చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళ జాలర్లపై శ్రీలంక గస్తీ దళాలు మరోసారి తమ దాష్టీకాన్ని ప్రదర్శించాయి. తమ సరిహద్దులో చేపల వేట సాగిస్తున్నారని ఆరోపిస్తూ 43 మందిని అరెస్ట్ చేసి తమ దేశానికి తీసుకెళ్లాయి. ఈ ఉదంతంతో రాష్ట్రంలోని జాలర్ల సంఘాలు ఆగ్రహంతో భగ్గుమన్నాయి. సీఎం పన్నీర్ సెల్వం ప్రధానికి లేఖాస్త్రం సంధించారు. కారైక్కాల్, నాగపట్టినంకు చెందిన 43 మంది జాలర్లు వేర్వేరు బృందాలుగా ఏర్పడి మంగళవారం ఉదయం సముద్రంలో చేపలవేటకు వె ళ్లాయి. కచ్చదీవుల సమీపంలో శ్రీలంక గస్తీదళాలు వారిని చుట్టుముట్టి అరెస్ట్ చేశాయి. ఇప్పటికే అనేక మంది జాలర్లు శ్రీలంక చెరలో మగ్గుతుండగా మరికొంత మంది బందీలుగా మారారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే మంగళవారం తిరుమల దర్శనానికి వచ్చి ఉన్న సమయంలోనే తమిళ జాలర్లను అరెస్ట్ చేయడాన్ని తమిళ జాలర్ల సంఘాలు కవ్వింపు చర్యగా భావించాయి. నాగై, పుదుకోట్టై, రామేశ్వరం, కారైక్కాల్, తిరువారూరు ఈ ఆరు జిల్లాలకు చెందిన తమిళ జాలర్ల సంఘాల ప్రతినిధులు బుధవారం నాగపట్టినంలో అత్యవసరంగా సమావేశ మయ్యూరు. కారైక్కాల్‌లోని జాలర్లు చేపల వేటను బహిష్కరించి ఆందోళనకు దిగారు. శ్రీలంక చెరలో ఉన్న జాలర్లను విడిపించాలని, తమ నుంచి అపహరించిన మర పడవలను తిరిగి స్వాధీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.
శ్రీలంక నిజరూపమిదే :సీఎం పన్నీర్ సెల్వం
తమిళ జాలర్ల పట్ల శ్రీలంక నిజస్వరూపం తాజా అరెస్ట్‌లతో బైటపడిందని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ప్రధానికి లేఖ రాశారు. నాగపట్నానికి చెందిన 14 మందిని, కారైక్కాల్‌కు చెందిన మరో 14 మందిని ఈనెల 9వ తేదీన శ్రీలంక గస్తీ దళాలు అరెస్ట్ చేశాయని అన్నారు. గతంలో అరెస్టయిన 38 జాలర్లు ఇప్పటికీ అక్కడి జైళ్లలో మగ్గిపోతున్నారని తెలిపారు. జాలర్ల విడుదలకు ఈనెల 6 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శికి లేఖ రాశారని సీఎం గుర్తుచేశారు. పాత ఖైదీల విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో మంగళవారం మరో 28 మందిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కేంద్ర మత్స్యశాఖ వెంటనే కలగజేసుకుని శాశ్వత పరిష్కారం కోసం కృషి చేసేలా ఆదేశించాలని, శ్రీలంక కబంధహస్తాల్లో చిక్కుకున్న 66 మంది జాలర్లను, 81 మరపడవలను విడిచిపెట్టేలా జోక్యం చేసుకోవాలని పన్నీర్ సెల్వం ఉత్తరం ద్వారా ప్రధానిని కోరారు.
లంక చెరలో 43మంది
Published Thu, Dec 11 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM
Advertisement