయను కలుసుకోవడానికి ఎవరినీ అనుమతించలేదని, కలుసుకోవాలని వచ్చిన వారికి జయ బాగానే ఉన్నారని చెప్పి శశికళ బంధువులు పంపించేవారన్నారు.
అబద్ధాలు చెప్పినందుకు క్షమించాలని వేడుకున్నారు. మదురైలో శుక్రవారం ఓ సభలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘దయచేసి నన్ను క్షమించండి. అమ్మ ఇడ్లీ, సాంబార్, చట్నీ తింటున్నారని అబద్ధాలు చెప్పాం. ఆమె ఇడ్లీ తింటుండగా, టీ తాగుతుండగా మేమెవరం చూడలేదు. అవి కట్టుకథలు. జయతో పలువురు నాయకులు సమావేశమయ్యారని, ఆమె కోలుకుంటున్నారని చెప్పినవన్నీ అబద్ధం. పార్టీ రహస్యాలు బయటికి రాకూడదనే అబద్ధాలు చెప్పాం’ అని అన్నారు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లోనే శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించాల్సి వచ్చిందని వెల్లడించారు.
జయ చికిత్స వీడియో ఉంది:
శ్రీనివాసన్ వ్యాఖ్యలపై శశికళ మేనల్లుడు దినకరన్ స్పందించారు. ఆసుపత్రిలో జయ చికిత్స పొందుతున్నప్పటి వీడియో ఫుటేజీ ఉందని, దాన్ని తగిన సమయంలో బయటపెడతామన్నారు.‘ అపోలో ఆసుపత్రిలో జయకు చికిత్స చేయడానికి ఎయిమ్స్ నుంచి వైద్యులు వచ్చారు.జయను చూడటానికి శశికళను అనుమతించలేదు. మేము దేనికి భయపడం. శశికళ అనుమతి లేకుండా జయ చికిత్సకు సంబంధించిన ఫుటేజీని విడుదల చేయలేం. సీబీఐ లేదా జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తే దాన్ని తగిన సమయంలో బహిర్గతం చేస్తాం’ అని దినకరన్ అన్నారు.