కచ్చదీవులే లక్ష్యం | Four Tamil Nadu fishermen arrested by Sri Lankan Navy | Sakshi
Sakshi News home page

కచ్చదీవులే లక్ష్యం

Published Wed, Nov 2 2016 3:35 AM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

Four Tamil Nadu fishermen arrested by Sri Lankan Navy

వేటకు పట్టు
ఢిల్లీకి ప్రతినిధుల పయనం
నేడు శ్రీలంకతో భేటీ
అధికారులతో మంత్రి సమీక్ష

కచ్చదీవుల్లో చేపల వేటకు అనుమతి లక్ష్యంగా కేంద్రంతో పాటు, శ్రీలంకపై ఒత్తిడికి తమిళ జాలర్లు సిద్ధమయ్యారు. నాలుగో విడత చర్చల నిమిత్తం ఢిల్లీకి మంగళవారం పయనమయ్యారు. భారత దేశ రాజధాని నగరం వేదికగా బుధవారం శ్రీలంక, తమిళ జాలర్లు ఒక చోట సమావేశం కానున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లను కేంద్ర అధికార వర్గాలు పూర్తి చేశాయి.
 
సాక్షి, చెన్నై : తమిళ జాలర్ల మీద కడలిలో శ్రీలంక సేనల వీరంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు దేశాల జాలర్లను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు తగ్గ ప్రయత్నాలు ఏళ్ల తరబడి సాగుతున్నా చర్చలు మాత్రం కొలిక్కి రావడం లేదు. ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చర్చలను కొలిక్కి తెచ్చేందుకు తగ్గ ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా భారత్‌లో పర్యటించి తమిళ జాలర్లతో చర్చలకు శ్రీలంక జాలర్ల ప్రతి నిధుల బృందం, అక్కడి మత్స్యశాఖ అధికారులతో కూడిన కమిటీ ముందుకు వచ్చింది. శ్రీలంక మత్స్యశాఖ ఉన్నతాధికారులతో కూడిన ప్రతి నిధులు బుధవారం ఢిల్లీలో అడుగు పెట్టనున్నారు. అక్కడే తమిళ జాలర్లతో సంప్రదింపులకు వేదికను సిద్ధం చేశారు. ఇక, తమిళ జాలర్ల ప్రతినిధుల్ని ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. వీరితో పాటు మత్స్యశాఖ కార్యదర్శి గగన్ దీప్‌సింగ్ నేతృత్వంలో  అధికారుల బృందం మంగళవారం రాత్రి ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు.

కచ్చదీవులే లక్ష్యం : తమిళనాడు జాలర్ల ప్రతినిధులుగా పన్నెండు మంది ఢిల్లీ వెళ్లారు. వీరిలో రామనాథపురానికి చెందిన దేవదాసు, జేసురాజ్, అరులానందం, రాయప్పన్, నాగపట్నంకు చెందిన వీరముత్తు, జగన్నాథన్, చిత్ర వేల్, శివజ్ఞానం, పుదుకోటైకు చెందిన కుడియప్పన్, రామకృష్ణన్, తంజావూరుకు చెందిన రాజమాణ్యం ఉన్నారు. ముందుగా ఈ ప్రతినిధుల బృందం మత్స్య శాఖ కార్యదర్శి గగన్ దీప్ సింగ్‌తో భేటీ అయ్యారు. బుధవారం శ్రీలంకతో చర్చించాల్సిన అంశాలపై సమీక్షించారు. శ్రీలంక జాలర్లు గతంలో తమకు సూచించిన కొన్ని రకాల వలల ఉపయోగంపై పరిశీలన జరిపారు.

ప్రధానంగా కచ్చదీవుల స్వాధీనం విషయంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, అలాగే, ఆ దీవుల్లో  ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపల వేటకు అనుమతి లభించే విధంగా, భద్రతకు పూర్తి భరోసా దక్కే రీతిలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. తదుపరి మత్స్య శాఖ మంత్రి డి.జయకుమార్‌తో గగన్ దీప్ సింగ్‌తో పాటుగా మత్స్యశాఖ కమిషనర్ పీలా రాజేష్, తదితర అధికార వర్గాలు సమాలోచించారు. కచ్చదీవుల స్వాధీనం గురించి తమిళ అసెంబ్లీలో ఇది వరకు చేసిన తీర్మానాలను ఢిల్లీ వేదికగా సాగనున్న చర్చల ముందు ఉంచేందుకు తగ్గ కార్యాచరణతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇక, ఐదో తేదీన రెండు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు, మత్స్యశాఖ అధికారులు భేటీ కానున్నారు.

ఈ భేటీ మేరకు తదుపరి నిర్ణయాలు ప్రకటించే అవకాశాలు ఉన్నారుు. కాగా, ఓ వైపు చర్చలకు సర్వం సిద్ధం చేసి ఉంటే, మరో వైపు రామేశ్వరానికి చెందిన నలుగురు జాలర్లను శ్రీలంక సేనలు బందీగా పట్టుకెళ్లడం గమనార్హం. వేకువ జామున కచ్చదీవుల సమీపంలో వేటలో ఉన్న తమిళ జాలర్లను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసిన సమాచారంతో, ఇక, తమ భద్రతకు భరోసా ఎక్కడ అన్న ఆవేదనను జాలర్లు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement