Kakatiya mission
-
ఆర్థిక సంక్షోభంలో రాష్ట్ర ప్రభుత్వం
రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో ముద్రించాలి: జి.కిషన్ రెడ్డి సాక్షి, యాదాద్రి: రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని బీజేఎల్పీ నేత జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం భువనగిరిలో జరిగిన యాదాద్రిభువనగిరి జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి హాజరైన సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. కేంద్రం మంజూరు చేసిన ఎన్ ఆర్ఈజీఎస్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ, హరితహారం వంటి పలు కార్యక్రమాలకు దారి మళ్లిస్తుందన్నారు. టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలైనా కొత్త రేషన్ కార్డుల ఇవ్వలేకపోయిందన్నారు. త్వరలో ఇచ్చే కార్డులపై సీఎం కేసీఆర్ ఫొటోతో పాటు ప్రధాని మోదీ ఫొటో కూడా ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టూ ఏడు జిల్లాలను అనుసంధానం చేస్తూ వంద శాతం కేంద్ర నిధులతో ఇన్నర్‌రింగ్ రోడ్డును చేపడతామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు భూమి ఇవ్వనందునే మంజూరు కాలేదన్నారు. ఎంఎంటీఎస్ పనుల కోసం రాష్ట్ర వాటా మంజూరు చేయకపోవడంతో జాప్యమవుతుందని వివరించారు. -
టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలి
తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ, మిష న్ భగీరథ పథకాల్లో ఇంజనీర్లు కమీషన్లు తీసుకుంటున్నారని మహానాడులో తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానించడంపై తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ నేతలు మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు ఇంజనీర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శనివా రం సచివాలయంలో మీడియా పాయింట్ వద్ద జేఏసీ నేతలు మాట్లాడారు. ప్రజలకు లబ్ధి కలిగించే ఎంతో ప్రతిష్టాత్మకమైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను విజయవంతం చేయడానికి ఇంజనీర్లు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. -
మిషన్ కాకతీయ, భగీరథ భేష్
♦ ప్రశంసించిన నీతి ఆయోగ్ ♦ 12న హైదరాబాద్‌లో సమీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. చెరువుల పునరుద్ధరణ, ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు చేపట్టిన ఈ పథకాలు ఆదర్శమని కితాబిచ్చింది. ఈ మేరకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఇటీవలే లేఖలు రాశారు. సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు తెలంగాణ అమలు చేస్తున్న ఈ పథకాలను నమూనాగా తీసుకొని కార్యక్రమాలు చేపడితే ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని ఇతర రాష్ట్రాలకు సూచించారు. గత ఏడాది మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తీరుతెన్నులు పరిశీలించేందుకు నీతి ఆయోగ్ బృందం రాష్ట్రంలో పర్యటించింది. మరోసారి ఈ పథకాల పురోగతిని సమీక్షించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 12న రాష్ట్రానికి రానున్న పనగారియా రాష్ట్ర ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. ప్రధానంగా రాష్ట్ర సాగునీటి పారుదల, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులతో సమాలోచనలు జరుపుతారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాలకు ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రూ.10 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని నీతి ఆయోగ్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పథకాల పురోగతిపై సమీక్ష జరగనుండటంతో ఆర్థిక సాయం చేసే అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఈ సమావేశానికి పనగారియాతో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి సలహాదారు అశోక్‌కుమార్ జైన్, ఇరిగేషన్ సలహాదారు జితేంద్రకుమార్, కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య విబాగం ఉప సలహాదారు పీకే ఝూ తదితరులు హాజరు కానున్నారు. -
'రూ.కోటి పనులు మార్చికల్లా పూర్తి చేయండి'
హైదరాబాద్: మిషన్ కాకతీయపై మంత్రి హరీష్ రావు మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.కోటికంటే తక్కువ ఉన్న పనులు మార్చికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, కోటిపైన ఖర్చయ్యే పనులను జూన్ 30కల్లా పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. -
చెరువులకు జల కళ..‘మిషన్ కాకతీయ’
చెరువులు... పాడి పంటలకు పట్టుకొమ్మలు. కాకతీయుల కృషితో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో గొలుసు కట్టు చెరువులు అభివృద్ధి చెందాయి. అనంతర కాలంలో పాలకుల నిర్లక్ష్యం, పూడిక, ఆక్రమణలు ఫలితంగా చెరువులు తమ ప్రాభవాన్ని కోల్పోయాయి. ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’తో చెరువులు తిరిగి జల సిరులను సంతరించుకుంటున్నాయి. ఇందులో భాగంగా తొలి దశలో రూ. 2,611 కోట్లు ఖర్చు చేసి, 8,217 చెరువులను పునరుద్ధరించారు. 2016, జనవరి నుంచి జూన్ వరకు రెండో దశ మిషన్ కాకతీయ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయ కార్యక్రమంపై ప్రత్యేక కథనం... కృత్రిమ పద్ధతులను ఉపయోగించి, పంట పొలాలకు నీటి వసతిని కల్పించడాన్ని నీటిపారుదల అంటారు. తెలంగాణలో నీటిపారుదలకు సంబంధించి కాకతీయులు విశేష కృషి చేశారు. కాకతీయ రాజులు 12వ శతాబ్దంలో చిన్న, చిన్న నదులకు ఆనకట్టలు కట్టడం ద్వారా నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు. అంతేకాకుండా వారు పెద్ద సంఖ్యలో చెరువులను కూడా తవ్వించారు. కాకతీయులు రామప్ప చెరువు, పాకాల, లక్నవరం చెరువులు వంటి పెద్ద చెరువులనే కాకుండా చిన్న చెరువులను కూడా తవ్వించారు. కాకతీయుల అనంతరం నిజాం పరిపాలన కాలంలో నిర్మించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, నిజాంసాగర్ వంటి నీటిపారుదల ప్రాజెక్టులు ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. చెరువుల పుట్టిల్లు తెలంగాణ దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ రాష్ర్టం చెరువుల నిర్మాణానికి అనువైన ప్రాంతం. శాతవాహనుల కంటే ముందే తెలంగాణలో చెరువుల నిర్మాణం ఉందనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. కాకతీయుల కాలంలో మాత్రం చెరువుల నిర్మాణం అత్యున్నత ప్రమాణాలతో సాగినట్లు తెలుస్తోంది. కాకతీయులు నిర్మించిన రామప్ప, పాకాల, లక్నవరం, ఘనవరం, బయ్యారం వంటి అనేక పెద్ద చెరువులు నేటికీ సేవలు అందిస్తున్నాయి. కాకతీయుల తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్‌షాహీలు, అసఫ్జాహీలు, వివిధ సంస్థానాధీశులు చెరువుల నిర్మాణాన్ని కొనసాగించి, వ్యవసాయ విస్తరణకు తోడ్పడ్డారు. తెలంగాణలో ప్రతీ ఊరికి ఒక చెరువు తప్పనిసరిగా ఉండేది. ఒకటి కంటే ఎక్కువ చెరువులు ఉన్న గ్రామాలు తెలంగాణలో చాలా ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ర్ట ప్రభుత్వం పునర్నిర్మాణంపై దృష్టి సారించింది. పునర్నిర్మాణం ప్రధానంగా సాగునీటి రంగంపై ఆధారపడి ఉందని భావించిన ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యచరణ ప్రకటించింది.చెరువుల పునరుద్ధరణ జరిగితే తెలంగాణలో వలసలు తగ్గుతాయి. గ్రామాల్లో అనేక కులవృత్తుల ప్రజలకు జీవనోపాధి లభిస్తుంది.చెరువులను పునరుద్ధరించి వాటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వ్యవసాయాభివృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. మిషన్ కాకతీయ తెలంగాణలో వేల సంఖ్యలో చెరువులను తవ్వించిన కాకతీయుల స్ఫూర్తిగా రాష్ర్ట ప్రభుత్వం మిషన్ కాకతీయను ప్రారంభించింది.తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2015, మార్చి 12న నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం పాత చెరువులో ‘మిషన్ కాకతీయ’ పైలాన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా చెరువులను పునరుద్ధరించి కాకతీయుల కాలం నాటి శోభను తిరిగితెచ్చేందుకు ప్రభుత్వం దృఢసంకల్పంతో ముందుకు సాగుతోంది. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా 46 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించనున్నారు. దీని కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో వ్యయం చేయనుంది.2014-15 నుంచి దశల వారీగా చెరువుల పనరుద్ధరణ జరగనుంది. ఏడాదికి ఐదో వంతు చొప్పున మొత్తం 46,531 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఇందులో భాగంగా ‘మిషన్ కాకతీయ’ కోసం 20 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. అన్ని చెరువులను 5 ఏళ్లలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాల వారీగా చెరువుల సంఖ్య 1) మెదక్ 7,941 2) మహబూబ్‌నగర్ 7,480 3) కరీంనగర్ 5,939 4) వరంగల్ 5,839 5) నల్గొండ 4,762 6) ఖమ్మం 4,517 7) ఆదిలాబాద్ 3,951 8) నిజామాబాద్ 3,251 9) రంగారెడ్డి 2,851 మొత్తం 46,531 సంవత్సరం-ప్రతిపాదించిన చెరువులు (2014-19) 1) 2014 - 15 9,305 2) 2015 - 16 9,308 3) 2016 - 17 9,430 4) 2017 - 18 9,480 5) 2018 - 19 9,008 మొత్తం 46,531 అనుకున్న స్థాయిలో చెరువుల పునరుద్ధరణ జరిగితే 10.17 లక్షల హెక్టార్లకు సాగునీటి వసతి లభిస్తుంది. చేపట్టనున్న కార్యక్రమాలు చెరువులు, కుంటల్లోని పూడికను తొలగించి వాటి నీటి నిల్వ సామర్థ్యం పెంచడం. చెరువు కట్టలను బలోపేతం చేయడం, చెరువు అలుగు, తూములకు మరమ్మత్తులు చేయడం. చెరువుల్లో పెరిగిన తుమ్మచెట్లను నరికివేయడం, గుర్రపు డెక్క లొట్టపీసు మొక్కల తొలగింపు. గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరిస్తారు. తొలగించిన పూడికను రైతుల పంట భూముల్లో చల్లుతారు. చెరువు కట్ట బలోపేతానికి సరిపడా పూడికమట్టిని వాడుకోవడం. అవసరమైన చోట్ల ఫీడర్ చానళ్లను రీసెక్షన్ చేయడంతో పాటు పూడిక ను తొలగిస్తారు. చెరువుల శిఖం భూములను కబ్జాల నుంచి కాపాడటం. మిషన్ కాకతీయ మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక పట్టణ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తారు. చెరువుల పునరుద్ధరణలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కార్యక్రమాలు చెరువుల పునరుద్ధరణ వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందనున్నారు. దీంతో పాటు గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలకు పరోక్షంగా ప్రయోజనం కలగనుంది. చెరువుల మీద ఆధారపడి జీవించే అనేక కులవృత్తులు... రజకులు, కుమ్మరులు, బేస్తవారు, కల్లు గీత కార్మికులు తదితరులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. చెరువులు - సాంస్కృతిక కేంద్రాలు తెలంగాణ రాష్ర్టంలో చెరువులు సాంస్కృతిక కేంద్రాలుగా కూడా విలసిల్లుతున్నాయి. తెలంగాణలో వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండగను చెరువు కట్టలపైనే జరుపుకుంటారు. తెలంగాణకు హరితహారం (టీకెహెచ్‌హెచ్) తెలంగాణలో అడవుల విస్తీర్ణం 24 శాతంగా ఉంది. రాష్ర్ట భౌగోళిక విస్తర్ణీంలో వృక్షాల విస్తీర్ణ శాతాన్ని 33 శాతానికి పెంచటం లక్ష్యంగా ప్రభుత్వం ‘తెలంగాణకు హరితహారం’ పథకాన్ని ప్రారంభించింది.ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2015, జూలై 3న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ‘చిలుకూరు బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ‘సంపంగి’ మొక్కను నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.కార్యక్రమంలో భాగంగా బహుళ రహదారుల పక్కన, నదులు, కాలువలు, చెరువుల గట్టుల మీద, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రాంగణాల్లో, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో, హౌసింగ్ కాలనీల్లో, కమ్యూనిటీ భూముల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచనున్నారు. హరిత హారం కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేయనున్నారు.ఇందులో భాగంగా సంబంధిత విధానాలు, చట్టాలు, పాలనాపరమైన అంశాల్లో అవసరమైన మార్పులు చేస్తారు. రానున్న మూడేళ్లలో రాష్ర్ట వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. వీటిలో 130 కోట్ల మొక్కలను నోటిఫైడ్ అటవీ ప్రాంతాలకు వెలుపల నాటాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా 10 కోట్ల మొక్కలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో, మిగిలిన 120 కోట్ల మొక్కలను రాష్ర్టంలోని మిగిలిన ప్రాంతాల్లో నాటనున్నారు.అడవులను సంరక్షించటం, లైవ్ రూట్ స్టాక్‌ను ప్రోత్సహించడం ద్వారా నోటిఫైడ్ అడవుల లోపల వంద కోట్ల మొక్కలను పునరుజ్జీవింప చేయాలని నిర్ణయించారు.‘మన ఊరు - మన ప్రణాళిక (ఏంవీఎంపీ)’ కార్యక్రమం ద్వారా వచ్చే సూచనల ఆధారంగా హరితహారం కార్యక్రమంలో నర్సరీలు, మొక్కలను నాటే ప్రదేశాలను గుర్తిస్తారు. ఇలా గుర్తించిన 3,888 నర్సరీల్లో 2015లో 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అటవీశాఖ, వ్యవసాయ, ఉద్యానవన, గిరిజన సంక్షేమం తదితర శాఖలను కూడా కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నారు.2016లో మరో 40 కోట్ల మొక్కలను నాటేందుకు భవిష్యత్ ప్రణాళికను రూపొందించారు.చైనా, బ్రెజిల్ తర్వాత తెలంగాణలోనే భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ఏడాదికి ప్రతిపాదించిన చెరువులు మొత్తం 2014-15 2015-16 2016-17 2017-18 2018-19 చెరువులు కరీంనగర్ 1188 1210 1220 1200 1121 5939 ఆదిలాబాద్ 790 800 800 800 761 3951 వరంగల్ 1168 1170 1180 1200 1121 5839 ఖమ్మం 903 910 920 930 854 4517 నిజామాబాద్ 650 650 650 650 651 3251 మెదక్ 1588 1590 1600 1610 1553 7941 రంగారెడ్డి 570 500 570 600 611 2851 మహబూబ్‌నగర్ 1496 1500 1510 1510 1464 7480 నల్గొండ 952 978 980 980 872 4762 మొత్తం 9305 9308 9430 9480 9008 46531 -
కాకతీయ ‘కాసు’ల కథ.. మిషన్ 22%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పథకం అధికారుల కమీషన్ల కక్కుర్తి కారణంగా అభాసుపాలవుతోంది. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ప్రక్రియలో అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. బిల్లులు పాసు కావాలంటే వివిధ స్థాయిల్లో అధికారులకు 12 శాతం, ప్రజా ప్రతినిధులకు 10 శాతం కమీషన్లు చెల్లించాల్సి వస్తోంది. దీంతో తక్కువ మొత్తానికి టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. ఈ బాగోతాన్ని ముందే గ్రహించిన కొందరు కాంట్రాక్టర్లు కమీషన్ల మేరకు సొమ్మును మిగుల్చుకునేందుకు పైపైన పనులు చేసి చేతులు దులుపుకొన్నారు. కొత్తగా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు చేతులు కాల్చుకున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ సగటున 17 శాతం తక్కువ మొత్తానికి అరడజను చెరువుల టెండర్లు తీసుకున్నారు. తీరా బిల్లులు తీసుకునే సమయానికి కమీషన్లు కలిపి చూసుకుంటే 11 శాతానికిపైగా నష్టం వాటిల్లింది. ఇదే సంగతిని ఆయన అధికారుల దృష్టికి తీసుకువెళితే... కథలు చెప్పొద్దంటూ ఆయన బిల్లు పాస్ చేయలేదు. ఆ కాంట్రాక్టర్ ఇక చేసేది లేక కమీషన్లు ముట్టజెప్పి, మిషన్ కాకతీయకు గుడ్‌బై చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర మంత్రి బంధువొకరు నాలుగు చెరువులకు సగటున 23 శాతం తక్కువకు టెండర్ పొందినా 15 శాతం లాభాలు ఆర్జించారు. ఈ నాలుగు చెరువుల్లో పనులు అత్యంత నాసిరకంగా ఉన్నా సరే అధికారులు బిల్లులు పాస్ చేశారు. కమీషన్లు ఇలా.. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 6,655 చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. రూ.1,500 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో ఇప్పటికే రూ.650 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ పనులకు బిల్లుల చెల్లింపు ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకు 1,070 చెరువులకు సంబంధించి రూ. 117.18 కోట్ల మేర బిల్లుల చెల్లింపులు చేశారు. మిగతా బిల్లుల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ బిల్లుల చెల్లింపు ప్రక్రియ కమీషన్లను బట్టే నడుస్తోంది. అధికారి స్థాయిని బట్టి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నుంచి క్షేత్రస్థాయిలో ఉండే అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) వరకూ అందరికీ కలిపి 12 శాతం దాకా ముట్టజెప్పాల్సి వస్తోందనే ఆరోపణలున్నాయి. పూడిక కొలతలు (మెజర్మెంట్) తీసుకునే ఏఈకి, అతనితో పాటు క్వాలిటీని నిర్ధారించే క్వాలిటీ కంట్రోల్ అధికారులకే 6 శాతం, కొలతల పుస్తకాన్ని పరిశీలించి ప్రభుత్వ ఆమోదం కోసం పంపేందుకు డీఈ, ఈఈ స్థాయిలో 1 శాతం చొప్పున, బిల్లులు పాస్ చేసే కార్యాలయానికి వెళ్లాక అక్కడి సంబంధిత అధికారులకు 4 శాతం మేర కమీషన్లు ముట్టజెప్పాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల దగ్గర.. తక్కువ మొత్తానికి టెండర్ వేసి నాణ్యతతో కూడిన పనులు చేసిన కాంట్రాక్టర్లు కమీషన్లు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. అలాం టివారికి సరిగా బిల్లులు పాస్ కావడం లేదనే ఆరోపణలున్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ చెరువుల పునరుద్ధరణపై ఆసక్తి కొద్దీ పది చెరువుల పనులను సగటున 7 శాతం తక్కువకు దక్కించుకున్నారు. గ్రామస్తుల సహకారం కూడా తీసుకుని విజయవంతంగా పని పూర్తి చేశారు. ‘‘నేను, నా కుటుంబ సభ్యుల పేర్లతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టాం. 90 శాతం నాణ్యతతో పనులు చేశాం, లాభం లేకున్నా పూర్తిచేశాం. ఇప్పుడు బిల్లుల దగ్గరకు వచ్చేసరికి ఎవరెవరికి ఎంత మొత్తంలో కమీషన్లు ముట్టజెప్పాలో చెబుతూ అధికారులు జాబితా ఇస్తున్నారు. పనులు బాగా చేశాం కదా అంటే ప్రతి పనిలో లోపా లు వెతుకుతున్నారు. చేసేది లేక కమీషన్లు ముట్టజెప్పాల్సి వస్తోంది. పనులకు ముందే స్థానిక ప్రజాప్రతినిధులకు 10 శాతం దాకా ముట్టజెప్పి, ఇప్పుడు అధికారులకూ ఇచ్చి.. ఇక మళ్లీ నేను మిషన్ కాకతీయ పనులు చేపట్టను..’’ అని ఆ కాంట్రాక్టర్ వాపోయారు. ఇలా అన్ని జిల్లాల్లోనూ కమీషన్లు ఇవ్వడానికి ముందుకు రాని కాంట్రాక్టర్ల బిల్లులు సాంకేతిక కారణాలతో పాస్ కాకుండా తిరిగి వస్తున్నాయి. మంత్రే హెచ్చరించినా.. కమీషన్ల విషయమై కాంట్రాక్టర్ల నుంచి మంత్రి హరీశ్‌రావుకు, ఆయన పేషీకి చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. 10 నుంచి 30 శాతం తక్కువకు కోట్ చేసి పనులు దక్కించుకున్న తమకు ఈ కమీషన్ల వ్యవహారం గుదిబండగా మారుతోందని వారు వాపోతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకున్న హరీశ్‌రావు... ఇటీవల ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు. అయినా వారి తీరు మారలేదు. ఈ కమీషన్ల వ్యవహారంపై మంత్రి పేషీ అధికారులు కొందరు కింది అధికారులను ఫోన్లో నిలదీస్తుంటే.. ‘మేం డిమాండ్ చేయడం లేదు. కేవలం గిఫ్ట్‌గా ఇస్తే తీసుకుంటున్నా’మని బదులు చెబుతున్నారు. -
చంద్రబాబులో విషసర్పం బుస కొడుతోంది
నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ పండుగ జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధపడుతుంటే మరో వైపు ఏపీ సీఎం చంద్రబాబులోని విషసర్పం బుసలు కొడుతోందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ విభజనకు వ్యతిరేకంగా జూన్ 2న దీక్షలు చేయమని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు చెప్పడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని అన్నారు. తెలంగాణ వ్యతిరేకతను చాటుకున్న బాబును నిలదీయాలని టీడీపీ నేతలకు పిలుపునిచ్చారు. అలా వీలుకాకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు నిలబెట్టిన అభ్యర్థిని ఓడించి తీర్పు చెప్పాలన్నారు. అవసరమైతే రాత్రిపూట ‘మిషన్’ పనులు చేయించండి.. మిషన్ కాకతీయకు సంబంధించి కొత్త పనులను ఆరంభించే ముందు ఈ సీజన్లో పూర్తి చేయగలమో లేదో నిర్ణయించుకోవాలని, ఆ తర్వాతే పనులు చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. ఇప్పటికే ఆరంభించిన పనులను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే రాత్రి పూట సైతం ఫ్లడ్ లైట్లు పెట్టుకొని పనులు జరిపించాలని ఆదేశించారు. శనివారం ఆయన సచివాలయంలో మిషన్ పనుల పురోగతి, మార్కెటింగ్ శాఖలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా తలపెట్టిన గోదాముల నిర్మాణానికి జిల్లాల అధికారులు ప్రభుత్వ భూమిని గుర్తించి యుద్ధప్రాతిపదికన మార్కెటింగ్ డిపోలకు అప్పగించాలని ఆదేశించారు. అంతకుముందు మిషన్ కాకతీయపై పరిశోధన చేస్తున్న అమెరికాలోని మిషిగాన్ యూనివర్సిటీ స్కాలర్స్ మంత్రి హరీశ్‌రావును ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. -
క‘మీషన్’ కాకతీయ!
చెరువు పనుల నిధులు మెక్కుతున్న నేతలు కమీషన్ల కోసం కాంట్రాక్టర్లపై పడుతున్న స్థానిక ప్రతినిధులు మొత్తం సొమ్ములో పది శాతం వరకు ఇవ్వాలని ఒత్తిళ్లు లేదంటే పనులు జరగనివ్వబోమని బెదిరింపులు సొంత వాళ్లకు సబ్ కాంట్రాక్టు కోసం మరికొందరి పట్టు విరాళాలు కోరుతున్న అధికార పార్టీ కార్యకర్తలు చెరువుల వద్ద శిలాఫలకాలు, పనుల ప్రారంభానికి ఆర్భాటాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే దందా తీవ్ర ఇబ్బందులతో ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల ఫిర్యాదులు సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ’లో కమీషన్ల దందా మొదలైంది. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం స్థానిక ప్రజా ప్రతినిధులకు వరంగా మారింది. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు ప్రస్తుతం కమీషన్ల కాక తగులుతోంది. నేతల ఒత్తిళ్లను తట్టుకోలేక అత్యధికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ బాగోతం పనుల నాణ్యతపై ప్రభావం చూపిస్తుందని, చివరకు ఈ కార్యక్రమమే అభాసుపాలయ్యే ప్రమాదముందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని, మిషన్ కాకతీయ కాస్తా క‘మీషన్’ కాకతీయగా మారుతోందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. అంచనాలు రూపొందించడం నుంచి ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ల వరకు అంతా సజావుగానే సాగిన ప్రక్రియ.. పనులు మొదలవడంతోనే పక్కదారి పట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్‌ను ఐదు నుంచి పది శాతం మేర కమీషన్ ఇవ్వాలని స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టుపడుతున్నారు. మరికొన్ని చోట్ల తాము సూచించిన వారికి సగం పని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అంచనా కంటే 25 నుంచి 30 శాతం అధిక మొత్తానికి టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఈ పరిణామాలతో కంగుతింటున్నారు. కొందరు నాసిరకం పనులకు సిద్ధపడి నేతలతో రాజీపడుతుంటే, మరికొందరేమో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. కమీషన్ ఇవ్వాల్సిందే..!: ప్రస్తుతం చేపట్టిన 9,577 చెరువుల పునరుద్ధరణ పనుల్లో ఇప్పటివరకు 6,268 చెరువుల పనులకు ప్రభుత్వం రూ. 2,500 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో 3,270 చెరువులకు ఇప్పటికే కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదరగా, 1645 చెరువుల పనులు ఇప్పటికే ఆరంభమయ్యాయి. పనులు మొదలైన చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు రంగ ప్రవేశం చేసేశారు. తమకు మొత్తం కాంట్రాక్టు సొమ్ములో ఐదు శాతం కావాలని కొన్ని చోట్ల, పది శాతం కంటే తక్కువ ఇస్తే పనులు చేయొద్దని మరికొన్ని చోట్ల డిమాండ్లు పెడుతున్నారు. ఇవ్వడానికి సిద్ధపడని కాంట్రాక్టర్లకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, కరీనంగర్ జిల్లా పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గాల్లోని కాంట్రాక్టర్లు ఇప్పటికే ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గం సిద్దిపేటలోనే ఓ కాంట్రాక్టర్‌కు టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. తమకు ఐదు శాతం కమీషన్ ఇస్తేనే పనులు చేయనిస్తామంటూ వారు బెదిరించారు. ఈ సంగతి తెలిసి మంత్రి సదరు కార్యకర్తలను హెచ్చరించినట్లు సమాచారం. మంత్రి పరిధిలోనే పరిస్థితి ఇలా ఉందంటే.. ఇక అన్ని జిల్లాల్లో ఇంతకన్నా ఘోరంగా ఉంది. అనేక చోట్ల బెదిరింపుల పర్వం జోరుగా సాగుతోంది. ‘అసలు నేనే టెండర్ వేసి ఉంటే నీకు వచ్చేదా.. అది దృష్టిలో ఉంచుకో.. మేం టెండర్లో పాల్గొనలేదు కాబట్టే నీకు పని వచ్చింది. నీకు ఎటూ 25 శాతం లాభం వస్తుంది.. అందులో నాకు 7.5 శాతం ఇవ్వు. అందులో సగం ముందే ఇచ్చేయ్’ అంటూ నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కాంట్రాక్టర్‌ను ఓ ఎంపీటీసీ బెదిరించినట్లు తెలిసింది. ఒప్పందం సమయంలోనే కమీషన్లు పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఉంటుందని, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని తెలిసి చాలా మంది పార్టీ నేతలు, కార్యకర్తలు కాంట్రాక్టర్ల అవతారమెత్తారు. అఘమేఘాల మీద కాంట్రాక్టర్‌గా లెసైన్సులు పొందారు. టెండర్ల ప్రక్రియ మొదలైన వెంటనే రూ. 50 లక్షలకు మించి అంచనా మొత్తం ఉన్న చెరువులకు ఇతరులు టెండర్లు వేయకుండా అడ్డుకున్నారు. వరంగల్ జిల్లా స్టేషన్గణపూర్, నల్లగొండ జిల్లా నకిరేకల్, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ నేతలులేదా వారి సమీప బంధువులే కాంట్రాక్టర్లుగా చెరువు పనులు చేజిక్కించుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఎల్లారెడ్డి, బాల్కొండ వంటి కొన్ని నియోజకవర్గాల్లో మూడుసార్లు టెండర్లకు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. కొందరు ఔత్సాహికులు ముందుకు వచ్చినా స్థానిక టీఆర్ఎస్ నేతలు బెదిరించారు. పెద్ద ఎత్తున చెరువుల పనులు తీసుకోవాలని ముందుకు వచ్చిన ఇద్దరు కాంట్రాక్టర్లను ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. స్థానిక నేతల ఒత్తిళ్ల మేరకు టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదని జిల్లా స్థాయి అధికారి ఒకరు చెప్పారు. చివరకు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు తమ సొంత మనుషులకే టెండర్లు దక్కేలా చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌లో తీవ్ర ఒత్తిళ్లు మహబూబ్‌నగర్ జిల్లాలో రూ. 30 నుంచి రూ. 40 లక్షల టెండర్లు పూర్తిగా తమ మద్దతుదారులకే దక్కేలా స్థానిక ఎమ్మెల్యేలు జాగ్రత్తలు తీసుకోగా, చెరువుల పనులు దక్కని చిన్న స్థాయి నేతలు కమీషన్ల కోసం కాంట్రాక్టర్ల వెంట పడుతున్నారు. వారితో గొడవలకు దిగుతున్నారు. చెరువు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటున్న సమయంలోనే స్థానిక ప్రజా ప్రతినిధులు రంగప్రవేశం చేస్తున్నారు. ఒప్పందం ఖరారు కావాలంటే ముందుగా తమకు పని విలువలో పది శాతందాకా కమీషన్‌ను ఇవ్వాలని, లేదంటే తమకు సంబంధించిన ప్రొక్లెయినర్లు, ట్రాక్టర్లు మాత్రమే తీసుకోవాలని షరతు పెడుతున్నారు. మాట వినని కాంట్రాక్టర్లు ఉంటే అధికారులతోనూ వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. మంత్రులు లక్ష్మారెడ్డి, కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్చర్ల, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోనే ఇలాంటి ఘటనలు కోకొల్లలు. చెరువులను దక్కించుకున్న కాంట్రాక్లర్లను బెదిరించి తమ వారికి ఆ పనుల్లో వాటా ఇప్పించే యత్నాలకు సైతం నేతలు దిగినట్లు తెలుస్తోంది. ఇక గ్రామ స్థాయిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా ఇదే తరహా ఒత్తిళ్లకు దిగి వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. పనుల ప్రారంభానికే అడ్డగోలు ఖర్చు ఒక నియోజకవర్గ పరిధిలో ఎన్ని చెరువుల పనులు ఆరంభమైతే అన్ని చెరవులను స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే ఆరంభిస్తున్నారు. అలా ఒక్కో నియోజకవర్గ పరిధిలో 50 చెరువుల పనులను ఆరంభిస్తే ఆ చెరువు పనులన్నింటి వద్ద స్థానిక ప్రజా ప్రతినిధుల పేర్లతో శిలాఫలకం ఏర్పాటు, ఆ కార్యక్రమానికయ్యే ఖర్చు, ఫ్లెక్సీలు, కార్యకర్తలకు భోజనాలు అన్నీ కాంట్రాక్టర్లపైనే మోపుతున్నారు. దీంతో ఒక్కో చెరువు పనుల ప్రారంభానికే రూ. 30 వేల వరకు ఖర్చవుతోంది. ఈ లెక్కన కాంట్రాక్టర్లంతా కలిసి ఇప్పటివరకు రూ. 5 కోట్ల వరకైనా ఖర్చు చేశారని అంచనా. ఈ లెక్కన 9,577 చెరువులకు సంబంధించిన పనుల ప్రారంభానికి ఖర్చు రూ. 30 కోట్లు దాటుతుందని అధికారులు అంటున్నారు. మొత్తంగా మిషన్ కాకతీయ పనులపై ఓ ఉన్నతోద్యోగి మాట్లాడుతూ.. ‘మా బాధలు ఎన్నని చెప్పమంటారు. టెండర్ల వరకు బాగానే జరిగినా ఆ తర్వాత మా ప్రాణానికొచ్చింది. ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న ఒత్తిళ్లు ఏమని చెప్పమంటారు. గత అనుభవాల దృష్ట్యా ఏ విధంగా పనులు జరగకూడదని ప్రభుత్వం నిర్ణయించిందో.. అదే ఇప్పుడు పునరావృతమవుతోంది. దీనిపై ప్రభుత్వ పెద్దలే కల్పించుకోవాలి. అప్పుడే మిషన్‌ను కాపాడగలం’ అని ఆవేదనగా చెప్పారు. -
పాలన వేగవంతం
- జిల్లాలో ప్రతీ అర్హుడికి సంక్షేమ పథకాలు అందించటమే లక్ష్యం - కాకతీయ మిషన్, రోడ్ల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి - వాటర్‌గ్రిడ్ ద్వారా జిల్లా అంతటికీ తాగునీరు - విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల సాక్షి ప్రతినిధి, ఖమ్మం : నూతనంగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారుల విభజన జరిగిందని, ఇక నుంచి జిల్లాలో పాలన వేగవంతం చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్ 2న ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారని, గత నెల వరకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ పంపకాలు పూర్తి కాకపోవడంతో పాలనలో ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ప్రధానంగా కాకతీయ మిషన్, రోడ్ల మరమ్మతులు, విస్తరణ, అంగన్వాడీలకు సన్నబియ్యం, హరితహారం, వాటర్‌గ్రిడ్ పథకాలను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. కాకతీయ మిషన్ కింద 900 చెరువుల మరమ్మతు లక్ష్యం కాగా, 585 చెరువులకు అంచనాలు వేసి ఆమోదానికి పంపామని తెలిపారు. మిగిలిన పనుల అంచనాలు వారం రోజుల్లో పూర్తిచేసి టెండర్లు పిలుస్తామన్నారు. ఇప్పటికే 186 పనులకు టెండర్లు పూర్తి చేశామని, ఈ నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో అంచనాలు రూపొందించేలా ఆదేశాలు జారీ చేశామని వివరించారు. పంచాయతీరాజ్ శాఖలో ఉన్న రోడ్లు పదేళ్లలో విచ్ఛిన్నం, విధ్వంసం అయ్యాయని, వాటికి రెన్యూవల్స్, రిపేర్లకు టెండర్లు పిలిచామని చెప్పారు. ఆర్అండ్బీ పరిధిలో 104 పనులకు టెండర్లు పిలిచామని, వారంలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రూ.20 కోట్లతో 80 పనులు చేపడతామన్నారు. జిల్లాలో వాటర్‌గ్రిడ్ పథకం కింద మూడు ప్రాజెక్టుల ద్వారా తాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. తొలుత సత్తుపల్లి, అశ్వారావుపేట నియోకవర్గాలకు కృష్ణాజలాల నుంచి తాగునీటిని అందించాలని భావించామని, అది సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవటంతో గోదావరి నుంచి నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. హరితహారం కింద లక్ష్యాలు సాధించేందుకు ఈ నెలాఖరు నాటికి మొక్కలు నాటుతామన్నారు. రానున్న వేసవిలో కరెంట్, నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అందుకు అవసరమైన నిధులకోసం ప్రతిపాదనలు పంపించాలన్నారు. పెన్షన్లు రానివారు అధైర్యపడవద్దని, చివరి మనిషి వరకు పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. హాస్టళ్లలో, అంగన్వాడీ కేంద్రాల్లో సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని, పాలు, గుడ్లపై కూడా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. కడుపులో ఉన్న బిడ్డకు, తల్లికి ఆహారం అందించటంతో పాటు పుట్టిన నాటి నుంచి పెద్దయ్యేంత వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు. షాధీముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాన్ని అర్హులకు అందించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట కలెక్టర్ ఇలంబరితి, చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఉన్నారు. -
‘మిషన్’పై అశ్రద్ధ
⇒ నత్తనడకన సాగుతున్న మిషన్ కాకతీయ పనులు ⇒ 555 చెరువులకు గాను 340 చెరువుల్లో సర్వే పనులు కొలిక్కి ⇒ అందులో 187 చెరువులకు మాత్రమే ప్రతిపాదనలు తయారు ⇒ జూన్ నాటికి తొలివిడత పనులు పూర్తయ్యేది అనుమానమే సాక్షి, రంగారెడ్డి జిల్లా: చెరువుల పునరుద్ధరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘మిషన్ కాకతీయ’ పనుల్లో జిల్లాలో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. వచ్చే వర్షాకాలం నాటికి చెరువులను పునరుద్ధరించి అందుబాటులోకి తేవాలని సర్కారు భావించినప్పటికీ.. జిల్లాలో మాత్రం అధికారుల ఉదాసీనత వల్ల సర్వే పనులు ముందుకుసాగడం లేదు. నీటిపారుదల శాఖ ఇంజినీర్ల గణాంకాల ప్రకారం జిల్లాలో 2,747 చెరువులున్నాయి. ఈ చెరువులను పునరుద్ధరించి ఆయకట్టు పొలాలకు నీరు అందించి సాగులోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తొలివిడత 20శాతం చెరువులను ఎంపిక చేసుకుని వాటి మరమ్మతులు, కొత్తగా పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా నీటిపారుదల విభాగాలను ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లాలో 555 చెరువులను గుర్తించిన అధికారులు.. వాటి సర్వే పనుల్లో మాత్రం జాప్యం చేస్తున్నారు. దీంతో వర్షాకాలంలోగా నిర్దేశించిన చెరువులు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. మూడోవంతు చెరువులకే.. జిల్లాలో చెరువుల పునరుద్ధరణలో భాగంగా తొలివిడత 555 చెరువులను గుర్తించారు. ఈ చెరువులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలి. ఇందుకుగాను ముందుగా ఆయా చెరువులను సర్వే చేసి అంచనాలను సిద్ధం చేయాలి. ఇందులో భాగంగా సర్వే పనులను ఉపక్రమించిన అధికారులు.. ఇప్పటివరకు కేవలం 340 చెరువుల సర్వే మాత్రమే పూర్తి చేశారు. ఇందులో 187 చెరువులకు మాత్రమే ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో వంద ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం గల చెరువులు 77 ఉండగా, వంద ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులు 110 ఉన్నాయి. రూ.113 కోట్లకు ఓకే.. సర్వే పనులు పూర్తిచేసి ప్రణాళికలను ప్రభుత్వానికి పంపితే అందుకు సంబంధించి అనుమతులను ప్రభుత్వం ఇస్తుంది. ఈక్రమంలో జిల్లాలో 555 చెరువులకుగాను ఇప్పటివరకు 187 చెరువుల ప్రణాళికలు ప్రభుత్వానికి అందాయి. దీంతో ఆయా పనులను ఆమోదిస్తూ పరిపాలన పరమైన అనుమతులిచ్చింది. ఈ 187 చెరువుల మరమ్మతులకుగాను రూ.113 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. గడువులోగా పూర్తయ్యేనా.. వచ్చే ఏడాదిలో వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా నిర్దేశించిన చెరువుల పునరుద్ధరణ పూర్తికావాలి. జిల్లాలో 555 చెరువులు గుర్తించగా.. ఇప్పటివరకు 187 చెరువుల పనుల అంశం కొలిక్కి వచ్చింది. మిగతా చె రువులకు సంబంధించి సర్వే, ప్రణాళికల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి ఈపాటికే ప్రభుత్వ ఆమోదం లభిస్తే గడువులోగా పనులు పూర్తిచేసే వీలుండేది. కానీ అధికారుల ఉదాసీనవైఖరితో ప్రణాళికల తయారీ ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో వానాకాలంలోగా నిర్దేశించిన చెరువులు పునరుద్ధరణ అనుమానమే. -
జిల్లానుంచే కాకతీయ మిషన్
* పెలైట్ ప్రాజెక్టుగా మునుగోడు, భువనగిరి, ఆలేరు మండలాల ఎంపిక * డిసెంబర్ చివరినాటికి పనులు ప్రారంభం నల్లగొండటౌన్/చౌటుప్పల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాకతీయ మిషన్ పేరుతో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని జిల్లానుంచే ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించింది. వాటర్‌గ్రిడ్ పనులను జిల్లా నుంచే మొదలుపెడతామని ప్రకటించిన ప్రభుత్వం, హైదరాబాద్‌తోపాటు వాటర్‌గ్రిడ్‌ను చెరువులకు అనుసంధానం చేయాలనే ఆలోచనలో ఉంది. జిల్లాలో ఈ ఏడాది 952 చెరువులను పునరుద్ధరించాలని చిన్ననీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే కరువుతో అల్లాడుతున్న ఆలేరు, మునుగోడు, భువనగిరి మండలాల్లో పెలైట్ ప్రాజెక్టుగా చెరువుల పునరుద్ధరణను ప్రారంభించాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది. హైదరాబాద్‌లో గురువారం సీఎం కేసీఆర్ ముం బయికి చెందిన జెనిసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిపుణులతో సమావేశమయ్యారు. భౌగోళిక సమాచార సర్వే విధానం(జీఐఎస్)తో చెరువులను సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం లిడార్ టెక్నాలజీని ఉపయోగించి, వాటర్‌గ్రిడ్‌ను, హైదరాబాద్ నగరాన్ని, చెరువులను అనుసంధానం చేసేలా సర్వే చేయనున్నారు. అంచనాల రూపకల్పనలో నిమగ్నం పునరుద్ధరణకు సంబంధించి ఇప్పటికే సుమారు 200 చెరువులకు సంబంధించి అంచనాలు పూర్తి చేశారు. మిగతా 276 చెరువుల అంచనాలను నవంబర్ నెలాఖరు వరకు పూర్తిచేసి డిసెంబర్ మొదటి వారంలో పనులకు టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. పనుల్లో ఎలాంటి జాప్యమూ జరగకుండా వేగవంతంగా పూర్తి చేయించాలన్న భావనలో అధికారులు ఉన్నారు. దీనికిగాను గతంలో ఉన్న టెండర్ల ప్రక్రియ మాదిరిగా కాకుండా కేవలం వారం రోజులలో టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి డిసెంబర్‌లోపే సదరు కాంట్రాక్టర్లకు పనులను అప్పగించనున్నారు. డిసెంబర్లో మొదటి విడతగా పనులను ప్రారంభించిన 476 చెరువుల పునరుద్ధ్దరణ పనులను జూన్ చివరినాటికి పూర్తి చేయాలనే పట్టుదలలో ఉన్నారు. అదే విధంగా జనవరి మొదలైన మిగిలిన సగం 476 చెరువుల పునరుద్ధరణ పనులకు అంచనాల కోసం సర్వే పనులను ప్రారంభించాలని నిర్ణయించారు. వాటి అంచనాలను, టెండర్ ప్రక్రియను కొలిక్కితెచ్చి పనులను జూలై నెలలో ప్రారంభించి 2015 డిసెంబర్ నాటికి పూర్తి చేయడానికి ముమ్మరమైన కసరత్తు చేస్తున్నారు. 10నుంచి 15చెరువుల ఎంపిక.. తొలిదశలో చెరువుల పునరుద్ధరణ పథకం(కాకతీయ మిషన్)లో తొలిదశలో భాగంగా భువనగిరి, ఆలేరు, మునుగోడు మండలాలతోపాటు రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ మండలాల్లో త్వరలో సర్వేను ప్రారంభించనున్నారు. ఇప్పటికే చెరువుల పునరుద్ధరణకు భువనగిరిలో 16, ఆలేరులో 20, మునుగోడులో 9చెరువులను ఎంపిక చేశారు. తొలి దశగా ఈ మండలాల నుంచి, 10నుంచి 15చెరువులను ఎంపిక చేసి పనులను ప్రారంభించనున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ప్రతి మండలంలో 15నుంచి 20చెరువులను అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. చెరువుల్లో నీటిని తొలగించం : హమీద్‌ఖాన్, ఈఈ చెరువుల పునరుద్ధరణ పనులలో భాగంగా చెరువులలో ఉన్న నీటిని తొలగించం. నీటిని పూర్తిగా వాడుకున్న తరువాతనే పూడికతీత పనులను చేపడతాం. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తాం. అభివృద్ధి పనులు ఇలా.. * చెరువుల్లో పూడికతీతతోపాటు తూములు, అలుగులను సరిచేస్తారు. * చెరువుల్లోకి వర్షపునీరు వచ్చేలా వరద కాలువలు, ఫీడర్చానళ్లను కూడా అభివృద్ధి చేయనున్నారు. * నదులు, ప్రధాన వాగులపై చెక్‌డ్యాంల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను కూడా సర్వేలో గుర్తిస్తారు. * ఒక్కో చెరువుకు, సామర్థ్యాన్ని బట్టి రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేయనున్నారు. * వాటర్‌గ్రిడ్ పథకానికి ఈ చెరువులన్నింటినీ అనుసంధానం చేయనున్నారు. తద్వారా వాటర్‌గ్రిడ్‌లో ఎప్పుడూ నీరు నిల్వ ఉండేలా చూడనున్నారు.