అమ్మ సినిమా!
తమిళనాడు ప్రజలు ముఖ్యమంత్రి జయలలితను అమ్మ అని ఆప్యాయంగా పిలుచుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అమ్మ అనే ఈ పదాన్ని అనేక పథకాలకు చేర్చడం ద్వారా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రజలకు మరింత చేరువయ్యారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: పేదలను దృష్టిలో ఉంచుకుని అమ్మ క్యాంటిన్లు, ఆమ్మ మినరల్ వాటర్, అమ్మ సిమెంట్, అమ్మ ఫార్మసి, అమ్మ అముదం స్టోర్లు ఇప్పటికే ప్రజల మన్నలను అపారంగా పొందాయి. ఇప్పటి వరకు ఆహారం, ఆరోగ్యం వరకే పరిమితమైన జయలలిత అమ్మ థియేటర్ల ఏర్పాటు వినోదంపై కూడా దృష్టి సారించారు. ఇలా అమ్మ పథకాల వరుసలో అమ్మ థియేటర్లు చేరబోతున్నాయి. వినోదం అనేది తారతమ్య బేధం లేకుండా అందరికీ అవసరమే. విసుగుపొందిన జీవితంలో ఆట విడుపుకు వినోదాన్ని పంచివ్వగల సినిమాకు పేదలైనా ఒకటే పెద్దలైనా ఒకటే.
అయితే హైక్లాస్ సినిమా టిక్కెట్టు ధర రూ.1.25లు తాకిన తరుణంలో పేదవాడికి సినిమా వినోదం అందని ద్రాక్షపండుగా మారిపోతోంది. రోజంతా కష్టించిన సొమ్మును కడుపు నింపుకోవడం కోసం కాకుండా వినోదం కోసం ఖర్చుచేయడపై పేదల మనస్సులు అంగీకరించడం లేదు. అలాగని సినిమా మాధ్యమానికి దూరంగా ఉండలేని స్థితి. ఈలోటును కొంత వరకు భర్తీ చేసేందుకు నగరంలో కొత్తగా నిర్మించే ప్రతి ఐమాక్స్, ఎస్ మాక్స్ థియేటర్లలో కిందివైపున ఒక వరుస సీట్లు పేదల కోసం రూ.10లకే కేటాయించేలా ప్రభుత్వం షరతు విధించింది. ఈ షరతుతో పేద ప్రజలు సైతం హైక్లాస్ థియేటర్లలో సినిమాలను చూసి ఆనందిస్తున్నారు. అయితే ఈ థియేటర్లలో తక్కువ ధర సీట్ల సంఖ్య చాలా స్వల్పం.
కార్పొరేషన్ వారి ‘అమ్మ సినిమా’:
మరింతమంది పేదలకు సినిమాను అందుబాటులోకి తెచ్చేందుకు చెన్నై కార్పొరేషన్ కనుసన్నల్లో నడిచేలా అమ్మ థియేటర్లు ఆవిర్భవిస్తున్నాయి. ముందస్తుగా రెండింటిని ప్రారంభిస్తున్నారు. చెన్నై కార్పొరేషన్ నేతృత్వంలో టీ నగర్ (జీఎన్ చెట్టి రోడ్డులోని సర్ పిట్ త్యాగరాయ కలైఅరంగం), షెనాయ్‌నగర్‌లలో అమ్మ థియేటర్లు సిద్దం అవుతున్నాయి. షెనాయ్‌నగర్‌లోని కలైఅరంగాన్ని ఇటీవలే రూ.17.28 కోట్లతో తీర్చిదిద్దగా ఇందులో 3వేల మంది సినిమాను వీక్షించే మార్పులు చేయడంపై పరిశీలన సాగుతోంది. అంతేగాక ముగప్పేర్‌లోని 3.94 ఎకరాల గృహనిర్మాణశాఖ వారి ఖాళీ స్థలాన్ని, చేట్‌పట్‌లో మరో స్థలాన్ని పరిశీలిస్తున్నారు. టిక్కెట్టు ధర రూ.10, రూ. 20, రూ.30లుగా నిర్ణయించే అవకాశం ఉంది. అలాగే డిజిటల్ సౌండ్ సిస్టమ్ అనుభవాన్ని పొందవచ్చు.