సాక్షి ప్రతినిధి, కడప: అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలంటూ కొన్నేళ్లుగా విన్నవించుకుంటున్నా ఏమాత్రం పట్టించుకోని ప్రజాప్రతినిధులకు ఉన్నట్లుండి జ్ఞానోదయమవుతోంది. ఏకంగా నిధుల వరదనే పారిస్తున్నారు. ఇంత కాలం సొంతలాభం చూసుకున్న నేతలకు ఒక్కమారుగా నియోజకవర్గం, ప్రజలు, అభివృద్ధి పనులు గుర్తుకొస్తున్నాయి. జిల్లాకు చెందిన మంత్రివర్యుడు అహ్మదుల్లా ఇలాంటి కోవలో ముందువరుసలో నిలుస్తున్నారు. మరో పదిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరో వైపు రాష్ట్ర విభజన అంశం కాకమీదుంది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సమైక్యవాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో మంత్రి అహ్మదుల్లా చర్యలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పదవీకాలం ముగుస్తుండటంతో హడావుడిగా రూ.12.72 కోట్లతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చకచకా చేసేస్తున్నారు. ఈ పనులను ఎప్పుడు చేపట్టి ఉంటే ప్రజలు హర్షించేవారని ఎన్నికల ముందు హడావిడిగా చేపట్టడంతో ఓటర్ల దృష్టిని ఆకర్షించడానికేనని భావిస్తున్నారు.
అవసరమున్న చోట వదిలేసి....
అభివృద్ధి చేయాల్సిన చోట వదిలేసి, ఉన్నచోటే మరిన్ని వసతులు సమకూరుస్తున్నారు. ఇందులో స్వలాభ పేక్ష ఉండడమే కారణమని పలువురు పేర్కొంటున్నారు. కడప నగరంలో కొత్త భవనం నిర్మిస్తే తన అభివృద్ధి పనుల ఖాతాలోకి వస్తుందని మిగతా ప్రాంతాలలో అలా చేస్తే తనకు ఏమాత్రం ఉపయోగం ఉండదనే రీతిలో మంత్రి వ్యవహరిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇందుకు జిల్లా కేంద్ర గంధ్రాలయ సంస్థ భవనం నిదర్శనంగా నిలుస్తోంది. మంచి వసతులతో కూడిన భవనం జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఉంది. ఇప్పుడున్న ఆ భవనాన్ని 1986లో అప్పటి మంత్రి ఆర్. రాజగోపాల్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. కేవలం 28 సంవత్సరాల క్రితం ప్రారంభించిన భవనం స్థానంలో కొత్తగా రూ.5కోట్లతో నిర్మించేందుకు మంత్రి అహ్మదుల్లా శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఇప్పటికే 36 మండలాల్లో గ్రంధాలయాలకు సొంత భవనాలు లేవు. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత నిధులతో నూతనంగా భవనాలను నిర్మించవచ్చు. అలాగే 20 మంది గ్రంధాలయ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు అందడం లేదు. ఇవేవీ పట్టించుకోకుండా హడావుడిగా జిల్లా కేంద్రంలో నూతన గ్రంధాలయ భవనానికి శంకుస్థాపన చేయడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని పలువురు ఎత్తి చూపుతున్నారు.
సొంత శాఖ పరిధిలోని పనులు సైతం...
రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేస్తున్న అహ్మదుల్లా తన శాఖ పరిధిలోని పనులకు సైతం హడావుడిగా శ్రీకారం చుట్టారు. ఎన్నికల ముందర పంపకాల జాతరకు తెరలేపారని పలువురు ఆరోపిస్తున్నారు. ఐదేళ్లుగా మంత్రిగా పనిచేస్తున్న ఆయన ఇంత కాలం అభివృద్ధి పనులను విస్మరించి గడువు ముగిసే ముందు శంకుస్థాపనలు చేపట్టాడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. జిల్లా కేంద్రంలో పెద్దదర్గా మసీదు కోసం రూ.2.32కోట్లు, అలాగే పలు మసీదుల నిర్మాణంతో పాటు పునఃనిర్మించేందుకు మరో రూ.4.70కోట్లతో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అయితే ఏనాడో చేపట్టాల్సిన పనులను మంత్రిగా ఉండి కూడా విస్మరించారని పలువురు ఆరోపిస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితమే ఈ పనులను పూర్తి చేసి ఉంటే ఈపాటికే ముస్లీం మైనార్టీలకు అందుబాటులో ఉండేవని పలువురు భావిస్తున్నారు.
ఇప్పటికీ పూర్తి కాని కొత్త కలెక్టరేట్..
అభివృద్ధి పనులపై దృష్టి సారించాల్సిన మంత్రి అహ్మదుల్లాకు అసంపూర్తిగా ఉన్న కొత్త కలెక్టరేట్ భవనం గుర్తుకు రావడం లేదా అని జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జెట్‌స్పీడ్‌తో మొదలయిన పనులు నిధుల కొరత కారణంగా నత్తనడకను మరిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన మంత్రిగా అహ్మదుల్లా ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపలేక పోయారు. ఇప్పటికీ అవ సరం మేరకు నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఇవేవీ పట్టించుకోకుండా కేవలం స్వలాభపేక్షతోనే కడప నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టారని పలువురు ఆరోపిస్తున్నారు.