విడిపించండి
శ్రీలంక కోర్టు తమిళ జాలర్లకు విధించిన ఉరిశిక్షకు ప్రధానిదే బాధ్యత అని ఎండీఎంకే అధినేత వైగో పేర్కొన్నారు. శ్రీలంక తీరును నిరసిస్తూ ఎండీఎంకే ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మరోవైపు సమ్మె పాటిస్తున్న మత్స్యకారులు ఈ నెల 6వ తేదీ నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు మంగళవారం ప్రకటించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:శ్రీలంకకు హెరాయిన్ చేరవేస్తున్నారనే అభియోగంపై తమిళనాడుకు చెందిన ఐదుగురు జాలర్లకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ ఇటీవల తీర్పు చెప్పింది. ఈ ఉదంతంపై మండిపడిన రాష్ట్రం ఆగ్రహంతో ఊగిపోయింది. ఎండీఎంకే అధినేత వైగో నగరంలోని వళ్లువర్‌కోట్టం వద్ద తన అనుచరగణంతో మంగళవారం ఆందోళనకు దిగారు. వందలాది మంది కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐదుగురు యువకులు తమ మెడకు ఉరితాళ్లు తగిలించుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైగో మాట్లాడుతూ, చేపల వేటకు వెళ్లిన తమిళనాడు జాలర్లపై సాగుతున్న వేధింపు చర్యల్లో భాగంగా శ్రీలంక ఉరిశిక్షను విధించిందన్నారు. ఒక వేళ వారు హెరాయిన్‌ను అక్రమ రవాణా సాగించారని అనుకున్నా, ఇదే మత్తు పదార్థాన్ని అక్రమరవాణా చేస్తూ దేశంలో ఎందరో పట్టుబడ్డారని, వారెవరికీ ఉరిశిక్ష వేసిన దాఖలాలు లేవని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం శ్రీలంక పట్ల అవలంభిస్తున్న మెతకవైఖరే ఉరిశిక్షకు కారణమని ఆయన దుయ్యబట్టారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు భారతరత్న ప్రకటించాలని ఓ బీజేపీ నేత పేర్కొనగా, ఆ పార్టీ నేతలు ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రానికి సీఎంలు
తమిళ జాలర్లు ఇన్ని అవస్థలు పడుతుండగా, రాష్ట్రాన్ని పాలిస్తున్న ఇద్దరు సీఎంలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వైగో వ్యాఖ్యానించారు. ప్రజల ముఖ్యమంత్రి అనే నినాదంతో జయలలిత, కన్నీరు పెడుతూ పాలిస్తున్న పన్నీరు సెల్వం మరో ముఖ్యమంత్రిగా ఆయన అభివర్ణించారు. ఎంతో హుందాగా బాధ్యతలు నిర్వరిస్తూ ప్రజాసేవ చేయాల్సిన పన్నీర్ సెల్వం కనీసం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేందుకు, చాంబర్ వద్ద జయ బోర్డును తొలగించేందుకు సైతం సాహసం చేయడం లేదని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో ఉచిత వస్తువుల పంపిణీని మానేసి, పెరిగిన పాల ధరను తగ్గించాలని వైగో సూచించారు.
జాలర్ల ఆమరణ దీక్ష
తమిళనాడుకు చెందిన ఐదుగురు జాలర్లకు శ్రీలంక ప్రభుత్వం ఉరిశిక్ష విధించడాన్ని నిరసిస్తూ గత మూడు రోజులుగా నిరవధిక దీక్షలు నిర్వహిస్తున్న మత్స్యకారులు ఈనెల 6 వ తేదీ నుంచి ఆమరణదీక్షకు పూనుకోవాలని నిర్ణయించారు. నాగపట్నం, కారైక్కాల్, పుదుక్కోట్టై, తంజై, తిరువారూరు జిల్లాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటను నిషేధించి నిర్వహిస్తున్న సమ్మె మంగళవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. జాలర్ల సంఘాల ప్రతినిధులు సీఎం పన్నీర్ సెల్వంను సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈనెల 6వ తేదీలోగా ఉరిశిక్ష పడిన జాలర్లు విడుదల కాని పక్షంలో అదే రోజు నుంచి ఆమరణ దీక్షకు దిగుతామని మంగళవారం ప్రకటించారు.