కచ్చదీవుల రచ్చ
► సభలో వాగ్వాదం
► పిచ్చుకల పరిరక్షణపై చర్చ
సాక్షి, చెన్నై: కచ్చదీవుల ధారాదత్తం అంశం మళ్లీ అసెంబ్లీ ముందుకు వచ్చింది. ఆ దీవుల స్వాధీనం లక్ష్యంగా తామంటే, తాము చర్యలు తీసుకున్నామని అధికార, ప్రతిపక్ష సభ్యులు వా గ్యుద్ధానికి దిగారు. అంతరిస్తున్న పిచ్చుకల పరిరక్షణకు పరిశీలన జరిపేందుకు మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఓ తీర్మానం తీసుకొచ్చి చర్చకు పట్టుబట్టారు. ఇందుకు స్పీకర్ ధనపాల్ అనుమతి ఇచ్చారు.
తమిళ జాలర్ల మీద సాగుతున్న దాడులు, గత వారం జరిగిన కాల్పులను గుర్తు చేశారు. వీటికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని వివరిస్తూ కచ్చదీవుల స్వాధీనం లక్ష్యంగా చర్యలు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని స్టాలిన్ నిలదీశారు. దీంతో ఆర్థిక, మత్స్య శాఖ మంత్రి జయకుమార్ జోక్యం చేసుకుని, ఆ దీవుల్ని ధారాదత్తం చేసిందెవరోనన్నది జగమెరిగిన సత్యం అని ఎదురు దాడికి దిగడంతో సభలో కాసేపు గందగరోళం నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకే సభ్యులు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో బుజ్జగించడం స్పీకర్‌కు తలకు మించిన భారంగా మారింది.
స్టాలిన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కచ్చదీవులను ధారాదత్తం చేస్తున్న సమయంలో తమ అధ్యక్షుడు, అప్పటి సీఎం కరుణానిధి తీవ్రంగా వ్యతిరేకించిన విషయాలను ఆధారాలతో సహా సభ ముందు ఉంచారు. కచ్చదీవుల స్వాధీనం లక్ష్యంగా డీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడల్లా తీసుకున్న చర్యలను ఆధారాలతో వివరించారు. ఇవన్నీ ప్రజల్ని మభ్య పెట్టేందుకు సాగిన ఆధారాలేనంటూ మంత్రితోపాటుగా అన్నాడీఎంకే సభ్యులు విమర్శలు ఎక్కుపెట్టడంతో మళ్లీ సభలో గందరగోళం తప్పలేదు. చివరకు స్పీకర్ ఇరువర్గాల్ని బుజ్జగింప చేసి, కాసేపు స్టాలిన్ కు తదుపరి మంత్రికి మాట్లాడే అవకాశం కల్పించారు.
జాలర్ల సంక్షేమం, కచ్చదీవుల స్వాధీనం లక్ష్యంగా తామంటే, తామే చర్యలు తీసుకున్నామన్నట్టు ఈ ప్రసంగాలు సాగాయి. తదుపరి ఇటీవల కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలియజేస్తూ తీర్మానం తీసుకొచ్చి సభను మంగళవారానికి స్పీకర్ వాయిదా వేశారు. ముందుగా ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే సభ్యుడు తంగం తెన్నరసు ఓ ప్రశ్నను సంధించగా, అందరూ ఆహ్వానించారు. సోమవారం పిచ్చుకల దినోత్సవం అని గుర్తు చేస్తూ, అంతరించి పోతున్న వాటిని పరిరక్షించేందుకు ఏదేని కార్యాచరణ సిద్ధం చేస్తారా? అని ఆయన సంధించిన ప్రశ్నకు తొలుత అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ సమాధానం ఇవ్వలేదు.
మళ్లీ అదే ప్రశ్నను సంధించగా, పరిశీలిస్తామని, తప్పకుండా చర్యలు తీసుకుందామని హామీ ఇచ్చారు. అలాగే పళ్లికరణైలో పక్షుల శరణాలయం విస్తరణకు తగ్గ ప్రశ్నకు మంత్రి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యల్ని ఎత్తి చూపుతూ స్టాలిన్ సంధించిన ప్రశ్నకు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ స్పందిస్తూ, పరిశీలించి, త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.