సాక్షి, చెన్నై: కోయంబత్తూరులో కొన్ని నెలలుగా ఒంటరి అటవీ ఏనుగు సంచరిస్తోంది. ఈ ఏనుగు ప్రజలపై దాడి చేయడం లేదు. కేవలం పంట పొలాల్లోకి వెళ్లి అక్కడున్న పంటను మేసేస్తోంది. దీంతో అన్నదాతలకు నష్టాలు, కష్టాలు తప్పడం లేదు. ఈ ఏనుగుకు చిన్నతంబి అన్న పేరు కూడా పెట్టేశారు. ఆపరేషన్ చిన్నతంబి అంటూ వీరోచితంగా శ్రమించి ఎట్టకేలకు గత నెలాఖరులో పట్టుకున్నారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మరీ ఈ చిన్నతంబిని పట్టుకోవడమే కాదు టాప్ సిలిప్ అడవుల్లోకి తీసుకెళ్లి వదలిపెట్టారు. చిన్నతంబిని పట్టుకునే సమయంలో దాని దంతాలు విరిగి పోవడం, కుంకీ ఏనుగుల దాడిలో గాయపడడం అన్నదాతల్నే కంట తడి పెట్టించింది. ఎట్టకేలకు చిన్నతంబి బెడద తీరిందని ఆనందం వ్యక్తం చేసిన వాళ్లు ఎక్కువే.
అయితే, మూడు రోజుల్లో ఈ చిన్నతంబి వంద కి.మీ దూరం పయనించి తిరుప్పూర్‌లో ప్రత్యక్షం కావడం అటవీ అధికారుల్నే కాదు, అన్నదాతల్ని విస్మయంలో పడేసింది. మళ్లీ చిన్నతంబి తన పనితనాన్ని ప్రదర్శించడం మొదలెట్టాడు. ప్రస్తుతం తిరుప్పూర్ పరిసరాల్లో మకాం వేసిన చిన్నతంబి పంటపొలాల్ని మేసేస్తూ వస్తున్నాడు. దీనిని పట్టుకునేందుకు కలీం, మారియప్పన్ అనే రెండు కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించారు. ఈ చిన్నతంబి అటవీ అధికారులకు చిక్కకుండా తప్పించుకు తిరిగే పనిలో పడింది. ఎలాగైనా చిన్నతంబిని పట్టుకుని తీరుతామన్న ధీమాతో అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్నతంబిని ఉద్దేశించి అటవీ మంత్రి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి.
కుంకీ తంబి:
మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ తరచూ నెట్టిజన్లకు హాట్ టాఫిక్‌గా మారడం సహజంగా మారింది. ఏదో ఒక వ్యాఖ్య చేయడం నాలుక కరుచుకోవడం ఆయనకు పరిపాటిగామారింది. తాజాగా శనివారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో చిన్నతంబి గురించి చెప్పుకొచ్చాడు. వంద కి.మీ దూరం శరవేగంగా దూసుకొచ్చిన ఈ ఏనుగు, ప్రజలపై మాత్రం దాడి చేయడం లేదని ఇది కాస్త ఊరటేనని వ్యాఖ్యానించారు. ఈ చిన్నతంబిని కుంకీగా మారేస్తే మంచిదని, అందుకు తగ్గ చర్యలు చేపట్టాలని అటవీ అధికారుల్ని ఆదేశించబోతున్నట్టు వివరించారు. చిన్నతంబిపై ప్రత్యేక పరిశోధన సాగబోతున్నదని, కుంకీగా ఎలా మార్చాలో అన్న పరిశోధన అని చెప్పుకొచ్చిన ఈ మంత్రి, కేంద్ర బడ్జెట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అదే సమయంలో బడ్జెట్‌ను వాజ్‌పేయ్ బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ప్రవేశ పెట్టడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించి నెట్టిజన్లకు చిక్కారు.
అటవీ ఏనుగును కుంకీగా మారుస్తామని, ఇందుకు సైంటిస్టులను రప్పించబోతున్నట్టు, పరిశోధనలు జరపబోతున్నట్టుగా, వ్యాఖ్యలు ఎక్కడి నుంచి కనిపెడుతున్నారు మంత్రి వర్య అని వ్యంగ్యాస్త్రాలు, చమత్కారాలు సంధించే నెట్టిజన్లు పెరిగారు. చిన్నతంబిని కుంకీగా మార్చేందుకు వ్యతిరేకత బయలుదేరింది. ఆందోళనలు సైతం ఆదివారం చోటుచేసుకున్నాయి. సినీ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ పేర్కొంటూ, చిన్నతంబిని కుంకీగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, పీయూష్ గోయల్ బడ్జెట్‌ను దాఖలు చేస్తే, ఈలోకంలో లేని వాజ్‌పేయ్‌న్‌ను ఎలా రప్పించావంటూ వ్యాఖ్యల తూటాల్ని పేల్చే పనిలో పడ్డారు. దీంతో మేల్కొన్న మంత్రి నెట్టిజన్ల నోరు మూయించేందుకు ఆదివారం ఉదయాన్నే మీడియా ముందుకు వచ్చారు. కుంకీగా మార్చాలన్న పరిశీలన మాత్రమేనని వ్యాఖ్యానంచారు. తాను చేసిన వ్యాఖ్యలపై పునర్ పరిశీలనకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఆ ఏనుగుకు శిక్షణ ఇవ్వడంలో తప్పేముందంటూ, వ్యతిరేకిస్తున్న వాళ్లు ఎక్కువే కాబట్టి...కుంకీ నిర్ణయంపై పునఃపరిశీలన చేస్తామని ప్రకటించారు
Comments
Please login to add a commentAdd a comment