Kaccha Islands
-
చిరుదీవిలో ఎన్నికల చేపలవేట
ఎన్నికలంటే సాధారణంగా ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం లాంటివి ప్రస్తావనకొస్తాయి. కానీ, మూడు రోజులుగా ఓ విదేశాంగ విధానం ప్రధానాంశమై కూర్చుంది. లోక్‌సభ ఎన్నికల తొలి దశలోనే తమిళనాట పోలింగ్ జరగనున్న వేళ ఆ రాష్ట్రానికి అతి సమీపంగా భారత – శ్రీలంకల మధ్యనున్న చిరుద్వీపం కచ్చతీవు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. స్టాలిన్ సారథ్యంలోని స్థానిక డీఎంకె ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాని, విదేశాంగ మంత్రి సహా సమస్త శక్తులనూ బీజేపీ కేంద్రీకరించినట్టు కనిపిస్తోంది. ఎన్నికల మాట అటుంచితే, భారత సర్కారే ఒకప్పుడు శ్రీలంకకు అప్పగించిన ఓ ద్వీపప్రాంత ప్రాదేశిక హక్కులపై ఇప్పుడు రగడ చేయడం సబబేనా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా సముద్ర జలాల సరిహద్దులు మార్చేసే ప్రయత్నాలు ఎక్కడికి దారి తీస్తాయి? భారత్ – శ్రీలంకల మధ్య పాక్ జలసంధిలో 1.6 కిలోమీటర్ల పొడవు, 300 మీటర్ల వెడల్పున్న చిన్న ప్రాంతం కచ్చతీవు. భారత్‌లోని రామేశ్వరానికి ఉత్తరాన 30 కి.మీ.ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు దక్షిణాన 60 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ద్వీపం వ్యూహాత్మకంగా కీలకమైనది. కచ్చతీవు చారిత్రకంగా జాఫ్నా రాజ్యంలో, ఆపైన రామ్నాడ్ సహా పలువురు రాజుల ఏలుబడిలో, బ్రిటీష్ వారి హయాంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తాగునీటితో సహా ప్రాథమిక వసతులేవీ లేని ఈ ప్రాంతంలో ఒకే ఒక్క చర్చి మినహా నివాసాలే లేవు. ఈ ద్వీపం తాలూకు ప్రాదేశిక హోదాపై భారత్, శ్రీలంకల మధ్య దీర్ఘకాలం వివాదం నెలకొంది. అయితే, 1974లో ఇరుదేశాలూ ఓ ఒప్పందానికి వచ్చి, సంతకాలు చేశాయి. శ్రీలంకతో పటిష్ఠ బంధానికై కేంద్రంలో ఇందిరా గాంధీ సారథ్యంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిరుద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించింది. ఇప్పుడు యాభై ఏళ్ళ తర్వాత మోదీ నేతృత్వంలోని బీజేపీ భారత సమైక్యతకు విఘాతం కలిగిస్తూ కాంగ్రెస్, డీఎంకెలు ‘నిర్లక్ష్యంగా’ ఆ ద్వీపాన్ని శ్రీలంకకు ధారాదత్తం చేసేశాయంటూ దాడికి దిగింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఇటీవల ‘సమాచార హక్కు’ పిటిషన్ ద్వారా ఇప్పటి దాకా బయటపడని ఈ ద్వీపం అప్పగింత వివరాలను తీసుకున్నారు. అవన్నీ మీడియాలో వచ్చాయి. దక్షిణాదిన, అందునా తమిళనాట బీజేపీ జెండా ఎగరేయాలని తరచూ పర్యటిస్తున్న ప్రధాని మోదీ దాన్ని అందిపుచ్చుకొన్నారు. ద్వీపం అప్పగింత తప్పుడు నిర్ణయమంటూ కాంగ్రెస్‌ను దుయ్య బట్టారు. విదేశాంగ మంత్రి జైశంకర్ స్వరం కలిపారు. సమీప శ్రీలంక జలాల్లో భారతీయ జాలర్లను పదే పదే అరెస్టు చేస్తున్నారంటే, అదంతా అప్పటి తప్పుడు నిర్ణయం ఫలితమేనని ఆయన ఆరోపణ. ఈ చిరుద్వీపానికి తన దృష్టిలో పెద్దగా ప్రాధాన్యం లేదని 1961 మేలోనే ప్రధాని నెహ్రూ అన్నారట. ద్వీపాన్ని అప్పగించినా చేపలు పట్టుకొనేందుకు భారతీయులకున్న హక్కుల్ని 1974 ఒప్పందంలో పరిరక్షిస్తున్నామంటూ పార్లమెంట్‌కు హామీ ఇచ్చిన నాటి సర్కార్ తీరా ఆ ప్రాంతంలో చేపలు పట్టే హక్కులను సైతం 1976లో వదులుకుందని జైశంకర్ నిందిస్తున్నారు. గత ప్రధానులు ఈ అంశంపై ఉదాసీనంగా ఉన్నా, భారత – శ్రీలంక సముద్రజలాల సరిహద్దు చట్టం అమలు, భారతీయ జాలర్ల హక్కులపై తమ సర్కార్ శ్రీలంకతో చర్చలు జరుపుతుందని ఆయన చెబుతున్నారు. గమ్మత్తేమిటంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులు గత పదేళ్ళుగా ఆ పని ఎందుకు చేయలేదో తెలీదు. అలాగే, ఆ ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకొనే పనిలో మోదీ సర్కార్ ఉన్నట్టు తమిళనాడు బీజేపీ చెబుతోంది కానీ, అసలు ఇప్పటి దాకా ఆ అంశంపై మోదీ సర్కార్ నుంచి అధికా రిక సమాచారమే లేదని శ్రీలంక మంత్రి ఒకరు తేల్చేశారు. మరి, కచ్చతీవు అంశాన్ని బీజేపీ ఉన్న ట్టుండి ఎందుకు లేవదీసినట్టు? లోక్‌సభ ఎన్నికల తొలి దశలో భాగంగా ఈ నెల 19న తమిళనాట పోలింగ్ జరగనుంది. ప్రాంతీయ, భాషాభిమానాలు మెండుగా ఉండే తమిళనాట చొచ్చుకుపోవడా నికి తంటాలు పడుతున్న బీజేపీ దీన్ని ఓ అస్త్రంగా భావించింది. కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఆ ద్వీపాన్ని ఇచ్చేస్తుంటే, అడ్డుకోని కరుణానిధి సారథ్యంలోని డీఎంకె సర్కార్‌దీ తప్పుందని బీజేపీ నిందిస్తోంది. తమిళ ఓటర్లలో సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందడమే దాని అజెండాగా కనిపిస్తోంది. నిజానికి, ఎవరు సలహా ఇచ్చారో కానీ ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేశాం. దీవి అప్పగింత విషయం అంతర్జాతీయ వ్యవహారం గనక అప్పట్లో కేంద్రం తమిళ సర్కార్‌కు సమాచారమిచ్చి ఉంటుందే తప్ప, సరేనన్న అనుమతి తీసుకొని ఉంటుందనుకోలేం. స్థానిక అనివార్యతల రీత్యా అప్పటి కరుణానిధి సర్కార్ నుంచి ఇప్పటి స్టాలిన్ సర్కార్ దాకా డీఎంకె ప్రభుత్వాలు శ్రీలంకతో ఒప్పందాన్ని నిరసిస్తూనే వచ్చాయి. చేపల వేటకు వెళ్ళే తమిళ జాలర్లు పదే పదే లంకేయుల చేతిలో అరెస్టవుతున్నారని చెబుతూనే ఉన్నాయి. ఆ మధ్య భారత – శ్రీలంక ప్రధానుల భేటీ ముందూ స్టాలిన్ ఈ సంగతి మోదీ దృష్టికి తెచ్చారు. అవేవీ పట్టించుకోని బీజేపీ ఎన్నికల ముందు ఈ అంశం పట్టుకోవడమే విడ్డూరం. ద్వైపాక్షిక బంధాలపై ప్రభావం చూపే సున్నితమైన అంశాన్ని ఎన్నికల లబ్ధి కోసం తలకెత్తుకోవడం ప్రమాదకరం. నేపాల్ లాంటి పొరుగుదేశాలతోనూ అపరిష్కృత ప్రాదేశిక వివాదాలున్న భారత్ గతాన్ని తవ్వితే తలనొప్పులే. శ్రీలంకలో జాతుల యుద్ధం ముగిశాక వాణిజ్యం, ఇంధన, రవాణా రంగాల్లో ఇరు దేశాలూ ముందుకు సాగుతున్నాయి. పాత చరిత్రను ఆశ్రయిస్తే కొత్త దౌత్య యత్నాలకు చిక్కులు తప్పవు. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక ప్రాంతంలో లంగరేయడానికి చైనా సిద్ధంగా ఉన్నవేళ కచ్చతీవు వివాదం అభిలషణీయం కానే కాదు. అయినా, మనమే వదులుకున్న ఈ దక్షిణాగ్ర ద్వీపంపై ఇంత ప్రేమ ప్రదర్శిస్తున్న పాలకులు ఉత్తరాన వేలాది చదరపు కిలోమీటర్లు చైనా ఆక్రమించుకున్నట్టు వార్తలున్నా ఉలకరేం? పలకరేం? -
కచ్చదీవుల రచ్చ
► సభలో వాగ్వాదం ► పిచ్చుకల పరిరక్షణపై చర్చ సాక్షి, చెన్నై: కచ్చదీవుల ధారాదత్తం అంశం మళ్లీ అసెంబ్లీ ముందుకు వచ్చింది. ఆ దీవుల స్వాధీనం లక్ష్యంగా తామంటే, తాము చర్యలు తీసుకున్నామని అధికార, ప్రతిపక్ష సభ్యులు వా గ్యుద్ధానికి దిగారు. అంతరిస్తున్న పిచ్చుకల పరిరక్షణకు పరిశీలన జరిపేందుకు మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఓ తీర్మానం తీసుకొచ్చి చర్చకు పట్టుబట్టారు. ఇందుకు స్పీకర్ ధనపాల్ అనుమతి ఇచ్చారు. తమిళ జాలర్ల మీద సాగుతున్న దాడులు, గత వారం జరిగిన కాల్పులను గుర్తు చేశారు. వీటికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని వివరిస్తూ కచ్చదీవుల స్వాధీనం లక్ష్యంగా చర్యలు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని స్టాలిన్ నిలదీశారు. దీంతో ఆర్థిక, మత్స్య శాఖ మంత్రి జయకుమార్ జోక్యం చేసుకుని, ఆ దీవుల్ని ధారాదత్తం చేసిందెవరోనన్నది జగమెరిగిన సత్యం అని ఎదురు దాడికి దిగడంతో సభలో కాసేపు గందగరోళం నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకే సభ్యులు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో బుజ్జగించడం స్పీకర్‌కు తలకు మించిన భారంగా మారింది. స్టాలిన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కచ్చదీవులను ధారాదత్తం చేస్తున్న సమయంలో తమ అధ్యక్షుడు, అప్పటి సీఎం కరుణానిధి తీవ్రంగా వ్యతిరేకించిన విషయాలను ఆధారాలతో సహా సభ ముందు ఉంచారు. కచ్చదీవుల స్వాధీనం లక్ష్యంగా డీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడల్లా తీసుకున్న చర్యలను ఆధారాలతో వివరించారు. ఇవన్నీ ప్రజల్ని మభ్య పెట్టేందుకు సాగిన ఆధారాలేనంటూ మంత్రితోపాటుగా అన్నాడీఎంకే సభ్యులు విమర్శలు ఎక్కుపెట్టడంతో మళ్లీ సభలో గందరగోళం తప్పలేదు. చివరకు స్పీకర్ ఇరువర్గాల్ని బుజ్జగింప చేసి, కాసేపు స్టాలిన్ కు తదుపరి మంత్రికి మాట్లాడే అవకాశం కల్పించారు. జాలర్ల సంక్షేమం, కచ్చదీవుల స్వాధీనం లక్ష్యంగా తామంటే, తామే చర్యలు తీసుకున్నామన్నట్టు ఈ ప్రసంగాలు సాగాయి. తదుపరి ఇటీవల కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలియజేస్తూ తీర్మానం తీసుకొచ్చి సభను మంగళవారానికి స్పీకర్ వాయిదా వేశారు. ముందుగా ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే సభ్యుడు తంగం తెన్నరసు ఓ ప్రశ్నను సంధించగా, అందరూ ఆహ్వానించారు. సోమవారం పిచ్చుకల దినోత్సవం అని గుర్తు చేస్తూ, అంతరించి పోతున్న వాటిని పరిరక్షించేందుకు ఏదేని కార్యాచరణ సిద్ధం చేస్తారా? అని ఆయన సంధించిన ప్రశ్నకు తొలుత అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ సమాధానం ఇవ్వలేదు. మళ్లీ అదే ప్రశ్నను సంధించగా, పరిశీలిస్తామని, తప్పకుండా చర్యలు తీసుకుందామని హామీ ఇచ్చారు. అలాగే పళ్లికరణైలో పక్షుల శరణాలయం విస్తరణకు తగ్గ ప్రశ్నకు మంత్రి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యల్ని ఎత్తి చూపుతూ స్టాలిన్ సంధించిన ప్రశ్నకు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ స్పందిస్తూ, పరిశీలించి, త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
కచ్చదీవులే లక్ష్యం
► వేటకు పట్టు ► ఢిల్లీకి ప్రతినిధుల పయనం ► నేడు శ్రీలంకతో భేటీ ► అధికారులతో మంత్రి సమీక్ష కచ్చదీవుల్లో చేపల వేటకు అనుమతి లక్ష్యంగా కేంద్రంతో పాటు, శ్రీలంకపై ఒత్తిడికి తమిళ జాలర్లు సిద్ధమయ్యారు. నాలుగో విడత చర్చల నిమిత్తం ఢిల్లీకి మంగళవారం పయనమయ్యారు. భారత దేశ రాజధాని నగరం వేదికగా బుధవారం శ్రీలంక, తమిళ జాలర్లు ఒక చోట సమావేశం కానున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లను కేంద్ర అధికార వర్గాలు పూర్తి చేశాయి. సాక్షి, చెన్నై : తమిళ జాలర్ల మీద కడలిలో శ్రీలంక సేనల వీరంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు దేశాల జాలర్లను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు తగ్గ ప్రయత్నాలు ఏళ్ల తరబడి సాగుతున్నా చర్చలు మాత్రం కొలిక్కి రావడం లేదు. ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చర్చలను కొలిక్కి తెచ్చేందుకు తగ్గ ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా భారత్‌లో పర్యటించి తమిళ జాలర్లతో చర్చలకు శ్రీలంక జాలర్ల ప్రతి నిధుల బృందం, అక్కడి మత్స్యశాఖ అధికారులతో కూడిన కమిటీ ముందుకు వచ్చింది. శ్రీలంక మత్స్యశాఖ ఉన్నతాధికారులతో కూడిన ప్రతి నిధులు బుధవారం ఢిల్లీలో అడుగు పెట్టనున్నారు. అక్కడే తమిళ జాలర్లతో సంప్రదింపులకు వేదికను సిద్ధం చేశారు. ఇక, తమిళ జాలర్ల ప్రతినిధుల్ని ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. వీరితో పాటు మత్స్యశాఖ కార్యదర్శి గగన్ దీప్‌సింగ్ నేతృత్వంలో అధికారుల బృందం మంగళవారం రాత్రి ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. కచ్చదీవులే లక్ష్యం : తమిళనాడు జాలర్ల ప్రతినిధులుగా పన్నెండు మంది ఢిల్లీ వెళ్లారు. వీరిలో రామనాథపురానికి చెందిన దేవదాసు, జేసురాజ్, అరులానందం, రాయప్పన్, నాగపట్నంకు చెందిన వీరముత్తు, జగన్నాథన్, చిత్ర వేల్, శివజ్ఞానం, పుదుకోటైకు చెందిన కుడియప్పన్, రామకృష్ణన్, తంజావూరుకు చెందిన రాజమాణ్యం ఉన్నారు. ముందుగా ఈ ప్రతినిధుల బృందం మత్స్య శాఖ కార్యదర్శి గగన్ దీప్ సింగ్‌తో భేటీ అయ్యారు. బుధవారం శ్రీలంకతో చర్చించాల్సిన అంశాలపై సమీక్షించారు. శ్రీలంక జాలర్లు గతంలో తమకు సూచించిన కొన్ని రకాల వలల ఉపయోగంపై పరిశీలన జరిపారు. ప్రధానంగా కచ్చదీవుల స్వాధీనం విషయంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, అలాగే, ఆ దీవుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపల వేటకు అనుమతి లభించే విధంగా, భద్రతకు పూర్తి భరోసా దక్కే రీతిలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. తదుపరి మత్స్య శాఖ మంత్రి డి.జయకుమార్తో గగన్ దీప్ సింగ్‌తో పాటుగా మత్స్యశాఖ కమిషనర్ పీలా రాజేష్, తదితర అధికార వర్గాలు సమాలోచించారు. కచ్చదీవుల స్వాధీనం గురించి తమిళ అసెంబ్లీలో ఇది వరకు చేసిన తీర్మానాలను ఢిల్లీ వేదికగా సాగనున్న చర్చల ముందు ఉంచేందుకు తగ్గ కార్యాచరణతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇక, ఐదో తేదీన రెండు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు, మత్స్యశాఖ అధికారులు భేటీ కానున్నారు. ఈ భేటీ మేరకు తదుపరి నిర్ణయాలు ప్రకటించే అవకాశాలు ఉన్నారుు. కాగా, ఓ వైపు చర్చలకు సర్వం సిద్ధం చేసి ఉంటే, మరో వైపు రామేశ్వరానికి చెందిన నలుగురు జాలర్లను శ్రీలంక సేనలు బందీగా పట్టుకెళ్లడం గమనార్హం. వేకువ జామున కచ్చదీవుల సమీపంలో వేటలో ఉన్న తమిళ జాలర్లను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసిన సమాచారంతో, ఇక, తమ భద్రతకు భరోసా ఎక్కడ అన్న ఆవేదనను జాలర్లు వ్యక్తం చేస్తున్నారు. -
మోదీ దౌత్యం
* భారత జైలుకు జాలర్లు * మత్స్యకారుల్లో ఆనందం * జాలర్లకు ఉరిశిక్షను రద్దు చేయాలని ఆందోళన చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంక ఆధీనంలోఉన్న కచ్చదీవుల్లో తమిళనాడు జాలర్లు చేపల వేటసాగిస్తూ హద్దుమీరుతున్నారని ఆ దేశం తరచూ ఆరోపణలు గుప్పిస్తోంది. అంతేగాక అదేపనిగా తమిళ జాలర్లపై దాడులకు పాల్పడుతూ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ దశలో రామనాథపురం జిల్లా రామేశ్వరం సమీపం తంగచ్చిమండపానికి చెందిన 8 మంది జాలర్లు హెరాయిన్ మత్తుపదార్థాలను చేరవేస్తున్నారంటూ 2011 నవంబరు 28న శ్రీలంక గస్తీదళాలు అరెస్ట్ చేశారుు. అప్పటి నుంచి అంటే గత 35 నెలలుగా 8 మంది జాలర్లు శ్రీలంక జైలులోనే మగ్గుతున్నారు. పట్టుబడిన 8 మంది తమిళ జాలర్లలో 5 గురికి ఉరిశిక్ష విధిస్తూ గత నెల 30న శ్రీలంక కోర్టు తీర్పు చెప్పింది. ఈనెల 14 వ తేదీలోగా అప్పీలు చేసుకునే అవకాశం కల్పించింది. కక్షపూరిత వైఖరితో అమాయకులకు శ్రీలంక ఉరిశిక్ష విధించిందని తమిళనాడు ముక్తకంఠంతో ఖండించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న దృష్ట్యా బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు నిరసన గళం విప్పాయి. తీర్పు వెలువడిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం పరిస్థితి తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అన్ని కోణాల నుంచి ఒత్తిడి పెరగడంతో శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయసాగింది. ఉరిశిక్ష పడిన జాలర్ల అంశంపై శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 9న టెలిఫోన్ ద్వారా సంభాషించారు. తమిళనాడులో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు చల్లబడేందుకుఐదుగురు జాలర్లను భారత దేశంలోని ఏదేని జైలుకు తరలించాలని కోరారు. రాజపక్సే అంగీకరించారు. రాజపక్సే మీడియా ప్రతినిధి మోహన్ సమీరనాయకే ఈ విషయాన్ని ధృవీకరించారు. భారత ప్రధాని మోదీ, రాజపక్సేతో చర్చించడం, తమిళ జాలర్లను భారత్‌కు తరలించేందుకు రాజపక్సే అంగీకరించిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే వారిద్దరి సంభాషణల్లోని పూర్తి వివరాలు తనకు తెలియవన్నారు. ఆనందాలు-ఆందోళనలు: ఉరిశిక్ష పడడంతో ప్రాణాలతో తిరిగిరారనే ఆవేద నలో మునిగిపోయిన మత్స్యకార కుటుంబాలు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నాయి. శ్రీలంక చెర నుంచి ముందు బయటపడితే భారత ప్రభుత్వానికి నచ్చజెప్పి తమవారి ప్రాణాలను రక్షించుకోవచ్చనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఐదుగురి జాలర్లను మదురై జైలుకు తరలించాలని కోరుతూ మదురై హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు తెలిసింది. మరోవైపు ఐదుగురు జాలర్ల ఉరిశిక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మద్రాసు హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాదుల ఆందోళన టీనగర్: రామేశ్వరం తమిళ జాలర్లకు శ్రీలంక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ మద్రాసు హైకోర్టు న్యాయవాదులు సోమవారం ఆందోళన చేశారు. హైకోర్టు విధులను బహిష్కరించారు. దీంతో చెన్నై ప్యారిస్‌లోగల హైకోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం మోపిన అభియోగంపై ఐదుగురు జాలర్లకు కొలంబో న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది. ఈ ఉరిశిక్షను రద్దు చేయాలంటూ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు, సంఘాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. ఉరిశిక్షకు వ్యతిరేకత తెలుపుతూ మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఆర్సి పాల్ కనకరాజ్ ఆధ్వర్యంలో జరిగిన సంఘ సర్వసభ్య సమావేశంలో ధర్నా చేయడం, హైకోర్టు విధులను బహిష్కరించేందుకు నిర్ణయించారు. మహిళా న్యాయవాదుల సంఘం అధ్యక్షురాలు నళిని ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ హైకోర్టు విధులను బహిష్కరించేందుకు తీర్మానించారు. దీంతో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో న్యాయవాదులందరూ మద్రాసు హైకోర్టు ఆవిన్ గేటు సమీపాన గుమికూడారు. న్యాయవాదుల సంఘం కార్యదర్శి అరివళగన్, ఉపాధ్యక్షుడు గిని మాన్యువేల్ ఆధ్వర్యంలోను, మహిళా న్యాయవాదుల సంఘం అధ్యక్షురాలు నళిని ఆధ్వర్యంలోను న్యాయవాదులు శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ఆ తర్వాత ఎన్ఎస్సి బోస్ రోడ్డుపై రాస్తారోకో జరిపారు. హైకోర్టు విధులను బహిష్కరించడంతో హైకోర్టు, సెషన్స్ కోర్టులలో కేసుల విచారణలు స్థంభించాయి.