► ఆస్తిపన్ను వసూలు లక్ష్యం రూ.700 కోట్లు
► దుకాణాలపై కార్పొరేషన్ కొరడా
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై కార్పొరేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన కోసం పన్ను బకాయిలు పడిన దుకాణాలు, నివాస గృహాలపై కొరడా ఝుళిపిం చడం ప్రారంభించింది. చెన్నై కార్పొరేషన్‌కు వచ్చే వార్షిక ఆదాయంలో ఆస్తిపన్ను రూపేణా లభించే శాతమే ఎక్కువ. ఆస్తిపన్ను ద్వారా గత ఏడాది రూ.600 కోట్లు వసూలు లక్ష్యంగా పెట్టుకోగా రూ.586.46 కోట్లు వసూలైంది. కార్పొరేషన్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిపన్ను అత్యధిక సొమ్ముగా రికార్డు నమోదు చేశారు. ప్రస్తుతం చెన్నై కార్పొరేషన్ ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుండగా, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఆస్తిపన్నే దిక్కని భావిస్తూ రూ.650 కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆస్తిపన్ను వసూలులో తొలి అర్ధ సంవత్సరం రూ.308 కోట్లు వసూలు చేశారు. ఇక లక్ష్యసాధనలో మిగిలిన రూ.342 కోట్లకు అక్టోబర్ 1వ తేదీ నుంచి కొరడా ఝుళిపించడం ప్రారంభించారు. రోజుకు సగటున అందరూ కలిపి రూ.4 కోట్లు వసూలు చేయాలని బిల్ కలెక్టర్లకు నిబంధన విధించారు. అత్యధిక బకాయి ఉన్న వర్తక దుకాణాల జాబితాను సిద్ధం చేసుకుని కఠిన చర్యలు చేపడుతున్నారు. దుకాణాలకు జారీ చేసిన జీఎస్‌టీలను రద్దు చేయించడం, కాలుష్య నియంత్ర మండలి నుంచి సర్టిఫికెట్ జారీ కాకుండా అడ్డుకోవడం వంటి చర్యల ద్వారా మొండి బకాయిలను వసూలు చేస్తున్నారు. పురసైవాక్కం జాతీయ రహదారి, ఠాకూర్ రోడ్డు ప్రాంతాల్లో రాయపురం మండల అధికారులు గురువారం దాడులు జరిపి 18 దుకాణాలకు సీలు వేశారు.
ఇదే ప్రాంతంలోని రెండు వర్తక దుకాణాల వారు రూ.50 లక్షల వరకు ఆస్తిపన్ను బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు కావడం, ఈశాన్య రుతుపవనాల ప్రభావం అంతగా లేకపోవడం వల్ల కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి పన్ను వసూలు మినహా మరే ముఖ్యమైన బాధ్యతలు లేవు. దీంతో ఆస్తిపన్ను వసూలుపైనే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇదే వేగాన్ని మరి కొన్ని నెలలు కేటాయించి రూ.700 ఆస్తిపన్ను వసూలుతో సరికొత్త రికార్డును స్థాపించగలమని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఆస్తిపన్ను లక్ష్య సాధన, చెల్లింపు బకాయిలపై కార్పొరేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ కేవలం కాంట్రాక్టర్లకే రూ.400 కోట్ల బకాయిని కార్పొరేషన్ చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఆస్తిపన్ను ద్వారా వసూలయ్యే నగదులో నిర్వహణ ఖర్చులకు, పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించేందుకే సరిపోతుందని అన్నారు.
ఆస్తిపన్ను వసూళ్ల ద్వారానే కార్పొరేషన్ ఆర్థిక భారాన్ని నెట్టుకొస్తున్నామని తెలిపారు. 2012-13లో ఆస్తిపన్ను కింద రూ.461 కోట్లు, వృత్తిపన్ను ద్వారా రూ.221.04 కోట్లు వసూలు చేశామని తెలిపారు. అలాగే 2013-14లో ఆస్తిపన్ను కింద రూ.480.13, వృత్తి పన్ను ద్వారా రూ.234.68, 2014-15లో ఆస్తిపన్ను ద్వారా రూ.581.82, వృత్తిపన్ను కింద రూ.264.79 వసూలు చేశామని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెల మొదటి వారం వరకు రూ.400 కోట్లు వసూలైనట్లు తెలియజేశారు.
కొరడా
Published Sat, Nov 12 2016 3:29 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
Advertisement
Advertisement