dindugal Srinivasan
-
హాట్ టాపిక్‌గా మారిన ‘చిన్నతంబి’
సాక్షి, చెన్నై: కోయంబత్తూరులో కొన్ని నెలలుగా ఒంటరి అటవీ ఏనుగు సంచరిస్తోంది. ఈ ఏనుగు ప్రజలపై దాడి చేయడం లేదు. కేవలం పంట పొలాల్లోకి వెళ్లి అక్కడున్న పంటను మేసేస్తోంది. దీంతో అన్నదాతలకు నష్టాలు, కష్టాలు తప్పడం లేదు. ఈ ఏనుగుకు చిన్నతంబి అన్న పేరు కూడా పెట్టేశారు. ఆపరేషన్ చిన్నతంబి అంటూ వీరోచితంగా శ్రమించి ఎట్టకేలకు గత నెలాఖరులో పట్టుకున్నారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మరీ ఈ చిన్నతంబిని పట్టుకోవడమే కాదు టాప్ సిలిప్ అడవుల్లోకి తీసుకెళ్లి వదలిపెట్టారు. చిన్నతంబిని పట్టుకునే సమయంలో దాని దంతాలు విరిగి పోవడం, కుంకీ ఏనుగుల దాడిలో గాయపడడం అన్నదాతల్నే కంట తడి పెట్టించింది. ఎట్టకేలకు చిన్నతంబి బెడద తీరిందని ఆనందం వ్యక్తం చేసిన వాళ్లు ఎక్కువే. అయితే, మూడు రోజుల్లో ఈ చిన్నతంబి వంద కి.మీ దూరం పయనించి తిరుప్పూర్‌లో ప్రత్యక్షం కావడం అటవీ అధికారుల్నే కాదు, అన్నదాతల్ని విస్మయంలో పడేసింది. మళ్లీ చిన్నతంబి తన పనితనాన్ని ప్రదర్శించడం మొదలెట్టాడు. ప్రస్తుతం తిరుప్పూర్ పరిసరాల్లో మకాం వేసిన చిన్నతంబి పంటపొలాల్ని మేసేస్తూ వస్తున్నాడు. దీనిని పట్టుకునేందుకు కలీం, మారియప్పన్ అనే రెండు కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించారు. ఈ చిన్నతంబి అటవీ అధికారులకు చిక్కకుండా తప్పించుకు తిరిగే పనిలో పడింది. ఎలాగైనా చిన్నతంబిని పట్టుకుని తీరుతామన్న ధీమాతో అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్నతంబిని ఉద్దేశించి అటవీ మంత్రి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. కుంకీ తంబి: మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ తరచూ నెట్టిజన్లకు హాట్ టాఫిక్‌గా మారడం సహజంగా మారింది. ఏదో ఒక వ్యాఖ్య చేయడం నాలుక కరుచుకోవడం ఆయనకు పరిపాటిగామారింది. తాజాగా శనివారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో చిన్నతంబి గురించి చెప్పుకొచ్చాడు. వంద కి.మీ దూరం శరవేగంగా దూసుకొచ్చిన ఈ ఏనుగు, ప్రజలపై మాత్రం దాడి చేయడం లేదని ఇది కాస్త ఊరటేనని వ్యాఖ్యానించారు. ఈ చిన్నతంబిని కుంకీగా మారేస్తే మంచిదని, అందుకు తగ్గ చర్యలు చేపట్టాలని అటవీ అధికారుల్ని ఆదేశించబోతున్నట్టు వివరించారు. చిన్నతంబిపై ప్రత్యేక పరిశోధన సాగబోతున్నదని, కుంకీగా ఎలా మార్చాలో అన్న పరిశోధన అని చెప్పుకొచ్చిన ఈ మంత్రి, కేంద్ర బడ్జెట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అదే సమయంలో బడ్జెట్‌ను వాజ్‌పేయ్ బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ప్రవేశ పెట్టడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించి నెట్టిజన్లకు చిక్కారు. అటవీ ఏనుగును కుంకీగా మారుస్తామని, ఇందుకు సైంటిస్టులను రప్పించబోతున్నట్టు, పరిశోధనలు జరపబోతున్నట్టుగా, వ్యాఖ్యలు ఎక్కడి నుంచి కనిపెడుతున్నారు మంత్రి వర్య అని వ్యంగ్యాస్త్రాలు, చమత్కారాలు సంధించే నెట్టిజన్లు పెరిగారు. చిన్నతంబిని కుంకీగా మార్చేందుకు వ్యతిరేకత బయలుదేరింది. ఆందోళనలు సైతం ఆదివారం చోటుచేసుకున్నాయి. సినీ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ పేర్కొంటూ, చిన్నతంబిని కుంకీగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, పీయూష్ గోయల్ బడ్జెట్‌ను దాఖలు చేస్తే, ఈలోకంలో లేని వాజ్పేయ్న్ను ఎలా రప్పించావంటూ వ్యాఖ్యల తూటాల్ని పేల్చే పనిలో పడ్డారు. దీంతో మేల్కొన్న మంత్రి నెట్టిజన్ల నోరు మూయించేందుకు ఆదివారం ఉదయాన్నే మీడియా ముందుకు వచ్చారు. కుంకీగా మార్చాలన్న పరిశీలన మాత్రమేనని వ్యాఖ్యానంచారు. తాను చేసిన వ్యాఖ్యలపై పునర్ పరిశీలనకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఆ ఏనుగుకు శిక్షణ ఇవ్వడంలో తప్పేముందంటూ, వ్యతిరేకిస్తున్న వాళ్లు ఎక్కువే కాబట్టి...కుంకీ నిర్ణయంపై పునఃపరిశీలన చేస్తామని ప్రకటించారు -
‘అమ్మ’ ఆరోగ్యంపై అన్నీ అబద్ధాలే
సాక్షి ప్రతినిధి, చెన్నై: శశికళకు భయపడి దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి ఏఐఏడీఎంకే నాయకులు అబద్ధాలు చెప్పారని తమిళనాడు మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జయ కోలుకుంటున్నారని ప్రజలను నమ్మించడానికే అలా చేయాల్సి వచ్చిందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జయను కలుసుకోవడానికి ఎవరినీ అనుమతించలేదని, కలుసుకోవాలని వచ్చిన వారికి జయ బాగానే ఉన్నారని చెప్పి శశికళ బంధువులు పంపించేవారన్నారు. అబద్ధాలు చెప్పినందుకు క్షమించాలని వేడుకున్నారు. మదురైలో శుక్రవారం ఓ సభలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘దయచేసి నన్ను క్షమించండి. అమ్మ ఇడ్లీ, సాంబార్, చట్నీ తింటున్నారని అబద్ధాలు చెప్పాం. ఆమె ఇడ్లీ తింటుండగా, టీ తాగుతుండగా మేమెవరం చూడలేదు. అవి కట్టుకథలు. జయతో పలువురు నాయకులు సమావేశమయ్యారని, ఆమె కోలుకుంటున్నారని చెప్పినవన్నీ అబద్ధం. పార్టీ రహస్యాలు బయటికి రాకూడదనే అబద్ధాలు చెప్పాం’ అని అన్నారు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లోనే శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించాల్సి వచ్చిందని వెల్లడించారు. జయ చికిత్స వీడియో ఉంది: శ్రీనివాసన్ వ్యాఖ్యలపై శశికళ మేనల్లుడు దినకరన్ స్పందించారు. ఆసుపత్రిలో జయ చికిత్స పొందుతున్నప్పటి వీడియో ఫుటేజీ ఉందని, దాన్ని తగిన సమయంలో బయటపెడతామన్నారు.‘ అపోలో ఆసుపత్రిలో జయకు చికిత్స చేయడానికి ఎయిమ్స్ నుంచి వైద్యులు వచ్చారు.జయను చూడటానికి శశికళను అనుమతించలేదు. మేము దేనికి భయపడం. శశికళ అనుమతి లేకుండా జయ చికిత్సకు సంబంధించిన ఫుటేజీని విడుదల చేయలేం. సీబీఐ లేదా జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తే దాన్ని తగిన సమయంలో బహిర్గతం చేస్తాం’ అని దినకరన్ అన్నారు. -
కచ్చదీవుల రచ్చ
► సభలో వాగ్వాదం ► పిచ్చుకల పరిరక్షణపై చర్చ సాక్షి, చెన్నై: కచ్చదీవుల ధారాదత్తం అంశం మళ్లీ అసెంబ్లీ ముందుకు వచ్చింది. ఆ దీవుల స్వాధీనం లక్ష్యంగా తామంటే, తాము చర్యలు తీసుకున్నామని అధికార, ప్రతిపక్ష సభ్యులు వా గ్యుద్ధానికి దిగారు. అంతరిస్తున్న పిచ్చుకల పరిరక్షణకు పరిశీలన జరిపేందుకు మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఓ తీర్మానం తీసుకొచ్చి చర్చకు పట్టుబట్టారు. ఇందుకు స్పీకర్ ధనపాల్ అనుమతి ఇచ్చారు. తమిళ జాలర్ల మీద సాగుతున్న దాడులు, గత వారం జరిగిన కాల్పులను గుర్తు చేశారు. వీటికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని వివరిస్తూ కచ్చదీవుల స్వాధీనం లక్ష్యంగా చర్యలు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని స్టాలిన్ నిలదీశారు. దీంతో ఆర్థిక, మత్స్య శాఖ మంత్రి జయకుమార్ జోక్యం చేసుకుని, ఆ దీవుల్ని ధారాదత్తం చేసిందెవరోనన్నది జగమెరిగిన సత్యం అని ఎదురు దాడికి దిగడంతో సభలో కాసేపు గందగరోళం నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకే సభ్యులు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో బుజ్జగించడం స్పీకర్‌కు తలకు మించిన భారంగా మారింది. స్టాలిన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కచ్చదీవులను ధారాదత్తం చేస్తున్న సమయంలో తమ అధ్యక్షుడు, అప్పటి సీఎం కరుణానిధి తీవ్రంగా వ్యతిరేకించిన విషయాలను ఆధారాలతో సహా సభ ముందు ఉంచారు. కచ్చదీవుల స్వాధీనం లక్ష్యంగా డీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడల్లా తీసుకున్న చర్యలను ఆధారాలతో వివరించారు. ఇవన్నీ ప్రజల్ని మభ్య పెట్టేందుకు సాగిన ఆధారాలేనంటూ మంత్రితోపాటుగా అన్నాడీఎంకే సభ్యులు విమర్శలు ఎక్కుపెట్టడంతో మళ్లీ సభలో గందరగోళం తప్పలేదు. చివరకు స్పీకర్ ఇరువర్గాల్ని బుజ్జగింప చేసి, కాసేపు స్టాలిన్ కు తదుపరి మంత్రికి మాట్లాడే అవకాశం కల్పించారు. జాలర్ల సంక్షేమం, కచ్చదీవుల స్వాధీనం లక్ష్యంగా తామంటే, తామే చర్యలు తీసుకున్నామన్నట్టు ఈ ప్రసంగాలు సాగాయి. తదుపరి ఇటీవల కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలియజేస్తూ తీర్మానం తీసుకొచ్చి సభను మంగళవారానికి స్పీకర్ వాయిదా వేశారు. ముందుగా ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే సభ్యుడు తంగం తెన్నరసు ఓ ప్రశ్నను సంధించగా, అందరూ ఆహ్వానించారు. సోమవారం పిచ్చుకల దినోత్సవం అని గుర్తు చేస్తూ, అంతరించి పోతున్న వాటిని పరిరక్షించేందుకు ఏదేని కార్యాచరణ సిద్ధం చేస్తారా? అని ఆయన సంధించిన ప్రశ్నకు తొలుత అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ సమాధానం ఇవ్వలేదు. మళ్లీ అదే ప్రశ్నను సంధించగా, పరిశీలిస్తామని, తప్పకుండా చర్యలు తీసుకుందామని హామీ ఇచ్చారు. అలాగే పళ్లికరణైలో పక్షుల శరణాలయం విస్తరణకు తగ్గ ప్రశ్నకు మంత్రి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యల్ని ఎత్తి చూపుతూ స్టాలిన్ సంధించిన ప్రశ్నకు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ స్పందిస్తూ, పరిశీలించి, త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.