మౌనం దాల్చిన సీఎం వర్గం మంత్రులు
హస్తానికి ఓటమి పాఠం
దొడ్డబళ్లాపురం: కులాల ప్రాతిదికన ఉపముఖ్యమంత్రుల సంఖ్యను పెంచాలని ఇన్ని రోజులూ డిమాండు చేస్తున్న పలువురు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత మౌనం దాల్చారు. డిప్యూటీ సీఎం పదవులు కావాలని అనేకమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇది ఒక రకంగా పార్టీలో అసమ్మతిని రాజేసింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులు ఈ డిమాండును తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎం సిద్ధరామయ్య మద్దతుదారులైన మంత్రులు రాజన్న, పరమేశ్వర్, సతీష్ జార్కిహొళి, ఎంబీ పాటీల్,ఎమ్మెల్యే బసవరాయరెడ్డి తదితరులు కేబినెట్‌లో 5 మంది ఉప ముఖ్యమంత్రులను నియమించాలని డిమాండు చేశారు. తద్వారా డీకేశి ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భావించారు. ఇది కాంగ్రెస్ నాయకత్వానికి ఇబ్బందిగా మారింది.
మంత్రుల జిల్లాల్లో పరాభవం
లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలలోకి 17 సీట్లలో కాంగ్రెస్ ఓడిపోవడం తెలిసిందే. అందులోనూ మంత్రుల జిల్లాల్లో కాంగ్రెస్‌కు ఓట్లు పడకపోగా జేడీఎస్, బీజేపీ కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించారు. ఇందుకు మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంది. ఉదాహరణకు శివమొగ్గలో మంత్రి మధు బంగారప్ప సోదరి గీత, తుమకూరులో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. దీంతో హోంమంత్రి పరమేశ్వర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కొందరు మంత్రులపై వేటు పడే అవకాశం లేకపోలేదని వార్తలు వస్తున్నాయి. ఇటీవల బెంగళూరుకు వచ్చిన రాహుల్ గాంధీ కూడా మంత్రుల సొంత జిల్లాల్లో కాంగ్రెస్ మట్టి కరవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఆ ఆలోచనే లేదు: హోంమంత్రి
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ వర్కింగ్ కమిటీ సమావేశానికి వెళ్లిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా ఖర్గేతో డీసీఎంలు, ఎన్నికల్లో ఓటమి గురించి చర్చించారని తెలిసింది. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన హోంమంత్రి జీ పరమేశ్వర్.. ఉప ముఖ్యమంత్రి పదవుల సంఖ్య పెంచే ఆలోచన పార్టీ హైకమాండ్‌కు లేదని చెప్పారు. ప్రభుత్వం సమర్థవంతంగా నడుస్తోందని, ఇప్పుడు అలాంటి ప్రస్తావనలు లేవని వివాదానికి ముగింపు పలికేలా మాట్లాడారు.
ఓటమిపై ఆత్మపరిశీలన: డీకే
శివాజీనగర: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వెనుకంజ కారణాలకు పరిశీలనా కమిటీ ఏర్పాటు గురించి డీసీఎం డీ.కే.శివకుమార్ మాట్లాడుతూ, తమకు ఇది హెచ్చరిక గంట, తాము సరి చేసుకోవాల్సిన అవసరముందని అన్నారు. సోమవారం నగరంలో మీడియాతో మాట్లాడుతూ కమిటీ ఏర్పాటు చేయాలని రాహుల్‌గాంఽధీ సూచించారు, దీనిపై త్వరలోనే బెంగళూరు ఎమ్మెల్యేల సమావేశాన్ని జరుపనున్నట్లు తెలిపారు. ఎక్కడ తప్పు జరిగింది అనేది పరిశీలిస్తామన్నారు. పార్టీ నేతలు ఎవరూ మీడియాతో ఓటమి గురించి మాట్లాడరాదని సూచించాం. మాకు 14 నుంచి 18 సీట్లు రావాల్సింది. అన్ని స్థానాలు రాలేదు. విఫలమయ్యామనేది అంగీకరిస్తాం. కొంతమంది మంత్రుల నియోజకవర్గాల్లో కూడా వెనుకబడ్డాం. ఓటమిపై ఏ మంత్రి ఫిర్యాదు చేయలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment