సాక్షి, కడప : ప్రధాన సాగునీటి వనరులైన గాలేరు-నగరి, హంద్రీ-నీవా, కేసీ కెనాల్ లాంటి ప్రాజెక్టులను ప్రస్తుత సీఎం విస్మరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దుయ్యబట్టారు. గాలేరు-నగరి ప్రాజెక్టు ద్వారా కమలాపురం నియోజకవర్గానికి తాగు, సాగు నీరందించాలని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన (గురువారం సాయంత్రం విరమించారు) దీక్షకు మద్దతుగా గురువారం అన్నిచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా కడపలో ఎమ్మెల్యే అంజద్‌బాష, మేయర్ సురేష్‌బాబు, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కమలాపురంలో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, బద్వేలులో ఎమ్మెల్యే జయరాములు, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, పులివెందులలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి చంద్రబాబు ఏనాడూ కృషి చేయలేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల కాలంలో ప్రాజెక్టులకు కేవలం రూ. 17 కోట్లు విడుదల చేస్తే.. దివంగత సీఎం వైఎస్సార్ సుమారు నాలుగు వేల కోట్లు విడుదల చేశారన్నారు. అప్పట్లో 80 శాతం పనులు పూర్తయినా ప్రస్తుతం 20 శాతం పనులు చేయడానికి కూడా ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలపక్ష నేతలు పాదయాత్ర చేసి ప్రాజెక్టుల స్థితిగతులను సీఎంకు విన్నవించడానికి వెళితే కలవకుండా వెళ్లిపోవడం ఆయనకే చెల్లిందన్నారు. చివరకు బ్రహ్మంసాగర్‌కు కూడా నీరు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని, సీమకు సంబంధించిన గాలేరు-నగరి, హంద్రీ-నీవా, కేసీ కెనాల్ ప్రాజెక్టులకు ఈసారి బడ్జెట్‌లో కనీసం రూ. 3 వేల కోట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
రాస్తారోకోలతో స్తంభించిన ట్రాఫిక్
జిల్లా కేంద్రమైన కడపలో బిల్టప్ వద్ద జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్ బాష, నగర మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, జిల్లా నాయకులు అఫ్జల్‌ఖాన్, హఫీజుల్లా తదితరులతోపాటు వందలాది మంది కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు అన్ని వైపుల భారీగా నిలిచిపోయాయి.
పోరుమామిళ్లలో ఎమ్మెల్యే జయరాములు, ఎంపీపీ చిట్టా విజయప్రతాప్‌రెడ్డిల ఆధ్వర్యంలో బస్టాండు వద్ద రాస్తారోకో నిర్వహించి చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజంపేటలో తిరుపతి-కడప బైపాస్ రోడ్డు వద్ద వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ పోలా శ్రీనివాసులురెడ్డి, ఆకేపాటి సోదరుడు అనిల్‌కుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రైల్వేకోడూరులోని టోల్‌గేట్ వద్దనున్న వైఎస్సార్ సర్కిల్ వద్దఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
సుమారు గంటపాటు రోడ్డుపై ఎమ్మెల్యే బైఠాయించి రాస్తారోకోలో పాల్గొన్నారు. కమలాపురంలోని కడప-తాడిపత్రి ప్రధాన రహదారిపై వైఎస్సార్ సీపీ మండల కమిటీ ఆధ్వర్యంలో సుమిత్రా రాజశేఖర్‌రెడ్డి, రాజుపాలెం సుబ్బారెడ్డి, వల్లూరు జెడ్పీటీసీ సభ్యుడు వీరారెడ్డిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోకు మద్దతుగా ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానపరెడ్డి ప్రతాప్‌రెడ్డి, కత్తిరెడ్డి మహేశ్వరరెడ్డి, శేఖర్‌రెడ్డిల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ప్రధాన కూడలి కావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ భారీగా స్పందించింది.
పులివెందులలో భారీ ర్యాలీ..
పులివెందులలో వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రభుత్వ నిర్వాకంపై గర్జించాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌లో ఉన్న దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వైఎస్సార్ అమర్హ్రే.. వైఎస్ జగన్ నాయకత్వం వర్దిల్లాలని నినాదాలు చేశారు. అక్కడి నుంచి మెయిన్ బజారు మీదుగా పాత బస్టాండు, పూల అంగళ్లు, కచేరి రోడ్డు, శ్రీనివాస హాలు మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వందలాదిగా కదలివచ్చిన కార్యకర్తలతో పులివెందులలోని మెయిన్‌రోడ్డు అంతా నిండిపోయింది. జెండాలు చేతబట్టిన కార్యకర్తలు మెయిన్ బజారులో చేస్తున్న నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. అనంతరం తహశీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.
సీఎంకు సీమ గోడు పట్టదు
Published Fri, Mar 6 2015 2:42 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement