కాకతీయ ‘కాసు’ల కథ.. మిషన్ 22% | kakatiya mission gets back with commission episode | Sakshi
Sakshi News home page

కాకతీయ ‘కాసు’ల కథ.. మిషన్ 22%

Published Sat, Aug 1 2015 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

కాకతీయ ‘కాసు’ల కథ.. మిషన్ 22%

కాకతీయ ‘కాసు’ల కథ.. మిషన్ 22%

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పథకం అధికారుల కమీషన్ల కక్కుర్తి కారణంగా అభాసుపాలవుతోంది. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ప్రక్రియలో అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. బిల్లులు పాసు కావాలంటే వివిధ స్థాయిల్లో అధికారులకు 12 శాతం, ప్రజా ప్రతినిధులకు 10 శాతం కమీషన్లు చెల్లించాల్సి వస్తోంది. దీంతో తక్కువ మొత్తానికి టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. ఈ బాగోతాన్ని ముందే గ్రహించిన కొందరు కాంట్రాక్టర్లు కమీషన్ల మేరకు సొమ్మును మిగుల్చుకునేందుకు పైపైన పనులు చేసి చేతులు దులుపుకొన్నారు. కొత్తగా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు చేతులు కాల్చుకున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ సగటున 17 శాతం తక్కువ మొత్తానికి అరడజను చెరువుల టెండర్లు తీసుకున్నారు. తీరా బిల్లులు తీసుకునే సమయానికి కమీషన్లు కలిపి చూసుకుంటే 11 శాతానికిపైగా నష్టం వాటిల్లింది. ఇదే సంగతిని ఆయన అధికారుల దృష్టికి తీసుకువెళితే... కథలు చెప్పొద్దంటూ ఆయన బిల్లు పాస్ చేయలేదు. ఆ కాంట్రాక్టర్ ఇక చేసేది లేక కమీషన్లు ముట్టజెప్పి, మిషన్ కాకతీయకు గుడ్‌బై చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర మంత్రి బంధువొకరు నాలుగు చెరువులకు సగటున 23 శాతం తక్కువకు టెండర్ పొందినా 15 శాతం లాభాలు ఆర్జించారు. ఈ నాలుగు చెరువుల్లో పనులు అత్యంత నాసిరకంగా ఉన్నా సరే అధికారులు బిల్లులు పాస్ చేశారు.
 
 కమీషన్లు ఇలా..
 
 ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 6,655 చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. రూ.1,500 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో ఇప్పటికే రూ.650 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ పనులకు బిల్లుల చెల్లింపు ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకు 1,070 చెరువులకు సంబంధించి రూ. 117.18 కోట్ల మేర బిల్లుల చెల్లింపులు చేశారు. మిగతా బిల్లుల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ బిల్లుల చెల్లింపు ప్రక్రియ కమీషన్లను బట్టే నడుస్తోంది. అధికారి స్థాయిని బట్టి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నుంచి క్షేత్రస్థాయిలో ఉండే అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) వరకూ అందరికీ కలిపి 12 శాతం దాకా ముట్టజెప్పాల్సి వస్తోందనే ఆరోపణలున్నాయి. పూడిక కొలతలు (మెజర్‌మెంట్) తీసుకునే ఏఈకి, అతనితో పాటు క్వాలిటీని నిర్ధారించే క్వాలిటీ కంట్రోల్ అధికారులకే 6 శాతం, కొలతల పుస్తకాన్ని పరిశీలించి ప్రభుత్వ ఆమోదం కోసం పంపేందుకు డీఈ, ఈఈ స్థాయిలో 1 శాతం చొప్పున, బిల్లులు పాస్ చేసే కార్యాలయానికి వెళ్లాక అక్కడి సంబంధిత అధికారులకు 4 శాతం మేర కమీషన్లు ముట్టజెప్పాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 బిల్లుల దగ్గర..
 
 తక్కువ మొత్తానికి టెండర్ వేసి నాణ్యతతో కూడిన పనులు చేసిన కాంట్రాక్టర్లు కమీషన్లు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. అలాం టివారికి సరిగా బిల్లులు పాస్ కావడం లేదనే ఆరోపణలున్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ చెరువుల పునరుద్ధరణపై ఆసక్తి కొద్దీ పది చెరువుల పనులను సగటున 7 శాతం తక్కువకు దక్కించుకున్నారు. గ్రామస్తుల సహకారం కూడా తీసుకుని విజయవంతంగా పని పూర్తి చేశారు. ‘‘నేను, నా కుటుంబ సభ్యుల పేర్లతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టాం. 90 శాతం నాణ్యతతో పనులు చేశాం, లాభం లేకున్నా పూర్తిచేశాం. ఇప్పుడు బిల్లుల దగ్గరకు వచ్చేసరికి ఎవరెవరికి ఎంత మొత్తంలో కమీషన్లు ముట్టజెప్పాలో చెబుతూ అధికారులు జాబితా ఇస్తున్నారు. పనులు బాగా చేశాం కదా అంటే ప్రతి పనిలో లోపా లు వెతుకుతున్నారు. చేసేది లేక కమీషన్లు ముట్టజెప్పాల్సి వస్తోంది. పనులకు ముందే స్థానిక ప్రజాప్రతినిధులకు 10 శాతం దాకా ముట్టజెప్పి, ఇప్పుడు అధికారులకూ ఇచ్చి.. ఇక మళ్లీ నేను మిషన్ కాకతీయ పనులు చేపట్టను..’’ అని ఆ కాంట్రాక్టర్ వాపోయారు. ఇలా అన్ని జిల్లాల్లోనూ కమీషన్లు ఇవ్వడానికి ముందుకు రాని కాంట్రాక్టర్ల బిల్లులు సాంకేతిక కారణాలతో పాస్ కాకుండా తిరిగి వస్తున్నాయి.
 
 మంత్రే హెచ్చరించినా..
 
 కమీషన్ల విషయమై కాంట్రాక్టర్ల నుంచి మంత్రి హరీశ్‌రావుకు, ఆయన పేషీకి చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. 10 నుంచి 30 శాతం తక్కువకు కోట్ చేసి పనులు దక్కించుకున్న తమకు ఈ కమీషన్ల వ్యవహారం గుదిబండగా మారుతోందని వారు వాపోతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకున్న హరీశ్‌రావు... ఇటీవల ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు. అయినా వారి తీరు మారలేదు. ఈ కమీషన్ల వ్యవహారంపై మంత్రి పేషీ అధికారులు కొందరు కింది అధికారులను ఫోన్‌లో నిలదీస్తుంటే.. ‘మేం డిమాండ్ చేయడం లేదు. కేవలం గిఫ్ట్‌గా ఇస్తే తీసుకుంటున్నా’మని బదులు చెబుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement