రోడ్లకు ఇక మహర్దశ
⇒రహదారుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్
⇒స్పెషల్ పర్పస్ వెహికల్‌గా ‘హెచ్‌ఆర్‌డీసీఎల్’ ఏర్పాటు
సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీలో ప్రధాన రూట్లలోని రహదారులను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌ఆర్‌డీసీఎల్)ను ఏర్పాటు చేసింది. రహదారుల అభివృద్ధి మాత్రమే కాక, రహదారుల వెంట ప్రకటనలు, రహదారుల వెంబడి ఉన్న ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం సైతం ఈ సంస్థకే చెందుతాయి. అవసరమైన నిధుల్ని బ్యాంకు రుణాలుగా లేదా షేర్ల ద్వారా పొందే అధికారం సైతం దీనికి ఉంది. వీటన్నింటి కోసం స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)గా హెచ్‌ఆర్‌డీసీఎల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
రహదారుల అభివృద్ధి లక్ష్యం..
గ్రేటర్ నగరంలో రోడ్ల దుస్థితి గురించి చెప్పాలిందేం లేదు. నాలుగు చినుకులు పడ్డా వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారుల(మేజర్‌రోడ్ల)నైనా అభివృద్ధి పరచాలని ప్రభుత్వం భావించింది. వాటిని అభివృద్ధి పరచాలంటే వివిధ ప్రభుత్వ విభాగాల మధ్యనే సమన్వయం, సహకారం లేవు. ఓవైపు నుంచి జీహెచ్‌ఎంసీ రోడ్లు వేస్తూ ఉంటే.. మరోవైపు నుంచి జలమండలి/ఆర్‌అండ్‌బీ/టీఎస్‌ఎస్‌పీడీసీఎల్/బీఎస్‌ఎన్‌ఎల్/ ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్లు / ట్రాఫిక్ పోలీసులు...ఎవరికి తోచిన విధంగా వారు తమ అవసరాల కోసం రోడ్లు తవ్వుతూ పోతున్నారు.
మౌలిక సదుపాయాల కోసం చేసే ఈ పనుల్లో అన్ని ప్రభుత్వ విభాగాలు, సంస్థల మధ్య సమన్వయంలేదు. దీంతో ఏటా కోట్ల రూపాయలు రోడ్ల కోసం ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రజల కష్టాలు తీరడం లేదు. ట్రాఫిక్ సమస్యలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ ప్రధాన రహదారుల మార్గాల్లో సమగ్రంగా రహదారులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం హెచ్‌ఆర్‌డీసీఎల్‌ను ఏర్పాటు చేసింది. కంపెనీ యాక్ట్ కింద స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)గా దీన్ని ఏర్పాటు చేసింది. ఇకపై జీహెచ్‌ఎంసీ పరిధిలో.. పరిసరాల్లోని పట్టణస్థానిక సంస్థల్లో రోడ్‌నెట్‌వర్క్ అభివృద్ధి పనులు మొత్తం దీని పర్యవేక్షణలో జరుగుతాయి.
మరోవైపు ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా తొలిదశలో దాదాపు రూ. 2600 కోట్లతో మల్టీ లెవెల్ ఫ్‌లై ఓవర్లు, స్కైవేలు, తదితర పనుల్ని జీహెచ్‌ఎంసీ చేపడుతోంది. ఆర్‌అండ్‌బీ పరిధిలోని 41 రహదారుల్ని సైతం రెండేళ్ల కిందట జీహెచ్‌ఎంసీ అధీనంలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో మేజర్ రోడ్లను అభివృద్ధి పరచేందుకు సమగ్ర ప్లాన్ అవసరమని, ప్లాన్ మేరకు పనులు పనులను పర్యవేక్షించేందుకు ఎస్‌పీవీ అవసరమని భావించిన ప్రభుత్వం హెచ్‌ఆర్‌డీసీఎల్‌ను ఏర్పాటు చేసింది. అన్ని శాఖల మధ్య సమన్వయం కోసం హెచ్‌ఆర్‌డీసీఎల్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులను డైరెక్టర్లుగా నామినేట్ చేసింది.
చీఫ్ సెక్రటరీ చైర్మన్‌గా..
హెచ్‌ఆర్‌డీసీఎల్‌కు చైర్మన్‌గా చీఫ్ సెక్రటరీని, ఎండీగా మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ/సెక్రటరీని నియమించింది. డైరెక్టర్లుగా ఆర్ అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ /సెక్రటరీ, ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌సెక్రటరీ/ సెక్రటరీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ, హెచ్‌ఎండీఏ కమిషనర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అడిషనల్ కమిషనర్(ట్రాఫిక్), టీఎస్సార్టీసీ ఎండీ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ చైర్మన్ అండ్‌ఎండీ, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీలను నియమించింది.
రుణాలు సేకరించే అధికారం..
జీహెచ్‌ఎంసీ, శివార్లలోని మేజర్‌రోడ్స్ నెట్‌వర్క్ పనులకు అవసరమైన నిధుల్ని ఆర్థిక సంస్థలనుంచి రుణాలుగా పొందేందుకు హెచ్‌ఆర్‌డీసీఎల్‌కు అధికారం ఉంటుంది. షేర్ల రూపేణా తీసుకునే పక్షంలో హెచ్‌ఆర్‌డీసీఎల్ షేర్ క్యాపిటల్ ఎంత ఉండాలనేది సమయానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
తొలుత ఆర్‌అండ్‌బీ మార్గాలు..
తొలిదశలో భాగంగా ఆర్‌అండ్‌బీ నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చిన రహదారుల్ని హెచ్‌ఆర్‌డీసీఎల్ పరిధిలోకి తెచ్చారు. రహదారులతోపాటే వాటి రైట్ ఆఫ్ వే పరిధిలోని వివిధ అధికారాలు (ప్రకటనలు, పార్కింగ్, నిర్మాణాల లీజులు, ఆస్తిపన్ను మీద సెస్ వంటి) సైతం హెచ్‌ఆర్‌డీసీఎల్‌కే ఉంటాయి.
భవిష్యత్తులో ఈరోడ్ల వెంబడి భవనాలకు ఇంపాక్ట్ ఫీజు వంటివి విధించినా తద్వారా వచ్చే ఆదాయం సైతం దీనికే చెందుతాయి. రహదారుల్ని అభివృద్ధి పరచేందుకు ఈ నిధుల్ని వినియోగిస్తారు. హెచ్‌ఆర్‌డీసీఎల్‌ను ఏర్పాటుచేస్తూ కొద్దిరోజుల క్రితం చీఫ్ సెక్రటరీ ఎస్‌పీ సింగ్ జీవో (నెంబర్ 89) జారీ చేశారు.