ఎన్నికలంటే సాధారణంగా ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం లాంటివి ప్రస్తావనకొస్తాయి. కానీ, మూడు రోజులుగా ఓ విదేశాంగ విధానం ప్రధానాంశమై కూర్చుంది. లోక్‌సభ ఎన్నికల తొలి దశలోనే తమిళనాట పోలింగ్ జరగనున్న వేళ ఆ రాష్ట్రానికి అతి సమీపంగా భారత – శ్రీలంకల మధ్యనున్న చిరుద్వీపం కచ్చతీవు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. స్టాలిన్ సారథ్యంలోని స్థానిక డీఎంకె ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాని, విదేశాంగ మంత్రి సహా సమస్త శక్తులనూ బీజేపీ కేంద్రీకరించినట్టు కనిపిస్తోంది. ఎన్నికల మాట అటుంచితే, భారత సర్కారే ఒకప్పుడు శ్రీలంకకు అప్పగించిన ఓ ద్వీపప్రాంత ప్రాదేశిక హక్కులపై ఇప్పుడు రగడ చేయడం సబబేనా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా సముద్ర జలాల సరిహద్దులు మార్చేసే ప్రయత్నాలు ఎక్కడికి దారి తీస్తాయి?
భారత్ – శ్రీలంకల మధ్య పాక్ జలసంధిలో 1.6 కిలోమీటర్ల పొడవు, 300 మీటర్ల వెడల్పున్న చిన్న ప్రాంతం కచ్చతీవు. భారత్‌లోని రామేశ్వరానికి ఉత్తరాన 30 కి.మీ.ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు దక్షిణాన 60 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ద్వీపం వ్యూహాత్మకంగా కీలకమైనది. కచ్చతీవు చారిత్రకంగా జాఫ్నా రాజ్యంలో, ఆపైన రామ్‌నాడ్ సహా పలువురు రాజుల ఏలుబడిలో, బ్రిటీష్ వారి హయాంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తాగునీటితో సహా ప్రాథమిక వసతులేవీ లేని ఈ ప్రాంతంలో ఒకే ఒక్క చర్చి మినహా నివాసాలే లేవు.
ఈ ద్వీపం తాలూకు ప్రాదేశిక హోదాపై భారత్, శ్రీలంకల మధ్య దీర్ఘకాలం వివాదం నెలకొంది. అయితే, 1974లో ఇరుదేశాలూ ఓ ఒప్పందానికి వచ్చి, సంతకాలు చేశాయి. శ్రీలంకతో పటిష్ఠ బంధానికై కేంద్రంలో ఇందిరా గాంధీ సారథ్యంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిరుద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించింది. ఇప్పుడు యాభై ఏళ్ళ తర్వాత మోదీ నేతృత్వంలోని బీజేపీ భారత సమైక్యతకు విఘాతం కలిగిస్తూ కాంగ్రెస్, డీఎంకెలు ‘నిర్లక్ష్యంగా’ ఆ ద్వీపాన్ని శ్రీలంకకు ధారాదత్తం చేసేశాయంటూ దాడికి దిగింది.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఇటీవల ‘సమాచార హక్కు’ పిటిషన్ ద్వారా ఇప్పటి దాకా బయటపడని ఈ ద్వీపం అప్పగింత వివరాలను తీసుకున్నారు. అవన్నీ మీడియాలో వచ్చాయి. దక్షిణాదిన, అందునా తమిళనాట బీజేపీ జెండా ఎగరేయాలని తరచూ పర్యటిస్తున్న ప్రధాని మోదీ దాన్ని అందిపుచ్చుకొన్నారు. ద్వీపం అప్పగింత తప్పుడు నిర్ణయమంటూ కాంగ్రెస్‌ను దుయ్య బట్టారు. విదేశాంగ మంత్రి జైశంకర్ స్వరం కలిపారు. సమీప శ్రీలంక జలాల్లో భారతీయ జాలర్లను పదే పదే అరెస్టు చేస్తున్నారంటే, అదంతా అప్పటి తప్పుడు నిర్ణయం ఫలితమేనని ఆయన ఆరోపణ.
ఈ చిరుద్వీపానికి తన దృష్టిలో పెద్దగా ప్రాధాన్యం లేదని 1961 మేలోనే ప్రధాని నెహ్రూ అన్నారట. ద్వీపాన్ని అప్పగించినా చేపలు పట్టుకొనేందుకు భారతీయులకున్న హక్కుల్ని 1974 ఒప్పందంలో పరిరక్షిస్తున్నామంటూ పార్లమెంట్‌కు హామీ ఇచ్చిన నాటి సర్కార్ తీరా ఆ ప్రాంతంలో చేపలు పట్టే హక్కులను సైతం 1976లో వదులుకుందని జైశంకర్ నిందిస్తున్నారు. గత ప్రధానులు ఈ అంశంపై ఉదాసీనంగా ఉన్నా, భారత – శ్రీలంక సముద్రజలాల సరిహద్దు చట్టం అమలు, భారతీయ జాలర్ల హక్కులపై తమ సర్కార్ శ్రీలంకతో చర్చలు జరుపుతుందని ఆయన చెబుతున్నారు.
గమ్మత్తేమిటంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులు గత పదేళ్ళుగా ఆ పని ఎందుకు చేయలేదో తెలీదు. అలాగే, ఆ ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకొనే పనిలో మోదీ సర్కార్ ఉన్నట్టు తమిళనాడు బీజేపీ చెబుతోంది కానీ, అసలు ఇప్పటి దాకా ఆ అంశంపై మోదీ సర్కార్ నుంచి అధికా రిక సమాచారమే లేదని శ్రీలంక మంత్రి ఒకరు తేల్చేశారు. మరి, కచ్చతీవు అంశాన్ని బీజేపీ ఉన్న ట్టుండి ఎందుకు లేవదీసినట్టు? లోక్‌సభ ఎన్నికల తొలి దశలో భాగంగా ఈ నెల 19న తమిళనాట పోలింగ్ జరగనుంది.
ప్రాంతీయ, భాషాభిమానాలు మెండుగా ఉండే తమిళనాట చొచ్చుకుపోవడా నికి తంటాలు పడుతున్న బీజేపీ దీన్ని ఓ అస్త్రంగా భావించింది. కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఆ ద్వీపాన్ని ఇచ్చేస్తుంటే, అడ్డుకోని కరుణానిధి సారథ్యంలోని డీఎంకె సర్కార్‌దీ తప్పుందని బీజేపీ నిందిస్తోంది. తమిళ ఓటర్లలో సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందడమే దాని అజెండాగా కనిపిస్తోంది.
నిజానికి, ఎవరు సలహా ఇచ్చారో కానీ ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేశాం. దీవి అప్పగింత విషయం అంతర్జాతీయ వ్యవహారం గనక అప్పట్లో కేంద్రం తమిళ సర్కార్‌కు సమాచారమిచ్చి ఉంటుందే తప్ప, సరేనన్న అనుమతి తీసుకొని ఉంటుందనుకోలేం. స్థానిక అనివార్యతల రీత్యా అప్పటి కరుణానిధి సర్కార్ నుంచి ఇప్పటి స్టాలిన్ సర్కార్ దాకా డీఎంకె ప్రభుత్వాలు శ్రీలంకతో ఒప్పందాన్ని నిరసిస్తూనే వచ్చాయి.
చేపల వేటకు వెళ్ళే తమిళ జాలర్లు పదే పదే లంకేయుల చేతిలో అరెస్టవుతున్నారని చెబుతూనే ఉన్నాయి. ఆ మధ్య భారత – శ్రీలంక ప్రధానుల భేటీ ముందూ స్టాలిన్ ఈ సంగతి మోదీ దృష్టికి తెచ్చారు. అవేవీ పట్టించుకోని బీజేపీ ఎన్నికల ముందు ఈ అంశం పట్టుకోవడమే విడ్డూరం. ద్వైపాక్షిక బంధాలపై ప్రభావం చూపే సున్నితమైన అంశాన్ని ఎన్నికల లబ్ధి కోసం తలకెత్తుకోవడం ప్రమాదకరం. నేపాల్ లాంటి పొరుగుదేశాలతోనూ అపరిష్కృత ప్రాదేశిక వివాదాలున్న భారత్ గతాన్ని తవ్వితే తలనొప్పులే.
శ్రీలంకలో జాతుల యుద్ధం ముగిశాక వాణిజ్యం, ఇంధన, రవాణా రంగాల్లో ఇరు దేశాలూ ముందుకు సాగుతున్నాయి. పాత చరిత్రను ఆశ్రయిస్తే కొత్త దౌత్య యత్నాలకు చిక్కులు తప్పవు. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక ప్రాంతంలో లంగరేయడానికి చైనా సిద్ధంగా ఉన్నవేళ కచ్చతీవు వివాదం అభిలషణీయం కానే కాదు. అయినా, మనమే వదులుకున్న ఈ దక్షిణాగ్ర ద్వీపంపై ఇంత ప్రేమ ప్రదర్శిస్తున్న పాలకులు ఉత్తరాన వేలాది చదరపు కిలోమీటర్లు చైనా ఆక్రమించుకున్నట్టు వార్తలున్నా ఉలకరేం? పలకరేం?
చిరుదీవిలో ఎన్నికల చేపలవేట
Published Wed, Apr 3 2024 12:50 AM | Last Updated on Wed, Apr 3 2024 4:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment