లంకకు కళ్లెం వేయండి
సాక్షి, చెన్నై : తమిళ జాలర్లకు శ్రీలంక నుంచి భద్రత కల్పించే విధంగా భరోసా ఇవ్వాలని జాలర్ల సంఘాల ప్రతినిధులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తాత్కాలిక పరిష్కారాలతో ఒరిగేది శూన్యం అని శ్రీలంకతో తాడో పేడో తేల్చుకుని తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ రెండు దేశాల జాలర్ల మధ్య చర్చలకు ఏర్పాట్లు చేయాలని, శ్రీలంక ఆగడాలకు శాశ్వతంగా కళ్లెం వేయాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వద్ద సమస్యల్ని జాలర్ల సంఘాలు ఏకరువు పెట్టాయి.
శ్రీలంక నావికాదళం రూపంలో తమిళ జాలర్లకు కడలిలో భద్రత కరువైంది. చేపల వేటకు వెళ్లే వాళ్లు తిరిగి వస్తారా..? అన్న ఎదురు చూపుల్లో కుటుంబాలు గడపాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఐదుగురు జాలర్ల ఉరి శిక్ష వివాదం సముద్ర తీర జిల్లాల్లో పెద్ద కలకలాన్నే రేపింది. వేటను బహిష్కరించి జాలరన్న ఆమరణ దీక్షకు సిద్ధం అయ్యాడు. ఎట్టకేలకు కేంద్రం విజ్ఞప్తితో దీక్ష విరమించినా, తమకు శాశ్వత పరిష్కారం ఏదీ..? అని అభ్యర్థించక తప్పలేదు. మంగళవారం ఇదే నినాదంతో ఢిల్లీలో జాలర్ల సంఘాల ప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు.
ఢిల్లీకి పయనం :
జాలర్లను బుజ్జగించడం లక్ష్యంగా రాష్ట్రంలోని బీజేపీ వర్గాలు తీవ్రంగానే పావులు కదిపాయి. తాము ఉన్నామంటూ భరోసా ఇచ్చి కేంద్రం వద్దకు జాలర్ల గోడును తీసుకెళ్లే పనిలో పడ్డారు. కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్, బీజేపీ సీనియర్ నేత ఇలగణేషన్, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, నేతలు శరవణ పెరుమాల్, నాగరాజన్, కుప్పురాం, ఆదవన్‌లు జాలర్ల సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. వారిని ఢిల్లీకి తీసుకెళ్లే పనిలో పడ్డారు. బీజేపీ నేతల పిలుపుతో జాలర్ల సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి కదిలా రు. మంగళవారం చెన్నై నుంచి రాష్ట్రంలోని నాగపట్నం, రామనాథపురం, రామేశ్వరం, పుదుకోట్టై, కారైక్కాల్, జాలర్ల సంఘాల ప్రతినిధులు, రాష్ర్ట జాలర్ల సంఘాల నేతలు, జాతీయ స్థాయి జాలర్ల సంఘాల నేతలు ఇళంగోవన్, శేషు, దేవదాసు, వీరముత్తు, శేఖర్, మోహన్, చంద్రబాబు, కుట్టి పాండి, రామకృష్ణన్, భాస్కరన్ తదితర పదిహేను మంది ప్రతినిధుల్ని బిజేపి నేతలు ఢిల్లీకి తీసుకెళ్లారు.
శాశ్వత పరిష్కారమే లక్ష్యం
బీజేపీ నేతలతో కలసి ఢిల్లీ చేరుకున్న జాలర్ల సంఘాల ప్రతినిధులు తొలుత కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. తమ గోడును వివరిస్తూ విజ్ఞప్తి లేఖను అందించారు. ఇందులో తాత్కాలిక పరిష్కారం తమకు వద్దని దాడుల అడ్డుకట్టకు శాశ్వత పరిష్కారం చూపించాలని జాలర్ల సంఘాలు డిమాండ్ చేశాయి. శ్రీలంక చెరలో ఉన్న తమిళ జాల ర్లందర్నీ విడుదల చేయించాలని కోరారు. ఉరి శిక్షను ఎదుర్కొంటున్న ఐదుగురి ఉరిశిక్ష రద్దును అధికార పూర్వకంగా ప్రకటించాలని, వారిని విడుదల చేసి, స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని కోరారు. శ్రీలంక వద్ద ఉన్న 82 పడవల్ని స్వాధీనం చేసుకుని, బాధిత జాలర్లకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. పారంపర్యంగా తాము చేపల్ని వేటాడే ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు కలకుండా చర్యలు తీసుకోవాలని, కడలిలో తమకు పూర్తి భద్రత కల్పించే విధంగా భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంటి తడుపు చర్యలతో కాకుండా శ్రీలంక నడ్డి విరిచి, వారి ఆగడాలకు కళ్లెం వేస్తూ, శాశ్వత పరిష్కారాన్ని తమకు చూపిం చాలని విన్నవించారు. శ్రీలంక జాలర్ల ప్రతినిధులు, అక్కడి అధికారులతో సాగిన చర్చలు అసంతృప్తికరంగా ముగిశాయని, మరోమారు చర్చలకు చర్యలు తీసుకోవాలని కోరారు. వీటన్నింటికి సానుకూలంగా స్పందించిన పొన్ రాధాకృష్ణన్ సాయంత్రం సుస్మా స్వరాజ్‌తో భేటీకి చర్యలు తీసుకున్నారు.
సుష్మాతో భేటీ :
సాయంత్రం సుష్మా స్వరాజ్‌తో జాలర్ల సంఘాల ప్రతి నిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో శ్రీలంక రాయబార అధికారుల, కేంద్ర ప్రభుత్వ అధికారులు సైతం పాల్గొన్నట్టు సమాచారం. ఈ భేటీలో తమకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా జాలర్ల సంఘాల ప్రతినిధులు పట్టుబట్టినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయి తే, ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారోనన్నది వెలువడాల్సి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ భారత్ రాకతో ఆయన దృష్టికి జాలర్ల సమస్యల్ని తీసుకెళ్లి, పరిష్కరించే విధంగా సుష్మా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో కేంద్రం హామీకి ఏ మేరకు జాలర్ల సంఘాల ప్రతినిధులు స్పందిస్తారోనన్నది వేచి చూడాల్సిందే.