క‘మీషన్’ కాకతీయ! | Kamisan 'Kakatiya! | Sakshi
Sakshi News home page

క‘మీషన్’ కాకతీయ!

Published Tue, Apr 7 2015 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 11:56 PM

క‘మీషన్’ కాకతీయ!

క‘మీషన్’ కాకతీయ!

  • చెరువు పనుల నిధులు మెక్కుతున్న నేతలు
  • కమీషన్ల కోసం కాంట్రాక్టర్లపై పడుతున్న స్థానిక ప్రతినిధులు
  • మొత్తం సొమ్ములో పది శాతం వరకు ఇవ్వాలని ఒత్తిళ్లు
  • లేదంటే పనులు జరగనివ్వబోమని బెదిరింపులు
  • సొంత వాళ్లకు సబ్ కాంట్రాక్టు కోసం మరికొందరి పట్టు
  • విరాళాలు కోరుతున్న అధికార పార్టీ కార్యకర్తలు
  • చెరువుల వద్ద శిలాఫలకాలు, పనుల ప్రారంభానికి ఆర్భాటాలు
  • రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే దందా
  • తీవ్ర ఇబ్బందులతో ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల ఫిర్యాదులు
  • సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ’లో కమీషన్ల దందా మొదలైంది. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం స్థానిక ప్రజా ప్రతినిధులకు వరంగా మారింది. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు ప్రస్తుతం కమీషన్ల కాక తగులుతోంది. నేతల ఒత్తిళ్లను తట్టుకోలేక అత్యధికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ బాగోతం పనుల నాణ్యతపై ప్రభావం చూపిస్తుందని, చివరకు ఈ కార్యక్రమమే అభాసుపాలయ్యే ప్రమాదముందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    దాదాపు అన్ని జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని, మిషన్ కాకతీయ కాస్తా క‘మీషన్’ కాకతీయగా మారుతోందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. అంచనాలు రూపొందించడం నుంచి ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్ల వరకు అంతా సజావుగానే సాగిన ప్రక్రియ.. పనులు మొదలవడంతోనే పక్కదారి పట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్‌ను ఐదు నుంచి పది శాతం మేర కమీషన్ ఇవ్వాలని స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టుపడుతున్నారు. మరికొన్ని చోట్ల తాము సూచించిన వారికి సగం పని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అంచనా కంటే 25 నుంచి 30 శాతం అధిక మొత్తానికి టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఈ పరిణామాలతో కంగుతింటున్నారు. కొందరు నాసిరకం పనులకు సిద్ధపడి నేతలతో రాజీపడుతుంటే, మరికొందరేమో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
     
    కమీషన్ ఇవ్వాల్సిందే..!: ప్రస్తుతం చేపట్టిన 9,577 చెరువుల పునరుద్ధరణ పనుల్లో ఇప్పటివరకు 6,268 చెరువుల పనులకు ప్రభుత్వం రూ. 2,500 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో 3,270 చెరువులకు ఇప్పటికే కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదరగా, 1645 చెరువుల పనులు ఇప్పటికే ఆరంభమయ్యాయి. పనులు మొదలైన చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు రంగ ప్రవేశం చేసేశారు. తమకు మొత్తం కాంట్రాక్టు సొమ్ములో ఐదు శాతం కావాలని కొన్ని చోట్ల, పది శాతం కంటే తక్కువ ఇస్తే పనులు చేయొద్దని మరికొన్ని చోట్ల డిమాండ్లు పెడుతున్నారు. ఇవ్వడానికి సిద్ధపడని కాంట్రాక్టర్లకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు.

    ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, కరీనంగర్ జిల్లా పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లా బాన్స్‌వాడ నియోజకవర్గాల్లోని కాంట్రాక్టర్లు ఇప్పటికే ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గం సిద్దిపేటలోనే ఓ కాంట్రాక్టర్‌కు టీఆర్‌ఎస్ కార్యకర్తల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. తమకు ఐదు శాతం కమీషన్ ఇస్తేనే పనులు చేయనిస్తామంటూ వారు బెదిరించారు. ఈ సంగతి తెలిసి మంత్రి సదరు కార్యకర్తలను హెచ్చరించినట్లు సమాచారం. మంత్రి పరిధిలోనే పరిస్థితి ఇలా ఉందంటే.. ఇక అన్ని జిల్లాల్లో ఇంతకన్నా ఘోరంగా ఉంది. అనేక చోట్ల బెదిరింపుల పర్వం జోరుగా సాగుతోంది. ‘అసలు నేనే టెండర్ వేసి ఉంటే నీకు వచ్చేదా.. అది దృష్టిలో ఉంచుకో.. మేం టెండర్‌లో పాల్గొనలేదు కాబట్టే నీకు పని వచ్చింది. నీకు ఎటూ 25 శాతం లాభం వస్తుంది.. అందులో నాకు 7.5 శాతం ఇవ్వు. అందులో సగం ముందే ఇచ్చేయ్’ అంటూ నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కాంట్రాక్టర్‌ను ఓ ఎంపీటీసీ బెదిరించినట్లు తెలిసింది.
     
    ఒప్పందం సమయంలోనే కమీషన్లు


    పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఉంటుందని, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని తెలిసి చాలా మంది పార్టీ నేతలు, కార్యకర్తలు కాంట్రాక్టర్ల అవతారమెత్తారు. అఘమేఘాల మీద కాంట్రాక్టర్‌గా లెసైన్సులు పొందారు. టెండర్ల ప్రక్రియ మొదలైన వెంటనే రూ. 50 లక్షలకు మించి అంచనా మొత్తం ఉన్న చెరువులకు ఇతరులు టెండర్లు వేయకుండా అడ్డుకున్నారు. వరంగల్ జిల్లా స్టేషన్‌గణపూర్, నల్లగొండ జిల్లా నకిరేకల్, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ నేతలులేదా వారి సమీప బంధువులే కాంట్రాక్టర్లుగా చెరువు పనులు చేజిక్కించుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఎల్లారెడ్డి, బాల్కొండ వంటి కొన్ని నియోజకవర్గాల్లో మూడుసార్లు టెండర్లకు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. కొందరు ఔత్సాహికులు ముందుకు వచ్చినా స్థానిక టీఆర్‌ఎస్ నేతలు బెదిరించారు. పెద్ద ఎత్తున చెరువుల పనులు తీసుకోవాలని ముందుకు వచ్చిన ఇద్దరు కాంట్రాక్టర్లను ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. స్థానిక నేతల ఒత్తిళ్ల మేరకు టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదని జిల్లా స్థాయి అధికారి ఒకరు చెప్పారు. చివరకు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు తమ సొంత మనుషులకే టెండర్లు దక్కేలా చేసుకున్నారు.
     
    మహబూబ్‌నగర్‌లో తీవ్ర ఒత్తిళ్లు


    మహబూబ్‌నగర్ జిల్లాలో రూ. 30 నుంచి రూ. 40 లక్షల టెండర్లు పూర్తిగా తమ మద్దతుదారులకే దక్కేలా స్థానిక ఎమ్మెల్యేలు జాగ్రత్తలు తీసుకోగా, చెరువుల పనులు దక్కని చిన్న స్థాయి నేతలు కమీషన్ల కోసం కాంట్రాక్టర్ల వెంట పడుతున్నారు. వారితో గొడవలకు దిగుతున్నారు. చెరువు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటున్న సమయంలోనే స్థానిక ప్రజా ప్రతినిధులు రంగప్రవేశం చేస్తున్నారు. ఒప్పందం ఖరారు కావాలంటే ముందుగా తమకు పని విలువలో పది శాతందాకా కమీషన్‌ను ఇవ్వాలని, లేదంటే తమకు సంబంధించిన ప్రొక్లెయినర్లు, ట్రాక్టర్లు మాత్రమే తీసుకోవాలని షరతు పెడుతున్నారు. మాట వినని కాంట్రాక్టర్లు ఉంటే అధికారులతోనూ వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. మంత్రులు లక్ష్మారెడ్డి, కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్చర్ల, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోనే ఇలాంటి ఘటనలు కోకొల్లలు. చెరువులను దక్కించుకున్న కాంట్రాక్లర్లను బెదిరించి తమ వారికి ఆ పనుల్లో వాటా ఇప్పించే యత్నాలకు సైతం నేతలు దిగినట్లు తెలుస్తోంది. ఇక గ్రామ స్థాయిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా ఇదే తరహా ఒత్తిళ్లకు దిగి వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి.
     
    పనుల ప్రారంభానికే అడ్డగోలు ఖర్చు

    ఒక నియోజకవర్గ పరిధిలో ఎన్ని చెరువుల పనులు ఆరంభమైతే అన్ని చెరవులను స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే ఆరంభిస్తున్నారు. అలా ఒక్కో నియోజకవర్గ పరిధిలో 50 చెరువుల పనులను ఆరంభిస్తే ఆ చెరువు పనులన్నింటి వద్ద స్థానిక ప్రజా ప్రతినిధుల పేర్లతో శిలాఫలకం ఏర్పాటు, ఆ కార్యక్రమానికయ్యే ఖర్చు, ఫ్లెక్సీలు, కార్యకర్తలకు భోజనాలు అన్నీ  కాంట్రాక్టర్లపైనే మోపుతున్నారు. దీంతో ఒక్కో చెరువు పనుల ప్రారంభానికే రూ. 30 వేల వరకు ఖర్చవుతోంది.

    ఈ లెక్కన కాంట్రాక్టర్లంతా కలిసి ఇప్పటివరకు రూ. 5 కోట్ల వరకైనా ఖర్చు చేశారని అంచనా. ఈ లెక్కన 9,577 చెరువులకు సంబంధించిన పనుల ప్రారంభానికి ఖర్చు రూ. 30 కోట్లు దాటుతుందని అధికారులు అంటున్నారు. మొత్తంగా మిషన్ కాకతీయ పనులపై ఓ ఉన్నతోద్యోగి మాట్లాడుతూ.. ‘మా బాధలు ఎన్నని చెప్పమంటారు. టెండర్ల వరకు బాగానే జరిగినా ఆ తర్వాత మా ప్రాణానికొచ్చింది. ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న ఒత్తిళ్లు ఏమని చెప్పమంటారు. గత అనుభవాల దృష్ట్యా ఏ విధంగా పనులు జరగకూడదని ప్రభుత్వం నిర్ణయించిందో.. అదే ఇప్పుడు పునరావృతమవుతోంది. దీనిపై ప్రభుత్వ పెద్దలే కల్పించుకోవాలి. అప్పుడే మిషన్‌ను కాపాడగలం’ అని ఆవేదనగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement