పోట్లదుర్తికి పోవాలంటే భయం | leaders behaviour Wildly at potladutthy in kadapa | Sakshi
Sakshi News home page

పోట్లదుర్తికి పోవాలంటే భయం

Published Mon, May 8 2017 1:22 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

పోట్లదుర్తికి పోవాలంటే భయం

పోట్లదుర్తికి పోవాలంటే భయం

► స్పాట్‌ బిల్లింగ్‌ సిబ్బందిని కొట్టారు
► నాయకులే రౌడీల్లా దాడి చేస్తున్నారు
► తెలుగునాడు విద్యుత్‌ ఉద్యోగుల జిల్లా కార్యదర్శి  పరశురాం


ప్రొద్దుటూరు టౌన్‌/ఎర్రగుంట్ల: విద్యుత్‌ సిబ్బంది పోట్లదుర్తికి పోవాలంటే భయపడుతున్నారు.  నాయకులే రౌడీల్లా దాడి చేస్తున్నారని తెలుగునాడు విద్యుత్‌ ఉద్యోగుల యూనియన్‌ జిల్లా కార్యదర్శి పరశురాం అన్నారు. ఆదివారం మధ్యాహ్నం పోట్లదుర్తిలో ఎంపీ సీఎం రమేష్‌ దాడిలో గాయపడిన అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ దండు వీరశేఖర్‌ను పరామర్శించేందుకు ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా అయన విలేకరులతో మాట్లాడారు. పోట్లదుర్తిలో విద్యుత్‌ సిబ్బంది ఎవ్వరూ పని చేసేందుకు ముందుకురారన్నారు. ఏ తప్పు చేయకపోయినా మాపై అధికార పార్టీ నాయకులు దాడి చేస్తున్నారని చెప్పారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎక్కడా ఉండవని పేర్కొన్నారు.

స్పాట్‌బిల్లింగ్‌ సిబ్బందిపై దాడి..
పోట్లదుర్తిలో పనిచేయని విద్యుత్‌ మీటర్లను మార్చేందుకు వెళ్లిన స్పాట్‌ బిల్లింగ్‌ సిబ్బందిని చింతకుంట మధునాయుడు ఎంపీ సీఎం రమేష్‌   మందే   కాళ్లతో  కొట్టాడన్నారు.  ఏమన్నా మాట్లాడితే మీరు దొంగలని కేసులు పెడతాం..ఆడవారితో ఫిర్యాదు చేయిస్తామంటూ బెదిరించడం అధికార పార్టీ నాయకులకు పరిపాటిగా మారిందన్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు కూడా ఆ నాయకులంటే భయంతో ఏమీ మాట్లాడరన్నారు. మా ప్రాణాలు పోయినా అధికారులు చలించరా అని ప్రశ్నించారు.

నేటి నుంచి విధుల బహిష్కరణ..
సోమవారం నుంచి పోట్లదుర్తిలో విద్యుత్‌ విధులు బహిష్కరిస్తున్నట్లు తెలుగునాడు విద్యుత్‌ ఉద్యోగుల యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు   జయరాజ్, డివిజన్‌ అధ్యక్షుడు కె.రమేష్‌ తెలిపారు. ఎన్ని సార్లు అధికార పార్టీ నాయకులతో దెబ్బలు తినాలని ప్రశ్నించారు.

నేడు డీఈ కార్యాలయం ఎదుట ధర్నా
విద్యుత్‌ సిబ్బందిపై ఎంపీ రమేష్‌ దాడి చేసి గాయపరిచినా విద్యుత్‌శాఖ డీఈ విజయన్‌ కనీసం చూసేందుకు కూడా రాలేదని, అసలు దాడే జరగలేదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఈ విషయంపై డీఈ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేస్తున్నట్లు ఎర్రగుంట్ల మండల విద్యుత్‌ ఉద్యోగులు తెలిపారు.

ప్రాణహాని ఉంది
నాకు ఎంపీ సీఎం రమేష్‌ కుటుంబ సభ్యుల వల్ల ప్రాణహాని ఉందని పోట్లదుర్తి అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ దండు వీరశేఖర్‌ అన్నారు. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో  చికిత్స పొందిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోట్లదుర్తిలో ఇక తాను విధులు నిర్వహించలేనని పేర్కొన్నారు. తనకు ఏమి జరిగినా ఎంపీదే బాధ్యత అని తెలిపారు.

మాపై దాడి చేశారు
రెండు నెలల కిందట స్పాట్‌ బిల్లింగ్‌లో పనిచేస్తున్న మేము  మీటర్లు చెడిపోతే మార్చేందుకు వెళ్లాం. పోట్లదుర్తికి చెందిన చింతకుంట మధునాయుడు వచ్చి.. ఏం చేస్తున్నారని పిలిచాడు. మీటర్లు మార్చేందుకు వచ్చామని చెప్పగానే మమ్మల్ని ఇళ్ల వద్ద నుంచి బయటికి పిలుచుకొచ్చి  కొట్టాడు. ఎందుకు కొడుతున్నారో కూడా మాకు తెలియలేదు. అధికారులు చెబితే మీటర్లు మార్చేందుకు వెళ్లాం.  – నరేంద్ర, సంతోష్‌

డీఈ నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తున్నారు
పోట్లదుర్తిలో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ దండు వీరశేఖర్‌పై ఎంపీ రమేష్‌  దాడిచేసిన విషయాన్ని ప్రొద్దుటూరు డివిజన్‌ విద్యుత్‌శాఖ డీఈకి తెలిపాం. ఇంత వరకు ఆస్పత్రికి  రాలేదు. పైగా మీడియా ప్రతినిధులు ఫోన్‌ చేసి  అడిగితే ఎవరిపై దాడి జరగలేదు, వందంతులేనని చెబుతున్నారు. ఇలాంటి అధికారులు ఎందుకు పనిచేయాలి. సిబ్బంది ప్రాణాలు తీసినా వీరు చలించరు.  – దండు రత్నాకర్, వీరపునాయునిపల్లె లైన్‌మెన్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement