పాలన వేగవంతం
- జిల్లాలో ప్రతీ అర్హుడికి సంక్షేమ పథకాలు అందించటమే లక్ష్యం
- కాకతీయ మిషన్, రోడ్ల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి
- వాటర్‌గ్రిడ్ ద్వారా జిల్లా అంతటికీ తాగునీరు
- విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : నూతనంగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారుల విభజన జరిగిందని, ఇక నుంచి జిల్లాలో పాలన వేగవంతం చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్ 2న ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారని, గత నెల వరకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ పంపకాలు పూర్తి కాకపోవడంతో పాలనలో ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు.
ప్రధానంగా కాకతీయ మిషన్, రోడ్ల మరమ్మతులు, విస్తరణ, అంగన్‌వాడీలకు సన్నబియ్యం, హరితహారం, వాటర్‌గ్రిడ్ పథకాలను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. కాకతీయ మిషన్ కింద 900 చెరువుల మరమ్మతు లక్ష్యం కాగా, 585 చెరువులకు అంచనాలు వేసి ఆమోదానికి పంపామని తెలిపారు. మిగిలిన పనుల అంచనాలు వారం రోజుల్లో పూర్తిచేసి టెండర్లు పిలుస్తామన్నారు. ఇప్పటికే 186 పనులకు టెండర్లు పూర్తి చేశామని, ఈ నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో అంచనాలు రూపొందించేలా ఆదేశాలు జారీ చేశామని వివరించారు. పంచాయతీరాజ్ శాఖలో ఉన్న రోడ్లు పదేళ్లలో విచ్ఛిన్నం, విధ్వంసం అయ్యాయని, వాటికి రెన్యూవల్స్, రిపేర్లకు టెండర్లు పిలిచామని చెప్పారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో 104 పనులకు టెండర్లు పిలిచామని, వారంలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
రూ.20 కోట్లతో 80 పనులు చేపడతామన్నారు. జిల్లాలో వాటర్‌గ్రిడ్ పథకం కింద మూడు ప్రాజెక్టుల ద్వారా తాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. తొలుత సత్తుపల్లి, అశ్వారావుపేట నియోకవర్గాలకు కృష్ణాజలాల నుంచి తాగునీటిని అందించాలని భావించామని, అది సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవటంతో గోదావరి నుంచి నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. హరితహారం కింద లక్ష్యాలు సాధించేందుకు ఈ నెలాఖరు నాటికి మొక్కలు నాటుతామన్నారు. రానున్న వేసవిలో కరెంట్, నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అందుకు అవసరమైన నిధులకోసం ప్రతిపాదనలు పంపించాలన్నారు. పెన్షన్లు రానివారు అధైర్యపడవద్దని, చివరి మనిషి వరకు పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
హాస్టళ్లలో, అంగన్‌వాడీ కేంద్రాల్లో సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని, పాలు, గుడ్లపై కూడా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. కడుపులో ఉన్న బిడ్డకు, తల్లికి ఆహారం అందించటంతో పాటు పుట్టిన నాటి నుంచి పెద్దయ్యేంత వరకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు. షాధీముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాన్ని అర్హులకు అందించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట కలెక్టర్ ఇలంబరితి, చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఉన్నారు.