కార్పొరేషన్‌లో ‘కోడిగుడ్డు’
ఓడిన పార్టీలంటే గెలిచిన పార్టీలకు ఎప్పుడూ చులకనేనని అన్నాడీఎంకే నిరూపించింది. ఓటమి చవిచూసిన పార్టీలకు కార్పొరేషన్ సాక్షిగా కోడిగుడ్డు చూపించి వాగ్యుద్ధానికి తెరదీసింది. చెన్నై కార్పొరేషన్‌లో శుక్రవారం జరిగిన సమావేశం గందరగోళం, వాకౌట్ల నడుమ రసాభాసగా సాగింది.
- ప్రతిపక్ష ఓటమిపై అన్నాడీఎంకే కౌన్సిలర్ ఎద్దేవా
- డీఎంకే, కాంగ్రెస్‌సభ్యుల వాకౌట్
- నగరంలో 15 రోడ్ల విస్తరణ
- మరో 200 అమ్మ క్యాంటీన్లు
చెన్నై, సాక్షి ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికల వేడి చల్లారినా పార్టీల మధ్య వైషమ్యాల సెగలు మాత్రం సమసిపోలేదు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఒంటి చేత్తో 37 లోక్‌సభ సీట్లు మూటగట్టుకుంది. విధిలేక ఒంటరిపోరుకు దిగిన కాంగ్రెస్ గెలుపు మాట అటుంచి డిపాజిట్టును కోల్పోయింది. ఇక అన్నాడీఎంకే ప్రధాన ప్రత్యర్థి డీఎం కే 35 స్థానాల్లో (మిత్రపక్షం 5) పోటీచేసి దారుణ పరాభవానికి గురైంది. గెలుపోటములపై రాష్ట్ర పార్టీల్లో తర్జనభర్జనలు జరుగుతున్న తరుణంలో ఎన్నికల తరువాత తొలి సమావేశం శుక్రవారం జరిగింది.
మేయర్ సైదై దొరస్వామి సమావేశానికి అధ్యక్షత వహించగా, తొలి అంశంగా అన్నాడీఎంకే అధినేత్రికి ధన్యవాదాలు చెప్పే తీర్మానా న్ని ప్రతిపాదించారు. ఇందుకు డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. కార్పొరేషన్ సమావేశం ప్రజా సమస్యలను చర్చించేందుకే గానీ ప్రశంసలు కురిపించేందుకు కాదని ప్రతిపక్ష నేత సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. నగరంలో విద్యుత్ కోత, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి అనేక సమస్యలుండగా, అభినందన తీర్మానం ఏమిటని అడ్డుతగిలారు. ఇంతలో అన్నాడీఎంకే మహిళా కౌన్సిలర్ వేలాంగణి కుర్చీ నుంచి లేచి డీఎంకే, కాంగ్రెస్‌ల ఓటమికి చిహ్నంగా కోడిగుడ్డును చూపారు.
ఎన్నికల సమయంలో తరచూ 144 సెక్షన్ అమలుచేయడం వల్లే అన్నాడీఎంకే గెలుపు సాధ్యమరుందని వారు ఎద్దేవా చేశారు. అయినా అధికార పార్టీ సభ్యుల విమర్శలు కొనసాగించడంతో ఆగ్రహించిన ప్రతిపక్షాల వారు వాకౌట్ చేశారు. మరికొద్ది సేపటికి వారంతా సమావేశం హాలులోకి ప్రవే శించగా ఆమె మళ్లీ కోడిగుడ్డును ప్రదర్శించారు. అయితే రెండోసారి ఆమె చేతి నుంచి కోడిగుడ్డు జారిపడి పగిలిపోవడంతో సభ్యులంతా నవ్వుకున్నారు.
మరో 200 అమ్మ క్యాంటీన్లు: నగరంలో మరో 200 అమ్మ క్యాంటీన్లను తెరవనున్నట్లు కార్పొరేషన్ ప్రకటించింది. నగరంలో మొత్తం వెయ్యి క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యంకాగా తొలివిడతగా నగరంలోని అన్ని వార్డుల్లో 200 క్యాంటీన్లు ప్రారంభమైనట్లు మేయర్ తెలిపారు. దశలవారీగా 1000 క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నగరంలో ఇరుకుగా ఉన్న 15 రోడ్లను విస్తరించనున్నట్లు చెప్పారు.
రోడ్ల విస్తరణతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలుగుతాయని పేర్కొన్నారు. కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆళ్వారుపేటలోని సంక్రాంతి హోటల్‌కు సీలువేసినట్లు ప్రకటించారు. ఇంటికోసం దరఖాస్తు చేసుకుని హోటల్ నిర్మాణం చేపట్టినందుకే ఈ చర్యతీసుకున్నట్లు ఆయన వివరించారు. కార్పొరేషన్ దుకాణాలకు లెసైన్సు పొంది సబ్‌లీజు ఇస్తే మంజూరైన లీజును రద్దుచేస్తామని మేయర్ హెచ్చరించారు.